‘నల్ల’ పాముల..‘తెల్ల’దారులు | black money to white money via bankers | Sakshi
Sakshi News home page

‘నల్ల’ పాముల..‘తెల్ల’దారులు

Published Wed, Nov 23 2016 11:09 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

black money to white money via bankers

– నల్లధనాన్ని వైట్‌ చేసుకుంటున్న వైనం
– ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న కొందరు బ్యాంకర్లు
– ఈ నెల 8న రాత్రి కాంట్రాక్టర్‌కు సంబంధించి భారీగా నగదు మార్చిన ఓ బ్యాంకు
– విద్యుత్‌ బిల్లుల స్వీకరణ కేంద్రాలు, పెట్రోలు బంకుల్లోనూ నగదు మార్పిడి
–  వైట్‌ చేసేందుకు 20–30శాతం కమీషన్‌ తీసుకుంటున్న దళారులు
– రూ.122 కోట్ల పాత నోట్లను ఓ కాంట్రాక్టరుకు ఇచ్చిన అధికార పార్టీ కీలక నేత
– 'ప్రత్యేక' దాడులు చేస్తే పగలనున్న ‘కట్టల’ పుట్టలు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
     'రూ.122 కోట్ల నగదు ఉంది. ఇందులో 70శాతం మొత్తానికి కొత్తనోట్లు నాకివ్వు. అవసరమైతే ఏడాది సమయం తీసుకో. సమస్యను మాత్రం తీర్చాలి. నువ్వు పెద్ద కాంట్రాక్టర్‌. కాబట్టి ఏదో రకంగా మార్చగలవు' – ఇదీ అనంతపురంలోని ఓ కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ ప్రజాప్రతినిధి విన్నపం.
    'అన్నా! మా వద్ద రూ.2 కోట్ల పాతనోట్లు ఉన్నాయి. మార్చాలంటే నెల్లూరులో ఓ వ్యక్తి 35శాతం కమీషన్‌ అడుగుతున్నారు. ఏం చేద్దాం?!’ – ఓ బ్యాంకు ఉద్యోగితో రియల్టర్‌ బేరం
‘ 30శాతం ఇవ్వు. వందలు, రెండువేల నోట్లు ఇప్పిస్తా. క్యాష్‌ అండ్‌ క్యారీఽ. నగదు తీసుకుని మా ఇంటికి వచ్చేయ్‌'- రియల్టర్‌కు బ్యాంకు ఉద్యోగి భరోసా.

                జిల్లాలో నగదు మార్పిడి జోరుగా సాగుతోంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' సినిమా విజయవంతంగా నడుస్తోంది. కొన్ని బ్యాంకుల అండతో కొంతమంది మధ్యవర్తులు యథేచ్ఛగా నగదు మార్పిడి చేస్తున్నారు. ఈ తీరు చూస్తే బ్లాక్‌ మనీని ఇంత సులువుగా ‘వైట్‌’ చేసుకోవచ్చా అన్న సందేహం కలుగుతోంది.

ఆ రోజే అప్రమత్తం
        పాత రూ.500, వెయ్యినోట్లు చెల్లవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈ నెల 8న ప్రకటన చేశారు. దీంతో అప్రమత్తమైన ఓ బడా కాంట్రాక్టర్‌ తన లావాదేవీలు అధికంగా ఉన్న, తనతో సన్నిహితంగా ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి ద్వారా అదేరోజు రాత్రి భారీగా నగదు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రెండు బొలేరో వాహనాల్లో నగదును తీసుకెళ్లి మార్చుకున్నారని సమాచారం.  ఇందులో కొంతమేర రూ.వందనోట్లు అప్పటికప్పుడే తీసుకెళ్లగా, మూడురోజుల తర్వాత రూ.రెండువేల నోట్లను తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం. ఈ కాంట్రాక్టర్‌కే జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రజాప్రతినిధి రూ.122 కోట్ల నగదు ఇచ్చి 70శాతం కొత్తనోట్లు తిరిగి ఇచ్చేందుకు ఏడాది గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వతహాగా పేరు మోసిన కాంట్రాక్టర్‌ కావడంతో ఎలాగైనా పాతనోట్లను మార్చగలననే ధైర్యంతో ఆ మొత్తాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.

 పక్క జిల్లాల్లోనూ మార్పిడి
            'అనంత'తో పాటు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు, బెంగళూరులోని కొన్ని బ్యాంకుల్లోనూ నగదు మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దళారులు బ్లాక్‌మనీ ఎక్కువగా ఉన్న వారిని ఫోన్‌లో సంప్రదించి.. నగదు మార్పిడి చేసుకునే విధానం చెప్పి, కమీషన్‌ మాట్లాడుకుని దందా నడిపిస్తున్నారు. ఈ 15రోజుల్లో  జిల్లాలో కనీసం రూ.70 కోట్లకుపైగా నగదు మార్పిడి జరిగినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో మరో రూ.100 కోట్ల దాకా మార్పిడి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రెండు బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యక్తులు, నగదు, సమయాన్ని బట్టి 20–30శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరెంటు బిల్లుల వసూలు కేంద్రాలలో కూడా నగదు మార్పిడి జరుగుతోంది. బిల్లులు చెల్లించేందుకు వచ్చేవారు రూ.వందలతో పాటు కొత్తనోట్లను కూడా ఇస్తున్నారు. ఇక్కడ పాతనోట్లను తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగులు బిల్లుల వసూలు కేంద్రంలో పనిచేసే సిబ్బందితో కలిసి రోజూ సాయంత్రం రూ.వంద, రూ.2వేల నోట్లను తీసుకుని వాటి బదులుగా పాతనోట్లను అందజేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా వసూలు కేంద్రాలతో పాటు 24 గంటలూ బిల్లులు స్వీకరించే కేంద్రాల్లోనూ ఈ తంతు సాగుతోంది.  మెడికల్‌ స్టోర్లలోనూ పాతనోట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఇక్కడా సాయంత్రం వరకూ వసూలైన రూ.వంద, రూ.2వేల నోట్లను పాతనోట్లతో మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు మార్పిడికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గంటలకొద్దీ క్యూలో నిల్చుని వెనుదిరుగుతున్నారు. కానీ నల్లకుబేరులు మాత్రం యథేచ్ఛగా నగదు మార్పిడి చేసుకుంటున్నారు. ఈ తంతుపై బ్యాంకుల ఉన్నతాధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే బ్లాక్‌ అండ్‌ వైట్‌ దందా గుట్టు రట్టయ్యే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement