పాము మంత్రం పని చేస్తుందా?
పాము కరవగానే ప్రాథమిక చికిత్స గురించి ఆలోచించకుండా పాము మంత్రాన్ని ఆశ్రయించేవాళ్లు ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నారు. ఇంతకీ అసలు ఆ పాము మంత్రం పనిచేస్తుందా? విషం విరుగుతుందా?
మంత్రానికి పాము విషం విరుగుతుందనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మన దేశంలో మొత్తం వంద రకాల పాములు ఉన్నాయి. అందులో తొంభై రకాల పాములకు విషం ఉండదు. త్రాచు, రక్తపింజర, కట్లపాము, ఒక రకమైన సముద్రపు పాముల్లో మాత్రమే విషం ఉంటుంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్ల... పాము కరిచింది అనగానే విపరీతంగా ఆందోళనపడతారు. ఆ ఆందోళనను క్యాష్ చేసుకోడానికే కొందరు మంత్రం వేస్తామనేవారు. కొందరేమో ‘నీకేం కాదు’ అని ధైర్యం చెప్పడానికి, భయాన్ని పారదోలడానికి పాము మంత్రం వేసేవాళ్లు. అంతే తప్ప ‘పాము మంత్రం’ అనేది విషానికి విరుగుడు కానే కాదు. అది తెలియక కొందరు విషసర్పం కాటేసినప్పుడు పాము మంత్రం చాలనుకుని చికిత్స గురించి ఆలోచించక ప్రాణాలు కోల్పో తున్నారు. పాము మంత్రం ‘ఫెయిత్ హీలింగ్’ తప్ప విషం విరుగుడు కాదు.