
పిజ్జా పిలుస్తోంది!
విశేషం
ఎక్కడి పిజ్జా..? ఎక్కడ లండన్..? ఇటలీలో పుట్టిన పిజ్జా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశ దేశాల్లో పిజ్జా అభిమానులు ఉన్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌లోనైతే పిజ్జాకు వీరాభిమానులూ ఉన్నారు. ఇలాంటి వీరాభిమానులకు పిజ్జా పండుగ ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన వచ్చిందీ మధ్య. ఆలోచన వస్తే ఆచరణలోకి రావడం ఎంతసేపు? అది కూడా లండన్ వారికి. అందుకే అక్కడి పిజ్జా వీరాభిమానులంతా కార్యాచరణకు చకచకా రంగం సిద్ధం చేసేశారు.
వారి కోరిక మేరకు ఫుడ్ ఈవెంట్ కంపెనీ అయిన ‘యంగ్ అండ్ ఫుడిష్’... సెప్టెంబర్ 13న లండన్‌లో తొలిసారిగా పిజ్జా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. లండన్‌లోని బరో మార్కెట్ జూబ్లీ ప్లేస్‌లో జరగ నున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించింది. పిజ్జా పండుగలో పాల్గొనా లంటే 8 పౌండ్లు ప్రవేశ రుసుము చెల్లించాలి.
వెరైటీ వెరైటీ పిజ్జాలు తిని ఆనందించాలంటే మాత్రం 30 పౌండ్లు సమర్పించుకోవాల్సిందే. ఆ మొత్తం చెల్లిస్తే ఏ రకానివైనా ఆరు పిజ్జాలు హ్యాపీగా లాగించేయవచ్చు. ఈ వార్త వినగానే పిజ్జా ప్రియులు అప్పుడే నోళ్లు చప్పరిస్తున్నారు!