
అరణ్యం: ఏనుగులు నవ్వుతాయా?
ఆఫ్రికా ఏనుగులన్నింటికీ దంతాలుంటాయి. కానీ ఆసియా ఏనుగుల్లో మగవాటికి మాత్రమే ఉంటాయి!
ఇవి రోజుకి 150 నుంచి 170 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి. వర్షాకాలంలో ఈ మోతాదు మరింత పెరుగుతుంది. అప్పుడు 200 నుంచి 280 కిలోలు తింటాయి. రోజులో పదహారు గంటలు తింటూనే గడుపుతాయి!
వీటి గ్రహణ శక్తి అమోఘం. మూడు మైళ్ల దూరంలో నీరు ఉన్నా ఏనుగులు ఇట్టే పసిగట్టేస్తాయి. పట్టుకు 80 నుంచి 210 లీటర్ల నీళ్లు తాగుతాయి. తొండంలో ఒకేసారి రెండు గ్యాలన్ల నీటిని నింపుకోగలవివి!
వీటి తొండం రెండు మీటర్ల వరకూ పొడవు పెరుగుతుంది. దాదాపు లక్ష కండరాలు ఉంటాయని అంచనా!
ఏనుగులు ఈత కొట్టగలవు. నీటిలో సైతం శ్వాసను పీల్చుకోవడానికి తొండం సహకరిస్తుంది వీటికి!
ఏనుగుకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఒక్కసారి ఏదైనా మనసులో పెట్టుకుంటే, జన్మలో మర్చిపోవు. ఒకసారి చూసినదాన్ని ఎన్నేళ్ల తర్వాతయినా గుర్తు పట్టేస్తాయి!
ఏనుగులు గుంపులుగా జీవిస్తాయి. ప్రతి గుంపులో కనీసం ఎనిమిది ఏనుగులుంటాయి. సంఖ్యకు పరిమితి లేదు. అయితే విశేషమేమిటంటే... ఆడవి వేరుగా, మగవి వేరుగా గుంపులు కడతాయి!
ఇవీ మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. ఆటలాడుకుంటాయి. పట్టరాని ఆనందం వస్తే బిగ్గరగా నవ్వుతాయి. బాధ కలిగితే ఏడుస్తాయి కూడా!
ఎందుకోగానీ ఏనుగులకు వేరుశెనగలంటే ఇష్టం ఉండదు. తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ వేరుశెనగల్ని మాత్రం ముట్టవట!
రంగే కాదు... రేటూ అదురుద్ది!
ఒక జాతికి చెందిన చేప ఒకే రంగులో ఉంటుంది. మహా అయితే రెండు రంగుల్లో ఉంటుంది. కానీ అరొవానా చేప చూడండి... ఎన్ని రంగుల్లో ఉందో! అక్వేరియంలో పెంచే చేపల్లో అత్యంత అందమైనవిగా వీటిని పరిగణిస్తారు.
అరొవానాలు మంచినీటిలో మాత్రమే జీవించగలవు. పెద్ద పెద్ద పొలుసులతో ఉండే వీటి తలనిండా ముళ్లు ఉంటాయి. ఈ చేపలు నీటి అడుగున చక్కని గూళ్లు కట్టుకుంటాయి. గుడ్డు పెట్టాక, వాటిని గూటిలో ఉంచి కాపాడుకుం టాయి. శత్రువు దాడి చేస్తే గుడ్లను తమ నోటిలో దాచేస్తాయి. ఇవి మహా హుషారైన చేపలు. తెగ గంతులు వేస్తుంటాయి. ఉన్నట్టుండి పైకి ఎగిరి నీటిలో టప్పున పడటం వీటికి మహా సరదా. దాదాపు ఆరడుగుల ఎత్తువరకూ ఎగరగలవు అరొవానాలు. అందుకే వీటిని దక్షిణమెరికాలో ‘వాటర్ మంకీస్’ అంటూ ఉంటారు. అక్వేరియంలో పెంచే చేపలన్నిటి కంటే అరొవానా ఖరీదు అత్యంత ఎక్కువ. అయితే మిగతా రంగుల చేపల కంటే సిల్వర్ కలర్ అరొవానా రేటు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, అవి చాలా అరుదుగా ఉంటాయి. అందుకే ఎంత రేటయినా పెట్టి కొనేస్తారు. దీని రేటు ఎనభై వేల డాలర్ల వరకూ వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి!