చైతన్యం: కరువు లుక్కును ఫేస్‌బుక్కు మార్చేసింది!
ప్రభుత్వాలు కరవు మండలాలు అని ప్రకటించడం మీరు వినే ఉంటారు కదా... ఒక ప్రాంతం తీవ్రమైన కరవు ఎదుర్కొన్నాక అనేక శాఖల అధికారులు వాటిని పరిశీలించి, నాయకులు వాటిని ప్రతిపాదించి.. ప్రభుత్వం కరుణిస్తే కొన్ని డబ్బులు వస్తాయి, కొన్ని సహాయాలు వస్తాయి. కానీ అప్పటికి జరగాల్సింది జరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సాయం కూడా అందినంత వరకు అందుతుంది, లేకుంటే అదీ లేదు. మహారాష్ర్టలోని కొన్ని కరవు ప్రాంతాల పరిస్థితి కూడా ఇలాగే అయిఉండేదీ కానీ, సామాజిక స్పృహ ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతాలను ఆదుకున్నారు. అందుకు వారికి సహాయపడింది ప్రభుత్వం కాదు. ఫేస్‌బుక్!
చాలామంది, ముఖ్యంగా పెద్దవాళ్లు ఫేస్‌బుక్ అంటే టైంపాస్ అని, వేస్ట్ అని అంటుంటారు. ఇందులో నిజం లేదు, అలాగని వారి అభిప్రాయాల్లో తప్పూ లేదు. ఏదైనా మన దృష్టిని బట్టి అవగాహన ఉంటుంది. మన విజన్‌ను బట్టి వినియోగం ఉంటుంది. కొందరు వృథా అనుకుంటున్న ఫేస్‌బుక్ కొన్ని దేశాలకు స్వాతంత్య్రాన్నే తెచ్చిపెట్టింది ఈ మధ్య. ఇండియాలో అంతపెద్ద పనిచేయలేదు గాని చాలా మంచి పనులే చేసింది. ఈ పనులకు, ఫేస్‌బుక్ యాజమాన్యానికీ ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ఫేస్‌బుక్ ఒక వేదిక అయ్యింది.
2013లో మహారాష్ట్రలో అత్యంత విషాదకరమైన కరవు సంభవించింది. తాగడానికి నీళ్లు లేక పశువులు చనిపోయాయి. మనుషులు నీళ్లకోసమే బతుకుతున్నట్లు వెంపర్లాడారు. తాగడానికే లేనపుడు పంటలకెలా వస్తాయని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి దుర్భరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కారణం... 2012లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షపాతం అతి తక్కువగా నమోదవడం. నామమాత్రంగా నాలుగు చినుకులు పడ్డాయంతే! పర్యవసానంగా తలెత్తిన దుర్భిక్షం కొందరు ఫేస్‌బుక్ మిత్రుల కంట పడింది. అంతే, మహారాష్ర్ట కరవు ప్రాంతాల ప్రజల దశ తిరిగింది.
ఇంతకీ వారు ఏం చేశారు?
డ్రాట్ హెల్ప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. ఆ గ్రూపులో ఎవరూ ఎవరికీ పరిచయం ఉన్నవాళ్లు కాదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చిన వారు. ఆ గ్రూపు పోస్టు చేసిన కరవు దృశ్యాలను చూసిన వారి గుండె ద్రవించింది. వారంతా ఏదో ఒక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. కరవు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో నెటిజన్లనే అక్కడి వాలంటీర్లగా వాడుకున్నారు. వాలంటీర్లే అక్కడి పరిస్థితులు చెబుతారు. అక్కడికి వాటర్ ట్యాంకు కావాలో, నీళ్లు కావాలో.. ఇంకా ఎలాంటి సాయం కావాలో పోస్ట్ చేస్తారు.
దాన్ని చూసిన గ్రూపులో సభ్యులు స్పందించి ఎవరు చేయదలచుకున్న మార్గంలో వారు వస్తు, నగదు, సేవ రూపేణా సిద్ధమై ఆ ఊరి వాలంటీర్‌కు సమాచారం అందిస్తారు. ఆ వాలంటీర్ వీరు పంపిన వాటిని అక్కడ ఏర్పాటుచేసి వాటి ఫొటోలు తీసి మళ్లీ గ్రూపులో పోస్టు చేస్తాడు. దీనివల్ల వృథా, దుర్వినియోగం జరగడంలేదని స్పష్టంగా అర్థమౌతుంది. దీంతో సమస్యకు కేవలం రోజుల్లోనే పరిష్కారం దొరికేసింది. ఇలా అందరూ కలిసి రకరకాల రూపాల్లో 75 లక్షల రూపాయల సాయం చేశారు. అన్ని గ్రామాల్లో తాగునీరు, ఆహార, వైద్య సాయం ఏర్పాటుచేశారు. ఇందులో చాలామంది స్వయంగా సేవల రూపంలో తమ కష్టం అందించిన వారూ ఉన్నారు. ఇలా కొన్ని నెలల్లో మహారాష్ట్రలో వివిధ కరవు బాధిత ప్రాంతాలకు చెందిన పది లక్షల మందికి ఏదో ఒక రూపంలో సాయం అందింది. ఎన్నో జీవితాలు నిలబడ్డాయి. పదివేల మంది సభ్యులున్న గ్రూపు ఇదంతా కొన్ని నెలల్లో పూర్తిచేసేంది. కనీసం ఈ గ్రూపు ప్రైవేటుగా గాని, ప్రభుత్వపరంగా గాని ఎటువంటి గుర్తింపు పొందలేదు. కేవలం కొందరి మానవతా దృక్పథం, చొరవ. అంతే.
దీనిని మొదలుపెట్టిన వ్యక్తి జయదీప్ పాతేర్ (సిస్టెలీ సొల్యూషన్స్). ఆయనకు ఆలోచనా సాయం చేసింది రవి ఘాటే. ఢిల్లీకి చెందిన డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ వీరి సేవలను సత్కరించింది. ఈ గ్రూపు ఇకముందు కూడా కరవును అస్సలు లేకుండా చేసేందుకు ప్రజాచైతన్యం, అవగాహన, వ్యవస్థాపనా సదుపాయాలపై దృష్టిపెడుతోంది.