ఆక్యుపంక్చర్‌తో అధికబరువుకు చెక్
చైనీస్ వైద్య విధానమైన ఆక్యుపంక్చర్ చికిత్సతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ఆక్యుపంక్చర్ చికిత్సతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే సగటున మూడు కిలోల వరకు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఈ చికిత్సలో ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆహార విహారాలలో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ చికిత్సా విధానంతో సులువుగా బరువు తగ్గవచ్చని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు వెల్లడిస్తున్నారు.
అధిక బరువుతో బాధపడే 72 మంది రోగులపై రెండు నెలలు పరిశోధనలు జరిపి, ఈ విషయాన్ని నిరూపించినట్లు హాంకాంగ్ బాప్టిస్ట్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఝాంగ్ లిడాన్ తెలిపారు. పరిశోధనల సమయంలో వారి రోజువారీ ఆహార విహారాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు. పరిశోధనల్లో పాల్గొన్న వారిలో ఒకరు అత్యధికంగా 7.2 కిలోల మేరకు బరువు తగ్గినట్లు తెలిపారు. ఆక్యుపంక్చర్ వల్ల జీవక్రియల వేగాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు వివరించారు.