కోపం గుండెకు చేటు!
వాషింగ్టన్: ఆందోళన, కోపం, నిరాశలతో... ప్రతికూల ఆలోచనలతో.. భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరితే మీ గుండె పనితీరులో మార్పు రావడమే కాదు... ఏకంగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ గేయినరోస్ బృందం ప్రతికూల భావోద్వేగాలు-మెదడు, గుండె సంబంధిత వ్యాధులపై పరిశోధనలు నిర్వహించింది. రక్తనాళాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే మొదడు, గుండెలకు రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడుతాయి, చివరకు అది గుండె పోటుకు దారితీస్తుంది.
ఈ పరిణామాన్ని ‘ఎథెరోస్ల్కేరోసిన్’గా పిలుస్తారు. శరీరంలో రసాయన ప్రక్రి య వేగంగా జరిగినప్పుడు మానసికభావోద్వేగాలు పెరగడంతో ఎథెరోస్ల్కేరోసిన్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువై హృదయానికి అందే రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడి గుండెసంబంధిత వ్యాధులు వస్తాయి. 157 మందికి విచారకరమైన చిత్రాలను చూపించి.. వారి భావోద్వేగాలను పరిశీలించిన అనంతరం పీటర్ బృందం ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలు అధికంగా ఉన్నవారిలో గుండెసంబంధిత వ్యాధు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తమ అధ్యాయనంలో తేలినట్లు వెల్లడించింది.