
మా రాంబాబు గాడి చింతన్ బైఠక్!
‘‘ఒరేయ్... రా రా... రా రా... చాలా రోజులకు కనిపిస్తున్నావు. రా కాస్త టిఫెన్ తిని వెళ్తువు గానీ రా ’’ అంటూ ఆహ్వానించాడు
హ్యూమర్
‘‘ఒరేయ్... రా రా... రా రా... చాలా రోజులకు కనిపిస్తున్నావు. రా కాస్త టిఫెన్ తిని వెళ్తువు గానీ రా ’’ అంటూ ఆహ్వానించాడు మా రాంబాబు గాడు. ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు కదా అని వెళ్లా. అదీగాక ఈమధ్య చాలారోజులైంది వాడి స్పీచ్‌లు వినక. ఆ టైమ్‌కు వాడు చింతపండు పులిహోర తింటున్నాడు. నాకూ కాస్త వడ్డించాడు. ‘‘ఏమిటోరా... పులిహోరలో చింతపులుసు కలపడానికి చింతపండును కాసేపు కసాబిసా పిసకాలి. పిసికి చింతపండు రసం తీయాలి. పిప్పి పక్కనే మిగిలిపోయేలా ఒడుపుగా రసం పోయాలి. చింత నుంచి రసం తీయడం అన్నది శ్రమతో కూడిన ఒక ఆర్టు. పాపం... ఈ మధ్య జనానికి సహనం తగ్గిపోయిందిరా. ఇంతగా శ్రమపడలేక... పిండటం పరమవీజీ కాబట్టి పులిహోర చేయాలంటే గబుక్కున నిమ్మకాయ పిసికేస్తున్నారు. పులుపు కలిపి మమ అనేస్తున్నారు’’ అంటూ చాలా బాధపడ్డాడు. ‘‘నువ్వే చూడురా... ఇటు నిమ్మరసం పులిహోరకూ, అటు చింతపండు పులిహోరకూ రుచిలో ఉన్న ఆ మహాద్భుతమైన తేడాను నువ్వే గమనించు’’ అంటూ చింత గొప్పకు వంత పాడాడు వాడు.
‘‘ఈరోజుల్లో అంతా షార్ట్ కట్సే కదరా. పోన్లే... ఏదేమైనా పులిహోర రుచి బాగుంది కదా ఎంజాయ్ చెయ్’’ అన్నాను. ‘‘చింతలో ఏదో వింత ఉంది. అందుకే కాబోలు చింత ఇంత నాణ్యమైనది కాబట్టే పతకం తయారీలో అపరభక్తుడైన శ్రీరామదాసు గారు జాగ్రత్తగా సీతమ్మవారికి చింతాకు పతకం చేయించాడు. చేయించి అక్కడితో ఊరుకున్నాడా... ఆ సంగతి తన కీర్తనలో నమోదు చేశాడు. చేసి గమ్మునున్నాడా.... ‘‘సీతమ్మకు చేయిస్తీ... చింతాకు పతకామూ.... పతకానికీ పట్టే పదివేల వరహాలూ...’’ అంటూ అది పరమ కాస్ట్‌లీ ఆభరణమంటూ టాం టాం చేశాడు. ఇక్కడో చిన్న మతలబు జరిగిపోయింది. సీతమ్మగారికి చేయించిన గోల్డ్ ఐటమ్ కంటే... దాన్ని ఏ మెటీరియల్‌తో చేశారో దానికి ప్రాధాన్యం వచ్చేసింది. చూశావా? అంటే లోకంలో ఎన్నెన్నో ఆకులు ఉండగా... రామదాసు గారు ఫలానా చింతాకు పతకమే చేయించాడెందుకూ అని ఆలోచించగా చించగా.. నిమ్మ పులిహోర కంటే చింతపులుసు పులిహోరే నాణ్యంగా ఉంటుందని తేలిపోయినట్టే... చింత ఆకులో ఏదో క్వాలిటీ గుణం ఉందని తేలిపోలా’’ అంటూ నన్ను ప్రశ్నించాడు రాంబాబు.
‘‘ఒరేయ్... ఇక్కడ జ్యువెలరీ డిజైన్‌లో చింతాకు ఒక షేప్. అంతకంటే దానికి ప్రాధాన్యమేమీ లేదేమోరా’’.... వాడి లాజిక్కులను నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజన్‌లో పడిపోతూనే అన్నాను నేను. ‘‘నో... నో... యువార్ మిస్టేకెన్... చింతలో నాణ్యత ఏదో ఉంది కాబట్టే మిగతా కర్రల కంటే దాన్ని విశేషంగా వాడతార్రా. ఫరెగ్జాంపుల్... నిన్ను చిన్నప్పుడు మీ మాస్టారు... వెదురు కర్రో, పేము బెత్తమో అందుబాటులో ఉన్నా... చింతబరికెనే వాడేవాడు. ఇలా తన్నడాన్ని ‘వీపు చింతపండు’ చేయడం అని అంటారు. అదీ చింతకిచ్చే గౌరవం. అంతేగానీ... అందుబాటులో ఉంది కదా అని... ఏ వేపపుల్లనో, పత్తికట్టెనో వాడి... ‘వీపు వేపపండు చేశారనో, జమపండు అయ్యిందనో అనేవాడు కాదు. పైగా ‘‘చీరి చింతకు కడతా’’ అనే కూడా వాడు. కానీ నీ వీపు చీరేసి మరో చెట్టుకు కట్టాలన్న కోరిక ఆయనకు ఉండేదికాదని అంత కోపంలోనూ నాకు తెలిసిపోయేది. మరోమాట ఆ కోపంలో మన సార్ కళ్లు చింతనిప్పుల్లా ఉండేవని చూసేవాళ్లు అనుకునేవారు, గుర్తులేదా’’ అంటూ రామదాసు గారి భక్తిపూజలతో పాటు నా చిన్ననాటి చింతబరికతో బడితెపూజలూ... సార్‌గారి చింతనిప్పుల కళ్లూ అలా ఎన్నో సంగతులను గుర్తుచేశాడు వాడు.
రాంబాబుగాడి ‘చింత’న వల్ల నా చిన్ననాటి సంగతులు బైటపడుతుండటం నాకు అంతగా రుచించలేదు. టాపిక్ మారుద్దామని ‘‘అన్నట్టు... సీఎంగారు ఇచ్చే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లకోసం అప్లికేషన్ పెడతానన్నావు కదా. ఎంతవరకు వచ్చిందా సంగతి?’’ అడిగా.
‘‘ఒరేయ్... డబుల్ బెడ్‌రూం నివాసాలంటే గుర్తుకొచ్చిందీ... ’మనకంటే ప్రభుత్వం ఒక పథకం పెట్టి వరసగా డబుల్ బెడ్రూములు ఇస్తుంది. పాపం... దెయ్యాలకు చింతచెట్లే డబుల్‌బెడ్‌రూమ్ భవనాలు కదా’ అని అడిగాడురా ఎప్పుడూ ఆ హారర్ సినిమాలు చూస్తుండే నీ కొడుకు’’ అంటూ టాపిక్‌ను మళ్లీ చింతచెట్టు దగ్గరికే తీసుకెళ్లాడు.
ఏదైనా మంత్రం వేసినట్టుగా వాడి మాటలను కట్టేస్తే బాగుండని నాకు అనిపించింది. కానీ ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ కదా అనే సామెత గుర్తొచ్చి ఆగిపోయాను. అలా వాడి మాటలకు డబుల్ చింతలో మునిగిపోతూ ఉండగా చింతకాయ కొరికినట్టుగా మారిన నా ఫేస్ ఫీలింగ్స్‌ను బట్టి వాడు గ్రహించాడు. ‘చింతపడకు చింతపడకు... చింత లేనివాడు సంతలోనైనా నిశ్చింతగా పడుకుంటాడట. కాబట్టి ముందు ‘చింత’ వదిలెయ్’’ అంటూ మళ్లీ ఓదార్చాడు వాడు. వీడికి ఎంత చెప్పినా ఇంతే... చింత చచ్చిన పులుపు చావదన్న తీరులో వీడి వైఖరి ఎప్పటికీ మారదన్న విషయం గ్రహించి మిక్కిలి చింతాక్రాంతుడనయ్యాను. ‘‘కాస్త బెంగగా ఉన్నట్లున్నావు... రా ఒక రౌండు ఆటాడుకుందాంగానీ రా రా’’ అంటూ సగానికి చీల్చిన చింత గింజలతో చేసిన అష్టా–చెమ్మా కాయలను విసురుతూ ఆహ్వానించాడు వాడు.
నోట్లో పులిహోరా... చెవిలో వీడి హోరూ భరించలేక... కాస్త మనశ్శాంతి కోసం ప్రశాంతంగా ఉంటుందని అలా మా ఊరి చింతలతోపు వైపునకు బయల్దేరాను నేను.
– యాసీన్