...నీటిలోకి జారిపోయాం | Brigadier Dr. V.D Abraham Professional experiences ... | Sakshi
Sakshi News home page

...నీటిలోకి జారిపోయాం

Published Sun, Mar 1 2015 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

...నీటిలోకి జారిపోయాం

...నీటిలోకి జారిపోయాం

యుద్ధ క్షేత్రం
కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కాలంలో గవర్నర్‌కు రక్షణాధికారి...
వైష్ణోదేవి దర్శనానికి రోడ్డు వేయించడంలో కీలక పాత్రధారి...
ఉగ్రవాదుల బారి నుంచి శరణార్థులను కాపాడిన వీరజవాను...
అయిన
బ్రిగేడియర్ డాక్టర్ వి.డి అబ్రహామ్ వృత్తిగత అనుభవాలు...

అది 1995వ సంవత్సరం డిసెంబర్  ఏడవ తేదీ. మనదేశం నుంచి అంటార్కిటికా ఖండానికి 15వ అంటార్కిటికా సైంటిఫిక్ ఎక్స్‌పెడిషన్ ప్రారంభమైంది. ఆ బృందానికి జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అరుణ్ చతుర్వేది నాయకత్వం వహించారు. నేను ఆ బృందానికి డిప్యూటీ లీడర్‌ని. గోవా తీరం నుంచి అరేబియా సముద్రంలో ప్రారంభమైన మా ప్రయాణం హిందూ మహాసముద్రం మీదుగా దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండానికి మూడు వారాలకు చేరింది. అంటార్కిటికాలో సముద్రపు నీటి మీద కొన్ని చోట్ల మంచు దిబ్బలు ఏర్పడి నీటి మీద కదులుతూ ఉంటాయి.

షిప్పులో రవాణా చేసిన పెట్రోల్, ఆహార పదార్థాలు, మందులు, పరిశోధన కోసం తీసుకెళ్లిన పరికరాలను మేము క్రేన్ సాయంతో షెల్ఫ్ ఐస్ (మంచు బల్లలాగ సమతలంగా ఉండే ప్రదేశం) మీదకు తరలిస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా మేము ఉన్న చోట మంచు ఒక్కసారిగా సముద్రంపై కదిలిపోతోంది. నేను, నా సహోద్యోగి పి.ఎమ్. మీనా నీటిలోకి జారిపోయాం. ఆ ప్రమాదంలో మీనా మంచు పలక మీద నుంచి సముద్రపు నీటిలో మునిగిపోయాడు. నేను ఓడ అంచు పట్టుకున్నాను. షిప్పులో ఉన్న వాళ్లు పైనుంచి పెద్ద తాడు వదిలారు.

నేనా తాడు పట్టుకోగానే, నన్ను పైకి లాగి రక్షించేందుకు ప్రయత్నించారు. సముద్రంలోకి దిగేందుకు తగినంత పొడవుగా తాడు వదలమని కోరి, ఎట్టకేలకు 90 అడుగుల లోతుకు వెళ్లి మీనాను రక్షించి పైకి తీసుకొచ్చాను. ఆ తర్వాత నా సాహసానికి మెచ్చిన మా బృందం నాయకుడు అరుణ్ చతుర్వేది ‘అశోక్ చక్ర’ పురస్కారానికి నా పేరు సూచించారు. కానీ అప్పట్లో నా సాహసానికి సంబంధించిన రుజువులను ప్రభుత్వానికి అందించే పరిస్థితి లేదు. 1995లో వెళ్లిన వాడిని 16 నెలల తర్వాత ఇండియాకు వచ్చాను. దాంతో ఆ పురస్కారాన్ని అందుకోలేకపోయాను. కానీ సైనికులకు ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఇచ్చే ‘సేనా మెడల్’ అందుకున్నాను.
 
లెఫ్టినెంట్‌గా మొదలై...
హైదరాబాద్‌లో పుట్టిన నేను.. మా నాన్న ఆర్మీ ఉద్యోగం కారణంగా దేశంలోని చాలా ప్రదేశాల్లో పెరిగాను. 1979లో రక్షణ రంగంలోకి వచ్చాను. భోపాల్‌లో లెఫ్టినెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టి, 2013లో బ్రిగేడియర్‌గా రిటైరయ్యాను. ఎక్కువకాలం జమ్మూ- కశ్మీర్‌లో ఉద్యోగం చేశాను. రాష్ట్రపతి పాలన కాలంలో 1987 నుంచి గవర్నర్ జగ్‌మోహన్‌కి రక్షణాధికారిగా పనిచేశాను. వైష్ణోదేవి ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేశాను. కశ్మీర్‌లో 1991లో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనప్పుడు కశ్మీర్ పండిట్ల కోసం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల నిర్వహణ బాధ్యతలు చూశాను.

ఆ సేవలకు నేషనల్ అవార్డు అందుకున్నాను. తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో సేవలకు కూడా ఆర్మీ కమాండర్స్ కమెండేషన్‌తోపాటు సైంటిఫిక్ ఇంటర్‌వెన్షన్, ఇండిజినైజ్‌డ్ క్రయోజనిక్ కూలర్‌ను కనిపెట్టి మోటార్ గన్‌లో ఉపయోగించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు కమెండేషన్ కార్డ్.. అలా మొత్తం ఐదు మెడల్స్ అందుకున్నాను. నేను కనుక్కొన్న ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

అవిశ్రాంతంగా...
రక్షణరంగంలో చేరిన తర్వాత ఎంటెక్, సీడీఎమ్‌ఏ పరిజ్ఞానం మీద పీహెచ్‌డీ చేశాను. రిటైరయ్యాక ఇండోర్‌లోని ఓరియెంటల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఈ ఏడాది జనవరి 31న రిటైరయ్యాను. ప్రస్తుతం ఇండియన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీకి అధ్యక్షుడిని. మరికొన్ని సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను.
- బ్రిగేడియర్ డాక్టర్ వి.డి. అబ్రహామ్ (విశ్రాంత సైనికాధికారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement