నరసింహం టూర్ నుంచి తిరిగొచ్చాడని తెలియగానే ఆ రాత్రి హుషారుగా బార్‌కి చేరుకుంది మిత్రబృందం. మందు సాక్షిగా తన టూర్ విశేషాలను మిత్రులతో పంచుకోవడం అతగాడి ఆనవాయితీ. నరసింహానికి ముప్పయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్‌గా ఉంటాడు. తన రూపంతో, మాట చాతుర్యంతో అమ్మాయిలను ఇట్టే పడేయగలనన్న గొప్ప ఆత్మవిశ్వాసం అతనిది. అయిదేళ్ళ క్రితం పెళ్ళయింది. రెండేళ్ళపాప కూడా ఉంది.ఒక ఆడిటింగ్ ఫర్మ్‌లో ఆడిటర్‌గా పనిచేస్తూన్న నరసింహం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు టూర్ వెళుతూంటాడు. వెళ్ళిన చోటల్లా ఓ కొత్త అనుభవం కోసం వెంపర్లాడుతుంటాడు.‘చీర్స్’ చెప్పుకుని మందుకు శ్రీకారం చుట్టారు మిత్రులు. నరసింహం వంక చూస్తూ, ‘‘కమాన్, బ్రో! స్టార్ట్ ద స్టోరీ’’ అన్నాడు ఓ మిత్రుడు. ‘‘నీ మౌనం మా కుతూహలాన్ని రెచ్చగొడుతోంది.ఆరంభించు, భయ్యా!’’ అన్నాడు ఇంకొకడు.‘‘మొదటిసారిగా కోల్‌కత్తా వెళ్ళొచ్చావు. బెంగాలీ భామల విశేషాలతో మా వీనులకు విందు చెయ్యి మామా!’’ తొందర చేశాడు మరో మిత్రుడు. కథ ఆరంభించే ముందు ఒకసారి కన్నులు మూసుకున్నాడు నరసింహం. కోల్‌కత్తా అనుభవం మదిలో సుళ్ళుతిరిగింది..
తమ క్లయింట్ కంపెనీ యాన్యువల్ ఆడిటింగ్ పని మీద కోల్‌కత్తా వెళ్ళాడు నరసింహం. ఆ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ పార్క్ స్ట్రీట్‌లో ఉంది. నరసింహానికి గొరియహాట్‌లోని కంపెనీ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటైంది.
ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు. సాయంత్రం గెస్ట్‌హౌస్‌కి చేరుకోగానే టిప్ టాప్‌గా తయారై వాహ్యాళికి తిరిగేవాడు నరసింహం. గొరియహాట్ నుంచి ఢకూరియా బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చేవాడు. ఆ వేళప్పుడు ఆ ఏరియా చాలా సందడిగా ఉంటుంది. మోడర్న్ దుస్తులలో సీతాకోకచిలుకల్లా తిరిగే భామలను ఆబగా చూసేవాడు అతను. వినూత్న బెంగాలీ అందాలనుకళ్ళతోనే జుర్రుకునేవాడు. ఒక సెలవురోజున సైట్ సీయింగ్ కోసం క్వీన్స్ వేలోని విక్టోరియా మెమోరియల్‌కి వెళ్ళాడు నరసింహం. 1921లో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మించిన పాలరాతి కట్టడం అది.మ్యూజియంగా రూపొందిన ఆ మెమోరియల్‌లో 25 గ్యాలరీలు ఉన్నాయి. వాటిలో రాయల్ గ్యాలరీ, జాతీయ నాయకుల గ్యాలరీ, తైలవర్ణచిత్రాల గ్యాలరీ, శిల్పకళాఖండాల గ్యాలరీ, ఆయుధాలు–కవచాల గ్యాలరీ, కోల్‌కత్తా గ్యాలరీ, సెంట్రల్ హాల్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి. దేశ, విదేశీ సందర్శకులతో మెమోరియల్ సందడిగా ఉంది. సెంట్రల్ హాల్‌లో ఓ బెంగాలీ యువతితో అతనికి పరిచయమైంది. ఫెయిర్ గా, స్లిమ్ గా, పొడవుగా ఉందామె. లైట్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడర్డ్ కుర్తీ, బ్లూ కలర్ లెగ్గింగ్స్‌లో మోడర్న్‌గా ఉంది.కబుర్లు చెప్పుకుంటూ గ్యాలరీలన్నీ తిరిగారు ఇద్దరూ. లంచ్ టైమ్‌లో గార్డెన్లో కూర్చుని తినుబండారాలను షేర్ చేసుకున్నారు. ఆమె కలుపుగోలుతనం అతనికి బాగా నచ్చింది. సందు దొరికినపుడల్లా అతను తన అందాన్ని పొగుడుతూండడం ఆమెకు నచ్చింది. సాయంత్రం మ్యూజియం నుంచి బయటపడ్డాక, ‘‘అయాం టైర్డ్. పక్కవీధిలో కాఫీ షాపు ఉంది. అక్కడ కాఫీ బాగుంటుంది. మీకు ఇబ్బంది కాకపోతే నాకు కంపెనీ ఇవ్వగలరా?’’ అడిగిందామె. రొట్టె విరిగి నేతిలోపడ్డట్టయింది అతనికి. ‘కాఫీ కఫే’ ఓపెన్–ఎయిర్ రెస్టారెంట్. జనం బాగానే ఉన్నారు. ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు నరసింహం, ఆ యువతీను. ఆమె పేరు జ్యోత్స్న అని తెలియగానే, ‘‘మీ పేరూ మీ అంత అందంగా ఉంది!’’ కాంప్లిమెంట్ ఇచ్చాడతను. నవ్వేసిందామె. ఆమె చనువుగా మెలగడంతో, సులభంగానే తన వలలో పడుతుందన్న ఆశ కలిగింది అతనిలో.
కాఫీలు రాగానే, కప్పు అందుకోబోయాడు నరసింహం. ఆమె వారించి, తన హ్యాండ్ బ్యాగులోంచి చిన్నగుళికలు ఏవో తీసి అతని కాఫీలో కలిపింది. ‘‘నేనేదో మత్తుమందుకలుపుతున్నాననుకునిభయపడిపోకండి. హెర్బల్ గుళికలివి. కాఫీ, టీలలో వేసుకుంటే కఫీన్, నికోటిన్‌ల ప్రభావం మన ఆరోగ్యంపైన పడదు’’ అంది చిరునవ్వుతో. నరసింహం కప్పు నోటి దగ్గర పెట్టుకుంటూండగా వెనుక నుంచి ఎవరిదో చేయి తగిలి కప్పు కింద పడిపోయింది. కాఫీ అతని దుస్తులపైన ఒలికింది.ఒక యువతి అతని ఎదుటకు వచ్చి, ‘‘ఓహ్, అయాం సారీ! చూసుకోలేదు’’ అంటూ అతనికిక్షమాపణలు చెప్పుకుంది. ఇంచుమించు జ్యోత్స్న వయసే ఉంటుంది ఆమెకు. సాధారణమైన అందం. నీలాల కన్నులు ఆమె ప్రత్యేక ఆకర్షణ. లేత ఆకుపచ్చరంగు బెంగాలీ కాటన్ శారీ, అదే రంగుబ్లౌజులో నిండుగా ఉంది.ఆమెను చూడగానే కూల్ అయిపోయాడు నరసింహం. ‘‘ఇట్సాల్‌రైట్. డోంట్ వర్రీ,’’ అన్నాడు. కాఫీ ఒలికిన షర్టును వాష్ చేసుకు వస్తానంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు.జ్యోత్స్న తనవంక తీక్షణంగా చూస్తూంటే, పెదవులు విడీవిడనట్లుగా నవ్వుకుంది ఆ యువతి. షర్ట్ వాష్ చేసుకుంటూంటే, ‘‘అయాం రియల్లీ సారీ!’’ అన్న పలుకులు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు నరసింహం.ఆశారీ గాళ్!‘‘పరవాలేదులెండి. మీరు కావాలని చేయలేదుకదా!’’ అన్నాడు.‘లేదు, నేను కావాలనే చేశాను!’’ అని ఆమె అనడంతో తెల్లబోయి చూశాడు.‘‘ఇది మెన్స్ వాష్‌రూమ్. అలా పక్కకు వచ్చారంటేఎందుకలాచశానో చెబుతాను’’ అందామె తాపీగా.విస్తుపాటుతో ఆమెను అనుసరించాడతను. జ్యోత్స్నలాగే చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతోందామె. ఆమె చెబుతూన్నది నోరు వెళ్ళబెట్టి ఆలకించాడు‘‘జ్యోత్స్న ఓ చీట్. తన అందచందాలతో పురుషులను ట్రాప్ చేస్తుంది. కాఫీ షాపుకు తీసుకొచ్చి, వారి కాఫీలో డ్రగ్స్ కలుపుతుంది. వాటి ప్రభావంతో ఆమె చెప్పినట్టు చేస్తారంతా. కాఫీ తాగాక, తనఫ్రెండ్‌నికలవాలంటూ హోటల్ మన్మథకు తీసుకువెళుతుంది. అప్పటికి మత్తు పూర్తిగా తలకెక్కిన ఆ వ్యక్తిని నిలువుదోపిడీ చేసి అదృశ్యమైపోతుంది. తెలివి వచ్చాక ఆ మందు ప్రభావం వల్ల జరిగిందేమీఅతనికి గుర్తుండదు’’ నమ్మలేనట్టుగా చూశాడు నరసింహం.
‘‘ఆమధ్య ఓసారి నా కజిన్ బ్రదర్ ఆమె ట్రాప్‌లో పడి మోసపోయాడు. సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోయాము’’ అందామె. ‘‘ఇతరులు కూడా ఆమె ఉచ్చులో తగులుకోకూడదనే వీలైనపుడల్లా వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను నేను. నా మాటలు నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం!’’ ఆ షాక్ నుంచి అతను తేరుకునే లోపునే అక్కడి నుంచి నిష్క్రమించిందామె. నరసింహం తిరిగి రాగానే జ్యోత్స్న మళ్లీ కాఫీకి ఆర్డర్ చేసింది. అతను వద్దంటూంటే, ‘‘మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేశాను నేను. ఇప్పుడు మీరు తాగకుండా వెళ్ళిపోతే నాకు ఎలాగో ఉంటుంది’’ అంది.కాఫీ రాగానే మళ్ళీ గుళికలు తీసిఅందులో వేసిందామె. ఆమెను కబుర్లలో పెట్టి, కప్పు నోటి వద్ద పెట్టుకుని త్రాగుతున్నట్టు నటించాడు అతను. ఉన్నట్టుండి టేబుల్ కింద నుంచి ఆమె కాలిని త్రొక్కడంతో చటుక్కున వంగిందామె. అదేక్షణంలో టేబుల్ పక్కనున్న పూలకుండీలో కాఫీని ఒలకబోసేశాడు.‘‘నా కాలు తగిలినట్టుంది. సారీ!’’ అన్నాడు. మందహాసం చేసిందామె.కాసేపటి తరువాత బయటకు నడచారు ఇద్దరూ. ‘చేరువలోనే కొంచెంఅర్జెంట్ పని ఉంది’’ అన్నాడు. బలవంత పెట్టినా ప్రయోజనం లేకపోవడంతో, ‘‘ఓకే. రేపు సాయంత్రం మళ్ళీ ఇదే కాఫీ షాపులో కలుద్దాం. అప్పుడు మీరు తప్పక నా స్నేహితురాలిని కలవాలి!’’అందామె. ‘‘ఓకే, ష్యూర్!’’ అంటూ, ఖాళీగా వెళుతున్న టాక్సీని ఆపి ఎక్కేశాడు అతను.మర్నాడే కాదు, మరో రెండురోజుల వరకు ఆ కెఫే ఛాయలకే వెళ్లలేదు నరసింహం. అతని మనసు మాత్రం తనకు హెల్ప్ చేసిన ‘శారీ సుందరి’ చుట్టూనే తిరుగుతోంది. ఆమె పేరు అడగలేదు. ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. ఆమెను మళ్లీ చూడాలన్న కోరిక బలమయింది అతనిలో. ఆ కాఫీ షాపుకువస్తుంటానని చెప్పిందామె. మూడోరోజున అక్కడికి వెళ్ళాడు నరసింహం. ఆ శారీ సుందరి కోసం చూస్తూంటే కెఫే బయటే ఎదురైందామె. బ్రౌన్ కలర్ బెంగాల్ హ్యాండ్‌లూమ్ శారీ కట్టుకుంది.అతన్నివెంటనే గుర్తుపట్టలేదామె. మూడురోజుల కిందటి సంఘటనను గుర్తుచేసి, ‘థాంక్స్’ చెప్పడానికి వచ్చానన్నాడు. తన మాట చాతుర్యంతో కాసేపటికే ఆమెను దోస్త్‌ని చేసేసుకున్నాడు. తన పేరు దేవయాని అనీ, స్వగ్రామం మిడ్నాపూర్ అనీ, ఉద్యోగరీత్యా తాను కోల్‌కతా వచ్చిందనీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందనీ, చౌరంఘీలేన్‌లో ఓ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటోందనీ చెప్పిందామె. వస్త్రధారణలో పొందిక, మనిషిలో సిగ్గరితనమూ అతన్ని ఆకట్టుకున్నాయి. చీరలో సెక్సీగా అనిపించింది. మచ్చిక చేసుకుని, కోల్‌కతా వదిలే లోపున ఆమెను పక్కలోకి లాగాలని నిశ్చయించుకున్నాడు.
ఆమెకు అతని పైన సదాభిప్రాయం కలగడంతో, రోజూ సాయంత్రపు వేళ కలుసుకునేవారు ఇద్దరూ. ట్రామ్ లో తిరిగేవారు. ఐస్‌క్రీమ్ పార్లర్స్ కి వెళ్ళేవారు. ఈడెన్ గార్డెన్స్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు.రాత్రి ఎనిమిది గంటలకల్లా ఆమెను హాస్టల్ సమీపంలో దిగబెట్టేవాడు అతను.ఇక రెండు రోజుల్లో కోల్‌కతా వదిలి వెళతాడనగా, తమ స్నేహానికి గుర్తుగా చిన్న పార్టీ ఏర్పాటు చేశానంటూ, ఆ సాయంత్రం దేవయానిని తాను ఉండే గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్ళాడు నరసింహం. కాక్ టెయిలూ, డిన్నరూ పూర్తయ్యేసరికి రాత్రి పదయిపోయింది. దేవయాని వాచ్ చూసుకుని కంగారుపడుతూ, ‘‘ఓ మై గాడ్! ఎనిమిది దాటితే హాస్టల్ డోర్ లాక్ చేసేస్తారు. ముందుగా లేట్ పర్మిషన్ తీసుకున్నవారినే లోపలికి ఎలవ్ చేస్తారు’’ అంది.‘‘డోంట్ వర్రీ. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. తెల్లవారాక వెళ్ళొచ్చును. రాత్రి ఎవరో ఫ్రెండ్‌ది బర్త్ డే పార్టీ బాగా లేటయిందనీ, అందుకే రాలేకపోయావనీ చెబుదువుగాని’’ అన్నాడతను. రాత్రి పదకొండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. తరువాత పడుకునేందుకు లేచారు. హఠాత్తుగా ఆమెను కౌగిలించుకుని, పెదవుల మీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు నరసింహం. ఆమె తెల్లబోయి, ప్రతిఘటించబోయింది. కానీ కౌగిలింతలోని పులకింత, ముద్దులోని మాధుర్యం మత్తుకు గురిచేయడంతో అది వ్యర్థప్రయత్నమే అయింది. మర్నాటి ఉదయం నరసింహానికి మెలకువ వచ్చేసరికి తొమ్మిది దాటిపోయింది. గదిలో దేవయాని కనిపించలేదు. వాష్ రూమ్‌కి వెళ్ళిందనుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి వాష్‌రూమ్‌కి వెళ్ళి చూశాడు. ఖాళీగా ఉందది. విస్తుపోతూ సూట్ అంతా వెదికినా ఆమె జాడ లేదు. మార్నింగ్ వాక్‌కి వెళ్ళిందేమోననుకుంటే, టీపాయ్ మీద ఉంచిన ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించలేదు. ఎవరి కంటా పడకూడదని తెల్లవారకుండానే వెళ్ళిపోయివుంటుందనీ, తన నిద్ర పాడుచేయడం ఇష్టంలేక లేపలేదనీ అనుకున్నాడు.
హఠాత్తుగా నరసింహం చూపులు కార్నర్ టేబుల్ పైన పడ్డాయి. దాని మీద ఉండవలసిన అతని ల్యాప్ టాప్ కనిపించలేదు! బెడ్ సైడ్ ర్యాక్ మీద పెట్టిన సెల్‌ఫోను, టైటాన్ వాచ్ కూడా కనిపించలేదు. ఏదో అనుమానం పొడసూపడంతో గబగబా టేబుల్ సొరుగు తెరచి చూశాడు. అందులో పెట్టిన మనీపర్స్, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులూ, ఐడీ కార్డూ మాయమయ్యాయి. పర్సులో పదివేలు ఉన్నాయి. గుండె ఝల్లుమంది.వెంటనే గెస్ట్ హౌస్ వాచ్‌మన్‌కి ఇంటర్‌కమ్‌లో ఫోన్ చేసి, దేవయాని గురించి వాకబు చేశాడు. తెల్లవారు జామునే ఆమె వెళ్ళిపోయిందనీ, చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉందనీ చెప్పాడతను. అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదు నరసింహానికి. మెదడు మొద్దుబారిపోవడంతో తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు.అదిగో, అప్పుడే పడింది అతని చూపు – టీపాయ్ క్రింద రెపరెపలాడుతున్న కాగితం మీద. చటుక్కున దాన్ని తీసి చూసాడు. అది ‘శారీ సుందరి’ దేవయాని ఆంగ్లంలో రాసిపెట్టిన ఉత్తరం –‘హే, బ్లడీ ఫ్లర్ట్! ఈ పాటికి గేమ్ అర్థమయివుంటుందనుకుంటాను నీకు, నీ ల్యాప్ టాప్, ఫోన్, మనీ,డెబిట్–క్రెడిట్ కార్డ్స్, వాచ్ నాతో తీసుకుపోతున్నాను – రాత్రి నీతో పొందిన అనుభవానికి జ్ఞాపికలుగా!... బై ద బై, ఆ కాఫీ గాళ్ గురించి నేను చెప్పినవేవీ నిజాలు కావు. ఆమె నీ కాఫీలో వేసిన గుళికలు హెల్త్‌పిల్సే. డ్రగ్ కాదు. ఆమె అప్పుడప్పుడు స్నేహితులతో ఆ కెఫేకి వస్తుంటుంది. కాఫీలో తులసి గుళికలను కలుపుకుని తాగుతుంటారు వాళ్ళు. ఆ విషయం చాలాసార్లు గమనించాను నేను.నీ వాలకం కనిపెట్టి, ఆమె అలవాటును నాకు ఎడ్వాంటేజ్ గా మార్చుకోవాలనుకున్నాను. నీ కాఫీని ఒలకబోసి డ్రామా ఆడాను. ఆమె గురించి చెడుగా చెప్పాను. నేను ఊహించినట్టే, నన్ను నమ్మి, నావెంట పడ్డావునువ్వు. నా గురించి నీకు చెప్పిన వివరాలు కూడా నిజం కాదు. నా రెసిడెన్స్ కూడా! ఆడవాళ్లను చూసి చొంగకార్చుకుంటూ వారిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకునే నీలాంటి విమనైజర్స్‌ని బకరాలను చేసి బుద్ధిచెప్పడం నా హాబీ!...నా కోసం వెదకడానికి ప్రయత్నించకు, నీ పరువే పోతుంది. బై, ఫర్ ఎవర్!’కంపెనీ వాళ్ళకు ఏదో చెప్పి, వారి సాయంతో తిరిగివచ్చాడతను.
నరసింహం చెప్పడం ముగించగానే మిత్రుల మధ్య భయంకర నిశ్శబ్దం అలముకుంది. ‘‘దెబ్బతో తాగిందంతా దిగిపోయింది, భయ్యా!’’ అన్నాడు ఓ మిత్రుడు, నిశ్శబ్దాన్ని చీల్చుతూ.‘‘కోల్‌కతా వెళ్ళొచ్చి కత్తిలాంటి కథ చెబుతావనుకుంటే సుత్తిదెబ్బలు తినొచ్చావేంట్రా, మామా!’’ అన్నాడు మరో మిత్రుడు.‘‘పద, బ్రో! కోల్‌కతా వెళదాం. ఆ మాయలాడిని వెదికి పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం’’ కోపంతో ఊగిపోయాడు ఇంకొకడు.తల అడ్డుగా తిప్పాడు నరసింహం. ‘‘లేదురా. ఆమె చేసింది కరెక్టేననిపిస్తోంది నాకు. విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలూ పెట్టుకుని ఎంగిలి కూటికి ఎగబడటం తప్పే! ఆ అనుభవం నాకళ్ళు తెరిపించింది. ఇక మీదట పరాయి స్త్రీ జోలికి పోకూడదని తీర్మానించుకున్నాను’’ అంటూన్న మిత్రుడి వంక నోళ్ళు వెళ్ళబెట్టి చూశారంతా.
- తిరుమలశ్రీ
శారీ సుందరి
Published Sun, Mar 10 2019 1:33 AM | Last Updated on Sun, Mar 10 2019 1:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment