అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ పెళ్లి సంబంధాల్లో తెల్లగా ఉండేవాళ్లనే కోరుకుంటారు. తప్పేం లేదు. తెలుపంటే అందరికీ క్రేజ్. (తెల్లగా ఉండేవాళ్లకి కూడా!) white supremacy అనే మాట ఈ క్రేజ్ నుండి వచ్చిందే. విశేషం ఏమిటంటే ఈ నలుపు తెలుపులను ‘పెళ్లి’కి పట్టించుకుంటారే కానీ, ‘ప్రేమ’లో పట్టించుకోరు. ఇంతకీ వైట్ సుప్రిమసీ అంటే ఏమిటి? నల్లగా ఉండేవాళ్ల కన్నా, తెల్లగా ఉండేవాళ్లే అన్నిటా అధికులనే భావన.
White అనే పదంతో ఉన్న పదబంధాలన్నీ దాదాపుగా ఇలాంటి ఆధిక్య భావననుంచి పుట్టుకొచ్చినవే. ఉదా: white collar. కాయకష్టం చేసే అవసరం లేకుండా చక్కగా ఆఫీసులో కూర్చుని మైండ్‌తో పనిచేసుకుంటూ పోయే ఉద్యోగులను white collar workers అంటారు. ఇలాంటి ఉద్యోగాలే వైట్ కాలర్ జాబ్స్.
అలాగే white hope అనేది ఇంకో మాట. అంటే ఆశాదీపం, ఆశాజ్యోతి. ఈ దీపాలు, జ్యోతులు... వ్యక్తులు కావచ్చు లేదా వస్తువులైనా కావచ్చు. ఈ వాక్యం చూడండి. This new car is seen as the great white hope of the Indian motor industry.
అదేంటో White తో కలిస్తే చెడ్డవి కూడా మంచివి అయిపోతుంటాయి. white lie అనే మాట మీరు వినే ఉంటారు. ఇందులో lie అంటే అబద్ధం అని కదా అర్థం. white lie అంటే ‘మంచి అబద్ధం’ అని. కొన్నిసార్లు మంచి కోసం... లేదా నిజం చెప్పడం వల్ల జరగబోయే అనర్థాలను నివారించడం కోసం... అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. వాటిని వైట్ లైస్ అంటారు. మరక మంచిదే అంటున్నారు కదా ఏదో సర్ఫ్ వాళ్లు. అలాగన్నమాట.
అదేవిధంగా white magic. అంటే మంచి పనులకోసం చేసే మ్యాజిక్. ఉదా: సమాజాన్ని మేల్కొలపడానికి, జాగృతం చేయడానికి చేసే మ్యాజిక్. దీనికి పూర్తిగా వ్యతిరేకం black magic. హాని తలపెట్టేందుకు చేసే మాయలు, మంత్రాలు ఈ కేటగిరీలోకి వస్తాయి.
ఇప్పుడు మరికొన్ని white ల గురించి చకచకా తెలుసుకుందాం. white goods అంటే విద్యుత్ గృహోపకరణాలు. (కుక్కర్లు, వాషింగ్ మెషీన్‌లు, ఫ్రిజ్‌లు వగైరా). white horses అంటే ... ఉపరితంలో తెల్లగా ఉండే అలలు. ఈ white horses నే యు.ఎస్.లో whitecaps అంటారు. white knight అంటే.. గట్టెక్కించే వ్యక్తి. ఆపద్బాంధవుడు. ఒక కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనుకుందాం. ఆ కంపెనీ మూత పడకుండా లేదా చేతులు మారకుండా కాపాడే వ్యక్తిని లేదా సంస్థను white knight అనొచ్చు. white trash అంటే... చదువు లేని, నిరుపేద తెల్లజాతీయులు. (అలాంటి వారు ఉంటారా?). తమలోనే డబ్బు లేనివాళ్లను అమెరికన్లు అనే మాట... వైట్ ట్రాష్. black-and-white అని ఇంకోమాట ఉంది. ‘స్పష్టంగా అర్థమయ్యేది’ అని దీని అర్థం. (Disarmament isn't a black-and-white issue for me). ఆయనెవరికో నిరాయుధీకరణ అనేది అంతుబట్టని సబ్జెక్ట్ అట. అలాగే in black and white అనే మాట. అంటే లిఖితపూర్వకంగా (రాతపూర్వకంగా) అని. (I could not believe it was true, but there it is, in black and white).
ఇవండీ... white తో వచ్చే కొన్ని పదాలు.
అన్నట్లు... whiter than white అనే మాట విన్నారా? అంటే... ఎప్పుడూ అసలు తప్పన్నదే చెయ్యకపోవడం.
(I never was convinced by the whiter than white image of her portrayed in the press).
White elephant నడపడానికి భారమైపోయిన కంపెనీలను, డబ్బును పదేపదే ఖర్చుపెట్టిస్తున్న వస్తువులను వైట్ ఎలిఫెంట్‌తో పోలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం white elephant (ఐరావతం) అనేది ఇంద్రుడి ఏనుగు. తెల్లగా ఉంటుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువులతో పాటు ఐరావతం కూడా ఉద్భవించిందని పురాగాథ.
భాషణం: తెల్ల ఉద్యోగాలు... తెల్ల అబద్ధాలు... తెల్ల ఆశాదీపాలు
Published Sun, Sep 22 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement