బల్లిగారి అరుపులకు... అర్థాలే వేరా! | a brief description about lizard | Sakshi
Sakshi News home page

బల్లిగారి అరుపులకు... అర్థాలే వేరా!

Published Sun, Oct 20 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

బల్లిగారి అరుపులకు... అర్థాలే వేరా!

బల్లిగారి అరుపులకు... అర్థాలే వేరా!

 నమ్మకం
  ఇంటి గోడల మీద జరజరా పాకే బల్లిని చూస్తే చాలామంది కెవ్వుమంటారు. పిల్లలయితే, బల్లి ఉంది అంటే చాలు... భీతితో బువ్వ తినేస్తారు. కానీ అలా భయపడేంత ప్రమాదకరమైనది కాదు బల్లి. చిన్న చిన్న పురుగులను పట్టి తింటుందే తప్ప, మనిషికి హాని చేసేంత శక్తి లేదు దానికి. కానీ బల్లి అనగానే భయమెందుకు? బల్లి చుట్టూ మనిషికి ఉన్న నమ్మకాలు ఏంటి? అవి నమ్మకాలా... మూఢనమ్మకాలా?
 బల్లి గురించి భారతదేశంలో ఉన్నన్ని నమ్మకాలు, మరే ఇతర దేశంలోనూ లేవు. కొన్ని దేశాల్లో అది మామూలు సరీసృపం. దానిని లెక్కే చేయరు. కానీ మన దేశంలో మాత్రం బల్లి చుట్టూ బలమైన నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకు ఆధారాలు గౌలి శాస్త్రంలో ఉన్నాయి.
 
 బల్లి వల్ల కలిగే లాభాలేమిటి, బల్లి ద్వారా చుట్టుముట్టే నష్టాలేమిటి అన్నదాన్ని చాలామంది విడమర్చి వివరిస్తూ ఉంటారు. బల్లి కిందపడటం గురించి ఎన్నో విషయాలు నమ్మకంగా చెబుతుంటారు. గురు శుక్రవారాలు తప్ప మిగిలిన ఏ రోజులో బల్లి గోడ మీది నుంచి కింద పడినా మంచి జరుగుతుందట. ఆదివారం పడితే ధనలాభమని, సోమవారం పడితే నూతన వస్తు లాభాలు కలుగుతాయని... ఇలా రకరకాల నమ్మకాలున్నాయి.
 
 బల్లి మనిషి మీద పడటం గురించి కూడా ఎన్నో వాదనలు, నమ్మకాలు ఉన్నాయి. బల్లి ఒక పురుషుడి నడినెత్తి మీద పడితే మరణం సంభవిస్తుందని ఎంతోమంది నమ్ముతారు. ముఖమ్మీద పడితే సంపద చేకూరుతుంది. గడ్డం మీద పడితే అవరోధాలు ఎదురవుతాయి. పాదం మీద పడితే అనారోగ్యం కలుగుతుంది. అదే స్త్రీలలో అయితే... బల్లి వారి చేతి మీద పడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. భుజమ్మీద పడితే ఆభరణాలు దక్కుతాయి. వీపు మీద పడితే మరణం సంభవిస్తుంది. ఛాతి మీద పడితే అశాంతి కలుగుతుంది. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి.
 
 కేవలం మీద పడటం గురించే కాదు, బల్లి అరుపు గురించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలు వేరన్నట్టు, బల్లి శబ్దాలకు కూడా చాలా అర్థాలున్నాయి. తూర్పు వైపున బల్లి శబ్దం చేస్తే అశుభం జరుగుతుందట. ఆగ్నేయం వైపు నుండి బల్లి అరిస్తే... కలహాలు, తగాదాలు ఏర్పడతాయట. దక్షిణ దిశలో శబ్దం చేస్తే శుభకార్యాలు జరుగుతాయని, బోలెడంత అదృష్టం కూడా వరిస్తుందని అంటారు. ఒకవేళ మన ఇంటికి దక్షిణం వైపున ఉన్న మరో ఇంటి మీద ఉండి బల్లి శబ్దం చేస్తే... విచారకమైన వార్తలు అందుతాయట.
 
 ఇలాంటి నమ్మకాలన్నీ కలిసి బల్లిని మనిషికి శత్రువుని చేశాయని చెప్పాలి. అందుకే దాన్ని విలన్ చేసి మాట్లాడుతున్నాం. బల్లిని బూచిని చేసి పిల్లల్ని భయపెడుతున్నాం. అయితే నిజానికి బల్లి వల్ల చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పినదానికి వేరే కారణం ఉందని అంటున్నారు పండితులు.
 
 అప్పట్లో ముంగిస జాతికి చెందిన ఒక రకమైన బల్లులు ఉండేవట. అవి ఒకలాంటి విషద్రవాన్ని తమ నోటితో వెదజల్లేవట. ఆ ద్రవం కంటిలో పడితే చూపు పోయేది. ఒంటి మీద పడితే ఒళ్లంతా నల్లటి మచ్చలు వచ్చేసేవి. నాలుకమీద పడితే మాట లేకుండా పోయేది. ఆ బల్లులను దృష్టిలో పెట్టుకుని, అది ఏ అవయవంపై పడితే ఏమవుతుందో చెబుతూ శాస్త్రాలు పంచాగాలు రాశారట. అవన్నీ ఆరోగ్య జాగ్రత్తల కోసం రాసినవే తప్ప, బల్లికి ఒక మనిషి భవిష్యత్తును నిర్దేశించే శక్తి లేదని, అవన్నీ మనిషి తనకు తాను ఏర్పరచుకున్న నమ్మకాలనీ అంటున్నారు.
 
 ఆరోగ్యపరంగా శాస్త్రాల్లో చెప్పిన జాగ్రత్తలను రకరకాలుగా అర్థ చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ పుట్టుకొచ్చాయన్న మాట. లోతుగా ఆలోచిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అయినా ఒక  చిన్ని జీవికి ఇన్ని శక్తులు ఉంటే, ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి కదా, వాటికి కూడా ఏవో శక్తులు ఉండాలిగా! ఇలా ఆలోచిస్తేనయినా ఎన్నో యేళ్లుగా బల్లి గురించి ఉన్న అపోహలు తొలగిపోతా యంటారా!
 
 థాయ్‌ల్యాండ్ వారికి కూడా బల్లి గురించిన ఓ భయంకర నమ్మకం ఉంది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు బల్లిజారి కాళ్ల ముందు గానీ పడితే, వాళ్లు ఇక ఇల్లు కదలరు. ఒకవేళ వెళితే... రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, లేదంటే మరి ఏదో ఒకరకంగానైనా మృత్యువు వెతుక్కుంటూ వస్తుందని భయపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement