విధులు - నిషేధాలు
విధులు
బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలలో అందరూ ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేవి తెలుసుకోవాలి. పుష్కరప్రవేశ సమయంలో మూడున్నర కోట్ల నదులు అదృశ్యంగా కృష్ణానదిలో ప్రవేశిస్తాయి. కనుక పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అన్ని కులాల వారు తప్పకుండా పన్నెండు రోజుల్లో ఒక రోజయినా పుష్కరస్నానం చెయ్యాలి. పన్నెండు రోజులూ చేస్తే మరీ మంచిది.
నదిలోకి దిగబోయేటప్పుడు మూడు చిటికెలు గట్టు మీద మట్టి కృష్ణలో వేస్తూ, ‘పిప్పలాద సముత్పన్నే! కృత్సే! లోకభయంకరి! మృత్తికాంతే మయాదత్తాం ఆహారార్థం ప్రకల్పయేత్’ అనే శ్లోకం చదవాలి. స్నానానికి కృష్ణానది అనుమతి తీసుకోవాలి. ‘కన్యాగతే దేవగురౌ పితౄణాం తారణాయ చ సర్వ పాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహమ్’ అని ప్రార్థించాలి. పుష్కర స్నానం పూర్తి అయ్యాక గట్టు మీద కృష్ణకు, బృహస్పతికి, పుష్కరునికి షోడశోపచార పూజ చెయ్యాలి. మంత్రాలు, భగవన్నామస్మరణ జపం చెయ్యాలి.
చేసేరోజును బట్టి దానాలు చెయ్యాలి. తరువాత తల్లిదండ్రులు లేనివారు పితృదేవతలకు పిండప్రదానం చెయ్యాలి. దూరం నుంచి వచ్చినవారు హిరణ్య శ్రాద్ధం (పదార్థాలు ఇవ్వడం) పెట్టాలి. తీరవాసులు అన్నశ్రాద్ధం పెట్టాలి. పురుషులు క్షౌరం చేయించుకుంటే పుణ్యప్రదం.
స్నానం వస్త్రంతోనే చెయ్యాలి. ప్రవాహానికి ఎదురుగా మూడు మునకలు వేసి, సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రవాహానికి వాలుగా మూడు మునకలు వెయ్యాలి. దంపతులైతే ఇద్దరూ కలిసి మునగాలి. స్త్రీలు ముఖానికి పసుపు రాసుకుని స్నానం చెయ్యాలి. పసుపు, కుంకుమ రవికలగుడ్డ కృష్ణానదికి సమర్పించాలి. స్నానం చేసి దోసిట్లోకి నీళ్లు తీసుకుంటూ బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రాది దేవతలు, వాలఖిల్యాది సప్తఋషులు, పితృదేవతలు, బృహస్పతి, పుష్కరుడు, గంగాది మహానదులు, కృష్ణవేణి, వశిష్ఠాది మునులు, సూర్యుడు వీరందరినీ వరుసగా తలచుకుంటూ నీళ్లు వదలాలి.
నిషేధాలు...
నదిలో కాలకృత్యాలు, దంతధావనం చెయ్యకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చెయ్యరాదు. సంకల్పం తనలో తానైనా చెప్పుకోకుండా ఊరికే మునగరాదు. ఆరు నెలల లోపు శుభకార్యాలు చేసి ఉన్న వారు పుష్కర శ్రాద్ధం చేయకూడదు. గట్టు మీద మట్టి చిటికెడు మించి నదిలో వేయరాదు. నదీతీరానికి పన్నెండు మైళ్ల లోపల ఎక్కడైనా శ్రాద్ధాది కార్యక్రమాలు చేయవచ్చు. తల్లి మరణించి తండ్రి ఉన్నవారు పుష్కర శ్రాద్ధం పెట్టరాదు. పుష్కరాలను, కృష్ణానదిని హేళనగా నిందించరాదు. పుష్కర స్నానానికి వచ్చిన జన సమూహాన్ని చూసి నమస్కరించాలి కాని అవమానించరాదు. కృష్ణానది అంతటా పుష్కర ప్రవేశం జరుగుతుంది కనుక అందరూ ఒకే చోట గుమికూడి స్నానం చేసి తొక్కిసలాటలో నదిని కలుషితం, అపవిత్రం చేయరాదు. ఈ పన్నెండు రోజులు ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. దానధర్మాలు చేయటానికి సందేహించరాదు.
తీర్థరాజ! నమస్తుభ్యం సర్వలోకైకపావన!
త్వయిస్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే॥
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్