
చాలాకాలం తరువాత మరొక పరిణామం జరిగింది. యాదవప్రకాశుడి తల్లి వరదరాజస్వామి భక్తురాలు. తరచు ఆలయానికి వస్తూ ఉండేది. కాంచీ పూర్ణుల వారిని కలిసేది. వారి చెంత రామానుజులను కూడా చూసేది. వారి ఉపదేశాలను విని విశిష్టాద్వైతం పట్ల ఆకర్షితురాలైనారామె. తన కుమారుడికి రామానుజుడికి మధ్య జరిగిన సంఘటనలు తనకుకూడా కొంత తెలుసు గనుక తల్లి వారిని చూసిన ప్రతిసారీ ఎక్కడో పొరబాటు జరిగిందని అనుకునేవారు. కాంచీపూర్ణులు రామానుజుల సమక్షంలో జరిగిన వేదాంత చర్చలను తదితర విషయాలను తన కుమారుడు యాదవప్రకాశునితో ఆమె అడపా దడపా చర్చించేది. రామానుజులు శ్రీరంగం వెళ్లి వచ్చిన తరువాత ఆచార్యత్వాన్ని స్వీకరించడం, శిష్యగణాలను సమకూర్చుకుని భగవద్విషయం పరివ్యాప్తిలో ముందంజ వేయడం అంతా యాదవప్రకాశులు తెలుసుకుంటూనే ఉన్నారు. రాను రాను తన అద్వైత సిద్ధాంతం విషయంలో సందేహాలు తనను చుట్టుముడుతున్నాయి. తన గురుకులంలో ఉన్నకాలంలో రామానుజుడు ఉపనిషన్మంత్రాలకు ఇచ్చిన వ్యాఖ్యానం అర్థమవుతూ వస్తున్నది. అది ఎంత సమంజసమైందో అనుకుంటూ ఉండేవారు. తన పాండిత్యం తనకు ప్రశాంతత ఇవ్వడం లేదని, ఇంకా ఏదో అన్వేషించవలసి ఉందని ఆయన మనసు పదేపదే హెచ్చరిస్తూ ఉండేది. సరిగ్గా అదే సందర్భంలో తల్లికి కూడా తన తనయుడు యాదవప్రకాశుడు రామానుజమతంలో ప్రవేశిస్తే బాగుండేదనే ఆలోచన వచ్చింది. తానూ నిజమే అనుకున్నాడు. రామానుజునితో తాను వ్యవహరించిన తీరు, అకృత్యాలు గుర్తు చేసుకుంటూ తనను ఆయన ఆదరిస్తాడా అనే సందేహించారు. తన పాపాలకు పరిష్కారం తీర్థయాత్రలేమో అనుకుంటూ ఓ రాత్రి నిద్రించారాయన. కలలో వరదరాజు కనిపించి ‘‘ఏ యాత్రలూ అవసరం లేదు. నీవొక్కసారి రామానుజుడికి ప్రదక్షిణ చేస్తేచాలు’’ అని ఆదేశించారు. దిగ్గున లేచి కూర్చున్నారు. అనునిత్యం వరదరాజ పెరుమాళ్‌తో సంభాషించే కాంచీ పూర్ణులను అడిగి సందేహాలు తీర్చుకుందామనుకున్నారు.
కలగన్న విషయం చెప్పి ఒకసారి వరదునితోమాట్లాడి తన సందేహాన్ని నివృత్తి చేయమని వేడుకున్నారు. సరేనన్నారు. ఆ రాత్రి వరదుడితో ఆ విషయం చర్చించినపుడు ‘‘రాత్రి నేను ఆదేశించిన తరువాత కూడా యాదవప్రకాశుడు సందేహిస్తున్నాడా. రామానుజుడిని ఆశ్రయించడమే ఆయనకు మిగిలిన మార్గం’’ అని స్పష్టం చేశారు. అది తెలిసిన వెంటనే యాదవప్రకాశుడు రామానుజుని చేరి పాదాలపైబడబోయినాడు. అంతలోనే అది గమనించిన రామానుజులు వారించి వారిని ఆలింగనం చేసుకుని సగౌరవంగా స్వాగతించారు. వరదుని ఆజ్ఞ ప్రకారం రామానుజునికి ప్రదక్షిణ చేసిశిష్యునిగా స్వీకరించమని ప్రార్థించారు. మరోసారి యాదవప్రకాశునికి ఉపనయనాది పంచసంస్కారములుగావించి గోవింద దాసు అని నామకరణం చేశారు. అచిరకాలంలోనే యాదవప్రకాశులు 11 అధ్యాయాలతో యతిధర్మసముచ్ఛయమనే గ్రంథాన్ని రచించారు. ఆతరువాత ఎంతో కాలం ఆయన జీవించలేదు. ఆ విధంగా గురువునే శిష్యుడు చేసుకున్న గురువు రామానుజుడు. వరదరాజస్వామికి ఆ కాలంలో అత్యంత సన్నిహితుడైన భక్తుడు కాంచీపూర్ణులు (తిరుక్కచ్చినంబి) వైశ్యకులానికి చెందిన వాడు. కాని ఆయన ఆచార్యత్వానికి, భక్తికి కులం అడ్డురాలేదు. ఆయన జగద్గురువు రామానుజాచార్యకే గురువు. వేయేళ్ల కిందట భక్తికి, భగవంతునితో సాన్నిహిత్యానికి ఆయన పెట్టింది పేరు. ఆయన నిజమైన అర్చకత్వానికి మంచి ఉదాహరణ. నిబద్ధతకు చిరునామా. కంచి వరదరాజస్వామి పెరుమాళ్‌కు ఎంతటి భక్తుడంటే పెరుమాళ్ కు వింజామర వీస్తూ సేవలు చేస్తూ ఆ స్వామితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనకు స్వామినుంచి సమాధానాలు లభిస్తూ ఉండేవి కూడా. అంతటి అత్యంత సన్నిహితుడు. శ్రీ వైష్ణవ అద్వైత సిద్ధాంత పాండిత్యంతో పాటు, ఆ పెరుమాళ్ల పట్ల ఆయనకు అపరిమితమైన ప్రేమ అభిమానం, అనురాగం ఉట్టిపడేది. అర్చకుడు స్వామికి అత్యంత సన్నిహితుడుగా ఉండాలి. భక్తుల బాధలు స్వామికి నివేదించే శక్తి ఉండాలి. భగవంతుని దయను భక్తుడి కోసం సాధించి ఆయన అందించవలసి ఉంటుంది. ఆ పనిచేసే కాంచీ పూర్ణుడే అంతటికి నిజమైన అర్చకుడు, ఆచార్యుడు.
రామానుజుడంటే ఆయనకు అమితమైన ప్రేమ. రామానుజుని జిజ్ఞాస. విజ్ఞానం, విద్యార్థిగా ఆయన క్రమశిక్షణ. వినయం, విధేయత, కళలూ, కాంతులు, గురువంటే నిండైన అభిమానం, అహంకార రాహిత్యం, ఈరా‡్ష్యసూయలు తెలియకపోవడం వంటి అత్యుత్తమ లక్షణాలను ఆయన గమనించారు. యాదవప్రకాశుల వద్ద చదువుకుంటు న్నప్పుడు కొన్ని ఉపనిషద్వాక్యాల పైన వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు, రామానుజుని భిన్నమైన అన్వయాల గురించి తెలుసు. ఛాందోగ్యంలో ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’ అంటే ‘‘ఈ సమస్తమూ పరమాత్మే కద’’ అనే పరిమిత అర్థాన్ని, ‘‘ఈ కుర్చీ బల్ల నీవు, నేను ఈ ప్రదేశం ఇలా సమస్తం పరమాత్ముడే’’ అన్న వివరణను రామానుజుడి ఆమోదయోగ్యం కాలేదు. దానిని ఖండిస్తూ ప్రతిగా రామానుజుడు ‘‘ప్రతి అంశంలోనూ ప్రాధాన్యతను అనుసరించి పరిశీలిస్తే పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని అంటాం. అందులో పరమాత్మకు ప్రాధాన్యత ఉందని గమనించాలి. ‘‘ఈ కూరంతా ఉప్పే’’ అని ఎవరైనా అంటే ఉప్పు మరీ ఎక్కువగా ఉందని అర్థం వస్తుంది. కాని మొత్తం ఉప్పే ఉందనీ మరే పదార్థం లేదనీ అర్థం చెబుతామా? లేదుకదా. అంతర్లీనంగా ఉన్న మూలభావాన్ని గ్రహించాలికాని ప్రతిపదార్థం చెప్పి అదే అర్థం అంటే ఎలా?’’ అని రామానుజుడు ఎంత సమంజసంగా వాదించాడో అని కాంచీ పూర్ణులు దాని గురించే చాలా ఆలోచించేవాడు. అదే విధంగా ‘‘నేహనాస్తి కించన’’ అనే బృహదారణ్యకోపనిషద్ వాక్యానికి పరమాత్మకన్న వేరైన వస్తువే లేదనే అర్థం బదులు పరమాత్మ అంతర్యామిగా లేని వస్తువు ఉండదంటే సరైన అర్థం అవుతుందని రామానుజుడి వివరణ. ఇది ధర్మసూక్ష్మం, సరైన వ్యాఖ్యానం. ఇంత అర్థ సూక్ష్మాన్ని అవగాహన చేసుకోవడం, దానికి పోలికలు ఊహించడం, విన్నవాడు అవుననే విధంగా సహేతుకంగా వివరించడం, తరువాత గురువుగారిముందే తన వాదాన్ని వినిపించడం వెనుక ఎంత అంతర్మథనం, నిబద్ధత, సాహసం అవసరం అని కాంచీ పూర్ణులు ఆలోచిస్తూ ఉండేవారు. పెద్దాయనను ఎదిరించే ఏమవుతుందోనని భయపడటం, ఆ మనకెందుకు అని వదిలేయడం, సర్దుకు పోవడం, లేదా గురువుగారి పరోక్షంలో సహాధ్యాయుల మధ్య నిందించడం లేదా విమర్శించడం చాలా మంది శిష్యులు చేస్తూ ఉంటాం. అది నీతి కాదు, అనుసరించవలసిన రీతి కాదు. నమ్మిన సిద్ధాంతాన్ని, సమంజసమైన వ్యాఖ్యానాన్ని చెప్పడానికి వెనుకాడలేదు. గురువుగారు ఏమనుకున్నా సరే మొగమాటం లేకుండా అదేసమయంలో వినయం కోల్పోకుండా, ఆయన వివరణలో లోపాలను ఎత్తిచూపగలగడం ఒక అపురూపమైన లక్షణం, వ్యక్తిత్వం, నాయకత్వగుణం. కనుక కాంచీపూర్ణులు రామానుజుని మనసులోనే ప్రశంసిస్తూ ఉంటారు.
కొన్నేళ్లకిందటే ఆ రామానుజుడిని చూడటానికి యామునాచార్యులు తన శిష్యులు పెరియనంబి అరైయార్ వెంటరాగా శ్రీరంగం నుంచి కంచికి వెళ్లారు. కాంచీ పూర్ణుడితో మాట్లాడుతూ, ‘‘రామానుజాచార్యుడని విన్నాను ఎవరతను నేనో సారి చూడాలి’’ అని వరదరాజాలయంలో అడిగారు. తాతగారైన నాథమునులు భవిష్యదాచార్యుల గురించి చెప్పినప్పటి నుంచి అతనెవరా అని ఎదురుచూస్తున్నారాయన. అప్పుడు లక్ష్మణాచార్యుల పేరుతో రామానుజులు యాదవప్రకాశుని శిష్యబృందంలో ఉన్నారు. వరదరాజపెరుమాళ్ దర్శనం చేసుకుని అక్కడే మంటపంలో నిలబడినప్పుడు, యాదవప్రకాశులు తన శిష్యబృందంతో అక్కడికి వచ్చారు. అప్పుడు కాంచీ పూర్ణులు ఆ బందంలో రామానుజుడిని చూపించారు. నమ్మాళ్వార్ల వారు నాథమునులకు ఇచ్చిన భవిష్యదాచార్యుల విగ్రహం నాథముని నుంచి వారి శిష్యుడు ఉయ్యక్కొండారులకు అందింది. ఆయన తన శిష్యుడు మణక్కాల్ నంబికి, వారినుంచి యామునాచార్యులకు లభించింది. ఈ మూర్తి జీవం పోసుకునేది ఎప్పుడు. ఆ జీవం శ్రీ వైష్ణవాన్ని ఉజ్జీవింపచేయడం ఎప్పుడు అని ఆ విగ్రహాన్నే చూస్తూ కాలంగడుపుతున్నాడు. వయసు మీరుతున్నది. కాలం గడిచిపోతున్నది. దూరం నుంచి చూసినా, రామానుజుని శరీర లక్షణాలు, కళలు, ప్రమాణాలు తాతగారిచ్చిన విగ్రహ రూపు రేఖలతో పోలి ఉన్నాయనిపిస్తున్నది. తన తపస్సు ఫలించిందనుకున్నారు. వేలసంవత్సరాల ముందే రూపొందిన ఆ విగ్రహం ప్రాణంపోసుకుని నడుస్తున్నదా అన్నట్టున్నాడు రామానుజుడు.
తనకు వయసు మీద బడుతున్నకొద్దీ యామునాచార్యులవారికి భవిష్యదాచార్యులను శ్రీరంగానికి రప్పించాలన్న తపన, ఎప్పుడొస్తాడో అంటూ మనసు ఉద్విగ్నం అవుతున్నది. రామానుజుని ప్రతిభావిశేషాలు వింటూ ఉంటే అతనిలో ఆచార్య లక్షణాలు కనిపిస్తున్నాయి. గురువుకే ఉపనిషద్వాక్యాలకు అర్థం చెప్పేవాడు, గురువుగారు తరమలేని బ్రహ్మరాక్షసిని తరిమిన వాడు రామానుజుడు. అవన్నీ తెలిసిన తరువాత తన భావన సరైనదే అని నిశ్చయమైంది.
ఇతనే అయదల్హనిల్ (అంటే సిద్ధాంత ప్రవర్తకుల్లో శ్రేష్ఠుడు) అని నిర్ధారించుకున్నారు. కాని యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించడం బాగుండదని అప్పుడనుకున్నాడు . యాదవ ప్రకాశుడికి ఆయన దూరం అయిన విషయం తన శిష్యుడైన కాంచీ పూర్ణుని ఆశ్రయించిన విషయం తరువాత తెలిసింది. కథ తిరగ వలసిన మలుపు తిరిగింది. వార్ధక్యం పెరిగి ఆరోగ్యం పూర్తిగా తరిగిపోకముందే ఆ యువ వైష్ణవాచార్యుడిని చూడాలనుకున్నారు. శిష్యుడు పెరియనంబి పిలిచి ‘‘నీవు కాంచీపురానికి వెళ్లి వీలయినంత త్వరగా రామానుజులను తోడ్కొని రా నాయనా’’ అని ఆదేశించారు.
శ్రీరంగం నుంచి మహాపూర్ణులు వస్తున్నారని ఒక శిష్యుడు కాంచీపూర్ణులవారికి తెలియజేశారు. కాంచీ పూర్ణులు మహాపూర్ణులు యామునాచార్యుల శిష్యులు. వారిలో మహాపూర్ణులు (పెరియనంబి) ఆయనకు ప్రియశిష్యుడు. తన సహాధ్యాయికి ఎదురు వెళ్లారు. స్వాగతం చెప్పారు. పెరియనంబి పరుగు పరుగున చేరుకున్నారు.ఎదురొచ్చిన కాంచీ పూర్ణుని పలకరించారు. పరస్పర నమస్కారాలు ముగిశాయి. యామునాచార్యుల ఆదేశం వివరించారు. క్షీణిస్తున్న ఆరోగ్యం గురించి చెప్పారు. గురువుగారి ఆరోగ్యం తెలియగానే కాంచీపూర్ణులు పరితపించారు. దుఃఖం ఆగలేదు. ఎలాగో కన్నీళ్లు ఆపుకుని కర్తవ్యం నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. మహాపూర్ణులు కాంచీ పూర్ణులు గర్భాలయప్రాంగణం దాటి మండపానికి వచ్చారు. రామానుజుడు దేవాలయ బావినుంచి నీళ్లు తోడి బిందెలో నింపి, భుజాన పెట్టుకుని నడుస్తున్నాడు. కాంచీపూర్ణులు చూపగా మహాపూర్ణులు గమనించారు.
స్వాభావికానవధికాతిశయ యేశితత్వం
నారాయణత్వయీ నమష్యతి వైదికాః కః
బ్రహ్మా శివః శతమఖః పరమస్వరాడితి
ఏతే కపియస్య మహిమార్ణవ విపషస్తే
అన్న శ్లోకాన్ని గొంతెత్తి పాడారు మహాపూర్ణుల వారు. రామానుజుల దృష్టి వెంటనే అటు మళ్లింది. మొత్తం శ్లోకం విన్నారు. ఆ నారాయణ స్తుతి ఆయన్ను ఆనంద పరవశుడిని చేసింది. ఆ భావం మనసును కదిలించింది. మహాపూర్ణుల దగ్గరకు వచ్చి, ‘‘ఎవరిదీ రచన? మీరెవరు? ఎక్కడ నుండి మీ రాక?’’ అని రామానుజులు అడిగారు. ‘‘యామునాచార్యవర్యులు గాక మరెవరు వ్రాయగలరు నాయనా ఈ అద్భుత శ్లోకాన్ని. ఇటువంటి శ్లోక రత్నభాండాగారమే ఆయన వాజ్ఞ్మయం కుమారా. నేను ఆ మహానుభావుడి శిష్యుడను మహాపూర్ణుడంటారు. శ్రీరంగం నుంచి వస్తున్నాను. నీ గురించి విన్నాను, ఆసూరి కేశవుని ప్రియపుత్రుడవని, శ్రీశైల పూర్ణుని మేనల్లుడవనీ వరదుని తిరుమంజన సేవకు జలసేవచేస్తున్నావని తెలుసు నాయనా. నీయందు యామునుల వారికి అపూర్వమైన అభిమానం ఉంది నాయనా’’ అని వివరించారు. ఆమాట వినగానే రామానుజుడు ‘‘యామునులంత పెద్దవారికి నేను తెలుసా.. ’’ అని ఆశ్చర్యానంద చకితుడైనాడు. తనగురించి తెలుసుకోవడమే కాదు, తనను రమ్మన్నారని తెలిసి పొంగిపోయాడు. కంచి వరదునికి నమస్కరించి, పెరుమాళ్ వద్ద సెలవు తీసుకుని, కాంచీపూర్ణునికి నమస్కరించి ఇంటికి వెళ్లి తల్లి అనుజ్ఞను అభ్యర్థించినాడు. ‘‘అళవందార్ (యామునాచార్య) రమ్మన్నారా, అంతకన్న భాగ్యమేముంది నాయనా, వెళ్లిరా, శీఘ్రంగా వెళ్లి క్షేమంగా రా రామానుజా’’ అని దీవించింది. తల్లికి సాష్టాంగదండప్రణామం చేసి, ‘‘పదండి స్వామీ వెళదాం’’ అని మహాపూర్ణులతో కలిసి కాంచీపురం నుంచి బయలుదేరారు. ఎప్పుడెప్పుడు యామునా చార్యులతో కలుద్దామా అని పరితపిస్తూ పరుగువంటి నడకతో వీలైనంత వేగంగా నడిచారు. శ్రీరంగానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment