
పిల్లొ పిల్లొ పిల్లో...
నూతన దంపతులనో, చిన్నపిల్లల్నో సరదాగా పోట్లాడుకోనిచ్చే దిండ్లు, అంతకంటే పెద్ద వేడుకలో పాల్గొంటున్నాయి. వీధి పోరాటాలుగా ఈ పిల్లో ఫైట్స్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా నగరాల్లో జరుగుతున్నాయి. ఇక్కడి దృశ్యం లండన్‌లోది. ప్రధానంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లల్లోని గ్రూపులు ఉన్నట్టుండి అనుకుని, దాదాపుగా ఉన్నపళంగా జరుపుకునే సంబరాలివి. మెత్తలతో మెత్తగా కొట్టుకోవడం కూడా ఒక రకమైన స్వేచ్ఛా వ్యక్తీకరణగానే ఇలాంటివాళ్లు భావిస్తున్నారు.
పిల్లల్లారా రారండి...
సక్రమంగా ఇవ్వని తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన తెలపడం మనకు తెలుసు. ఇది అలాంటిది కాకపోయినా, ప్రదన్శనగా సంబంధమున్నదే! విద్యార్థుల డ్రాపౌట్ రేటు పెరుగుతుండటానికి నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ‘లాస్ ఏంజిల్స్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్’ ప్రధాన కార్యాలయం ముందు తల్లిదండ్రులు, పట్టభద్రులు, కార్యకర్తలు జరిపిన ప్రదర్శన ఇది. ఈ జిల్లా నుంచి విద్యా సంవత్సరంలో సగటున ప్రతివారానికీ తగ్గిపోతున్న 375 మంది విద్యార్థులను ప్రతిబింబిస్తూ 375 ఖాళీ డెస్కులతో ప్రదర్శకులు రోడ్డును దిగ్బంధించారు. అమెరికా మొత్తమ్మీద హైస్కూళ్లలో ప్రతి ఏటా 12 లక్షల మంది చదువు పూర్తికాకముందే బడి మానేస్తున్నారు.
సనాతన గురువులు
ఫొటోలోని మహిళ పేరు పెప్సిలే మసేకో. ఈమె ఒక ‘సంగోమా’. ఇలాంటివాళ్లు దక్షిణాఫ్రికాలో సుమారు రెండు లక్షల మంది ఉన్నారని అంచనా! భూతప్రేతాలను పారద్రోలుతారనీ, తప్పిపోయిన పశువుల జాడచెబుతారనీ, సంకేతాల ఆధారంగా భవిష్యత్‌ను అంచనావేస్తారనీ, జబ్బులకు మందులు ఇస్తారనీ వీరికి పేరు. జనన మరణ క్రతువుల్లోనూ వీళ్ల సూచనల్ని ప్రజలు శిరోధార్యంగా భావిస్తారు. అందుకే సంగోమాలకు అక్కడి సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉంది.