పిట్ట బ్యాంకు! | black money | Sakshi
Sakshi News home page

పిట్ట బ్యాంకు!

Published Sun, Dec 18 2016 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

పిట్ట బ్యాంకు! - Sakshi

పిట్ట బ్యాంకు!

‘‘ఈ లోకంలో పిట్టలు హ్యాపీగా బతుకుతుంటాయి. ఎందుకంటే వాటిదంతా వైట్‌ మనీయే. అవి అస్సలు బ్లాక్‌ చేయవు’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘బ్యాంకుల ముందు క్యూలు చూసీ చూసీ, క్యూల్లో నిలబడీ నిలబడీ నీకు విరక్తి వచ్చింది. పిచ్చి ముదిరి పిట్టలకు బ్యాంకింగు అంటగడుతున్నావు. పిట్టలకు బ్లాకులేమిటి? బ్యాంకులేమిట్రా?’’ అయోమయంగా అన్నాను నేను. ‘‘వాటికి పర్‌ఫెక్ట్‌ బ్యాంకింగు వ్యవస్థ ఉంది’’ అన్నాడు వాడు స్థిరంగా. ‘‘నీ మాటలకు బ్యాక్‌ సపోర్టు ఇచ్చుకోవడం కోసం నువ్వు బ్యాంకు గురించి ఏదైనా  కూస్తావు. కానీ నీది పిట్ట కూతలా శ్రావ్యంగా ఉండదు. గుడ్లగూబ కూతలా వికృతంగా ఉంటుంది’’ అన్నాను నేను. ‘‘పిచ్చివాడా? గుడ్లగూబ ఆకృతిని చూసి అది వికృతంగా కూస్తుందని ఊహించుకుంటావు. కానీ అది కూయగా ఎప్పుడైనా విన్నావా?’’ అడిగాడు వాడు.
‘‘లేదు’’ అన్నాను నేను.

‘‘అలాగే పిట్టల బ్యాంకింగు కూడా నువ్వు చూడలేదు’’ అన్నాడు వాడు. ‘‘మళ్లీ చెబుతున్నాను. పిట్టలకు బ్యాంకులేమిట్రా. వింత కాకపోతే’’ అడిగా. ‘‘ఒరేయ్‌... చెట్టు మీద పండును తిని పిట్ట రెట్ట వేస్తుంది. అంటే... పండులోని గింజను భూమి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుందన్న మాట. ఎందుకూ... ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మళ్లీ వడ్డీ రూపంలో మరో చెట్టుగా పెరుగుతుంది. మరిన్ని కాయలు దొరుకుతాయి. తన బిడ్డలకు పనికి వస్తుంది కదా అని పిట్ట అలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుందన్న మాట’’ వివరించాడు రాంబాబుగాడు. అప్పటికీ హతాశుడినైపోయాన్నేను. ‘‘అది ఫిక్స్‌డ్‌ డిపాజిట్టా?’’ అన్నాను .‘‘ఆ... ఇంకా చెబుతా విను. పిట్ట ఎప్పుడూ బ్లాక్‌ మనీ ఉంచుకోదు. అంటే పండు రూపంలో మొత్తం ఇచ్చినా సరే... కేవలం కొద్ది కొద్దిగా మాత్రమే తింటుంది. చిలక దీనికి ఎగ్జాంపుల్‌. చిలక అనే పేరున్న ఈ పిట్ట... పండు రూపంలో ఎంత పెట్టినా.. కొద్దిగా మాత్రమే కొరికి వదిలేస్తుంది. చూశావా? అలా అది బ్లాక్‌ చేయదన్నమాట. కానీ మరో పిట్ట అవసరానికి బ్లాక్‌ చేస్తుంది’’ అన్నాడు.

‘‘మరో పిట్ట బ్లాక్‌ చేస్తుందా?’’ అయోమయంగా అన్నాను నేను. ‘‘అవును... ఈ పిట్ట లొట్టి పిట్ట’’ ట్విస్టు ఇచ్చినట్టుగా మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తూ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్‌... లొట్టిపిట్ట అంటే ఒంటె రా. ఫస్ట్‌ అది అసలు పండ్లే తినదు. అలాంటప్పుడు నీ భాషలో చెప్పాలన్నా బ్లాక్‌ చేయడం ఎలా కుదురుతుంది’’ అన్నాను. ‘‘మామూలు పిట్టలు బ్లాక్‌ చేయవు. కానీ ఎడారిలో చాలా కాలం పాటు తిరగాల్సి వస్తుంది కాబట్టి నీళ్లను బాగా తాగాక... ఒంటె ఆ నీళ్లను బ్లాక్‌ చేస్తుందన్న మాట. ఆ పిట్టలు బ్లాక్‌ చేయవు... ఇది బ్లాక్‌ చేస్తుంది కాబట్టి పిట్టలతో ఉన్న ఈ వైరుద్ధ్య  సారూప్యాన్ని మన తెలుగువాళ్లు గ్రహించారు. ఈ విషయాన్ని పసిగట్టినందువల్లే తెలుగువాళ్లు దానికి లొట్టి పిట్ట అంటూ పేరు పెట్టారు. భాషాశాస్త్రాన్ని మధించి నా మెదడు బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేస్తే లాజికల్‌గా వడ్డీ రూపంలో దొరికిన నా పరిశోధన ఫలితమిది’’ అంటూ కన్విన్స్‌ చేయబోయాడు వాడు.

‘‘ఊ... ఇంకా’’ అంటూ వ్యంగ్యంగా అడిగా.
‘‘ఇంకా అంటే...’’ కాస్త ఆలోచించాడు వాడు. అలా కాస్త ఆలోచిస్తుండగానే వాడి ఆలోచనల పరంపరను బ్లాక్‌ చేద్దామని వాడి మెదడును బ్లాంక్‌ చేద్దామని అనుకున్నాను. కానీ వాడి థాట్‌ ప్రాసెస్‌ నన్ను కట్టినడేసింది.
‘‘ఆ అర్థమైందిరా. చీమలు కూడా కూలీ చీమలతో చాలా సంపదను బ్లాక్‌ చేయిస్తుంటాయి కదా’’ అంటూ నాకు తెలియకుండానే వాడి ఆలోచన ధోరణిలోకి నేనూ కొట్టుకుపోతున్నానని ఈ మాట అన్న తర్వాతగానీ నాకు అర్థం కాలేదు. ‘‘యా... యువార్‌ రైట్‌. అయితే పిట్టలు బ్లాక్‌ చేయవు. కానీ పువ్వు పువ్వుకూ తిరిగి సంపాదించినంతా బ్లాక్‌ చేసేది తేనెటీగ. అందుకే ఐటీ వాళ్ల రూపంలో మనుషులు దాన్ని పొగబెట్టి వెళ్లగొట్టి తాము దోచుకుంటారు’’ అన్నాడు వాడు.

కానీ ఎందుకో ప్రతిసారీ లాజిక్‌ లేకుండానే వాడు ఏదో మాట్లాడుతుండటం... వాడి ధోరణికి నన్నూ లాగుతుండటం... నాకు తెలియకుండానే నేను వాడికి సపోర్ట్‌ చేయాల్సి రావడం నన్ను చిరాకు పరచింది.‘‘ఒరేయ్‌... నువ్వు చెప్పిందే నిజమని నేను నమ్ముతా’’ అంటుండగా విజయగర్వంతో నవ్వాడు వాడు. ‘‘ఎవ్వరైనా నమ్మక తప్పదు’’ అన్నాడు. ‘‘అయితే...’’ కాస్త పాజ్‌ ఇచ్చి ‘‘ఎప్పటికీ బ్లాక్‌ చేయనందుకు పిట్టలను కొట్టి తింటారు. కానీ బ్లాక్‌ చేసే తేనెటీగలను ఎవ్వడూ తినడు’’ అన్నాను నేను. అలా  క్లైమాక్స్‌ డైలాగ్‌ చెప్పి వాడిని అడ్డుకున్నా. అలా వాడి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేశా. అలా మొట్టమొదటిసారిగా వాడిని బ్లాక్‌ చేసేలా వాడి మాటలకు బ్రిక్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా అడ్డుపెట్టగలిగాను నేను.
– యాసీన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement