రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!
‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘ఎవర్‌గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్‌తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక.
వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు.
‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్‌కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే!
Comments
Please login to add a commentAdd a comment