అతనేమిటి అలా ఉన్నాడు? దేనికీ చలించకుండా? ఆ హృదయంలో జాలి, క్షమా...అనేవి పొరపాటున కూడా కనిపించవా?
అందరూ తనకు దాసోహం కావాలనుకునే ఉమా... ఎవరినైనా ఎప్పుడైనా ‘నేను నీకు దాసోహం అవుతాను’ అని అడిగాడా?
అవును అడిగాడు!
అయితే... అది తనను తాను తగ్గించుకోవడానికి కాదు. అతని మంచితనం కూడా కాదు.
కేవలం తన ‘పగ’ చల్లార్చుకోవడానికే!
అందుకే హీరోతో ఈ విలన్ ఇలా అంటాడు...
‘ఆ ఊళ్లో అణువణువూ పౌరుషంతో
రక్తం మరిగే ఒక మగాడున్నాడు.
వాడిని ఒక్కడిని చంపి నా పగను పంచుకోరా...
జీవితాంతం నీకు దాసోహం అంటాను’
‘మిర్చీ’ సినిమాలో ఘాటైన విలన్‌గా కనిపించాడు సంపత్‌రాజ్. మంచి ఒడ్డూ పొడుగు, నల్లటి మీసాలు, నలుపు తెలుపు రంగు జుట్టు... చూడగానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించాడు సంపత్‌రాజ్. ఎప్పుడు గొడవ జరుగుతుందా? ఎప్పుడు శత్రువు చేతికి చిక్కుతాడా? ఎప్పుడు వాడి రక్తం కళ్ల చూద్దామా... అన్నట్లుగా కనిపిస్తూ...
‘కనురెప్పలు వాల్చకుండా చూడన్నా
కొడుకులు... దేవాగాడి మనుషుల పీకలు తెంపుతున్నాను’ అని రక్తం కళ్లజూస్తూ... ‘మిర్చీ’లో ‘ఉమా’గా విలనిజాన్ని వీర లెవెల్లో ప్రదర్శించాడు సంపత్‌రాజ్.
సినిమాల్లోకి రావాలనుకునేవారు ‘హీరో సింహాసం’ మీదే మొదట కన్నేస్తారు.
సంపత్‌రాజ్ మాత్రం చిన్నప్పటి నుంచి విలన్‌నే ఇష్టపడేవాడు.
అద్దం ముందు విలన్‌గా రకరకాల హావభావాలతో నటిస్తుండేవాడు. ఈ హోంవర్క్ వృథా పోలేదు. అతని నటనకు ఆ కృషి పునాదిగా నిలిచింది.
సంపత్‌రాజ్ మాతృభాష తమిళం.
పద్నాలుగు సంవత్సరాలు ఎడ్వర్‌టైజ్‌మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన సంపత్ ఎన్నో యాడ్ ఫిల్మ్స్, జింగిల్స్ చేశాడు. ఆ సమయంలోనే సినిమాల మీద ప్రేమ చెన్నైకి తీసుకొచ్చింది.
కెప్టెన్ విజయకాంత్ హీరోగా నటించిన ‘నెరంజ మనసు’తో తమిళచిత్రసీమలో తన కెరీర్ ప్రారంభించాడు సంపత్‌రాజ్. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా మీద సంపత్‌కు చాలా అంచనాలు ఉన్నాయి. తండ్రి, కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేశాడు. అయితే... మొదటి రోజే సినిమా ఫ్లాప్ అంటూ ఫలితం తెలిసిపోయింది.
భారీ నిరాశ!
ఒక సినిమా ఫ్లాప్ అయితే...ఆ సినిమా గురించిగానీ, అందులో నటించిన నటులు, సాంకేతిక నిపుణుల గురించిగానీ ఇండస్ట్రీలో దాదాపుగా పట్టించుకోరు. అయితే ఇక్కడ జరిగిందేమిటంటే..‘నెరంజ మనసు’ సినిమా ఫ్లాప్ అయినా... సుమారు ఆరు ఏడు మంది దర్శకుల నుంచి సంపత్‌కు ఆఫర్లు వచ్చాయి! ఇది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీని తరువాత మరోసారి విజయ్‌కాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా తమిళ సినిమాల జర్నీ మొదలైంది.
తమిళ సినిమాకు ముందు రెండు కన్నడ చిత్రాల్లో నటించాడు. అందులో ఒకటి జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించాడు సంపత్. ‘దమ్ము’ ‘మిర్చీ’ ‘ఓమ్’ ‘రన్ రాజా రన్’ ‘పవర్’ ‘లౌక్యం’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘శ్రీమంతుడు’ ‘సోగ్గాడే చిన్నినాయనా’... మొదలైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సంపత్‌రాజ్.
ఒక పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాక... చేశాను అంటే చేశాను అన్నట్లు కాకుండా మానసికంగా ఆ పాత్రను విజువలైజ్ చేసుకుంటూ ‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’ ‘అలా చేస్తే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించుకొనిగానీ రంగంలోకి దిగడు. గుడ్డిగా నటించడం కాకుండా పాత్ర గురించి తనకు ఏవైనా సందేహాలు ఉంటే డెరైక్టర్ని అడిగి తీర్చుకుంటాడు.
‘చిన్న పిల్లలు, గర్భిణి స్త్రీల మీద అఘాయిత్యానికి ఒడిగట్టే పాత్రల్లో నటించను’ అని చెబుతున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ విలన్.
హీరోగా నటించమని ఇప్పటి వరకు పద్నాలుగు ఆఫర్లు వచ్చాయట.
అయినా సరే... ‘నో’ అంటున్నాడు.
‘ఉత్తమ విలన్’ అనిపించుకోవడమే తన తొలి ప్రాధాన్యం అంటున్న సంపత్‌రాజ్... మరిన్ని ‘చెడ్డ’ విలన్ పాత్రలతో ‘మంచి’ పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.