తెలుగమ్మాయిలకు ఏం తక్కువ? | chit chat with anthaka mundhu aa tharuvatha fame "eesha" | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయిలకు ఏం తక్కువ?

Published Sun, Jan 12 2014 1:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తెలుగమ్మాయిలకు ఏం తక్కువ? - Sakshi

తెలుగమ్మాయిలకు ఏం తక్కువ?

 తారాస్వరం
 
 నటించడం అంత తేలిక కాదు. నటనను నిజమని నమ్మించడం అంత సులభమూ కాదు. అందుకే నటించడం మొదలుపెట్టిన చాలా కాలానికి కానీ సహజమైన నటనను పండించడం సాధ్యం కాదు కొందరికి. కానీ ఈషా తొలి సినిమా ‘అంతకు ముందు ఆ తర్వాత’లోనే అత్యంత సహజంగా నటించింది. అందరి ప్రశంసలనూ అందుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా తన ఎంట్రీ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెబుతోన్న విశేషాలు...
 
 తొలిసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు....?
 నా సినిమా నేను తొలిసారి ప్రసాద్స్‌లో చూశాను. నా పక్కన ఓ అమ్మాయి కూచుంది. నా మనసంతా ఆమె మీదే. సినిమా చూసి తను ఎలా ఫీలవుతోంది, అందరూ ఎలా రియాక్టవుతారు, మెచ్చుకుంటారా తిట్టుకుంటారా అంటూ టెన్షన్‌గా చూశాను. నా అదృష్టం... అందరికీ నేను నచ్చాను.
 
 
     సినిమా వైపు అడుగులు ఎలా పడ్డాయి?
 నేను ఎంబీయే (హెచ్.ఆర్.) ఫైనలియర్‌లో ప్రాజెక్టు కోసం మీడియాను ఎంచుకున్నాను. అప్పుడే చాలామంది నాతో అనేవారు... చక్కగా ఉన్నావు, మోడల్‌గా ట్రై చేయొచ్చుగా అని. నాక్కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనిపించింది. అంబికా దర్బార్ బత్తి, అపర్ణా కన్‌స్ట్రక్షన్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. కానీ పరీక్షలు దగ్గర్లో ఉండటంతో చదువు మీదే శ్రద్ధపెట్టాను. చదువు పూర్తయ్యాక సినిమా అంగీకరించాను.
 
     హీరోయిన్‌గా పిలుపు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
 ఇంద్రగంటి మోహనకృష్ణగారి నుంచి పిలుపు రావడం పెద్ద సర్‌ప్రయిజ్. ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసి కాల్ చేశారాయన. ఆయన డెరైక్ట్ చేసిన అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ తదితర చిత్రాలు చూశాను. అంత మంచి దర్శకుడితో పనిచేసే చాన్స్ రావడం సంతోషమే కదా!
 
     నటనలో అనుభవం లేదు కదా... కష్టమనిపించలేదా?
 మొదట్లో అనిపించేది. సీన్లు డిస్కస్ చేయడానికి కూడా భయమేసేది. సినిమా ప్రారంభించక ముందు ఆరు నెలల పాటు రిహార్సల్స్ జరిగాయి. షూటింగ్ మొదలయ్యాక కూడా స్క్రిప్టు ముందే ఇచ్చేసేవారు. దాంతో ఇంటి దగ్గర బాగా చదివి, హోమ్‌వర్క్ చేసేదాన్ని. ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకునేదాన్ని. దాంతో తర్వాత ఈజీ అయిపోయింది.
 
     మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
 సినిమా చూడగానే నాన్న నాకు ఫోన్ చేసి... ‘ఇంత బాగా చేస్తావనుకోలేదురా’ అన్నారు. చాలా సంతోషమేసింది. మొదట్లో మోడలింగ్ అంటేనే ఇష్టపడలేదాయన. అన్నీ వివరించాక ‘నీ ఇష్టం, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకో, ఏం చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యి’ అన్నారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యింది.
 
     నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా?
 సినిమా చూశాక కొందరు... ఇంకాస్త గ్లామరస్‌గా కనిపించి ఉంటే బాగుండేది అన్నారు. నాకు అర్థం కాలేదు. గ్లామరస్‌గా నటించడమంటే నేను అందంగా లేననా లేక స్కిన్‌షో చేయలేదనా? నాకిప్పటికీ అర్థం కాలేదు.
 
     తెలుగమ్మాయిలకు తెలుగులో ప్రోత్సాహం లేదు అని ప్రతిసారీ నిరూపితమవుతోంది. దానికి మీరేమంటారు?
 అది నిజమే. మన అమ్మాయిలంతా తమిళ సీమలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడెందుకు అవకాశాలు రావడం లేదు! ఎందుకంటే... తెలుగమ్మాయిలంటే సంప్రదాయబద్దంగానే ఉంటారని, అన్ని పాత్రలకూ సూట్ కారని దర్శకులు ముందే ఫిక్సయిపోతున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చి చూస్తే కదా... వాళ్లు సూటవుతారో లేదో తెలిసేది!
 
     దర్శకులను శాటిస్‌ఫై చేయడానికి మన అమ్మాయిలు కూడా ఏమైనా మారాలంటారా?
 అవసరం లేదు. మనవాళ్లకి ఏం తక్కువ! నేను చాలా ఆడిషన్స్‌కి వెళ్లాను. నేను తెలుగమ్మాయినని తెలిసి చాలామంది షాక్ తిన్నారు. ఎందుకంటే అంత మోడ్రన్‌గా ఉంటాను నేను. ‘మా పాత్రకు ఇలా కావాలి’ అంటే అలా ఒదిగిపోయే టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలు బోలెడంతమంది ఉన్నారు. అవకాశం ఇవ్వడమే కావాలి.
 
     మీ రెండో సినిమా ఎప్పుడు వస్తుంది?
 మొదటి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఆ పాత్రలకు నేను సూటవనేమో అనిపించి నో అన్నాను. పూర్తిస్థాయి పాత్ర కావాలని కాదు. నిడివి తక్కువైనా మంచిది, పేరు తెచ్చేది అయితే ఓకే చేయడానికి నేను సిద్ధం. అలాంటి చాన్స్ కోసమే ఎదురు చూశాను. ఇప్పుడు రమేష్‌వర్మ డెరైక్షన్లో  చేస్తున్నాను. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. సెమీ వెస్టర్న్ క్యారెక్టర్. మంచి పేరు వస్తుందని అనుకుంటున్నా!
 
 - సమీర నేలపూడి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement