
కట్నం కష్టం జాన్తానై!
కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న నిలాంబుర్ గ్రామ పొలిమేరల్లో అడుగు పెట్టగానే ఓ నీలిరంగు బోర్డు కనిపిస్తుంది.
మన ఊరు
కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న నిలాంబుర్ గ్రామ పొలిమేరల్లో అడుగు పెట్టగానే
ఓ నీలిరంగు బోర్డు కనిపిస్తుంది. దానిమీద రాసివున్న తెల్లని
అక్షరాలు చదివితే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.
‘మీరు వరకట్న నిషేధిత ప్రాంతంలోకి అడుగు పెడుతున్నారు’ అన్నవే ఆ అక్షరాలు.
ఆ అక్షరాలు ఆ బోర్డుమీదికి చేరడం వెనుక పెద్ద కథే ఉంది.
అందరిదీ ఒకటే వ్యథ...
అరవయ్యేళ్ల మహ్మద్ ఓ కూలీ. భార్య, అయిదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకుల్ని అతనే పోషించాలి. ఎలాగో తంటాలు పడి, కోరిన కట్నాలు ఇచ్చి, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. కానీ మిగతా కూతుళ్ల పెళ్లి సమయానికి రోజులు మారిపోయాయి. పెళ్లి కొడుకుల డిమాండ్లు పెరిగిపోయాయి. దాంతో ఆ పేద తండ్రి పడరాని పాట్లు పడ్డాడు. కానీ కూతుళ్లను పెళ్లికూతుళ్లను మాత్రం చేయ లేకపోయాడు. దాంతో వాళ్లు అవివాహితు లుగానే మిగిలిపోయారు. మహ్మద్ కుమార్తెలే కాదు... నిలాంబుర్ గ్రామంలో వివాహానికి నోచుకోని అలాంటి ఆడపిల్లలు చాలామందే ఉండేవారు.
నిలాంబుర్‌లో ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలే. అందరూ తమ పిల్లల్ని బాగానే చదివించుకుంటూ వచ్చారు. కానీ వివాహ విషయానికొచ్చేసరికి వారి పరిస్థితి దయనీయంగా మారేది. కాస్తో కూస్తో ఉన్నవాళ్లు అన్నం పెట్టే తల్లిలాంటి పొలాన్ని అమ్మి, ఉంటున్న ఇల్లును బ్యాంకులో తాకట్టు పెట్టి పెళ్లిళ్లు చేసే వారు. ఆ స్తోమత లేనివాళ్లు పెళ్లి ప్రయ త్నాలు మానుకునేవారు. అలా వందల మంది అమ్మాయిలు అవివాహితులుగా మిగిలిపోయారు.
కానీ ఆ కథ ఇప్పుడు మారింది. ఆ ఊరివారి వ్యథ తీరిపోయింది. అక్కడ కట్నం అన్న మాటే నిషేధానికి గురైంది. ఆ ఊరు ఆడపిల్లల పాలిట స్వర్గమైంది. దానికి కారణం... ఆర్యదాన్ షౌకత్.
సర్వేతో మొదలైంది...
2007లో నిలాంబుర్‌లో సొంత ఇల్లు లేని వారి సంఖ్యను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక సర్వే చేయించింది. అప్పుడు 75 శాతం ఇళ్లు బ్యాంకులో తాకట్టుకు ఉన్నాయని తేలింది. ఎందుకా అని ఆరా తీస్తే, కూతుళ్లకు కట్నం ఇవ్వడానికి పెట్టారని తేలింది. అలాగే ఆ ఊళ్లో నలభై అయిదు వేల మంది జనాభా ఉంటే, అందులో పెళ్లి వయసు దాటినా పెళ్లి కాని ఆడపిల్లలు వెయ్యిమంది దాకా ఉన్నారని, పెళ్లయిన ఆడపిల్లల్లో యాభై రెండు శాతం మంది... ఒప్పుకున్న కట్నం ఇవ్వలేక, భర్త నిరాదర ణకు గురై పుట్టింటింకి చేరారని తేలింది. ఆ సర్వే రిపోర్టు చూసి నిలాంబుర్ పంచా యతీ ప్రెసిడెంట్ ఆర్యదాన్ షౌకత్ కదిలిపోయారు.
తన గ్రామంలో ఆడపిల్లల పెళ్లిళ్ల విషయంలో సమస్య ఉందని తెలుసు. కానీ ఇంత దారుణంగా ఉందని షౌకత్‌కు తెలియదు. తెలిశాక ఇక ఆగలేదు. వర్క్ షాపులు, పబ్లిక్ మీటింగులు పెట్టి మహిళల హక్కులు, సాధికారత గురించి అవగాహన కల్పించడం మొదలెట్టారు. ఆయన పిలుపుతో వందల మంది వాలంటీర్లు ముందుకు వచ్చారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం, వీధి నాటకాలు, అనౌన్స్‌మెంట్లు చేశారు. www.dowryfreemarriage.com అనే వెబ్‌సైట్ ద్వారా వివాహ ఆచారాలు, వర కట్నం, వివాహితులకు ఆస్తుల్లో చట్టపర మైన హక్కులు లాంటి విషయాలపై చర్చలూ జరిపారు.
మెల్లగా కట్నం తీసు కోవడం నేరం అన్న భావన కొందరు కుర్రాళ్లలో మొదలైంది. కట్నం తీసుకో కుండా పెళ్లి చేసుకుంటామంటూ ముందు కొచ్చారు. అలా ఆ ఊరి ఆడపిల్లలందరికీ కట్నాలు లేకుండా పెళ్లిళ్లు అయ్యాయి. ఊరి పొలిమేరలో ‘డౌరీ ఫ్రీ జోన్’ అనే బోర్డు వెలిసింది. తర్వాత బాల్య వివాహాలు, గృహ హింస కూడా లేని గ్రామంగా నిలాంబుర్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు గ్రామస్తులు. కొద్ది నెలల్లోనే అదీ సాధించారు. దాంతో ఆ ఊరు ఆడపిల్లల పాలిట స్వర్గధామంగా మారిపోయింది.
- నిఖిత నెల్లుట్ల
ఆర్యదాన్ షౌకత్ పంచాయతీ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడే నిలాంబుర్‌కి ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆడపిల్లల కష్టాలను అందరికీ తెలియజేయడం కోసం సినిమాను మాధ్య మంగా ఎన్నుకున్నారు. ముస్లిం ఆడపిల్లలను చదువుకోనివ్వ కుండా బాల్య వివాహాలు చేయడాన్ని నిరసిస్తూ 2013లో ఆయన నిర్మించిన ‘పదమ్ ఒన్ను’ అనే మలయాళ చిత్రం... జాతీయ అవార్డుతో కలిపి పదిహేను అవార్డులు గెల్చుకుంది. ఆ తర్వాత కూడా ఆయన సామా జిక దురాచారాలపై పలు చిత్రాలు నిర్మించి అవార్డులు, రివార్డులు అందుకున్నారు.