అబ్దుల్ కరీం అడవిని నాటాడు!
ఇది వాస్తవం. ఓ వ్యక్తి చెట్లు నాటగలడు, తోట పెంచగలడు.
కానీ అసమాన ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి అడవిని పెంచాడు.
అది అచ్చంగా అడవి లక్షణాలతో ఉన్న అడవే. అందులో అన్నీ అటవీ వృక్షాలే!
ఇది ఎలా సాధ్యం, ఆయన ఎవరు?
సాఫల్యం: భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లడం మామూలే. కేరళీయులు అయితే మరీ ఎక్కువగా వెళ్తుంటారు. అలా వలస వెళ్లిన వారిలో ఒకరు అబ్దుల్ కరీం. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో పరప్పా ప్రాంతం ఆయన నివాసం. పెళ్లి చేసుకుంది పుళియాంకుళంలో. ఆ ఊరికి వెళ్లినపుడల్లా ఆ ప్రాంతంలోని కొండల పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆయన గమనించేవారు. అది పంటలకు పనికొచ్చే స్థలం కాదు. లేటరైట్ రాయితో నిండిన నేల. 3750 రూపాయలు పెట్టి అక్కడే ఓ ఐదెకరాలు కొన్నాడు. అప్పట్లో అది పెద్ద మొత్తమే. పైగా గల్ఫ్‌కు వెళ్లొచ్చి చేసుకున్న పొదుపు సొమ్ము అది. పంటే పండని ఆ నేలలో 1979లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. చివరికి ఇంట్లో వారు కూడా ఆ పనిని ఇష్టపడలేదు. అయినా సరే ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఆ ఊళ్లో అబ్దుల్ కరీమ్ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోని వారు లేరు. కరీం కొన్న పంటలు పండని ఆ పొలంలో ఒక బావి ఉంది. అందులో నీళ్లుండవు. మరి నవ్వక ఏం చేస్తారు?
ఆ పొలం కొనడమే ఆశ్చర్యం అనుకుంటే అందులో చిన్నచిన్న మొక్కలు తెచ్చినాటాడు కరీం. అవి ఫలాలను ఇచ్చే మొక్కలేం కావు. అన్నీ అటవీ మొక్కలే. వాటికి మళ్లీ స్కూటరుపై మోసుకుని ఎక్కడినుంచో నీళ్లు తెచ్చిపోసేవాడు. చిత్రం ఏంటంటే... ఆ మొక్కలన్నీ చనిపోయాయి. ఇక చూడండి కరీం పరిస్థితి. జనంలో మరింత చులకన అయిపోయాడు. కానీ అతను ఎప్పుడూ వేరే వారి గురించి పట్టించుకోలేదు. మరోసారి అదే ప్రయత్నం చేశాడు... అది కూడా విఫలమవడంతో ఇంట్లో వారి నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. పొలంలో మట్టేలేదు మరి. ఎక్కడ చూసినా గడ్డకట్టిన మట్టిలాంటి లాటరైట్ రాళ్లన్నీ. వాటి మధ్యలో నాటేవాడు మొక్కలు.
తర్వాత మరో కొత్త ఆలోచన చేశాడు కరీం. ఇంతకుముందులా పద్ధతి ప్రకారం కాకుండా ఎన్నిమొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటేశాడు... దీంతో చాలా మొక్కలు వాడిపోయినా.. పెద్దసంఖ్యలోనే బతికి బట్టకట్టాయి. మొక్క పెద్దదయిన కొద్దీ నీళ్లు ఎక్కువ కావాలి. అది చాలా కష్టం. అందుకే మొదట్నుంచీ ఆ పని కూడా మొదలుపెట్టాడు. కొండపై నుంచి వచ్చే నీళ్లకు, ఆ నీళ్ల ద్వారా వచ్చే మట్టికి పొలంలో చిన్న అడ్డుకట్టలు కట్టి ఉంచాడు. అలాంటి కట్టలు నిండి వచ్చే నీరు అక్కడున్న బావిలోకి పోయేలా చేశాడు. దీంతో మొట్టమొదటి సారి ఆ బావి నిండింది. క్రమంగా పొలంలో మట్టి చేరడం పెరిగింది. మొక్కలు కాస్తా చిన్నచిన్న చెట్లయ్యాయి. ఆ బావి నీటిని వాటికి తోడిపోసే వాడు. బావిలో ఎప్పుడూ నీళ్లుండేలా చూసుకున్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతం కాస్త తడిగా మారింది.
భూమిలోకి నీరు ఇంకడమే కాక, రాలిన ఆకులు, కొట్టుకువచ్చిన మట్టి వల్ల ఓ పదేళ్లకు అది మెత్తటి మట్టి పొలంగా మారింది. ఆ ఉత్సాహంతో పక్కనే ఉన్న అలాంటి ప్రాంతమే సుమారు 27 ఎకరాలు కొన్నాడు. దానిని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేశాడు. అతడు ఐదెకరాల కొండ ప్రాంతాన్ని పచ్చటి చెట్లతో నింపినందుకు అందరూ ఆశ్చర్యపడినా... అవేవీ ఫలాన్నిచ్చేవి కాకపోవడంతో అప్పటికీ సదభిప్రాయం ఏర్పరుచుకోలేకపోయారు. మొత్తం 32 ఎకరాల్లో మొత్తం అడవిని పెంచాడు కరీం. ఇప్పటికి 35 సంవత్సరాలు అయ్యింది. ఇపుడు అది పెద్ద అడవి. అడవి పచ్చగా ఉంటే సరిపోదు, వాటిలో జంతుజాలం కూడా ఉంటేనే అందం. అందుకే తన అడవి నిండా చిన్న చిన్న జంతువులు, పక్షులు తాగడానికి నీటి కొలనులు కృత్రిమంగా ఏర్పాటుచేశాడు. దీంతో ఆ అడవి పశుపక్ష్యాదులకు అనువైన నివాసంగా మారింది.
పదేళ్ల క్రితం తొలిసారి కరీం కృషి ప్రపంచం కళ్లలో పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఆయన్ను ఆశ్చర్యంగా చూశాయి. ఆయన, ఆ అడవి రెండూ ఇప్పుడు ఎకో టూరిజానికి రోల్‌మోడల్స్. ఇంకో విషయం తెలుసా... ఆయన ఆ నేలను కొంటే నవ్విన వారు, వారి పిల్లలు ఇప్పుడు ఎండాకాలంలో మంచినీటి కోసం ఆయన బావి వద్దకే వస్తున్నారు. బయట అన్ని బావులు ఎండిపోయినా కరీం అడవిలో బావులు ఎండిపోవు. అమితాబ్ బచ్చన్, కేరళ ముఖ్యమంత్రి సహా ప్రపంచంలో ఎంతో మంది ఆ అడవిని సందర్శించి ఆయనను అభినందించారు. ఆయన ప్రయత్నం కేరళ ఆరోతరగతి పుస్తకంలో ఓ పాఠం. ఆయన పిల్లల్లో ఐదుగురు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పటికీ ఇద్దరు పిల్లలు అదే అడవిలో నివాసం ఉంటున్నారు.