కథ: బాల మేధావి | Chintu very genius in Study | Sakshi
Sakshi News home page

కథ: బాల మేధావి

Published Sun, Jan 19 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

కథ: బాల మేధావి

కథ: బాల మేధావి

‘మమ్మీ ప్రోగ్రెస్ కార్డ్’ అంటూ చింటూ ప్రోగ్రెస్ కార్డ్‌ని వాళ్లమ్మకి అందకుండా గాలిలోకి ఎత్తి తిప్పుతూ గదంతా రెండుసార్లు తిరిగి వచ్చి వాళ్లమ్మ ఒడిలో వాలిపోయాడు. ఆత్రంగా ఆ కార్డ్ చూసిన పద్మ ముఖం వెలిగిపోయింది. రవి, పద్మల ఒక్కగానొక్క కొడుకు చింటూ. ఈ సంవత్సరమే వాడిని కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇదే వాడి మొదటి ప్రోగ్రెస్ కార్డ్. కార్డ్ అందుకున్న ఆనందం వాడి ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. పద్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ప్రతి సబ్జెక్ట్‌లోను పాతిక మార్కులకి పాతిక మార్కులు. ఎక్కడా ఒక్క అర మార్క్ కూడా తగ్గకుండా కార్డంతా నింపేశాయి. ఆనందం పట్టలేక పద్మ వెంటనే వాళ్లాయనకి ఫోన్ చేసేసింది. ‘‘ఏమండోయ్! మన చింటూగాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారండీ. అందులో వాడికి అన్నింట్లోను ఫస్ట్ మార్కులే వచ్చాయండీ. మీరు వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురండి. ఎందుకైనా మంచిది ఈ విషయం మీ ఆఫీసులో ఎవరికీ చెప్పకండి. మనవాడికి దిష్టి పెడతారు’’ అంటూ ఫోన్ పెట్టేసి పక్కింటి పిన్నిగారికి విషయం చెప్పడానికి గోడ దగ్గరికి పరిగెత్తింది.
 
 అక్కడ ఆఫీసులో రవి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. భార్య అందరూ దిష్టి పెడతారని భయపెట్టింది కనుక గానీ, లేకపోయుంటే ఆఫీసంతా అరచి గీపెట్టేసేవాడు. ఫోన్‌లో విషయం విన్న వెంటనే అరపూట పర్మిషన్ పెట్టి దారిలో స్వీట్స్ కొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వస్తూనే చింటూగాడిని ఎత్తి గాల్లోకి నాలుగు తిప్పులు తిప్పేశాడు.
 
 ‘‘వీడికి అన్నీ నా పోలికలేనోయ్. వీడు కచ్చితంగా బాలమేధావే’’ అంటూ చింటూగాడి ముఖాన్ని ముద్దులతో తడిపేశాడు. ‘‘చాల్లెద్దురు బడాయి? మీకు చిన్నప్పుడు అన్ని మార్కులు వస్తే ఇప్పుడు ఈ గుమస్తాగిరీ ఎందుకు వెలగపెడతారు. వీడికి అన్ని మేనమామ పోలికలే. మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు తెలుసా’’ అంది గర్వంగా హొయలు పోతూ. ‘‘ఇంజనీరింగ్ గురించి నాకు చెప్పకు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదవడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎలిమెంటరీ స్కూల్ లేని ఊళ్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసిపోయాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ సీటు పరిస్థితి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు తయారయ్యింది.’’  ‘‘ఏమైనా అనండి, వీడిది మీ పోలిక మాత్రం కాదు. పదో తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో నేను చూడలేదనుకున్నారా’’ అంది భర్తవైపు వ్యంగ్యంగా చూస్తూ.
 
 ‘‘అదా! ఆ రోజుల్లో మార్కుల మీద రేషన్ విధించారులే. ఎవరికీ పూర్తి మార్కులు వేసేవారు కాదు. ఐదు వందల మార్కులు వస్తే వాడు ఏ కలెక్టరో అయిపోతాడని లెక్కేసేవారు. మరి ఇప్పుడో ఐదు వందల మార్కులు వస్తే వాడికి ఇంటర్‌లో సీటు కూడా దొరకడం లేదు. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది’’ అన్నాడు విచారంగా పెదవులు విరుస్తూ.
 
 ‘‘ఎవరి పోలిక అయితేనే! మనవాడికి మంచి తెలివితేటలు వచ్చాయి. వీడిని ఇలాగే చదివిస్తే వీడు ఏ ఐన్‌స్టీనో, న్యూటనో అయిపోతాడు. ముందు ముందు పేపర్లలోను, టీవీల్లోను మనవాడి ఫొటోలు చూపిస్తుంటే మా ఆఫీసువాళ్లంతా ముఖాలు మాడ్చుకుని కూర్చుంటారు’’ అంటూ చింటూగాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ‘‘ఏమండీ, వీడికి ఇప్పుడే ఇన్ని మార్కులు వస్తున్నాయంటే పెద్దయ్యాక ఏ కలెక్టరో అయిపోతాడంటారా’’ అంటూ చింటూగాడి తల నిమురుతూ భర్తని ప్రశ్నించింది. ‘‘కలెక్టర్‌దేముంది, అధికారం అయితే ఉంటుంది కానీ నిజాయితీగా ఉంటే ‘కాణీ’ కూడా సంపాదించలేడు. వీడిని ఏ బిజినెస్ స్కూల్లోనో జాయిన్ చేస్తే నెలకి పదేసి లక్షలు జీతం ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఎగరేసుకుపోతాయి’’ తెలుసా అన్నాడు గర్వంగా.  ‘‘అలాగాండీ! అయితే మనవాడిని అందులోనే జాయిన్ చేద్దామండి. మనవాడు పదిలక్షల జీతం అందుకుంటుంటే, అది చూసి పక్కింటి పిన్నిగారికి తిక్క కుదిరిపోవాలి’’ అంటూ పక్కింటి వైపు చూసి మెటికలు విరిచింది. ‘‘సర్లే, రేపణ్నుంచి వీడి పెంపకంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంతోమంది బాలమేధావుల అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రుల కృషి చాలా ముఖ్యమైనది తెలుసా’’ అన్నాడు రవి ఎవరికీ తెలియని విషయం కనిపెట్టినట్టు. ఇవేమీ అర్థం కాని చింటూ మౌనంగా కుర్‌కురే తింటున్నాడు. నిన్నటిదాకా వాడు అడిగితే పద్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అరగంటసేపు యోగాసనాలు వేయించేది. ఇప్పుడు మార్కుల పుణ్యమా అని వాడు అడక్కుండానే కొనిచ్చేసింది. మార్కుల మాటల్లో పడి వాళ్లిద్దరికీ రాత్రి కంటిమీద కునుకు లేదు. మర్నాడు పొద్దున నిద్ర ముఖంతో ఆఫీసుకి వెళ్లిన రవికి కొలీగ్స్ చాలామంది ముఖాలు కూడా నిద్రలేనట్టే కనిపించాయి. ఎప్పుడూ లేనిది అందరూ ఏదో విషయం దాస్తున్నట్టు చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకైనా మంచిదని రవి కూడా గుంభనంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. పిల్లల చదువులు వాళ్ల మార్కుల విషయం వచ్చినప్పుడల్లా అందరూ విషయం దారిమళ్లించి వేరే సంబంధం లేని విషయాలు మాట్లాడటం మొదలుపెట్టారు.
 
 రవి కూడా చింటూగాడి మార్కుల విషయం ఆఫీసులో బయటపడకుండా తెలివిగా తప్పించుకుని, ఆ రోజు డ్యూటీ అయ్యిందనిపించాడు. ఆఫీసు నుంచి సరాసరి బజారుకెళ్లి చింటూని బాలమేధావిగా మార్చడానికి కావలసిన సరంజామా కొనుక్కొచ్చాడు. ఇంటికి వస్తూనే, ‘‘పద్మా! ఏం తెచ్చానో చూడు’’అంటూ తను తెచ్చిన ప్యాకెట్లు టేబుల్ మీద పేర్చేశాడు. ‘‘ఏంటండీ ఇవి, అచ్చు మనిషి మెదడులా ఉన్నాయి’’ అంది పద్మ ఆశ్చర్యంగా ఆ టేబుల్ మీది ప్యాకెట్లు చేతిలోకి తీసుకుంటూ.
 
 ‘‘వీటిని అక్రూట్స్ అంటారులే. ఇవి తింటే పిల్లల మెదడు బాగా పనిచేస్తుందని పుస్తకంలో చదివాను. రేపట్నుంచి రోజూ చింటూగాడికి వీటిని తినిపించే బాధ్యత మాత్రం నీదే!’’  ‘‘అయ్యో! అలాగాండి, నేను కూడా ఇందాక బజారుకెళ్లి సరస్వతీ లేహ్యం కొనుక్కొచ్చాను. అది తింటే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుందని షాపువాడు చెప్పాడు’’ అంది భర్తకి సీసా చూపిస్తూ.  ‘‘పోనీలేవోయ్. రెండూ కలిపి మిక్సీలో వేసెయ్. అక్రూట్ లేహ్యం తయారవుతుంది. అది తింటే చింటూగాడికి జ్ఞాపకశక్తితో పాటు మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది’’ అన్నాడు సైంటిస్ట్‌లా నుదురు రుద్దుకుంటూ.
 
 ఆ రోజు మొదలు చింటూ వాళ్లిద్దరికీ ప్రయోగశాలలా మారిపోయాడు. ఎక్కడెక్కడో చదివిన ఆరోగ్య సూత్రాలు అన్నీ చింటూ మీద ప్రయోగించసాగారు. ప్రతిరోజు ‘బాల మేధావుల్ని తయారుచేయడం ఎలా?’ అన్న పుస్తకాన్ని పారాయణం చెయ్యడం మొదలుపెట్టారు. దానికి తోడు చింటూకి కూడా మేధావుల లక్షణాలు బాగా వంటపట్టేశాయి. ఎవరు ఏమి అడిగినా, నోరు మెదిపేవాడు కాదు. అన్ని వ్యవహారాలు సైగల ద్వారా కానిచ్చేవాడు. తల్లిదండ్రుల ప్రయత్నమో, భగవంతుని సంకల్పమో గాని చింటూగాడి ఎల్‌కేజీ చదువు నిర్విఘ్నంగా సాగి ఆఖరి తంతు వార్షిక పరీక్షల ఘట్టానికి చేరుకుంది. వాడిని పరీక్షలకి తయారుచేయడానికి రవి, పద్మ రకరకాల విన్యాసాలు చేయసాగారు. రోజూ ఆకు పసర్లతో తలంట్లు, లేహ్యాలు, లేపనాలతో మొత్తానికి పరీక్షలు పూర్తిచేశారు. వీళ్లు ఊహించినట్టుగానే చింటూగాడికి ఒక్క మార్కు కూడా పోకుండా ఆరు వందలకి ఆరు వందలూ వచ్చేశాయి. ఆ మార్కులు చూసి రవి భూమ్మీద నిలబడటం మానేసి, చింటూగాడు కట్టబోయే భవంతుల్లో విహరించసాగాడు. ఇంతలో చింటూగాడి స్కూల్ నుంచి వార్షికోత్సవం రోజు బహుమతి అందుకోవడానికి రమ్మని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసినప్పటినుంచీ రవి ఊహలన్నీ ఆ ఫంక్షన్ చుట్టూనే తిరగసాగాయి. ఆ రోజు ఎలా మాట్లాడాలి, ఏ బట్టలు వేసుకోవాలి అని సవాలక్ష ఆలోచనల మధ్య సూటు వేసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాట పద్మతో అంటే...
 
 ‘‘ఒక్క ఫంక్షన్ కోసం అన్ని వేలు తగలేసి సూటు కుట్టించుకోవడం ఎందుకండీ. అయినా మీరు సూటు వేసుకుంటే నేను మామూలు చీర కట్టుకోనా? నాక్కూడా ఉప్పాడ ఫ్యాన్సీ పట్టుచీర కొనాల్సిందే’’ అని భర్తని పట్టుబట్టి కొత్త చీర కొనిపించుకోవడానికి బజారుకి రెడీ అయిపోయింది.
 
 ‘‘ఒక చీరేం ఖర్మ పద్మా! మనం ఇంకా బోల్డు బట్టలు రెడీగా ఉంచుకోవాలి. ప్రతి సంవత్సరం మనం ఎన్నో ఫంక్షన్లకి వెళ్లి ఎన్నో బహుమతులు అందుకోవాలి. అవసరం అయితే, టీవీవాళ్లకి, పేపర్‌వాళ్లకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వవలసి ఉంటుంది తెలుసా. ఇంకో విషయం... రేపు పేపర్‌వాళ్లు ఇంటర్వ్యూలు అడిగితే, వాడి చదువు విషయంలో నేను శ్రద్ధ తీసుకున్నానని చెప్పు. వాడి ఆరోగ్యం విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకున్నావని నేను చెపుతాను. తెలిసిందా’’ అంటూ భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 
 ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. రవి ఎంతో ముచ్చటపడి కుట్టించుకున్న సూటు తగిలించుకుని, స్కూల్ ఫంక్షన్‌కి బయలుదేరాడు. ఆ వాతావరణం హంగు, ఆర్భాటం చూస్తుంటే రవికి అదంతా తనకోసమే ఏర్పాటు చేశారేమో అనిపించింది. పనిలో పనిగా చుట్టూ పంకించిన రవికి, తన కొలీగ్స్ నలుగురు కనిపించారు. ఎప్పుడూ నలిగిపోయిన బట్టలతో ఉండేవాళ్లు ఈ రోజు కొత్త సూట్‌లో తళతళలాడిపోతున్నారు. వాళ్లంతా సూట్‌లు ఎందుకు వేసుకున్నారో రవికి అర్థం కాలేదు. ఇంతలో ఫంక్షన్ మొదలవుతోంది అన్న మాటలు విని ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు.
 
 ఉపన్యాసాల తర్వాత బహుమతి ప్రదానం మొదలైంది.
 ‘చింటూ చిదంబరేశ్వర్ ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’ అన్న మాటలు విని రవి స్కూల్ అని కూడా చూడకుండా నోట్లో వేలు పెట్టుకుని విజిల్ వేశాడు. చింటూ గునగునా నడుచుకుంటూ వెళ్లి బహుమతి అందుకున్నాడు, తండ్రివైపు గర్వంగా చూస్తూ.
 
 ‘మేగీ మాణిక్యాంబ ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’ అన్న మాటలు విని రవికి కొంచెం అనుమానం మొదలైంది. ఒక చిన్నమ్మాయి వెళ్లి బహుమతి అందుకుంది.
 ‘జానీ జగదీశ్వర్రావు ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’
 ‘రాఖీ రాజారావు ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’
 ‘బన్నీ ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’
 ‘హనీ ఎల్‌కేజీ క్లాస్ ఫస్ట్’...
 అంటూ మైక్‌లో వరుసగా పేర్లు చదువుతున్నారు. పిల్లలందరూ వెళ్లి బహుమతులు అందుకుంటున్నారు. అందరూ క్లాస్ ఫస్ట్ అన్న మాటలు రవి ఉత్సాహం మీద నీళ్లు పోశాయి. ఇప్పటివరకూ అందంగా కనిపించిన ఆ వాతావరణం కంపరంగా అనిపించసాగింది. ఎలాగైనా విషయం తేల్చుకోవాలని కారాలు మిరియాలు నూరుకుంటూ ప్రిన్సిపాల్ గదికి నడిచాడు. రవిని చూస్తూనే ప్రిన్సిపాల్ కూర్చోమని సైగ చేసింది.  ‘‘నేను కూర్చోవడానికి రాలేదు మేడమ్, మీరు చేస్తున్న మోసం గురించి నిలదీద్దామని వచ్చాను. ఇలా మీరు క్లాసు క్లాసంతటికీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తే తెలివైన పిల్లలకి, తెలివితక్కువ పిల్లలకి తేడా ఏముంటుంది? ఇలా చేస్తే ఆ పసి హృదయాలు దెబ్బతినవా?’’ అన్నాడు పెద్ద మానసిక శాస్త్రవేత్తలా.
 
 ‘‘చూడండి రవిగారూ! మీకు మా కాన్సెప్ట్ తెలిసినట్టు లేదు. చిన్నపిల్లల మనసుల్ని మార్కులతో కల్లోలం చేయడం వలన పిల్లల్లో అనవసరమైన స్పర్థలు ఏర్పడుతున్నాయి. కొంతమంది పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు ఇతరులతో పోల్చి మరింత కుంగదీస్తున్నారు. అందుకనే మార్కుల మూలంగా పిల్లలు అనవసర గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశంతో చిన్న తరగతుల పిల్లలందరికీ పూర్తి మార్కులు ఇచ్చి అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం. ఇదే పెద్ద తరగతి పిల్లలకి మార్కుల బదులు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నాం.
 
 ‘‘ఏమండీ, వీడికి ఇప్పుడే ఇన్ని మార్కులు వస్తున్నాయంటే పెద్దయ్యాక ఏ కలెక్టరో అయిపోతాడంటారా’’ అంటూ చింటూగాడి తల నిమురుతూ భర్తని ప్రశ్నించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. రవి ఎంతో ముచ్చటపడి కుట్టించుకున్న సూటు తగిలించుకుని, స్కూల్ ఫంక్షన్‌కి బయలుదేరాడు.    తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి తల్లిదండ్రులకి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి, మరింత కృషి చేయించమని చెబుతున్నాం. నేను మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ చింటూకి అంకెలు కూడా సరిగ్గా రావట్లేదు. దస్తూరి కూడా బాలేదు. మీరు ఈ వేసవిలో వాడిచేత ప్రాక్టీస్ చేయించకపోతే వచ్చే సంవత్సరం కూడా మీవాడు ఎల్‌కేజీయే చదవాల్సి ఉంటుంది’’ అంటూ కుర్చీలోంచి లేచింది. ఆ మాటలు రవికి శరాఘాతాల్లా తాకాయి. చింటూగాడి ప్రోగ్రెస్ కార్డ్ కళ్లకి దగ్గరగా పెట్టుకుని చూస్తే, ఆ బాలమేధావి ప్రోగ్రెస్ కార్డ్ నిండా సున్నాలే కనిపించాయి.
 - .ఎం.సుభాకర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement