ఫ్యామిలీ ప్రేమ
ఎన్ని అడ్డుగోడలున్నా తండ్రి, కొడుకు, తల్లి మధ్య ప్రేమ అలాగే ఉందని తెలిసేట్టు చేయడం - చివరికి కుటుంబాన్ని ఒకటి చేయడమే ఈ సినిమా. ఎవరూ ఊహించనంత రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అద్భుతంగా మలిచాడు దర్శకుడు కరణ్ జోహార్.
ఒక కంట ఆనంద భాష్పం - మరోకంట దుఃఖపు కన్నీరు.ఈ లైన్‌ని కుటుంబ బంధాల నేపథ్యంలో కథగా రాసుకోవడం కత్తిమీద సాము. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీయడం మరో సాహసం. మిలీనియం తర్వాత భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకి చేరువ చేసి ఎన్నారై మార్కెట్ విస్తృతిని రుచి చూపించిన చిత్రం ‘కభీ కుషీ కభీ గమ్’.
కరుడుగట్టిన బండరాతి చిప్ప మనసున్న ప్రేక్షకుడు కూడా తన కన్ను చెమ్మగిల్లడం అనుభూతి చెందుతాడు ఈ సినిమా చూస్తే. ఈ వ్యాసం రాయడానికి మళ్లీ ఈ సినిమా చూసి మళ్లీ కన్నీళ్లు పెట్టాను నేను. ఇది నిజం.
ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, ఇద్దరూ పిల్లల గురించి ఏమనుకుంటున్నారో టైట్ క్లోజప్ షాట్స్‌లో కెమెరాతో చెప్పడం ఈ చిత్రానికి ప్రారంభం. పిల్లల విషయంలో తల్లిదండ్రుల మధ్య భావ వైరుధ్యం - ఎంత గొప్ప ఆలోచన.
‘ఒక తండ్రి తన కొడుకుని కౌగిలించుకుని, మనస్ఫూర్తిగా, ఐ లవ్ యూ మై సన్ అని ఎందుకు చెప్పలేడు’ - తండ్రి (అమితాబ్ బచ్చన్).
‘కొడుకు తన మాట వింటాడో, వినడో కానీ తల్లి మాత్రం బిడ్డా నువ్వు బాగుండు అని చెప్తూనే ఉంటుంది’ - తల్లి (జయాబచ్చన్).
‘చెప్పనంత మాత్రాన తండ్రి కొడుకుని తక్కువ ప్రేమిస్తున్నాడని కాదు అర్థం’ - తండ్రి.
‘తల్లి తన కొడుకుని ఎంత ప్రేమిస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది జవాబులేని ప్రశ్న. ఆ ప్రేమ కొలమానం లేని ఒక అనుభూతి’ - తల్లి.
‘‘నా కొడుకు రాహులే - నా జీవితం.’’ (రాహుల్ - షారుక్ ఖాన్)
ఇలా ప్రారంభమౌతుంది కె3జి సినిమా.
రాహుల్ చిన్నప్పుడు తల్లితో పెనవేసుకున్న అనుబంధాన్ని మాంటేజ్ షాట్స్‌గా చూపిస్తూ టైటిల్స్ మొదలౌతాయి.
‘ఇట్స్ ఆల్ ఎబౌట్ లవింగ్ యువర్ పేరెంట్స్’ - అని కరణ్ జోహార్ పేరు పడుతుంది.
అర్థమైపోయింది. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, థియేటర్‌లో ఏళ్ల తరబడి ఉన్నా, లేకపోయినా మనసులో మాత్రం చాలా ఏళ్లు వెన్నాడుతూ ఉంటుంది. ఈ టైప్ సినిమాలో కుషీ కమ్ - జ్యాదా గమ్ అని. ఎందుకంటే ఇల్లు, కుటుంబం, వీటిల్లో సరదాలు, సంతోషాలు ఎప్పుడూ పండుగల్లా, చుట్టాల్లా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాయి.
చిరాకులు, కోపాలు, అలకలు, బాధలు ఎప్పుడూ కుటుంబసభ్యుల్లా అట్టిపెట్టుకుని ఉంటాయి. ఇది విశ్వవ్యాప్తంగా సహజం. ఇలా ప్రిపేరై చూసినా ఈ చిత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది. అదీ విచిత్రం.రోహన్ (హృతిక్ రోషన్) కాలేజీలో తన టీమ్‌ని బౌండరీ కొట్టి క్రికెట్ మ్యాచ్ గెలిపించడంతో కథ మొదలౌతుంది. దీపావళి సెలవులకి హాస్టల్ నుంచి ఇంటికెళ్తూ హరిద్వార్‌లో ఉన్న నానమ్మని కలవడం వల్ల - తన అన్న రాహుల్ పదేళ్ల క్రితం ఇదే దీపావళి సందర్భంగా ఇంటి నుంచి ఎలా విడిపోయాడో తెలుస్తుంది. రాహుల్ ఆ కుటుంబానికి వారసుడు కాడని, రెండు నెలల అనాథని తెచ్చి పెంచుకున్నారని, తర్వాత తొమ్మిదేళ్లకి రోహన్ పుట్టాడని తెలుస్తుంది.
ఫ్లాష్ బ్యాక్ మొదలు. పదేళ్ల క్రితం అతి సంపన్నుడైన బిజినెస్‌మ్యాన్ యశ్‌వర్ధన్, అతని భార్య నందిని ఇంట్లో ఘనంగా దీపావళి వేడుక జరుగుతుంటే, పాట మధ్యలో హెలికాఫ్టర్ దిగి రాహుల్ వస్తుంటాడు. పాట ఆపి తల్లి గుమ్మం దగ్గరికొస్తుంది. రాహుల్ రాడు. తల్లి నవ్వుకుని వెనక్కి తిరగబోతే నిజంగానే రాహుల్ వస్తాడు. ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు - వస్తూనే రాహుల్, అమ్మా! ప్రతిసారీ నేనొచ్చే ముందే నీకెలా తెలిసిపోతుంది? అంటాడు. ఆమె బొట్టు పెట్టి దగ్గరకు తీసుకుంటుంది. ఇది తల్లీకొడుకుల బంధం. నైనా (రాణీముఖర్జీ - అతిథి పాత్ర) అనే స్నేహితుడి కూతురిని రాహుల్‌కిచ్చి పెళ్లిచేద్దాం అనుకుంటాడు తండ్రి.
కొడుకుతో వంశ మర్యాద, గౌరవం ప్రతిష్ట ఇనుమడింపజేయమని, తన వారసుడిగా తన పరువు నిలబెట్టాలని తండ్రి చెబుతున్నప్పుడే ఇంటర్‌కట్‌లో ఇండియా ఫ్లాగ్ పట్టుకుని రోడ్డుమీద ఆనందంగా గంతులేస్తున్న అంజలిశర్మ (కాజోల్) పరిచయం అవుతుంది. ఆ తండ్రి, కొడుకుల మధ్య రాబోయే భేదానికి చిహ్నంగా. అనుకున్నట్టే రాహుల్, అంజలిని ప్రేమించడం, తండ్రి అంగీకరించకపోవడం, తల్లి వీళ్లిద్దరి మధ్య నలిగిపోవడం, రాహుల్ ఇల్లు వదిలి వెళ్లిపోవడం - ఈ కథంతా తెలుసుకున్న తమ్ముడు రోహన్ లండన్ వెళ్లి అన్నని, వదినని, వదిన చెల్లెలు పూజ (కరీనా కపూర్) ద్వారా కలుసుకోవడం - అన్నని ఇంటికి తీసుకురాలేక తల్లిని, తండ్రిని లండన్ రప్పించడం, ఎన్ని అడ్డుగోడలున్నా తండ్రి, కొడుకు, తల్లి మధ్య ప్రేమ అలాగే ఉందని తెలిసేట్టు చేయడం - చివరికి కుటుంబాన్ని ఒకటి చేయడం. అన్నీ అనుకున్నట్టే జరిగే కథ కాబట్టి దీన్ని ఎవరూ ఊహించనంత రిచ్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసి విజువల్‌గా అద్భుతంగా మలిచాడు దర్శకుడు కరణ్ జోహార్.2001 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం 40 కోట్ల బడ్జెట్‌లో తీస్తే 117 కోట్లు వసూలు చేసిందట.జర్మనీలో కూడా థియేటర్స్‌లో రిలీజైన మొదటి భారతీయ సినిమా ఇది.
ఎన్నారై మార్కెట్‌ని ఎంతగా పెంచిందో చెప్పాలంటే, తర్వాత కరణ్ జోహర్ ప్రతి చిత్రాన్నీ ఎన్నారైల కోసమే తీసేంతలా. మొదటి సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’... సూపర్‌హిట్ ప్రేమకథ కరణ్ జోహార్‌కి . ‘కభీ కుషీ కభీ గమ్’ పోస్టర్ చూడగానే హిట్టు కళ కనిపించేసింది. కథ రాసుకునేటప్పుడే తండ్రి పాత్రకి అమితాబ్‌ని, కొడుకు పాత్రకి షారుఖ్‌ని ఫిక్స్ అయి రాసుకున్నాట్ట. తల్లి పాత్ర కోసం జయాబచ్చన్‌కి కథ చెప్తే ఆమె వింటూనే కన్నీళ్లు పెట్టిందట. ధర్మా ప్రొడక్షన్స్‌లో 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘కభీ కభీ’ సినిమాలో అమితాబ్, జయా బాధురి హీరో హీరోయిన్లు. ఈ చిత్రంలో వాళ్లిద్దరూ తల్లి, తండ్రి పాత్రలు పోషించడం వల్ల, టైటిల్‌లో కభీ, కభీ అని రెండుసార్లు రావడం వల్ల ఈ చిత్రం ‘కభీ కభీ’కి సీక్వెల్ అనుకున్నార్ట చాలామంది.
చాలాకాలం తర్వాత జయాబచ్చన్‌కి తెరపై మళ్లీ చూపించిన చిత్రం ఇది. ఆమె అభిమానులకో చిరుకానుక. హృతిక్ రోషన్‌కి మొదట సినిమా ‘కహో నా ప్యార్ హై’ విడుదల అవ్వకుండానే ఈ కథ చెప్పి, ఇందులో నువ్వు హీరోవి కావు. విడిపోయిన అన్నని, తండ్రిని కలిపే కేటలిస్టువి అని చెప్పి నా ఈ చిత్రం అంగీకరించాడు. బాలీవుడ్‌లో స్టార్లు స్టార్‌డమ్‌ని కాకుండా, కథని, పాత్రని ప్రేమిస్తారనడానికి ఇదో ఉదాహరణ. రొటీనైపోయిన మెకానికల్ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించేవాళ్లు, దూరమైపోయిన కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతున్నవాళ్లు, అపార్థాల వల్ల దూరంగా ఉంటున్నవాళ్లు - అందరూ ఈ చిత్రంలో ఏదో ఒక పాత్రతో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు.
బోరింగ్ సినిమా అని, టీవీ సీరియల్‌ని వెండితెర మీద చూసినట్టు ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ అయినా కూడా కుటుంబ విలువల్ని కథావస్తువుగా చేస్తే కుటుంబంలాగే స్థిరంగా నిలబడుతుందని నిరూపించిన చిత్రం ఇది. ప్రేమకథలకి పట్టంగట్టిన మిలీనియం యువతరం ఈ చిత్రాన్ని ఆదరించకపోవచ్చు. కానీ, 30 ఏళ్లు పైబడిన ప్రతి ప్రేక్షకుడి మనసునీ చెమ్మగిల్లే లాంటి మంచి సినిమా తీసినందుకు, మనసుని స్పృశించే ఆత్రేయ పాటని మూడు గంటల సినిమాగా చూపించినందుకు...
కరణ్... నీకు జోహార్...