పసందైన పూసలు
ఒకే రకమైన జ్యూవెలరీని వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. ఒక డ్రెస్ వేసుకుంటే.. దానికి తగ్గ జ్యూవెలరీని వేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. అంతేకాదు, ఒకేరకమైన మేకింగ్... అంటే జ్యూవెలరీ తయారీకి కావలసిన వాటిలోనూ వెరైటీ కోరుకుంటోంది. అందుకే ఎంతో ఫ్యాషన్‌గా.. అందంగా కనిపించే జ్యూవెలరీని ‘పూస’లతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వారం చూద్దాం..
కావలసినవి: రంగురంగుల పూసలు (చిన్నవి, పెద్దవి), ముత్యాలు, తీగలు, దారాలు, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్‌లెట్ హుక్స్, చిన్న సైజు కటింగ్ ప్లయర్
తయారీ: ముందుగా ఏ రంగు జ్యూవెలరీ కావాలో.. ఆ రంగు పూసలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటితో ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్, లెగ్ చెయిన్స్, నెక్‌లేస్ తయారు చేసుకోవాలి. ఎలా అంటే... గోల్డ్ లేదా సిల్వర్ కలర్ తీగకు పూసలు లేదా ముత్యాలను ఎక్కించి ఎలాంటి జ్యూవెలరీ కావాలంటే, దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తయారీకైతే... తీగకు పూసలను ఎక్కించి, చివరకు హుక్స్‌ను తగిలిస్తే సరిపోతుంది (తీగను మెలికలు తిప్పడానికి కటింగ్ ప్లయర్‌ను వాడాలి).
గాజుల తయారీకి దళసరి తీగలను ఉపయోగించాలి. కొన్నింటికి తీగకు బదులుగా దారాన్ని ఉపయోగిస్తేనే, జ్యుయెలరీ అందంగా కనిపిస్తుంది. నెక్‌లేస్, చెయిన్ల కోసం దళసరి దారాన్ని వాడాలి. ఒకే వరుస కాకుండా రెండు-మూడు వరుసలుగా పూసలను ఎక్కించి.. చివర్లకు హుక్ తగిలించొచ్చు లేదా రిబ్బన్ వాడినా బాగుంటుంది. అయినా.. పక్కనున్న ఫొటోలను చూస్తే, మీకో ఐడియా వస్తుంది.