అడగడం అంత ఈజీ కాదు
టీవీక్షణం
ప్రశ్నలు వేయడం ఈజీ అనుకుంటాం కానీ అవతలి వ్యక్తి నుంచి సమాధానాలు రాబట్టే విధంగా ప్రశ్నలు అడగడం మాత్రం అంత ఈజీ కాదు. ఎలాంటి ప్రశ్నకైనా జవాబు రాబట్టగలిగితే కనుక అంతకంటే గొప్ప ఇంటర్వ్యూ మరొకటి ఉండదు. కానీ అదంత తేలిక కాదు. అందుకే పలు చానెళ్లు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోన్నా అన్నీ సక్సెస్ సాధించడం లేదు. అయినా కూడా చానెళ్లు పోటీపడి మరీ కొత్త కొత్త తరహాల్లో ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాయి.
ఈ తరహా ప్రోగ్రాములు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ. ఇంటర్వ్యూలు చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’నే తీసుకోండి. సెలెబ్రిటీలను కపిల్ చాలా ప్రశ్నలే అడుగుతాడు. అవి ఎవరినీ హర్ట్ చేయవు. ఎందుకంటే లోతైన ప్రశ్నల్ని కూడా కామెడీగా అడుగుతాడు కాబట్టి. కామెడీ ప్రోగ్రామ్ కాబట్టి అవతలివాళ్లు కూడా అదే మైండ్ సెట్‌తో వస్తారు. అదే ‘కాఫీ విత్ కరణ్’ని చూస్తే... అది ఇంటర్వ్యూలా ఉండదు, ఇంటరాగేషన్‌లా ఉంటుంది. వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడిపోయి, అభ్యంతరకరమైన ప్రశ్నలు కూడా అడుగుతుంటాడు కరణ్ జోహార్. సెలెబ్రిటీలు తడబడిపోతుంటారు.
సమాధానం చెప్పలేక టెన్షన్‌ని దాచిపెట్టి నవ్వేస్తుంటారు. ఇక ఇటీవలే కలర్స్ చానెల్ ‘ద అనుపమ్ ఖేర్ షో’ను ప్రారంభించింది. అనుపమ్ చేయడం తప్ప ఇందులో అంత కొత్తదనమేమీ లేదు. కాస్త పేలవంగానే అనిపిస్తోంది. అనుపమ్ ఇమేజ్ ఒక్కటే షోని నిలబెడుతోందేమో అనిపిస్తుంది. గతంలో ఓ చానెల్ ‘సచ్‌కా సామ్నా’ అనే షో ప్రసారం చేసింది. ఇది ఇంటర్వ్యూలన్నింట్లోకీ భిన్నం. సెలెబ్రిటీలను ఏ ప్రశ్నయినా అడుగుతారు. వాళ్లు నిజమే చెప్పాలి. అబద్ధం చెబితే డిటెక్టర్ పసిగట్టేస్తుంది.
ఆట చేయిజారిపోతుంది. ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసేవారు కానీ, పోటీదారులకు మాత్రం ముచ్చెమటలు పోసేవి. అయితే మరీ వ్యక్తిగత విషయాలను అడుగుతూండటంతో, గొడవ చేసి ప్రోగ్రామ్‌ని ఆపించేశారు. ఇంకా వివిధ చానెళ్లలో పలు తరహాల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కొన్ని రొటీన్‌గా సాగి బోర్ కొట్టిస్తున్నాయి. అన్నింట్లోకీ బెస్ట్ అనిపించుకున్నది మాత్రం ‘ఆప్‌కీ అదాలత్’. సినిమా వాళ్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకులు, ఆటగాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా, నదరకుండా బెదరకుండా... ఇండియా టీవీ అధినేత రజత్‌శర్మ ప్రశ్నలు సంధించే తీరు శభాష్ అనిపించుకుంది.
ఇక మన తెలుగు చానెళ్ల విషయానికి వస్తే... ఇలాంటి షోలు కాస్త తక్కువే. వాటిలో కూడా కొన్ని మాత్రమే వైవిధ్యతను ప్రదర్శించాయని చెప్పవచ్చు. ప్రింట్ మీడియాలో వచ్చినన్ని మంచి ఇంటర్వ్యూలు చానెళ్లలో రావడం లేదు. వచ్చినా సాధారణంగా సాగుతాయే తప్ప సంచలనాలు సృష్టించేవి అరుదే. ప్రేమతో మీ లక్ష్మి, పిన్ కౌంటర్, ఓపెన్ హార్ట్, క్లోజ్ ఎన్‌కౌంటర్, దిల్‌సే లాంటి కొన్ని మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇంటర్వ్యూలు చేసేందుకు పెద్ద పెద్ద సెలెబ్రిటీలనే పెట్టినా కూడా ఫెయిలైన సందర్భాలు కోకొల్లలు.
ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్వ్యూ చేయడానికి గ్లామర్ ఒక్కటే సరిపోదు. అవతలివారి గురించి తగిన పరిజ్ఞానం, ఏ ప్రశ్న అయినా అడగగల తెగువ, స్పాంటేనియస్‌గా స్పందించగల సామర్థ్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా హుషారు వరదలై పారాలి. లేదంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. ఎంటర్‌టైన్‌మెంటూ ఫీలవ్వడు. ప్రతి ఇంటర్వ్యూ ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పగలిగితేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. లేదంటే అడిగే ప్రశ్నలూ వృథానే... చెప్పే సమాధానాలూ వృథానే!