నేనింకా ప్రేమలో పడలేదు!
ఇంటర్వ్యూ
‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు దగ్గరయ్యింది క్యాథరీన్ త్రెసా. పైసా, రుద్రమదేవి వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో ‘సరైనోడు’తో కలసి రాబోతోంది. ఈ సందర్భంగా తన గురించి చాలా విషయాలు చెప్పింది. చాలా భాషలు వచ్చని, పాటలు వినడమే కాదు పాడతానని, బద్దకంగా ఉండేవాళ్లు నచ్చరని... ఇలా ఎన్నో కబుర్లు చెప్పేసింది. తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చదవాల్సిందే!
కెరీర్ కాస్త స్లోగా ఉన్నట్టుంది?
వట్టి తెలుగు సినిమాల గురించే తీసుకుంటే అలానే అనిపిస్తుంది. నేను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఈ నాలుగు భాషల్లోనూ నటిస్తున్నాను. 2010 నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఏదో ఒక భాషలో నటిస్తూనే ఉన్నాను.
ఇన్ని చేస్తున్నారు. అన్ని భాషలూ వచ్చా?
ఇంగ్లిష్, హిందీ, అరబిక్, కన్నడం బాగా వచ్చు. మలయాళం, తమిళం పూర్తిగా కాకపోయినా చాలావరకూ వచ్చు. తెలుగు నేర్చుకుంటున్నాను.
నటన వైపు ఎలా వచ్చారు?
అమ్మ త్రెసా, నాన్న ఫ్రాంక్ మారియో అలెగ్జాండర్‌లిద్దరూ మలయాళీ క్యాథలిక్స్. దుబాయ్‌లో సెటిలయ్యారు. నేనూ అక్కడే పుట్టి పెరిగాను. పన్నెండో తరగతి వరకూ అక్కడే చదివాను. ఆ సమయంలోనే అప్ కమింగ్ ఫ్యాషన్ డిజైనర్ల కోసం మోడలింగ్ చేస్తూండేదాన్ని. డిగ్రీ చేయడానికి బెంగళూరు వచ్చాక్కూడా మోడలింగ్ కంటిన్యూ చేశా. చెన్నై సిల్క్స్, ఫాస్ట్ ట్రాక్, డెక్కన్ క్రానికల్ వంటి యాడ్‌స చేశాను. తర్వాత ‘శంకర్ ఐపీస్’ అనే కన్నడ చిత్రంలో చాన్సొచ్చింది.
తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
ఎప్పుడూ పాట నా చెవిన పడుతూనే ఉండాలి. బాగా పాడతాను కూడా. డ్యాన్స్, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్ ఇష్టం. వీటన్నిటిలో నేను శిక్షణ తీసుకున్నాను.
ఇంకా ఏమంటే ఇష్టం?
జీన్స్, టీషర్ట్స్ ధరించడానికి ఇష్ట పడతాను. రకరకాల బ్రేస్‌లెట్స్, రింగ్స్ ధరిస్తుంటాను. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు... షేక్‌స్పియర్ నవలలు... రెహమాన్ సంగీతం... మణి రత్నం సినిమాలు... షారుఖ్-కాజోల్‌ల నటన... పెద్ద లిస్టే ఉంది.
ఎదుటివారిలో మీకు నచ్చేది?
అమాయకత్వం, కష్టపడి పనిచేసే తత్వం.
మరి నచ్చనిది?
బద్ధకంగా ఉండేవాళ్లను చూసినా, శుభ్రత పాటించని వాళ్లను చూసినా దూరంగా పారిపోతాను. క్రూర మనస్తత్వం కలవాళ్ల దరిదాపుల్లోకి కూడా పోను.
మీలో మీకు నచ్చేదేంటి?
సెల్స్ కాన్ఫిడెన్స్.
నచ్చనిది?
కాస్త బాగా మాట్లాడితే చాలు, మంచోళ్లని డిసైడైపోతా. వాళ్ల నిజ స్వరూపం తెలుసుకుని అవాక్కవుతా. ఎన్నిసార్లు అలా జరిగినా ఆ విషయంలో బోల్తా పడుతూనే ఉంటాను.
మీ రోల్ మోడల్?
ఏ అమ్మాయికైనా మొదటి రోల్ మోడల్ అమ్మే. నాక్కూడా అమ్మే మార్గదర్శి. ఇంటి పనులు చక్కబెట్టడం, నాన్నకు కావలసి నవి అమర్చిపెట్టడం, నా అవసరాలు తీర్చడం... విసుగన్నదే ఉండదు. ఏ విషయంలోనైనా చక్కగా గైడ్ చేస్తుంది.
మీ జీవితంలో మర్చిపోలేని అనుభవం?
చాలా ఉన్నాయి. మొదటిసారి మోడ లింగ్ చేయడం, ఇండియాలో అడుగు పెట్టిన క్షణం, తొలి సినిమా అవకాశం, ‘రుద్రమదేవి’లాంటి గొప్ప సినిమాలో చోటు దక్కడం... ఇలా మర్చిపోలేని మంచి అనుభవాలు చాలానే ఉన్నాయి.
అత్యంత బాధ కలిగించినది?
మా తమ్ముడి మరణం. వాడు ఊహిం చని విధంగా డిప్రెషన్‌కి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వాడంటే నాకు ప్రాణం. నేను కాస్త డల్‌గా ఉంటే చాలు, ఏదో ఒకటి చెప్పి నవ్వించేసేవాడు. తను లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. నా లైఫ్‌లో తన ప్లేస్‌ని ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు.
డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
‘బ్లాక్’లో రాణీముఖర్జీ చేసిన రోల్ చాలా ఇష్టం నాకు. అలాంటి పాత్రలు చాలా అరుదుగా పుడతాయి. ఎవరినో అదృష్టం కొద్దీ వరిస్తాయి. ఆ అదృష్టం ఒక్కసారైనా నాకు కలగాలని నా కోరిక.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడాలనుంది. దుబాయ్‌లో నేను ‘ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ వాలంటీర్’గా చేశాను. ఇక్కడ కూడా అలా చేయాలని ఉంది. అయితే ప్రస్తుతానికి సమయం చిక్కడం లేదు. జీవితంలో కాస్త స్థిరపడ్డాక దానిమీద పూర్తిగా దృష్టి పెడతాను.
ప్రేమ, పెళ్లి?
పెళ్లి అప్పుడే లేదు. ఇక ప్రేమంటారా? నేనింకా ప్రేమలో పడలేదు. నాకు నచ్చే వ్యక్తి ఎదురైతే తప్పకుండా పడతా. చూడాలి ఆ వ్యక్తి ఎప్పుడు కలుస్తాడో!