విజయం: ఓ అపూర్వ గాథ! | Apurva purohit of CEO Radio City 91.1 FM Founder | Sakshi
Sakshi News home page

విజయం: ఓ అపూర్వ గాథ!

Published Sun, Oct 13 2013 2:30 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

విజయం: ఓ అపూర్వ గాథ! - Sakshi

విజయం: ఓ అపూర్వ గాథ!

అపూర్వ పురోహిత్.. దేశంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థల్ని నడుపుతున్న అతి కొద్ది మంది మహిళా సీఈవోల్లో ఒకరు! ‘‘మగాళ్లకేంటండీ.. ఏమైనా చేయగలరు.. మేం పిల్లల్ని కనాలి, పెంచాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలి...  మేం ఎదగడానికి అడుగడుగునా అడ్డంకులే’’.. అని వాదించే మహిళలందరికీ అపూర్వ జీవితం ఓ పాఠం! ఆమె అందరు మహిళల్లాగే పెళ్లి చేసుకుంది.. పిల్లల్ని కంది.. వాళ్లను పెంచి పెద్ద చేసింది.. ఇంటి బాధ్యతలన్నీ చూస్తోంది! ఇన్నీ చేస్తూ కెరీర్లోనూ ఎదిగింది! పాతికేళ్లుగా మీడియా రంగంలో అనేక సంస్థల్లో పని చేస్తూ...
 
  గత ఎనిమిదేళ్లుగా ‘రేడియో సిటీ’ని నడిపిస్తున్న అపూర్వ కథ.. నిజంగా ఓ అపూర్వమైన విజయగాధ! ఎంచక్కా ‘రేడియో సిటీ’లో పాటలు వింటూ సేదదీరే కోట్లాది మంది శ్రోతలకు ఆ కార్యక్రమాల వెనుక ఎంత వ్యవహారం ఉంటుందో తెలియదు. వందలాది మంది నిపుణుల సృజనాత్మక ఆలోచనలు, శ్రమ కలిస్తేనే ఈ కార్యక్రమాలు. మధ్యలో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలు.. ప్రచార కార్యక్రమాలు.. మార్కెటింగ్.. ఇలా తెర వెనుక చాలా బాధ్యతలుంటాయి. వీటన్నింటికీ నేతృత్వం వహించేది, మార్గనిర్దేశం చేసేది సీఈఓ.
 
 ఈ పనిని ఎనిమిదేళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు అపూర్వ. 4 కేంద్రాల్లో ఉన్న రేడియో సిటీని దేశవ్యాప్తంగా 20 నగరాలకు విస్తరించిన ఘతన ఆమెదే. వ్యూహాల ప్రణాళిక, బడ్జెట్, ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్, కార్యక్రమాల రూపకల్పన.. రోజూ ఇన్ని వ్యవహారాలు చూస్తారామె. ఇవి కాక ఉద్యోగుల నియామకం కూడా ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఐతే రేడియో సిటీ సీఈఓ పదవి అపూర్వకు తేలిగ్గా దక్కలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల పాటు మీడియా, టెలివిజన్ రంగంలో ఆమె పడిన శ్రమే ఆమెనీ స్థాయికి చేర్చింది.
 
 చండీగఢ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అపూర్వ దేశంలోని అనేక ప్రాంతాల్లో తన చదువు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచుగా బదిలీ అయ్యేవారు. స్కూల్ చదువు ముంబయిలో పూర్తి చేసి, చెన్నైలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎంలో పీజీ డిప్లమా చేశారు. మార్కెటింగ్ ఉద్యోగం వచ్చినా కాదనుకుని, ‘రెడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరారు. తర్వాత ఎఫ్‌సీబీ ఉల్కా అడ్వర్టైజింగ్ సంస్థలో మీడియా బయింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించారు.
 
 ఇక్కడే టీవీ రంగంలో ఆమె కెరీర్‌కు పునాది పడింది. అప్పటికి టీవీ ఛానెల్స్‌లో సమయాన్ని కొనడం, ప్రోగ్రామ్స్  రూపొందించడం, ప్రకటనలు సంపాదించడం.. ఈ వ్యవహారాలన్నీ కొత్త! ఈ పనులన్నీ సమర్థంగా చేసి తానేంటో నిరూపించుకున్నారు అపూర్వ. క్రమంగా మీడియా బయింగ్ కన్సల్టన్సీలు పెరగడంతో అపూర్వకు అవకాశాలు పెరిగాయి. పదేళ్ల పాటు వివిధ కంపెనీల్లో పని చేశారు. ఈ అనుభవం ఆమెకు 2002లో జీ టీవీకి ప్రెసిడెంట్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అక్కడా తనదైన ముద్ర వేశారు అపూర్వ.
 
 జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది. తర్వాత టైమ్స్ గ్రూప్ 2004లో ‘జూమ్’ ఛానెల్‌ను ప్రారంభించే పనిని అపూర్వకే అప్పగించింది. ఏడు నెలల్లో ఛానెల్‌ను లాంచ్ చేయించడంలో అపూర్వ కీలక పాత్ర పోషించింది. ఐతే కొన్ని కారణాల వల్ల అందులోంచి బయటికి వచ్చేశారు. తర్వాత రేడియో సిటీ సీఈఓ పదవి వరించింది.
 
 మహిళా సాధికారత గురించి అపూర్వ ‘లేడీ, యు ఆర్ నాట్ ఎ మేన్’ అనే పుస్తకం రాశారు. పురుషులతో సమానంగా మహిళలు ఎలా ఎదగగలరో విశదీకరించారీ పుస్తకంలో. మహిళాలోకానికి ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహిళా సాధికారత గురించి కేవలం లెక్చర్లతో సరిపెట్టకుండా చేతల్లోనూ చూపిస్తున్నారు. ‘రేడియో సిటీ’లోని సీనియర్ మేనేజర్లలో సగం మంది మహిళలే. మిగతా ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారామె. జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది.
 -  ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement