సైనేడ్ కిల్లర్ | Crime file sainedkillar | Sakshi
Sakshi News home page

సైనేడ్ కిల్లర్

Published Sun, Oct 4 2015 1:19 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

సైనేడ్ కిల్లర్ - Sakshi

సైనేడ్ కిల్లర్

కర్ణాటక, 2009...  ఆటో దిగి ఎదురుగా ఉన్న కళ్యాణ మంటపం వైపు చూసింది సవిత. ఆమె మనసంతా వింత అనుభూతికి లోన య్యింది. కాసేపట్లో తను ఒక వ్యక్తికి భార్య కాబోతోంది. అది కూడా తన మనసుకు నచ్చిన వ్యక్తికి. అది తలచుకుంటుంటే ఆమె అణువణువూ పులకరిస్తోంది.
 
 ‘‘ఏంటలా నిలబడిపోయావ్. పద’’ అన్నాడు కైలాష్ ఆమె చేయి పట్టుకుంటూ. అతని ముఖంలోకి చూసింది సవిత. మరు క్షణం ఆమె కనురెప్పలు సిగ్గుతో వాలాయి. ‘‘అబ్బో... సిగ్గే? కాసేపట్లో నువ్వు నా భార్యవయిపోతున్నావు. ఇంకా ఎందుకట అంత సిగ్గు’’ అన్నాడు కైలాష్.‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను కైలాష్. నీ భార్యను కావాలన్న ఆశ ఇంత త్వరగా తీరుతుందనుకోలేదు. థాంక్యూ’’ అంటుంటే సవిత కన్నుల్లోకి ఆనంద బాష్పాలు వచ్చి చేరాయి.
 
 ‘‘ఇదిగో... సంతోషంతో అయినా సరే, నీ కళ్లు తడిస్తే నేను తట్టుకోలేనని చెప్పానా? అయినా నేనే నీకు థాంక్స్ చెప్పాలి, నీ భర్తనయ్యే చాన్స్ నాకిచ్చినందుకు.’’మురిసిపోయింది సవిత. కైలాష్ చేయి పట్టుకుని మంటపం వైపు కదిలింది. నాలుగడుగులు వేయగానే ఠక్కున ఆగిపో యాడు కైలాష్. ఏమైందన్నట్టు చూసింది.‘‘అవునూ... ట్యాబ్లెట్ వేసు కున్నావా?’’ అన్నాడు చెవిలో గుసగుసగా. నాలిక్కరుచుకుందామె. ‘‘సారీ కైలాష్... మర్చిపోయాను’’ అంది గోముగా.  
 
 ‘‘భలేదానివే. ఇవాళ పెళ్లి కదా అని రాత్రి తొందరపడ్డాం. కానీ అప్పుడే పిల్లలూ గట్రా అంటే మన సంతోషానికి బ్రేక్ పడినట్టే. ముందు వెళ్లి ట్యాబ్లెట్ వేసుకుని రా. అందరి ముందూ వేసుకోకు. పెళ్లికూతురి ముస్తాబులో ఉండి కాంట్రా సెప్టివ్ పిల్ వేసుకోవడం ఎవరైనా చూస్తే బాగోదు’’ అన్నాడు కైలాష్. సరేనని తలూపి టాయిలెట్ వైపు నడిచింది సవిత. కైలాష్ మంటపం వైపు నడిచాడు.
   
 ‘‘ఏంటి... ఏం జరిగింది?’’
 టాయిలెట్ ముందు గుమిగూడి ఉన్న జనాన్ని చూసి అడిగాడు ఇన్‌స్పెక్టర్. ఎవ్వరూ మాట్లాడలేదు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చి అన్నాడు... ‘‘ఎవరో అమ్మాయి సర్. టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్నట్టుంది’’.అందరినీ దాటుకుని ముందుకు వెళ్లాడు ఇన్‌స్పెక్టర్. టాయిలెట్లో నేలమీద పడి ఉంది సవిత. నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. దగ్గరకు వెళ్లి నాడి పట్టుకుని చూశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘చనిపోయింది’’ అన్నాడు చేయి వదిలేస్తూ.
 
 ‘‘పెళ్లి చేసుకోవడానికి వచ్చిందని తన మేకప్‌ని బట్టి తెలుస్తోంది. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుని ఉంటుంది సర్’’... సందేహాన్ని వెలిబుచ్చాడు వెనుకే ఉన్న కానిస్టేబుల్.‘‘ఏముంది? ఎవరినో నమ్మి వచ్చి ఉంటుంది. వాడు తాళి కట్టే సమయానికి పరారైపోయి ఉంటాడు. తట్టుకోలేక ప్రాణాలు తీసుకుని ఉంటుంది. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువైపోయాయిగా?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అక్కడ ఉన్నవాళ్లందరినీ అడిగాడు. అందరూ తలలు అడ్డంగా ఊపడంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు.
   
 ‘‘వ్వా...ట్! అదెలా సాధ్యం?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోతూ.‘‘ఏమో సర్. తను సైనేడ్ మింగే ఆత్మ హత్య చేసుకుంది’’.. నొక్కి వక్కాణించాడు పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్. ‘‘ఒకవేళ ఆ అమ్మాయి మోసపోయి ఉంటే, చనిపోవాలని అప్పటికప్పుడు అను కుని ఉంటుంది. అలాంటప్పుడు వెళ్లి ఉరి వేసుకునేది. లేదంటే ఆ ఆవేశంలో ఏ బిల్డింగో ఎక్కి దూకేది. కానీ తనకి సైనేడ్ ఎక్కడి నుంచి వస్తుంది?’’ఆ అనాలసిస్ చూసి తన బాస్ గ్రేట్ అనిపించింది కానిస్టేబుల్‌కి. ‘‘నిజం సర్. మీరన్నది ముమ్మాటికీ నిజం. ఒకవేళ వెళ్లి కొనుక్కున్నా ఇంకెక్కడైనా మింగాలి కానీ, మళ్లీ మంటపం దగ్గరకొచ్చి, టాయిలెట్లోకి వెళ్లి ఎందుకు మింగుతుంది?’’... తన ఆలోచనలను కూడా జోడించాడు.‘‘యు ఆర్ రైట్. అంటే ఆమె ముందే చనిపోవడానికి ప్రిపేరయ్యి అయినా వచ్చి ఉంటాలి. లేదంటే ఆమెతో సైనేడ్ మరెవరైనా మింగించైనా ఉండాలి.’’
 
 ఇన్‌స్పెక్టర్ అలా అనగానే చురుక్కున చూశాడు డాక్టర్. ‘‘నాకో విషయం గుర్తొచ్చింది సర్. కొల్లూరులో నాకో ఫ్రెండ్ ఉన్నాడు. తనూ డాక్టరే. కొద్ది రోజుల క్రితం తను నాతో ఓ కేసు వివరాలు షేర్ చేసుకున్నాడు. అది కూడా ఇలాంటిదే. ఓ హోటల్ టాయిలెట్లో ఒకమ్మాయి శవం దొరికింది. నా ఫ్రెండే పోస్ట్‌మార్టమ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా పెళ్లికూతురి ముస్తాబులోనే ఉందని, సైనేడ్ మింగి చనిపోయిందని నా ఫ్రెండ్ చెప్పాడు.’’
 వెతకబోయిన తీగ ఏదో కాలికి తగిలినట్లయ్యింది ఇన్‌స్పెక్టర్‌కి. మరుక్షణం కొల్లూరు పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాడు. కేసు వివరాలడిగి తెలుసుకున్నాడు. డాక్టర్ చెప్పింది నిజమే. వెంటనే కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్లకీ ఫోన్ చేశాడు. ఇంకెక్కడైనా సైనేడ్ మరణాలు సంభవిం చాయా అంటూ ఆరా తీస్తే బుర్ర తిరిగి పోయే విషయాలు తెలిశాయతనికి.
 
 అప్పటివరకూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఇరవై మంది అమ్మాయిలు సైనేడ్ వల్ల మరణించారు. అందరూ పెళ్లికూతుళ్లే. అందరూ టాయిలెట్లలోనే చనిపోయారు. అయితే ఆత్మహత్య చేసు కున్నారా, హత్యకి గురయ్యారా అన్నది తేలకపోవడంతో అన్ని కేసుల ఫైళ్లూ అల్మరాల్లో చేరి మూలుగుతున్నాయి. విస్తుపోయాడు ఇన్‌స్పెక్టర్. ఒకటి కాదు, రెండు కాదు... ఇరవై మరణాలు. ఒక్క క్లూ కూడా దొరకలేదా? అదెలా? అతడీ విషయాన్ని తేలికగా తీసుకో దలచుకోలేదు. ఇంకే ఆడపిల్లా అలా మరణించడానికి వీల్లేదు అనుకున్నాడు బలంగా. అందుకేం చేయాలో వ్యూహాన్ని రచించడం మొదలుపెట్టాడు.
   
 నాలుగు రోజుల తర్వాత... మంగుళూరులోని ఓ హోటల్ ముందు ఆగింది పోలీస్ జీపు. ‘‘సర్... వాడే’’... ఇన్‌స్పెక్టర్ చెవిలో చెప్పాడు కానిస్టేబుల్. హోటల్ వైపు చూశాడు ఇన్‌స్పెక్టర్. మెయిడ్ డోర్ పక్కన నిలబడి ఉన్నాడో వ్యక్తి. సెల్‌ఫోన్లో మాట్లాడుతున్నాడు.అందరూ జీపు దిగారు. ఒక్క అంగలో వెళ్లి ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. సివిల్ డ్రెస్సుల్లో ఉన్నా, పోలీసులని అర్థమైపో యిందతనికి. మౌనంగా లొంగిపోయాడు.
 
 లేడీ కానిస్టేబుల్‌ని తీసుకుని టాయి లెట్ వైపు పరుగు తీశాడు ఇన్‌స్పెక్టర్. తలుపులు తోసుకుని లోపలికెళ్లేసరికి ఓ అమ్మాయి ఏదో ట్యాబ్లెట్ వేసుకోవడానికి సిద్ధపడుతోంది. ‘‘ఏంటిది... ఏం చేస్తున్నావ్’’... అంటూ చప్పున ఆపాడు.‘‘ఇది... ఇది... కాంట్రాసెప్టివ్ పిల్ సర్’’... అందా అమ్మాయి సిగ్గుతో తల దించుకుంటూ. ‘‘కాదు... అది కాంట్రాసెప్టివ్ కాదు. సైనేడ్’’ అంటూ ఆమె చేతిలోని ట్యాబ్లెట్ లాక్కున్నాడు. ఆమె అవాక్కయి చూస్తూండిపోయింది. ఆమె మాత్రమే కాదు... ఇరవై మంది అమ్మాయిల మరణాల వెనుక ఉన్న అసలు కథ తెలిసి యావత్ దేశమే అవాక్కయి పోయింది. మరణాలు సంభవించిన ప్రాంతాల్లోని మందుల షాపులపై నిఘా పెట్టారు పోలీసులు. ఎవరైనా సైనేడ్ అమ్ముతున్నారేమోనని పరిశీలించారు. చివరికి ఓ షాపువాడే ఆ పని చేస్తున్నాడని అర్థమైంది. అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజం బయటపడింది.
 ఆ ఆడపిల్లలెవరూ ఆత్మహత్య చేసుకో లేదు. హత్యకు గురయ్యారు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసానికి గురై ప్రాణాలు విడిచారు. దురదృష్టం ఏమిటంటే... అందరూ ప్రేమించింది ఒకే వ్యక్తిని. అతడే మోహన్ కుమార్.
 
 మోహన్ ఓ సాధారణ స్కూల్ మాస్టర్. కానీ అతడి ఆలోచనలు మాత్రం సామాన్యమైనవి కావు. డబ్బులో మునిగి తేలాలని విపరీతమైన ఆశ. సుఖాల్లో తేలియాడాలని వెర్రి తలలు వేసిన కాంక్ష. అ రెండూ అతణ్ని క్రూరమృగంగా మార్చేశాయి. మ్యాట్రిమోనియల్ సైట్లు, పేపర్లో పెళ్లి ప్రకటనల ద్వారా అమ్మాయిల వివరాలు సేకరించేవాడు. వారితో ఫోన్ ద్వారా మెల్లగా మాట కలిపేవాడు. అందంగా మాట్లాడి వాళ్లను ప్రేమ మత్తులో ముంచేసేవాడు. చివరికి డబ్బు, నగలు తీసుకుని ఇంటి నుంచి పారిపోయి రమ్మంటూ వాళ్లను ప్రోత్సహించేవాడు. వచ్చిన తర్వాత హోటల్‌కి తీసుకెళ్లేవాడు. రేపు పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మబలికి ఆ రాత్రి వారితో తన కోరికలు తీర్చుకునేవాడు. మర్నాడు వాళ్లను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసేవాడు. కానీ నగలు పెట్టుకోనిచ్చేవాడు కాదు. అందరి కళ్లూ పడతాయనో, అన్ని నగలు పెట్టుకో వడం రిస్క్ అనో చెప్పి, వాటిని బ్యాగులో సర్దేసేవాడు. ఆ తర్వాత టాయిలెట్లోకి వెళ్లి, గర్భం రాకుండా కాంట్రాసెప్టివ్ మాత్ర వేసుకొమ్మని ఇచ్చేవాడు. వాళ్లు వెళ్లి వేసు కుని మరణించేవారు. ఇతడు ఏమీ ఎరగ నట్టు డబ్బు, నగలు తీసుకుని ఉడాయించే వాడు. ఇలా ఇరవై హత్యలు చేశాడు. దొరక్కుండా ఉండేందుకు రకరకాల ప్రదేశాల్లో హత్యలు ప్లాన్ చేశాడు. కానీ చివరికి పాపం పండి పట్టుబడ్డాడు.
 
 మోహన్ కుమార్ చేసిన ఘాతుకాలు విని అందరూ షాకైపోయారు. అమాయక మైన ఆడపిల్లల్ని నమ్మించి, ఉసురు తీసిన ఆ దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు అన్నారు. న్యాయస్థానం కూడా అలాగే ఆలోచించింది. 2013లో మోహన్‌కి ఉరిశిక్ష విధించింది. అయితే అది ఇంకా అమలు కాలేదు. ప్రస్తుతం ఆ యాభై రెండేళ్ల మృగం... కర్ణాటకలోని ఓ జైలులో మగ్గుతోంది. ఎందరో ప్రాణాలు తీసిన తనను మృత్యువు కబళిస్తుందా లేక ఎన్నో కేసుల్లోలాగే తన మరణశిక్ష జైలుశిక్షగా మారుతుందా అని ఎదురు చూస్తోంది. మొదటిదే జరగాలని మరణించిన అమ్మాయిల కుటుంబాలతో పాటు దేశ ప్రజానీకం మొత్తం కోరుకుంటోంది. రెండోది కనుక జరిగితే న్యాయానికి ఉరి వేసినట్టవుతుందని అంటోంది. మరి సైనేడ్ కిల్లర్ మోహన్ కథ చివరికి ఎలా అంతమవుతుందో... వేచి చూడాలి!
 
 కర్ణాటకలోని బంట్వాల్ జిల్లాలో ఉన్న ఓ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేవాడు మోహన్. అక్కడ అతనికి ఎంత మంచి పేరు ఉందంటే... అతడన్ని హత్యలు చేశాడంటే వాళ్లెవరూ నమ్మలేక పోయారు. అతను ఎంతో నెమ్మదస్తుడని ఇరుగు పొరుగువాళ్లు, బంధువులు, స్నేహితులు సైతం సర్టిఫికెట్ ఇచ్చారు. విచిత్రమేమిటంటే... అంతమంది ఆడపిల్లల్ని నిర్దాక్షి ణ్యంగా చంపేసిన మోహన్‌కి ముగ్గురు భార్యలు, పిల్లలు ఉన్నారు. వాళ్లని అతడు ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, ఏ లోటూ రానిచ్చేవాడు కాదనీ వాళ్ల మాటల ద్వారా తెలిసింది. అయితే మాత్రం... తన ఇంట్లో సంతోషాన్ని వెదజల్లి, ఎందరో ఇళ్లలో చీకటిని నింపేసిన మోహన్‌ని క్షమించగలమా?!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement