అది ఓ శుభదినం. ఇంట్లో పండుగ వాతావరణం. ఉన్నమాట చెప్పాలి కదండీ! మా ఆవిడ లడ్డూలు చేస్తోంది, పక్కింటివారికి కూడా నోరూరేట్టు. ఆ రోజు లడ్డూ తయారీకి సరంజామా సిద్ధం చేసింది. సెలవు దినమైతే నేనూ ఉడత సాయం చేసేవాణ్నే. కానీ ఆ రోజు పనిదినం మూలాన ఆఫీసుకి వెళ్లిపోయాను.
తిరిగొచ్చేసరికి సాయంకాలమైంది. ఇంట్లో కాళ్లు పెట్టేసరికి ఒకటే ఘుమఘుమలు దేవుడి గదిలోంచి ముక్కుని తాకుతున్నాయి. ఏ వంట చేసినా మొదట దేవుడికి నైవేద్యం పెట్టే అలవాటు మా ఆవిడది.
గబగబా కాళ్లు, ముఖం కడుక్కొని నేరుగా దేవుని గదిలోకెళ్లాను. కొంచెం వెలుతురు, కొంచెం చీకటి. రాత్రి కాలేదు. కాబట్టి ఇంకా లైట్లు వెయ్యలేదు.
ఆ సంధ్య చీకట్లో ఒక లడ్డూ తీసుకుని అమాంతం నోట్లో వేసుకున్నాను. టేస్టు మాట దేవుడెరుగు, నోటి నిండా చీమలు, మూతి నిండా చీమలు. ఒకటే కరవడం. పెదవులు, బుగ్గలు, మూతి ఒకటే మంట!
ఈ హఠాత్పరిణామానికి ఉక్కిరిబిక్కిరై హాల్లోకి వచ్చేశాను. మా ఆవిడ, పిల్లలు అంతా నాకేమైందోనని గాబరాపడ్డారు.
వెంటనే లైటు వేశాక అసలు పరిస్థితి అర్థం చేసుకొని అంతా నవ్వుకున్నారు.
ఆ స్పాట్‌లో నాకు నవ్వు అస్సలు రాలేదు. కాని ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది.
- సీహెచ్ సింహాచలం శ్రీకాకుళం
మూతి కరిచిన లడ్డు
Published Sun, Aug 3 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement