మీ కష్టాన్ని మోస్తాను... అభాగ్యులకు అండగా రవి కల్రా
ఆదర్శం
రోడ్డు ఎక్కాలంటే భయం.
రోడ్డు పక్కన నడవాలంటే భయం.
ప్రమాదాలు జరుగుతాయని కాదు... అంత కంటే పెద్ద ప్రమాదం... ఓ రేంజ్‌లో వినిపించే హారన్ల శబ్దం. అవసరం ఉన్నా లేక పోయినా భారీగా వినిపించే హారన్ల శబ్దం. ఈ శబ్దాల వల్ల ‘ఇక మన చెవులు పనిచేస్తాయా!’ అనే అనుమానం అర్జంట్‌గా వస్తుంది.
‘నెగ్లెక్టెడ్ ఇష్యూ’గా ముద్రపడిన ఈ శబ్ద కాలుష్యాన్ని అప్పటికప్పుడు తిట్టుకోవడం తప్ప ఎక్కువగా ఆలోచించం.
రవి కల్రా(ఢిల్లీ) మాత్రం ఆలోచించారు. ఈ సమస్యపై పోరాడడానికి, ప్రభుత్వాన్ని, పౌరులను భాగస్వాములను చేయడానికి ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ పేరుతో నిర్మాణాత్మకమైన కృషిని ప్రారంభించారు. ‘‘నేను ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాను. అయితే ఒక్కసారి కూడా హారన్ ఉపయోగించే అవసరం రాలేదు. చిన్న ప్రమాదం కూడా జరగలేదు. నేను ఎన్నో దేశాలకు వెళ్లాను. అయితే ఎక్కడ కూడా హారన్‌ను వృథాగా కొట్టడం చూడలేదు. మనవాళ్లు విదేశీ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు హంకింగ్ గురించి ఆలోచించరు’’ అంటారు రవి.
రవి కృషి వృథా పోలేదు. అకారణంగా హంకింగ్ చేస్తున్న వారికి ఢిల్లీ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు.
ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అయిన రవి... ఒక రోజు ఒక దృశ్యాన్ని చూశారు. ఒక వీధిబాలుడు చెత్తకుప్పలోని ఆహారాన్ని తినడానికి కుక్కతో పోటీ పడుతున్నాడు. వీధిన పడిన అభాగ్యుల కోసం ఏదైనా చేయాలని అప్పుడే ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.
వీధిన పడిన అభాగ్యుల కోసం ఏదైనా చేయాలనే తపనతో ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసినప్పటికీ ఇది అనేక లక్ష్యాల కోసం పనిచేస్తుంది. ఎవరూ పట్టించుకోని వృద్ధుల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించారు. ఇందులో చేరడానికి పైసా చెల్లించనక్కర్లేదు.
రోడ్డు మీద కనిపించే మానసిక వికలాంగులను చూసి చలించిపోయారు రవి. ఎంతో కాలం నుంచి స్నానం చేయకపోవడం, చెత్తలో నుంచి ఏరుకొని ఏది పడితే అది తినడం, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దీనపరిస్థితిలో ఉండడం... ఇలాంటివన్నీ రవిని ఆలోచింపచేశాయి.
ఈ ఆలోచనలో భాగంగా మానసిక వికలాంగుల కోసం గుర్‌గావ్‌లోని బంద్వరి గ్రామంలో ‘రెస్క్యూ సెంటర్’ను ప్రారంభించారు. భోజన వసతితో పాటు వైద్యసదుపాయలు కూడా ఇందులో ఉంటాయి.
మనుషులకే కాదు ఆలనా పాలనా లేని ఆవులు, కుక్కలకు ఆశ్రయం ఇస్తుంది ‘ఎర్త్ సేవియర్స్ ఫౌండేషన్’.
పర్యావరణ సంబంధిత విషయాలపై దృష్టి సారించి ‘డోన్ట్ హంక్’ పేరుతో శబ్ద కాలుష్యంపై యుద్ధభేరీ మోగిస్తుంది.
సంస్థ సభ్యులు ఢిల్లీలోని వివిధ ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర పోస్టర్లు పట్టుకొని నిలబడతారు. కారులో ఉన్నవారితో మాట్లాడి కార్లకు ‘నో హంకింగ్’ స్టిక్కర్లు అంటిస్తారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సిబ్బందితో ‘శబ్ద కాలుష్యం’ నివారించడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా చెబుతారు.
‘‘హారన్ అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగించేది అనే అవగాహన తక్కువమందిలో ఉంటుంది. ఎదుటి వాళ్లు వేగంగా కదలడానికి మాత్రమే హారన్‌లు ఉన్నాయనుకుంటున్నారు. అవాంఛిత శబ్దాలు మనిషి ఆరోగ్యం, ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. వినికిడి శక్తి లోపించడంతో పాటు హైపర్‌టెన్షన్, స్ట్రెస్, మెమొరీ లాస్... మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. చాలామంది డ్రైవర్లు తమలోని కోపాన్ని వ్యక్తీకరించడానికి ఒక వాహికగా హారన్‌ను ఉపయోగిస్తున్నారు’’ అంటారు రవి.
‘డోన్ట్ హంక్’ పేరుతో 5 లక్షల స్టిక్కర్లు తయారు చేయించారు. ఆ స్టిక్కర్లలో ఇలా రాసి ఉంటుంది...
హారన్ అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే వాడేది. ఆడుకోవడానికి అది బొమ్మ కాదు.
మీ నగరం చేపల మార్కెట్ కాదు... నగరాన్ని శబ్దకాలుష్యం నుంచి కాపాడండి.
‘హారన్ ప్లీజ్’ నుంచి ‘నో హారన్ ప్లీజ్’కు చేరుకోవాలి.
సమస్య ఏదైనా... చూస్తూ... బాధపడడం కంటే మనవంతుగా ఏదో ఒకటి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు రవి. ఆ నమ్మకమే ఆయనతో ఎన్నో మంచి పనులు చేయిస్తుంది.