
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్‌లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్‌లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్‌లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.
దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు.