నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్‌ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్‌ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? – ఓ సోదరి
హెచ్‌ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్‌ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్‌ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది.
నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?– పేరు రాయలేదు
కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండటం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడటం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్
కూకట్‌పల్లి హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment