విహారం: థాయ్‌లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి! | Don't miss Phi Phi Islands, if visit Thailand | Sakshi
Sakshi News home page

విహారం: థాయ్‌లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి!

Published Sun, Dec 8 2013 3:14 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

విహారం: థాయ్‌లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి! - Sakshi

విహారం: థాయ్‌లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి!

థాయ్‌లాండ్... పర్యాటక స్వర్గాల్లో ఒకటైతే, ‘ఫి ఫి ఐలాండ్స్’ అందులో మరో అద్భుతం. ఈ పేరు ఎంత విచిత్రంగా ఉందో, ఆ ప్రదేశం అంత అద్భుతంగా ఉంటుంది. టూర్ వెళ్లేదే రిలాక్స్ కోసమే అయితే, ఇక్కడ ఆ పని తప్ప మీరేమీ చేయలేరు. మీ బాడీ ఆ ప్రాంతానికలా కనెక్ట్ అవుతుందంతే!
 
 ఫి ఫి ఐలాండ్స్... ఆరు ద్వీపాల కలయిక. వాటిల్లో ఇవి రెండూ పెద్దద్వీపాలు. మిగతా నాలుగు కేవలం బీచ్‌లకు ప్రత్యేకం. థాయ్‌లాండ్ దేశంలో దక్షిణం వైపు ఉంటాయి ఫిఫి దీవులు. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఈ దీవులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రిలాక్సేషన్‌కు పేరు గాంచిన ఈ దీవులు థాయ్‌లాండ్‌లోనే కాదు ప్రపంచంలోనే అందమైన దీవుల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
 
 అందమైన బీచ్‌లు...
 బీచ్‌లో తిరుగాడే రంగురంగుల చేపలను చూస్తూ బీచ్ ఒడ్డున లాంజర్ చెక్క కుర్చీల్లో కూల్‌డ్రింక్ తాగుతూ అలా సేదదీరుతుంటే ఇలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్లు బతికున్నామా అన్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా బీచ్‌లు ఇష్టపడేవారికి ఇది ఒక గొప్ప అట్రాక్షన్. బీచ్‌లను స్వచ్ఛంగా ఉంచటం అంత ఈజీ కాదు. కానీ, ఇక్కడ అలాంటి అరుదైన అనుభూతి దక్కుతుంది. వాటిలో లోపల తిరుగాడే అనేక రకాల, రంగుల చేపలు కనువిందు చేస్తూ ఆ నీటిలోంచి పైకి కనిపిస్తుంటాయి.
 
 యాచ్ ట్రిప్...
 ఈ దీవుల్లో మరో మంచి అనుభూతి యాచ్ ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఓ రోజంతా ఆ ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇవి ఖరీదు కూడా కాదు. వీటిని కొన్ని కంపెనీలు, హోటళ్లు, స్థానికులు నడుపుతారు. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్లు ఎంచుకోవచ్చు. ఇక ఆ దీవుల గురించి తెలుసుకోవాలంటే అక్కడే దొరికే గైడ్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు.  
 
 అక్కడకు వెళితే టాటూ ఒంటి మీద పడాల్సిందే
 ఫి ఫి ఐలాండ్స్ చాలా చిన్న ప్రాంతమే కానీ ఒక నగరానికి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. ఇక్కడ టూర్‌ను చాలా తక్కువ ఖర్చుతోనూ పూర్తి చేయొచ్చు. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టొచ్చు. ఇక్కడ టాటూ సంస్కృతి బాగా ఎక్కువ. ఏటీఎం సెంటర్లు కనిపించినంత ఎక్కువగా టాటూ సెంటర్లు కనిపిస్తాయి. మీకు ఏ టాటూ కావాలన్నా, ఏ పద్ధతిలో కావాలన్నా నిమిషాల్లో వేసి పంపించేస్తారు. ఒంటి మీద టాటూ పడితే మీరు ఫి ఫి పోయివచ్చినట్టన్నమాట.
 
 ప్రా నంగ్ టు ఫి ఫి
 క్రాబి టౌన్ పరిధిలోకి ఈ ద్వీపాలు వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో బీచ్ మనోహరంగా ఉంటుంది. కాస్త రద్దీగా ఉన్నా విశాలమైన బీచ్ కావడం వల్ల మీకు ఏ ఇబ్బందీ ఉండదు. జలకాలాడటం వచ్చి ఇసుకలో కాసేపు సేదదీరడం మళ్లీ జలకాలాటకు పోవడం. ఇక్కడ అదే పని. మీ ఓపిక, మీ టైం. క్రాబి టౌన్‌లో సుమారు పది బీచ్‌లు ఉంటే అన్నీ నిమిషాల ప్రయాణం దూరంలోనే ఉంటాయి. కాబట్టి మీరు అన్ని తీరాలనూ కవర్ చేసి ఆనందించొచ్చు.
 
 రెండే కాలాలు..

 లోకానికి మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబరు వరకు వానాకాలం. వాన పడనపుడు వెళ్తేనే మంచిది. ఉన్నది ఎక్కువగా బీచ్‌లే కాబట్టి పగలు సముద్రందగ్గర, రాత్రి హోటల్లో ఉండొచ్చు. ఇక్కడ ఎండాకాలం అంటే మహా వేడిగా ఏం ఉండదు. ఏకాలమైనా 22-32 డిగ్రీల మధ్య మాత్రమే ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ కాలం వెళ్లినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఈ వేడి మన భారతీయులకు అయితే సుపరిచితమే. ఇక్కడ థాయ్ భట్ కరెన్సీ. మనవి రెండు రూపాయిలు వాళ్ల ఒక థాయ్‌భట్‌తో సమానం. కాబట్టి ఇండియన్లకు థాయ్‌టూర్ అంత కాస్ట్లీ కాదు.
 
 థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. లక్కీ ఏంటంటే... ఫి ఫి ఐలాండ్స్ ఈ  పుకెట్ నుంచి కేవలం యాభై కిలోమీటర్లే. పుకెట్ దర్శనం కూడా ఫి ఫి ఐలాండ్స్ సందర్శనంతో పాటే అయిపోతుంది. పుకెట్ కూడా పెద్ద పర్యాటక ప్రదేశమే. అక్కడ అనేక ప్రకృతి దృశ్యాలుంటాయి. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలుంటాయి.
 
 అందుబాటులోనే ఉంది
 ఫి ఫి ఐలాండ్స్ అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం. ఇక్కడకు చేరుకోవడం చాలా సులువు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు అయినా ఫ్లైట్లో వెళ్లొచ్చు. లేదా నేరుగా ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగొచ్చు. హైదరాబాదు నుంచి ఫుకెట్‌కు నేరుగా వెళ్లాలంటే రూ.14 వేల నుంచి ఫ్లైట్ టికెట్ మొదలవుతుంది. అక్కడి నుంచి బస్సు, కారు, బోటు ఇలా ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తక్కువ ఖర్చులో వెళ్లిరాగల విదేశీ టూర్ ఇది.
 
 రవాణా అవసరమే రాదు
 బహుశా మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఆటోలు, ట్యాక్సీలు అవసరం అవుతుంటాయి. కానీ ఇక్కడ వాటి అవసరమే రాదు. ఏ బీచ్ నుంచి ఏ బీచ్‌కు అయినా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. చిన్న దీవులు కనుక ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు. ఎక్కడ చూసినా తోక పడవలే కనిపిస్తాయి. వీటిని అందరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా గంటల్లెక్కన, రోజు లెక్కన అద్దెకు కూడా తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement