గుండెపోటులో చచ్చుబడే కండరానికీ పునరుజ్జీవం! | Breakdown of muscle is the key to the resurrection of a heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటులో చచ్చుబడే కండరానికీ పునరుజ్జీవం!

Published Sat, Nov 19 2016 11:35 PM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM

గుండెపోటులో చచ్చుబడే   కండరానికీ పునరుజ్జీవం! - Sakshi

గుండెపోటులో చచ్చుబడే కండరానికీ పునరుజ్జీవం!

హెల్త్ ల్యాబ్

గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరానికి రక్తం అందక అది క్రమంగా చచ్చుబడిపోతుందన్నది తెలిసిందే. ఇప్పటివరకూ అలా చచ్చుబడిపోయిన కండరాన్ని మళ్లీ పునరుద్ధరించే మందులేమీ లేవు. కానీ అలా జరిగిన సందర్భాల్లో పనిచేసే రెండు సరికొత్త రసాయనాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇది నిజంగా శుభవార్తే. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు 5,500 రకాల రసాయనాలను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నారు.

గుండెపోటు వచ్చిన రోగుల్లో గుండె కండరానికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో ఆ కండరంలోని కొంతభాగం చచ్చుబడిపోతుంది. అలా చచ్చుబడ్డ కండరాలు గుండెపై ఒక గాయం (స్కార్)లా ఏర్పడతాయి. ఆ స్కార్ ఉన్నచోట కణాలు నిర్జీవమైనట్లుగా మారతాయి. దాంతో గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కూడా వస్తుంది. కానీ ఇలా జరిగిన కండర ప్రాంతంలో కణాలను పునరుజ్జీవించేలా చేయవచ్చునని గ్లాడ్‌స్టోన్ పరిశోధన సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎలుకల మీద జరిగిన ఈ పరిశోధనలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇలా గుండె కండరాలు చచ్చుబడిపోయిన కొన్ని ఎలుకలకు ఈ రసాయనాలు ఇచ్చి చూశారు. దాంతో ఆ కండరాలు మళ్లీ పునరుత్తేజితం అయ్యాయి. గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులార్ డిసీజెస్ డెరైక్టర్ డాక్టర్ దీపక్ శ్రీవాత్సవ ఈ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ ‘‘ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స కంటే మరింత సమర్థంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త ఇంజెక్షన్!
ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు సర్జరీతో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ చేస్తున్నారు. ఇందులో కీమో, రేడియోథెరపీలకు చాలా రకాల చికిత్సల్లో చాలా దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. కానీ బ్రిటిష్ సైంటిస్టులు కొత్త రకం ఇంజెక్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. దీనివల్ల చాలా రకాల సైడ్‌ఎఫెక్ట్‌లు, అనర్థాలను నివారించవచ్చని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ ఇంజెక్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. ఇద విజయవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల ఒంట్లోకి చేరే రసాయనాలు కేవలం క్యాన్సర్ కణజాలాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాయట. పక్కనున్న ఆరోగ్యకరమైన కణాల జోలికి అస్సలు వెళ్లవు అంటున్నారా పరిశోధకులు. అయితే ఈ కొత్త రకం ఇంజెక్షన్లు అందుబాటులోకి రావడానికి కొంతకాలం పడుతుందంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల లివర్‌పూల్‌లోని నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సీఆర్‌ఐ)లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో నివేదించారు. ఇక లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు మరో రకం పరిశోధనలనూ చేస్తున్నారు. మరింత తేలిగ్గా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కనుగొనే రక్తపరీక్ష విధానాన్ని వారు కొద్ది రోజుల క్రితమే అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మలబద్ధకం వల్ల కొత్త అనర్థం!
మీకు మలబద్ధకం ఉందా? తగ్గించుకోడానికి కాస్త ఎక్కువగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మలబద్ధకం వల్ల మరో అనర్థం రాబోతోందని కొత్తగా తెలిసింది. మలబద్ధకం ఉన్నవాళ్లలో 10 శాతం మందికి మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరో 13 శాతం మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరీ ఎక్కువగా ముక్కడం వల్ల మూత్రపిండాలపై దుష్ర్పభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు. మెంఫిస్ ఏవీ మెడికల్ సెంటర్‌లోని నెఫ్రాలజీ విభాగం చీఫ్ అయిన  డాక్టర్ స్కాబా కోవెస్డీ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ స్కాబా ఈ అంశాన్ని వెల్లడిస్తూ... ‘‘ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. గతంలో మలబద్ధకం గుండెజబ్బులతో సహా కొన్ని ఇతర అనర్థాలను తెచ్చిపెడుతుందని ఊహించాం. అయితే అది కలగజేసే అనర్థాల్లో ఇదీ ఒకటి అని తెలిసింది’’ అని పేర్కొన్నారు డాక్టర్ స్కాబా కోవెస్డీ. అయితే ఆహారంలో పీచుపదార్థాలు పుష్కలంగా తీసుకోవడం వల్ల మలబద్ధ్దకాన్ని నివారించడం ద్వారా మరెన్నో వ్యాధులనూ నివారించవచ్చని నిర్ద్వంద్వంగా తెలిసిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే సాఫీగా విరేచనం కావడానికి మందుల కంటే  ఒంటికి మేలు చేసే స్వాభావికమైన ఆహారాలు (పుష్కలంగా ఆకుకూరల వంటివి) ఎక్కువగా తీసుకోవాలని కూడా వారు చెబుతున్నారు. దాంతో మూత్రపిండాల జబ్బునూ నివారించవచ్చని వారి సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement