kapil
-
నా బిడ్డవు కదూ..!
రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘ఎవర్గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక. వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు. ‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే! -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
హనీట్రాప్ కలకలం.. కపిల్‌పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
Kapil Jindal: ‘కంటెంట్ అనేది అల్టిమేట్ కింగ్’.. మా విజయ రహస్యం ఇదే!
కల కని ఆ కలను నిజం చేసుకొని... సక్సెస్‌ను చూసి సంబరపడుతూ... ‘కలయా నిజమా!’ అనుకునేవారు ఉంటారు. అసలు ఏ కలా కనకుండానే ‘గెలుపు కళ’లో ఆరితేరినవారు ఉంటారు. దేవిందర్ మహేశ్వరి, కపిల్ జిందాల్ రెండో కోవకు చెందిన యువకులు. ‘బిబామ్’తో డిజిటల్ ప్రపంచంలో గెలుపు జెండా ఎగరేశారు.... రాజస్థాన్‌లోని హన్మాన్ఘర్లో ఒక కోచింగ్ సెంటర్లో పరిచయం అయిన దేవిందర్ మహేశ్వరి, కపిల్ జిందాల్ ఆ తరువాత మంచి స్నేహితులయ్యారు. అహ్మదాబాద్(గుజరాత్)లోని ప్రతిష్ఠాత్మకమైన నిర్మ యూనివర్శిటీలో ఇద్దరికీ అడ్మిషన్ దొరికింది. మహేశ్వరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జిందాల్ కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అయ్యారు. ఇద్దరూ రూమ్మేట్స్. కాలేజి నుంచి వచ్చిన తరువాత ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోయేవారు. ఇంట్రెస్టింగ్ టెక్ స్టఫ్ కోసం వెదికేవారు. ఆ సమయంలో వారికి అనిపించింది ఏమిటంటే, తాము ఎప్పటికప్పుడు తెలుసుకున్న టెక్నాలజీ విషయాలను ఇతరులతో పంచుకోవాలని. అలా ‘ది టెక్నికా’ పేరుతో వెబ్సైట్ మొదలుపెట్టారు. లేటెస్ట్ టెక్ డెవలప్మెంట్, కొత్త ప్రాడక్ట్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలకు ‘ది టెక్నికా’ వేదిక అయింది, మిత్రుల నుంచి మాత్రమే కాదు పరిచయం లేని వాళ్ల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వారి ఉత్సాహం రెట్టింపు అయింది. ‘యస్...మనం చేయగలం’ అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. 2013లో కాలేజి చదువు పూర్తయింది. మహేశ్వరి ఒక ఉద్యోగంలో చేరాడు. జిందాల్ ఏ ఉద్యోగం చేయలేదు. మహేశ్వరికి ఉద్యోగం భారం అనిపించింది. అందులో ‘కిక్’ అనిపించలేదు. అలా ఒక ఫైన్‌మార్నింగ్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మిత్రులిద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్న సమయంలో ‘దిటెక్నికా’ను ఫుల్‌టైమ్ వెంచర్ చేయాలనుకున్నారు. మకాంను అహ్మదాబాద్ నుంచి దిల్లీకి మార్చారు. ‘దిటెక్నికా’ పేరును ‘బిబామ్’గా మార్చారు. తమ దగ్గర పెద్దగా డబ్బేమీ లేదు. అయితే బోలెడు ఆత్మవిశ్వాసం ఉంది. ‘బిబామ్’ను నిలబెట్టడానికి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌లలో పనిచేయడం, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ చేయడం లాంటివి చేశారు. ‘బిబామ్’ సక్సెస్బాటకు చాలా దూరంలో ఉందని గ్రహించిన మిత్రులు తమ పనితీరును విశ్లేషించుకున్నారు. తప్పు ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. టెక్నాలజీని విస్తృతం గా కవర్ చేయడం అనేది తమ స్ట్రెంత్ అని గుర్తుతెచ్చుకున్నారు. కంటెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టారు. ఫ్రీలాన్స్ రైటర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలల తరువాత వెబ్సైట్లో కదలిక మొదలైంది. తరువాత నడవడం మొదలుపెట్టింది. ఆ తరువాత పరుగు అందుకుంది! ‘బిబామ్’ యూట్యూబ్ ఛానల్‌తో రెండో అడుగు పడింది. కంటెంట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. నాణ్యమైన వీడియోల కోసం రూపేష్, అక్షయ్లను ఎంపికచేసుకున్నారు. మూడు నెలలలో సబ్స్రైబర్లు లక్షకు పైగా పెరిగారు. ఆ తరువాత వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. ‘మేము సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాం అనే నమ్మకం వచ్చింది’ అని ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటాడు మహేశ్వరి. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లను సమీక్షించడం, గ్యాడ్జెట్లను పరిచయం చేయడం, తెలియని ఫీచర్ల గురించి వివరంగా తెలియజేయడం... వీటితో ‘బిబామ్’ డిజిటల్ వరల్డ్‌లో ప్రామాణికమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్ అనేది అల్టిమేట్ కింగ్’ అని నమ్మే మహేశ్వరి, జిందాల్‌లు ‘ఎలాంటి కంటెంట్ ను వీక్షకులు ఇష్టపడుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేస్తారు. స్టడీరిపోర్ట్లు చదువుతారు. తమ యూట్యూబ్ ఛానల్ సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ వెబ్సైట్ మీద శీతకన్ను వేయలేదు. మహేశ్వరి మాటల్లో చెప్పాలంటే ‘అది మా హృదయానికి చేరువైనది’ ‘మన దేశంలో డిజిటల్ బూమ్ మొదలైన తరువాత ప్రాడక్స్ గురించి తెలుసుకోవడానికి ఆన్లైన్ సమాచారంపై ఆధారపడేవారి సంఖ్య పెరిగింది. ఇలాంటి సమయంలోనే బిబామ్లాంటి చానల్స్‌కు ఆదరణ పెరిగింది. ఛానల్‌కు ఉండే విశ్వసనీయతే దాని విజయానికి కారణం అవుతుంది’ అంటున్నారు ఇండస్ట్రీ ఎనాలసిస్ట్ పావెల్ నైయా. విజయానికి కీలక సూత్రం మార్కెట్లోకి దూసుకువచ్చే కొత్త ధోరణులపై ఎప్పుడూ ఒక కన్నువేసి ఉండడం. షార్ట్–ఫామ్ వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరిగాక ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది బిబామ్. అక్కడ కూడా హిట్ కొట్టింది. 2017లో టెక్ న్యూస్ యాప్ లాంచ్ చేశారు. నెలల వ్యవధిలోనే అది సక్సెస్‌బాట పట్టింది. ‘ఇండియాలో బిగ్గెస్ట్ మీడియా టెక్నాలజీ కంపెనీగా ఎదగాలనేది మా భవిష్యత్ లక్ష్యం. ప్రతిభావంతులైన జర్నలిస్ట్‌లు, క్రియేటివ్ వీడియోఎడిటర్స్, ప్రోగ్రామర్స్, డాటా సైంటిస్ట్స్, డెవలపర్స్... మొదలైన వారితో మా లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకుంటున్నాం’ అంటున్నారు మహేశ్వరి, జిందాల్. చదవండి: Ultra Wide Selfie: సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమా? మరి 0.5 సెల్ఫీల గురించి తెలుసా? -
‘మరో కుమారుడు ఉంటే ఆర్మీలోకి పంపేదాన్ని’
గురుగ్రాం : తనకు మరో కుమారుడు ఉంటే తనను కూడా ఆర్మీలోకి పంపించి ఉండేదానినని పాక్ కాల్పుల్లో చనిపోయిన కెప్టెన్ కపిల్ కుండు తల్లి సునీత కుండు తెలిపారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో రామవతార్(28), శుభం సింగ్(22) అనే ఇద్దరు రైఫిల్ మెన్లు, హవల్దార్ రోషన్ లాల్(42)తో పాటు కెప్టెన్ కపిల్ కుండు(23) చనిపోయిన సంగతి తెల్సిందే. కుమారుడు చనిపోయిన విషయం తెలిసి సునీత విషణ్ణ వదనంతో విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు భారత జాతి కోసం పరితపించేవాడని, ఆర్మీలో చేరిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించేవాడని చెప్పారు. అమరుల కోసం పాకిస్తాన్ పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. తన కుమారుడు జీవించి ఉంటే మరో 10-15 సంవత్సరాలు భారత జాతి కోసం ఎంతో సేవ చేసే వాడని చెప్పారు. తన సోదరుడితో ఆదివారం మధ్యాహ్నాం ఒంటి గంటకు ఫోన్లో మాట్లాడానని, అంతా మంచిగానే ఉందని తనతో అన్నాడని కపిల్ కుండు సోదరి సోనియా వెల్లడించారు. కపిల్ కుండు స్వస్థలం హర్యానా రాష్ర్టం పటౌడీలోని రాన్సిక. ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆర్మీలో చేరాడు. కపిల్ తండ్రి లాలారాం 2012లో గుండెపోటుతో చనిపోయాడు. కపిల్‌కు కవిత్వం అంటే చాలా ఇష్టమని అతని సోదరుడు తారిఫ్ కుండు తెలిపారు. జవానుల మృతికి సంతాపంగా పలువురు సోషల్ మీడియా ద్వారా తమ మెసేజ్‌ని షేర్ చేశారు. -
భారత్‌ను అభినందించండి: ఆసీస్ మాజీ కెప్టెన్
బెంగళూరు: రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై భారత్ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్లతో ప్రశంసలు కురిపించారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్ జీనియస్ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్ గొప్ప విజయం సాధించందని, జట్టుకు క్లార్క్ అభినందనలు తెలిపారు. భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్, వాటే సీరీస్ అని ట్వీట్టర్లో పేర్కొన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగాక్కర గ్రేట్ ఫైట్ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్ చేశారు. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఛాంపియన్లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆసీస్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు
భారత క్రికెట్ దిగ్గజాలలో సమకాలీకులు గవాస్కర్, కపిల్ల మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకే 1984లో ఇంగ్లండ్‌తో టెస్టుకు కపిల్‌ను ఎంపిక చేయకుండా గవాస్కర్ అడ్డుకున్నారని ఇంతకాలం ప్రచారంలో ఉంది. మూడు దశాబ్దాల తర్వాత నాటి ఘటన గురించి సన్నీ నోరు విప్పారు. కపిల్‌ను జట్టులోకి ఎంపిక చేయకుండా అప్పట్లో ఓ సెలక్టర్ అడ్డుపడ్డారని, ఆయన పేరును తర్వాత చెబుతానని చెప్పారు. జట్టు ఎంపికలో కెప్టెన్ పాత్ర ఏమీ ఉండదని, కపిల్‌ను తానెప్పుడూ వద్దనుకోలేదని గవాస్కర్ తెలిపారు. -
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!
మాజీ క్రికెటర్‌పై బాక్సర్ ధ్వజం‘అర్జున’ స్వీకరించిన మనోజ్ న్యూఢిల్లీ: భారత మేటి బాక్సర్ మనోజ్ కుమార్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును స్వీకరించాడు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ హరియాణా బాక్సర్‌కు పురస్కారాన్ని అందజేశారు. తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో పాటు నువ్వు ఎవరో నాకు తెలీదన్న కమిటీ చైర్మన్ కపిల్దేవ్పై ఈ సందర్భంగా ధ్వజమెత్తాడు. ‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’ అని వ్యాఖ్యానించాడు. తాను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’ అని మనోజ్ వెల్లడించాడు. -
అడగడం అంత ఈజీ కాదు
టీవీక్షణం ప్రశ్నలు వేయడం ఈజీ అనుకుంటాం కానీ అవతలి వ్యక్తి నుంచి సమాధానాలు రాబట్టే విధంగా ప్రశ్నలు అడగడం మాత్రం అంత ఈజీ కాదు. ఎలాంటి ప్రశ్నకైనా జవాబు రాబట్టగలిగితే కనుక అంతకంటే గొప్ప ఇంటర్వ్యూ మరొకటి ఉండదు. కానీ అదంత తేలిక కాదు. అందుకే పలు చానెళ్లు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోన్నా అన్నీ సక్సెస్ సాధించడం లేదు. అయినా కూడా చానెళ్లు పోటీపడి మరీ కొత్త కొత్త తరహాల్లో ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాయి. ఈ తరహా ప్రోగ్రాములు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ. ఇంటర్వ్యూలు చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’నే తీసుకోండి. సెలెబ్రిటీలను కపిల్ చాలా ప్రశ్నలే అడుగుతాడు. అవి ఎవరినీ హర్ట్ చేయవు. ఎందుకంటే లోతైన ప్రశ్నల్ని కూడా కామెడీగా అడుగుతాడు కాబట్టి. కామెడీ ప్రోగ్రామ్ కాబట్టి అవతలివాళ్లు కూడా అదే మైండ్ సెట్‌తో వస్తారు. అదే ‘కాఫీ విత్ కరణ్’ని చూస్తే... అది ఇంటర్వ్యూలా ఉండదు, ఇంటరాగేషన్లా ఉంటుంది. వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడిపోయి, అభ్యంతరకరమైన ప్రశ్నలు కూడా అడుగుతుంటాడు కరణ్ జోహార్. సెలెబ్రిటీలు తడబడిపోతుంటారు. సమాధానం చెప్పలేక టెన్షన్‌ని దాచిపెట్టి నవ్వేస్తుంటారు. ఇక ఇటీవలే కలర్స్ చానెల్ ‘ద అనుపమ్ ఖేర్ షో’ను ప్రారంభించింది. అనుపమ్ చేయడం తప్ప ఇందులో అంత కొత్తదనమేమీ లేదు. కాస్త పేలవంగానే అనిపిస్తోంది. అనుపమ్ ఇమేజ్ ఒక్కటే షోని నిలబెడుతోందేమో అనిపిస్తుంది. గతంలో ఓ చానెల్ ‘సచ్‌కా సామ్నా’ అనే షో ప్రసారం చేసింది. ఇది ఇంటర్వ్యూలన్నింట్లోకీ భిన్నం. సెలెబ్రిటీలను ఏ ప్రశ్నయినా అడుగుతారు. వాళ్లు నిజమే చెప్పాలి. అబద్ధం చెబితే డిటెక్టర్ పసిగట్టేస్తుంది. ఆట చేయిజారిపోతుంది. ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసేవారు కానీ, పోటీదారులకు మాత్రం ముచ్చెమటలు పోసేవి. అయితే మరీ వ్యక్తిగత విషయాలను అడుగుతూండటంతో, గొడవ చేసి ప్రోగ్రామ్ని ఆపించేశారు. ఇంకా వివిధ చానెళ్లలో పలు తరహాల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కొన్ని సక్సెస్ అవుతున్నాయి. కొన్ని రొటీన్‌గా సాగి బోర్ కొట్టిస్తున్నాయి. అన్నింట్లోకీ బెస్ట్ అనిపించుకున్నది మాత్రం ‘ఆప్కీ అదాలత్’. సినిమా వాళ్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకులు, ఆటగాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా, నదరకుండా బెదరకుండా... ఇండియా టీవీ అధినేత రజత్శర్మ ప్రశ్నలు సంధించే తీరు శభాష్ అనిపించుకుంది. ఇక మన తెలుగు చానెళ్ల విషయానికి వస్తే... ఇలాంటి షోలు కాస్త తక్కువే. వాటిలో కూడా కొన్ని మాత్రమే వైవిధ్యతను ప్రదర్శించాయని చెప్పవచ్చు. ప్రింట్ మీడియాలో వచ్చినన్ని మంచి ఇంటర్వ్యూలు చానెళ్లలో రావడం లేదు. వచ్చినా సాధారణంగా సాగుతాయే తప్ప సంచలనాలు సృష్టించేవి అరుదే. ప్రేమతో మీ లక్ష్మి, పిన్ కౌంటర్, ఓపెన్ హార్ట్, క్లోజ్ ఎన్కౌంటర్, దిల్సే లాంటి కొన్ని మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇంటర్వ్యూలు చేసేందుకు పెద్ద పెద్ద సెలెబ్రిటీలనే పెట్టినా కూడా ఫెయిలైన సందర్భాలు కోకొల్లలు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్వ్యూ చేయడానికి గ్లామర్ ఒక్కటే సరిపోదు. అవతలివారి గురించి తగిన పరిజ్ఞానం, ఏ ప్రశ్న అయినా అడగగల తెగువ, స్పాంటేనియస్‌గా స్పందించగల సామర్థ్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా హుషారు వరదలై పారాలి. లేదంటే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడు. ఎంటర్టైన్మెంటూ ఫీలవ్వడు. ప్రతి ఇంటర్వ్యూ ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పగలిగితేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. లేదంటే అడిగే ప్రశ్నలూ వృథానే... చెప్పే సమాధానాలూ వృథానే!