బిబామ్ టీమ్(PC: Forbes India)
కల కని ఆ కలను నిజం చేసుకొని... సక్సెస్‌ను చూసి సంబరపడుతూ... ‘కలయా నిజమా!’ అనుకునేవారు ఉంటారు. అసలు ఏ కలా కనకుండానే ‘గెలుపు కళ’లో ఆరితేరినవారు ఉంటారు. దేవిందర్ మహేశ్వరి, కపిల్ జిందాల్ రెండో కోవకు చెందిన యువకులు. ‘బిబామ్’తో డిజిటల్ ప్రపంచంలో గెలుపు జెండా ఎగరేశారు....
రాజస్థాన్‌లోని హన్‌మాన్‌ఘర్‌లో ఒక కోచింగ్ సెంటర్‌లో పరిచయం అయిన దేవిందర్ మహేశ్వరి, కపిల్ జిందాల్ ఆ తరువాత మంచి స్నేహితులయ్యారు. అహ్మదాబాద్(గుజరాత్)లోని ప్రతిష్ఠాత్మకమైన నిర్మ యూనివర్శిటీలో ఇద్దరికీ అడ్మిషన్ దొరికింది. మహేశ్వరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జిందాల్ కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అయ్యారు.
ఇద్దరూ రూమ్‌మేట్స్. కాలేజి నుంచి వచ్చిన తరువాత ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోయేవారు. ఇంట్రెస్టింగ్ టెక్ స్టఫ్ కోసం వెదికేవారు. ఆ సమయంలో వారికి అనిపించింది ఏమిటంటే, తాము ఎప్పటికప్పుడు తెలుసుకున్న టెక్నాలజీ విషయాలను ఇతరులతో పంచుకోవాలని.
అలా ‘ది టెక్నికా’ పేరుతో వెబ్‌సైట్ మొదలుపెట్టారు. లేటెస్ట్ టెక్ డెవలప్‌మెంట్, కొత్త ప్రాడక్ట్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలకు ‘ది టెక్నికా’ వేదిక అయింది, మిత్రుల నుంచి మాత్రమే కాదు పరిచయం లేని వాళ్ల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వారి ఉత్సాహం రెట్టింపు అయింది. ‘యస్...మనం చేయగలం’ అనే ఆత్మవిశ్వాసం పెరిగింది.
2013లో కాలేజి చదువు పూర్తయింది. మహేశ్వరి ఒక ఉద్యోగంలో చేరాడు. జిందాల్ ఏ ఉద్యోగం చేయలేదు. మహేశ్వరికి ఉద్యోగం భారం అనిపించింది. అందులో ‘కిక్’ అనిపించలేదు. అలా ఒక ఫైన్‌మార్నింగ్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
మిత్రులిద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్న సమయంలో ‘దిటెక్నికా’ను ఫుల్‌టైమ్ వెంచర్ చేయాలనుకున్నారు. మకాంను అహ్మదాబాద్ నుంచి దిల్లీకి మార్చారు. ‘దిటెక్నికా’ పేరును ‘బిబామ్’గా మార్చారు. తమ దగ్గర పెద్దగా డబ్బేమీ లేదు. అయితే బోలెడు ఆత్మవిశ్వాసం ఉంది.
‘బిబామ్’ను నిలబెట్టడానికి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌లలో పనిచేయడం, అడ్వర్‌టైజింగ్ క్యాంపెయిన్స్ చేయడం లాంటివి చేశారు. ‘బిబామ్’ సక్సెస్‌బాటకు చాలా దూరంలో ఉందని గ్రహించిన మిత్రులు తమ పనితీరును విశ్లేషించుకున్నారు. తప్పు ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. టెక్నాలజీని విస్తృతం గా కవర్ చేయడం అనేది తమ స్ట్రెంత్ అని గుర్తుతెచ్చుకున్నారు.
కంటెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టారు. ఫ్రీలాన్స్ రైటర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలల తరువాత వెబ్‌సైట్‌లో కదలిక మొదలైంది. తరువాత నడవడం మొదలుపెట్టింది. ఆ తరువాత పరుగు అందుకుంది!
‘బిబామ్’ యూట్యూబ్ ఛానల్‌తో రెండో అడుగు పడింది. కంటెంట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. నాణ్యమైన వీడియోల కోసం రూపేష్, అక్షయ్‌లను ఎంపికచేసుకున్నారు. మూడు నెలలలో సబ్‌స్రైబర్‌లు లక్షకు పైగా పెరిగారు. ఆ తరువాత వారి సంఖ్య రెండు మిలియన్‌లకు చేరింది.
‘మేము సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాం అనే నమ్మకం వచ్చింది’ అని ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటాడు మహేశ్వరి. మార్కెట్‌లోకి వచ్చే కొత్త ఫోన్‌లను సమీక్షించడం, గ్యాడ్జెట్‌లను పరిచయం చేయడం, తెలియని ఫీచర్‌ల గురించి వివరంగా తెలియజేయడం... వీటితో ‘బిబామ్’ డిజిటల్ వరల్డ్‌లో ప్రామాణికమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.
‘కంటెంట్ అనేది అల్టిమేట్ కింగ్’ అని నమ్మే మహేశ్వరి, జిందాల్‌లు ‘ఎలాంటి కంటెంట్ ను వీక్షకులు ఇష్టపడుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేస్తారు. స్టడీరిపోర్ట్‌లు చదువుతారు.
తమ యూట్యూబ్ ఛానల్ సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ వెబ్‌సైట్ మీద శీతకన్ను వేయలేదు. మహేశ్వరి మాటల్లో చెప్పాలంటే ‘అది మా హృదయానికి చేరువైనది’
‘మన దేశంలో డిజిటల్ బూమ్ మొదలైన తరువాత ప్రాడక్స్ గురించి తెలుసుకోవడానికి ఆన్‌లైన్ సమాచారంపై ఆధారపడేవారి సంఖ్య పెరిగింది.
ఇలాంటి సమయంలోనే బిబామ్‌లాంటి చానల్స్‌కు ఆదరణ పెరిగింది. ఛానల్‌కు ఉండే విశ్వసనీయతే దాని విజయానికి కారణం అవుతుంది’ అంటున్నారు ఇండస్ట్రీ ఎనాలసిస్ట్ పావెల్ నైయా.
విజయానికి కీలక సూత్రం మార్కెట్‌లోకి దూసుకువచ్చే కొత్త ధోరణులపై ఎప్పుడూ ఒక కన్నువేసి ఉండడం. షార్ట్–ఫామ్ వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరిగాక ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది బిబామ్. అక్కడ కూడా హిట్ కొట్టింది.
2017లో టెక్ న్యూస్ యాప్ లాంచ్ చేశారు. నెలల వ్యవధిలోనే అది సక్సెస్‌బాట పట్టింది. ‘ఇండియాలో బిగ్గెస్ట్ మీడియా టెక్నాలజీ కంపెనీగా ఎదగాలనేది మా భవిష్యత్ లక్ష్యం. ప్రతిభావంతులైన జర్నలిస్ట్‌లు, క్రియేటివ్ వీడియోఎడిటర్స్, ప్రోగ్రామర్స్, డాటా సైంటిస్ట్స్, డెవలపర్స్... మొదలైన వారితో మా లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకుంటున్నాం’ అంటున్నారు మహేశ్వరి, జిందాల్.
చదవండి: Ultra Wide Selfie: సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమా? మరి 0.5 సెల్ఫీల గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment