మా రాంబాబుగాడి మత్స్యపురాణం!
నవ్వింత: మా రాంబాబుగాడు ఫిష్‌ల్యాండ్‌లో డిన్నర్ ఇస్తానన్న దగ్గర్నుంచి చేప వెరైటీ ఐటమ్స్ కోసం ఉవ్విళ్లూరుతూ ఉన్నాం. డిన్నర్ టైమ్‌లో వాడేం స్పీచులిస్తాడులే అనుకున్నాం గానీ... వెళ్లాకగానీ తెలియలేదు వాడి గేలానికి చిక్కిపోయామని. ‘‘నువెన్నైనా చెప్పురా... ఫిష్షు ఫిష్షే. దాని టేస్టు టేస్టే’’ అన్నాను తన్మయంగా. అంతే రెచ్చిపోయాడు మావాడు. ‘‘అందుకేగా రాజుగారు తన ఏడుగురు కొడుకుల్నీ వేటకు పంపితే... వాళ్లు పులుల్నీ, జింకల్నీ కొట్టడం మానేసి, చేపలు పట్టడం మొదలుపెట్టారు. పైగా చేప రుచిని మరవలేక, వాటినంత తేలిగ్గా విడవలేక... నిలవ ఉంచుకుని తినాలని ఎండబెట్టడం కూడా చేశారు. చేప గురించి తర్వాతి తరాలకు తెలియాలన్న కోరిక కొద్దీ... ‘చేపా చేపా ఎందుకు ఎండలేదంటూ’... మనకు తెలియకుండానే మనమంతా మన పిల్లలందరికీ తొలికథగా దాన్నే చెబుతుంటాం. అలా కథాసాహిత్యంలో కూడా చేపదే అగ్రస్థానం రా’’ అన్నాడు రాంబాబు. ‘‘నువ్వు గ్రేటురా. రుచి తాలూకు టేస్టునూ, సంప్రదాయంగా వస్తున్న పిల్లల కథల టేస్టునూ... రెంటినీ ఆస్వాదిస్తుంటావు’’ అన్నాను మెచ్చుకోలుగా. వాడు చెలరేగిపోయాడు.
‘‘విజ్ఞానమంతా వేదాల్లోనే ఉందన్న విషయం నీకు తెలియంది కాదు. పురాణాల్లో జరిగిన మొట్టమొదటి థెఫ్ట్ కేసును డీల్ చేయడానికి దేవుడంతటి వాడు చేపనే ఎందుకెంచుకున్నాడంటావ్? చేప నాలెడ్జీ సముపార్జనకు చిహ్నం అని లోకానికి తెలియ చెప్పడానికే. అందులో ఒమెగా ఫ్యాటీ ఆసిడ్సూ... అవీ, ఇవీ ఉన్నాయంటారుగానీ... సమస్తవిజ్ఞానభాండాగారమైన వేదాలను చేప రూపంలో సంరక్షించినందుకే రా... దాన్ని తిన్నవాడికీ జ్ఞానం, జ్ఞాపకశక్తీ, వ్యాధినిరోధకశక్తీ పెరుగుతాయి. పురాణాల్లోనే కాదు... సైన్సుకూ చేప చేసిన సేవ అంతా ఇంతా కాదు’’ అంటూ మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు మా రాంబాబు.
‘‘సైన్సుకు చేప సేవలా?’’ ఆశ్చర్యపోయాన్నేను. ‘‘కాదా మరి. జీవపరిణామ క్రమాన్ని చెప్పిన డార్విన్ వెన్నెముకగల జీవుల్లో చేప నుంచి మొదలుపెట్టి మనిషి దగ్గర ముగించాడు. సైన్సులోనే కాదురా... మనలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేయడానికి ఇచ్చే శిక్షణలోనూ చేపలు ఇతోధికంగా ఉపయోగపడతాయి తెల్సా?’’.
‘‘అవినీతి అంతానికీ, చేపలకూ సంబంధం ఏమిట్రా?’’
‘‘మొన్ననే పేపర్లో చదివాన్రా. ‘అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన పెద్ద చేప. పెద్ద చేప కోసం వలపన్నిన అధికార్లు’ అంటూ హెడ్డింగులు చూశా. అంటే... అవినీతిపరుల్ని గట్టిగా పట్టుకోవాలంటే కొంతకాలం చేపలు పట్టడం ప్రాక్టీస్ చేయాలని’’ అన్నాడు రాంబాబు.
‘‘నీకు మతిగానీ పోయిందా...?’’ అంటూ కేకలేయాలని చూశా. అయినా వదల్లేదు వాడు.
‘‘సినిమాల హిట్ ఫార్మూలాకు చేపల పులుసు ఒక సాధనం. మాస్ హీరోను వశపరచుకోవాలంటే హీరోయిన్ ఏ బిర్యానీయో, ఫ్రైడ్‌రైసో వండదు. చేపలపులుసు చేస్తుంది. అతగాడు దాన్ని లొట్టలేసుకుని తింటూ ‘ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లూ... ఎక్కడో గుచ్చావూ చేప ములూ’్ల... అంటూ పాట కవిత్వంతో కిర్రెక్కించేసరికి...మాస్ ప్రేక్షకులంతా ఫిదా. ఇది కనిపెట్టే హాలీవుడ్ డెరైక్టరు స్పీల్‌బర్గు కూడా ‘జాస్’ సినిమా తీసి ‘మాస్’ను ఆకట్టుకున్నాడు తెల్సా’’ అన్నాడు రాంబాబుగాడు.
‘‘అంటే చేపలంతా మాస్ యవ్వారమంటావ్! వాసనకొడుతుంటాయి కాబట్టి క్లాస్ పీపుల్‌కు చేపల్తో సంబంధం ఉండదంటావా?’’ అడిగాన్నేను.
‘‘ఎందుకు లేదూ... కాళిదాసుకు కవిత్వం అంతగా వచ్చిందెందుకనుకుంటున్నావ్. పుష్కలంగా చేపలు తిన్నందుకే!’’
‘‘ఒరే... ఒరే... కనిపెట్టు నీ కోతలు’’
‘‘కోతలు కాదురా. ఈ పద్యం విను.
కక్షే కిం తవ? పుస్తకం, కిముదకం? కావ్యార్థ సారోదకం.
గంధః కిం? ఘన రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః
పుచ్ఛః కిం? ఘన తాళపత్ర లిఖితం, కిం పుస్తకం హే కవే?
రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణ పుస్తకం!!
ఒకరోజున కాళిదాసు చేపల మార్కెట్లో ఒక పెద్దసైజు కొర్రమీను కొని తీసుకుపోతుంటే ఆ దృశ్యం చూసి, ఆయనను ఆటపట్టించాలనుకున్న భోజరాజు ‘ఆ చేతిలోదేమిట’ని అడిగాట్ట. ‘పుస్తకం’ అని జవాబిచ్చాట్ట కాళిదాసు. ‘నీళ్లు కారుతున్నాయేం’టి అని అడిగితే ‘కావ్య సారం నీళ్లలా స్రవిస్తోంద’న్నాట్ట కాళిదాసు. ‘వాసనొస్తోందేమిటి?’ అంటే ‘రామరావణ యుద్ధంలో చనిపోయిన సైనికుల శవాల కంపు’ అన్నాట్ట కవీంద్రుడు. ‘అది సరే గానీ కవిగారూ... ఇంతకీ అదేం పుస్తకం... కాస్త చూపిద్దువూ’ అని భోజరాజు బలవంత పెడితే... కాళిదాసు పొట్లం విప్పేసరికి అది రామాయణకావ్యంగా దర్శనమిచ్చిందంట. అటు కాళీమాత, ఇటు మత్స్యదేవత కూడబలుక్కొని తమ ఉమ్మడి భక్తుడైన కాళిదాసు పరువు కాపాడటానికే ఇలా తమ మహత్యం చూపించారని లోక ప్రతీతి.
కవిత్వం కమ్మగా చెప్పాలంటే క్లాస్ కవులూ తినాల్సిందేరా చేపలకూర. వినాల్సిందేరా చేపపురాణం. ఇన్ని గొప్పలున్నాయని చెప్పడానికే క్యాట్ ఫిష్ మీసాలు పెంచుతుంది. ఆ సంగతి తెలియక దాని మీసాలు పిల్లిమీసాల్లా ఉన్నాయని అమాయకంగా దాన్ని క్యాట్‌ఫిష్ అంటాం. ‘నాకూ పిల్లికీ సంబంధమేమిట్రా, నా గొప్ప నాదే అంటూ ఆ మీనం కాస్తా మీసం మెలేసి తన గొప్పదనం చాటుతుంటుంది!’’ అన్నాడు మా రాంబాబు.
- యాసీన్