మహాశక్తి
ఎవరైనా నాకే భయపడాలి తప్ప నేనెవరికీ భయపడను. అయినా ఎందుకు భయపడాలి? అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు ప్రతిభ ఉంది. అది నాకు దేవుడిచ్చిన వరం.
- ఓ ఇంటర్వ్యూలో భానుమతీ రామకృష్ణ
‘ఓహోహో... పావురమా’... 1945లో ఆడవాళ్లు ఇళ్లలో నుంచి రావడానికే జంకే రోజులలో సినిమాల్లో ప్రవేశించి స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి వెండితెర మీద నాగయ్యను కవ్వించింది ఆమే. ‘పరుగులు తీయాలి... గిత్తలు ఉరకలు వేయాలి’... ఎన్టీఆర్‌తో ఎడ్ల బండి మీద పరుగులు తీసింది ఆమే. చల్లని రాత్రి వేళ ఏ.ఎన్.ఆర్‌ని నిద్ర పుచ్చుతూ ‘మెల్లమెల్లగా చల్లచల్లగా’ పాట పాడిందీ ఆమే. పుట్టింది ఒంగోలు. చేరింది చెన్నపట్నం. సినీ రంగంలో మగవారికి సవాల్‌గా నిలిచిన శక్తి స్వరూపం.
వాళ్లది ఏముంది? కొందరికి పాడటం మాత్రం వచ్చు. భానుమతి పాడగలదు. కొందరికి ఆడటం మాత్రమే వచ్చు. భానుమతి ఆడగలదు. మరికొందరికి బాగా నటించడమే వచ్చు. భానుమతి వారి కంటే బాగా నటించగలదు. కొందరు దర్శకత్వం మాత్రమే చేయగలరు. భానుమతికి రాకపోతే కదా. కొందరు నిర్మాతలుగా మాత్రమే ఉండి కాసులు లెక్కపెట్టగలరు. భానుమతి నిర్మాతలకే నిర్మాత.
స్టుడియోలు మగాళ్ల సొత్తు. భానుమతి స్టూడియో భరణి నక్షత్రంలా వెలిగింది. కొందరు కింగ్ మేకర్‌లు కావచ్చు. కాని భానుమతిని మించిన కింగ్ మేకర్ ఎవరు? సౌతిండియా సూపర్ స్టార్. హిందీకి చండీరాణి. ఆమె చేసిన ప్రయోగాలు ఎవరు చేశారు? వర విక్రయాన్ని, చింతామణిని, నల దమయంతిని ఎవరు చూపారు?ఇంతటి శక్తి ఒక స్త్రీకి ఉండటం ఇంతటి ప్రతిభను నిలబెట్టుకోవడం ఇంతటి స్ఫూర్తి ఆమె మిగిల్చి వెళ్లటం నాలుగైదు సీక్వెల్స్‌గా తీయగలిగిన ఘనచరిత్ర.
‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’, ‘మల్లీశ్వరి’, ‘బొబ్బిలి యుద్ధం’... ఒక ఆర్టిస్ట్‌కు అన్ని క్లాసిక్స్ దొరకడం అద్భుతం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కూడా ఆమె నటన ప్రేక్షకులకు ‘మట్టిలో మాణిక్యం’గా తోచింది. ‘మంగమ్మగారి మనవడు’లో మంగమ్మకు దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టేలా చేసింది. తను వెలుగుతూ సాటి నటులను వెలిగించేవాళ్లు ఉంటారు- సావిత్రిలా. కాని భానుమతి స్కూల్ అది కాదు. తను తినేస్తుంది. మిగిలినవాళ్లు తమను తాము కాపాడుకోవాలి... అది ఎన్టీఆర్ అయినా ఏఎన్నార్ అయినా. మగవారిలో ఆ వైభోగం ఒకరికే దక్కింది- ఎస్.వి.రంగారావుకి.
భానుమతి గొంతు వెంటనే నచ్చేసేది కాదు. అది ‘తినగ తినగ వేము తియ్యనుండు’. వినాలి ఓపిగ్గా. శాంతంగా. అప్పుడు రుచి తెలుస్తుంది. ‘మనసున మల్లెల మాలలూగెనె’..., ‘ఎందుకే నీకింత తొందర’..., ‘పిలచిన బిగువటరా’..., వివాహ బంధంలో ఎన్టీఆర్‌కు పి.బి.శ్రీనివాస్ గొంతివ్వగా నీళ్ల మీద తేలుతూ భానుమతి పాడిన డ్యూయెట్ ‘నీటిలోన నింగిలోన నీవె ఉన్నావులే’.. దోర మామిడి పండు. ఆమె భక్తి గీతాలలో భక్తులకు ఉండే అహం ఉంటుంది. అది దేవుడికి ఎంతో నచ్చుతుంది.
‘శ్రీకర కరుణాలవాల వేణుగోపాల’... ‘శరణం నీ దివ్యచరణం’... ‘శ్రీ సూర్యనారాయణ మేలుకో’... ప్రభాత గీతాలు. ‘నగుమోము’.. మహామహులు పాడారు. వివాహబంధంలో భానుమతి కూడా ఆ త్యాగయ్య పదాన్ని అద్భుతంగా ఆలపించి ఆ వాగ్గేయకారుని పాదాల దగ్గర తన స్వరమాలను అలంకరించారు.భానుమతి రచయిత్రి. నటిగా ఎంత ఈజ్ ఉంటుందో రచనలో కూడా అంతే ఈజ్ ఉంటుంది. పొగరుబోతులందరికీ హాస్యం అంటే ఇష్టం. భానుమతికి కూడా. హాయిగా నవ్వేవాళ్లందరూ ఎంత వయసొచ్చినా పసిపిల్లలే.
తల ఒంచి బతకలేదు. తన నిలువెత్తు అంతస్తును ఎట్టి పరిస్థితులలోనూ కుదించుకోలేదు. ఓవర్సీస్ కలెక్షన్లు... వంద కోట్ల క్లబ్బులు నేటి హీరోయిన్లకు కొలమానం అయితే వాళ్లంతా భానుమతిని చేరాలంటే ఒక కాంతి సంవత్సరం పడుతుంది. భానుమతి సాధించింది సాధించాలంటే ఒకరి భుజాల మీద మరొకరుగా వంద మంది నిలుచోవాల్సి వస్తుంది. కొన్ని రిపీట్ కావు. భానుమతీ అంతే.
కొందరికి పాడటం మాత్రం వచ్చు. భాను మతి పాడగలదు. కొందరికి ఆడటం మాత్రమే వచ్చు. భానుమతి ఆడగలదు. మరికొందరికి బాగా నటించడమే వచ్చు. భానుమతి వారి కంటే బాగా నటించగలదు.
- నెటిజన్ కిశోర్