అప‌రాధి | Funday crime story of the week | Sakshi
Sakshi News home page

అప‌రాధి

Published Sun, Oct 21 2018 2:31 AM | Last Updated on Sun, Oct 21 2018 2:31 AM

Funday crime story of the week - Sakshi

‘‘ఇప్పటికీ మాధవరావు చనిపోయాడంటే నమ్మలేక పోతున్నా మాస్టారు.’’ గట్టిగా నిట్టురిస్తూ చెప్పాడు శ్రీరాములు.  ‘‘నిజమే.... నిన్న సాయంత్రం ఇద్దరం అర్ధగంట మాటాడుకున్నాం..... చక్కగా మాట్లాడాడు. అటువంటి ఆయన ఈరోజు లేడంటే ఎవరు నమ్మగలరు చెప్పండి’’ బాధపడుతున్నాడు శంకరం. ఫ్రీజర్‌ బాక్స్‌లో పడుకోబెట్టి ఉంది మాధవరావు భౌతికకాయం.  మాధవరావు హెడ్‌ మాస్టారుగా పని చేసి రిటైరయ్యారు. వచ్చిన జీతంలో ఇంటికి కావలసినవన్నీ కొంటూ, కొంత కొంత దాచుకుని కాకినాడ రామారావుపేటలో ఐదుసెంట్ల భూమి కొన్నారు.  రిటైరై ఆరునెలలవుతోంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ గా వచ్చిన మొత్తం కొంత పోస్టాఫీసులో కొంత జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. సర్వీసులో ఉండగానే కొడుకు పెళ్లి చేశారు. మాధవరావు కొడుకు రవి బీఈడీ చేశాడు. గవర్నమెంటు కొలువు రాక ఒక కాన్వెంట్‌లో టీచర్‌గా చేరాడు. అంతా కలసి వుంటున్న చిన్న ఉమ్మడి కుటుంబం వాళ్ళది.  ‘‘ఇంతకీ హార్ట్‌ ఎటాక్‌తోనే పోయేడంటారా!’’  మళ్ళీ అనుమానంగా అన్నాడు సుబ్బరామయ్య.  ‘‘వాళ్ళ ఇంట్లో వాళ్ళే హార్ట్‌ ఎటాక్‌ అంటుంటే మనకెందుకయ్యా’’ అన్నాడు శంకరం.‘‘నాకెందుకో అది సహజ మరణంగా అనిపించడం లేదు’’  తన సందేహాన్ని వెలిబుచ్చాడు శ్రీరాములు. ఓ యువకుడు వీరి దగ్గరకు వచ్చాడు.‘‘నమస్తే మాస్టారు! నన్ను  గుర్తు పట్టరా?’’  అన్నాడు శంకరం కేసి చూస్తూ. ‘‘మనిషి గుర్తున్నావు  కాని, పేరు గుర్తుకు రావడం లేదు’’  పేరును తడుముకుంటున్నాడు  శంకరం మాస్టారు.  ‘‘నాపేరు హరి అండీ... 2005 టెన్త్‌ క్లాస్‌ బాచ్‌. ప్రస్తుతం ఇండియన్‌ బ్యాంక్‌లో అక్కౌంటెంట్‌గా కాకినాడ ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చాను  రెండు రోజులుగా బ్యాంకులో బిజీగా వుండి ఇటు రాలేక పోయాను.  ఈ రోజు మాధవయ్య మాస్టారు గారిని కలుద్దామని వస్తే ఇలా జరిగింది...’’ ‘‘ఆ గుర్తుకు వచ్చావయ్యా హరి!. సెకండ్‌ బెంచ్‌ సెకండ్‌ వన్‌... ఆ రోజుల్లో నువ్వు క్లాస్‌లో చాలా బాగా చదివే వాడివి’’  అన్నాడు శంకరం.  

‘‘మాస్టారు... మాధవయ్యగారిది సహజ మరణం కాక పొతే మర్డరా... లేక ఆత్మహత్యా?’’  ‘‘చ... చ... ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఎవరైనా హత్య చేసి వుండాలి.’’ ఆన్నాడు సుబ్బరామయ్య!  అసలు ఉదయం మాధవరావు శవాన్ని చూసినప్పటి నుంచి అదే అనుమానంతో వున్నాడు సుబ్బరామయ్య.  ‘‘హత్య! ఆ అవసరం ఎవరికుంది? ‘‘ అంటున్న శ్రీరాములుతో ‘‘ఏమో!ఎవరికుందో పరిశోధిస్తే కదా తెలిసేది?’’ అన్నాడు సుబ్బరామయ్య.  ‘‘నేను కంప్లైంట్‌ ఇస్తా. సహజ మరణం అయితే ఎవరినీ నిందించక్కర్లేదు . అలా కాకుంటే .... కారణమైనా వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే.’’  అనుకుంటూ పొలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు హరి. కంప్లైంట్‌ పట్టుకొని ఇనస్పెక్టర్‌ రూమ్‌లోకి వెళ్ళాడు హరి.  ‘‘నమస్తే  మీకేం కావాలి’’ సౌమ్యంగా అడిగాడు ఇనస్పెక్టర్‌.  ‘‘నా పేరు హరికిషన్‌. ఎస్‌.ఎమ్‌.హెచ్‌. స్కూల్‌  ఒకప్పటి స్టూడెంట్‌ని’’...... అంటున్న హరి మాటకు ‘‘నేనూ  ఎస్‌.ఎమ్‌.హెచ్‌.స్కూల్‌  స్టూడెంట్‌ నే.. టెన్త్‌ ఏ బాచ్‌ మీరు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌  ‘‘2002 బాచ్‌’’  అన్న హరి మాటకు ‘‘మీరు మా అన్నయ్య క్లాస్‌మేట్‌. నేను మీ కంటే నాలుగు సంవత్సరాలు జూనియర్‌’’ అన్నాడు శ్యామ్‌. ‘‘మీ అన్నయ్య పేరు?’’ ‘‘మా అన్నయ్య పేరు మారిస్‌.  ‘‘ఓ  మారిస్‌ బ్రదరా మీరు. మారిస్‌ నా క్లాస్‌ మేటే కాదు, నా బెంచ్‌మేట్‌ కూడా ‘‘. ‘‘ఇంతకూ మీరు వచ్చిన పని?’’ అడిగాడు శ్యామ్‌. ‘‘మీరే నాకు హెల్ప్‌ చేయాలి. ఆ అపరాధి ని పట్టుకోవాలి. మాస్టారి ఆత్మకు శాంతి చేకుర్చాలి’’ ఆవేదనగా అన్నాడు హరి.

‘‘కూల్‌... కూల్‌... ఆవేదన వద్దు... అసలు జరిగిన విషయం చెప్పండి’’ అన్నాడు శ్యామ్‌.  ఉదయం జరిగినదంతా చెప్పాడు హరి.  ‘‘నేనూ ఆ స్కూల్‌లోనే చదివాను కనుక హెడ్‌ మాస్టారుగా నాకు ఆయన తెలుసు. చాలా డిసిప్లిన్‌ వున్నవారు... సరే మీరు ముందుగా మాధవరావుగారి ఇంటికి వెళ్ళండి నేను కాసేపటిలో వస్తాను’’ అన్నాడు శ్యామ్‌.సమయం నాలుగు గంటలు కావొస్తోంది. మాధవరావుగారి భౌతికకాయం చూడడానికి చాలామంది వచ్చి వెళుతున్నారు. మాధవరావు తమ్ముడు బెంగుళూరులో వుంటున్నారు. ఆయన వస్తే గాని శవాన్ని కదపరట.  ఈరోజు రాగలడో లేదో... ఎవరో అంటున్న మాటలు శ్యామ్‌ చెవిన పడ్డాయి. ఖాకీ డ్రెస్‌ వదిలి మఫ్టీలో వచ్చాడు. వీధి మొదట్లో వున్న బడ్డీ కొట్టు పక్కగా బుల్లెట్‌ స్టాండ్‌ వేసి కొట్టు దగ్గరకి వెళ్ళాడు. శ్యామ్‌. ‘‘మహానుభావుడు...ఎవరినీ ఏమనే వాడుకాదు.  తన పనేదో తాను చూసుకునేవాడు....’’ చెప్పుకుపోతున్నాడు బడ్డీ కొట్టు ఓనర్‌.  ‘‘మరి అలాంటి మాస్టారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందంటావ్‌?‘‘ అన్న శ్యామ్‌ మాటలకు ఠక్కున నోరు మూసేశాడు బడ్డీ్డకొట్టు ఓనర్‌.‘‘హత్యా!  అని ఎవరన్నారండి!’’   ‘‘చాలామంది అనుకుంటున్నారు. నీదాకా రాలేదా?’’ ప్రశ్నించాడు శ్యామ్‌.‘‘లేదయ్యా. ఆయనది హత్యని ఎవరనుకుంటారు. మంచివాడు అలాంటి బాబుని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది’’ అన్నాడతను. అతనితో కాసేపు మాట్లాడి, మాధవరావు ఇంటివైపు కదిలాడు శ్యామ్‌.‘‘రవీ! ఓసారి ఇలావస్తారా...’’ కొత్త వ్యక్తి తనను పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యపోయాడు మాధవరావు కొడుకు రవి.  షర్టు బటన్స్‌ పెట్టుకుని ఇవతలగా వచ్చి ‘‘ఎవరండీ మీరు?’’ అన్నాడు.  

‘‘నాపేరు శ్యామ్‌ టు టౌన్‌ ఇన్సె్పక్టర్‌ని.’’‘‘మాతో పోలీసువాళ్లకి ఏం పని?’’ అడిగాడు రవి.  ‘‘మిస్టర్‌ రవి! మీరు శ్రద్ధగా వినండి. మీ నాన్నగారిది సహజ మరణం కాదని. ఎవరో ఆయనను హత్య చేశారని మాకు కంప్లైంట్‌ వచ్చింది. మీరు సహకరిస్తే మా పని సులువవుతుంది’’ అన్నాడు శ్యామ్‌.  ‘‘హత్యా! ఎవరన్నారు? ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? అయినా  కంప్లైంట్‌ ఎవరు ఇచ్చారు?’’ గబాగబా మాటాడుతున్నాడు రవి.  ‘‘ఇలా రండి..’’ అంటూ రవిని బయటకు తీసుకెళ్లి మాట్లాడాడు శ్యామ్‌. అప్పటికే ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది.  హత్య అనేసరికి ..... చూడడానికి వచ్చిన వారంతా గబ గబా చూసి వెళ్లి పోతున్నారు. కాసేపటికే అక్కడంతా ఖాళీ అయిపోయింది. శ్యామ్‌ మాధవరావుగారి భార్యతో మాట్లాడాడు. తరువాత మాధవరావుగారి భౌతిక కాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. మాధవరావుగారి చొక్కా జబ్బకి అంటుకున్న రక్తపుమరక, నోటి దగ్గర కనిపించిన తెల్లని పొర స్పష్టంగా కనిపించాయి. మాధవరావుగారు మొదట చనిపోయిన గదిని పరిశీలించాడు ఇన్సె్పక్టర్‌ శ్యామ్‌. చిన్న గది. ఒకవైపు మంచం, మరోవైపు పాతకాలపు చెక్కబీరువా, ఆయన కూర్చునే పడక కుర్చీ. మంచం మీద తెల్లని తలగడ, దుప్పటి చెదిరిపోయి ఉన్నాయి. తలగడకు అంటిన మరక కుడా శ్యామ్‌ నిశిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. కానిస్టేబుల్‌ని రప్పించి ఆ గదికి తాళం వేయించాడు. రవి అనుమతి తీసుకుని బాడీని పోస్టుమార్టమ్‌కు పంపడానికి ఏర్పాట్లు చేశాడు.  కోడలు భానుమతి, పనిమనిషి రాములమ్మ జరుగుతున్న సంఘటనలకి నిశ్చేష్టులయి చూస్తున్నారు. మాధవరావు వియ్యంకుడు, భానుమతి తండ్రి విశ్వనాథరావు ఈ విషయం జీర్ణించుకోలేక పోతున్నాడు.  శ్యామ్‌ అందరితోనూ విడివిడిగా మాట్లాడాడు. చుట్టుపక్కల వాళ్లంతా తలుపులు బిగించుకోవడంతో వాళ్ళని తర్వాత కలవాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి బడ్డీకొట్టువాడితో మాట్లాడిన తరువాత శ్యామ్‌ బుల్లెట్‌ టూ టౌన్‌ పొలీస్‌ స్టేషన్‌ వైపు దూసుకు పోయింది.

మాధవరావు చనిపోయి ఐదు రోజులు దాటింది.  శ్యామ్‌ చొరవతో పోస్టుమార్టం రిపోర్ట్‌ కొద్ది వేగంగానే తయారయింది. మాధవరావుగారిది హత్యేనని, ఆయనకు ఎవరో ఎక్కువ మోతాదులో పెథిడ్రిన్‌ ఇంజక్ట్‌ చేసి, ఆపై ఊపిరాడకుండా చేసి చంపారని తేలింది.  కాని అంత చిన్న ఇంట్లో  అలా చేసే దైర్యం ఎవరిదీ? ఇంట్లో అందరికీ ఆయనంటే అభిమానమే.  ఎవరినీ అనుమానించే పరిస్థితి లేదు. అలాగని బయట వారెవరికీ ఈ హత్య చేసే అవకాశం కనిపించడం లేదు. శ్యామ్‌కి ఈ కేసు పరీక్షగా నిలిచింది.  స్టేషన్‌లో కూర్చుని మాధవరావు హత్య కేసుని విశ్లేషిస్తున్నాడు ఇన్సె్పక్టర్‌ శ్యామ్‌. అతని పక్కగా శివం, భద్రం అనే కానిస్టేబుల్స్‌ శ్రద్ధగా వింటున్నారు. ‘‘మాధవరావుగారు అజాత శత్రువు అనేది నిజం. కానీ, ఆయన్ని హత్య చేయడం వలన ఎవరికో లాభం ఉండి ఉంటుంది. అది తెలుసుకోవాలి. ముందుగా వారింట్లో వుండే అందరి గురించి తెలుసుకోండి. రవి, కోడలు భానుమతి , మాధవరావు భార్య సత్యవతి, వియ్యంకుడు విశ్వనాథరావు, పనిమనిషి రాములమ్మ, పాలు తీసుకువచ్చే రాములు.  ఇలా ఎవరినీ వదలద్దు నాకు సాయంత్రానికల్లా రిపోర్టు కావాలి. అలాగే మాధవరావు హత్య జరిగిన రోజు  ఎవరు ఎక్కడ వున్నారు లాంటి వివరాలు సేకరించండి. నేను కొన్ని విషయాలు తెలుసుకుని వస్తాను’’ అంటూ బయలుదేరాడు శ్యామ్‌.  సాయంత్రం కానిస్టేబుల్‌ శివం, భద్రంతో సమావేశమయ్యాడు శ్యామ్‌.  ‘‘శివం నువ్వు చెప్పు’’ అనగానే...‘‘యస్‌ సార్‌... నేను మాధవరావు వియ్యంకుడు విశ్వనాథరావు గురించి  వాకబు చేశాను.ఆయన చాలా మంచివాడు. మాధవరావుకి స్నేహితుడు. తన కన్నా పేద కుటుంబం అయినా .. మాధవరావుతో  సంబంధం కలుపుకున్నాడు. కూతురంటే చాలా గారం .. ఆమె బీ ఫార్మసీ. చదువుకుంది.  ఆమె పేరుతో పెట్టినదే భాను మెడికల్‌ షాప్‌..’’ ముగించాడు శివం. ‘‘ఇక భద్రం నువ్వు తెలుసుకున్న విషయాలు చెప్పు ‘‘...  ‘‘సార్‌.. నేను రవి గురించి, పనిమనిషి రాములమ్మ గురించి ఎంక్వయిరీ చేశాను.మాధవరావు కొడుకు రవి చాలా మంచివాడు. బీఈడీ చేసినా గవర్నమెంట్‌ స్కూల్‌లో ఉద్యోగం రాలేదని అతని దిగులు. ఇక్కడే ఒక ప్రైవేటు స్కూల్‌లో చేరాడు. అతని భార్య భానుమతి చాలా ఖర్చు మనిషి. అతని జీతం చాలడం లేదని రోజూ గొడవ పడుతుంది. భార్యతో గొడవల వల్ల కొద్దిగా మందుకి అలవాటు పడ్డాడు. అలాగని తాగుబోతు కాదు. రాత్రి వెళ్ళే ముందు బడ్డీ కొట్టు దగ్గర ఓ రౌండ్‌ వేసి వెళతాడని తెలిసింది. ఇక పని మనిషి రాములమ్మ గురించి తెలిసిన విషయాలు కొంత ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తున్నాయి. మాధవరావుగారు హెడ్‌ మాస్టర్‌గా పనిచేసినంత కాలం రాములమ్మ పిల్లాడి స్కూల్‌ ఫీజు, పుస్తకాల ఖర్చులు వంటి భాద్యత చుసుకునేవాడు. ఆయన రిటైరయ్యాక స్కూల్‌ వాళ్లు ఆమెకు ఫీజు గురించి నోటీసులు ఇచ్చారు. ఒకేసారి ఆరు వేల రూపాయలు కట్టాలని. దాంతో ఆమెకు దిక్కు తోచలేదు.మాధవరావు కూడా ఆమెకు భరోసా ఇవ్వలేదు. ఎలా కట్టిందో ఏమో! మాధవరావు చనిపోయిన ముందురోజు ఆమె ఫీజు కట్టేసింది. అలాగే పుస్తకాలు కూడా కొనేసింది. ఆ డబ్బు ఎక్కడిదో తెలుసు కోవాలి’’ అన్నాడు భద్రం. 

‘‘సర్‌! మీరు మాధవరావు కోడలు గురించి తెలుసుకోవాలని వెళ్ళారు. ఎనీ క్లూ?’’ అంటున్న భద్రం మాటలకి...‘‘లెట్స్‌ గో... మాధవరావుగారింటికి పదండి.. దొంగ దొరికినట్టే’’ అంటూ బయటకు నడిచాడు ఇన్సె్పక్టర్‌ శ్యామ్‌.‘‘మిసెస్‌ భానుమతి..! మాధవరావు గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాను. మీకు సహకరించిన రాములమ్మని కూడా’’ అన్న ఇన్సె్పక్టర్‌ శ్యామ్‌ మాటలకు రవి, సత్యవతితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ‘‘మిస్టర్‌ ఇన్సె్పక్టర్‌ మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? నా కూతురుని అపరాధి అనడానికి ఎంత ధైర్యం?. మామగారిని కంటికి రెప్పలా చూసుకునే భానుమతి మీద అభాండం వేస్తారా?’’  గట్టిగా కేకలు పెడుతూ వణుకుతున్నాడు విశ్వనాథరావు.‘‘ఒకరిని అపరాధి అనే ముందు మేం చాలా ఎంక్వయిరీ చేస్తాం.  ఆ తరువాత వారిని దోషిగా బయట పెడతాం.మీ కుమార్తె భానుమతి చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి. అతిగారాబంతో ఆమెకు అడిగి నంత డబ్బు ఇస్తూ వచ్చారు.  దానితో ఆమె భారీ షాపింగులోకి, చిరు వ్యసనాలకి బానిసగా మారింది. పెళ్లయిన తర్వాత ఆమె జోరుకి బ్రేక్‌ పడింది. దాంతో ఆమెలో అసహనం పెరిగింది. అప్పుడప్పుడు మీరులేని సమయంలో మీ మెడికల్‌ షాపుకి వెళ్లి క్యాష్‌ బాక్స్‌లో డబ్బు దొంగచాటున తెచ్చుకుని ఖర్చు పెట్టేది.  తన భర్త చిన్న ఉద్యోగి. అతని జీతంలో కొంత ఇచ్చినా ఆమెకు సరిపోయేది కాదు. దాంతో అతనితో గొడవ పడేది.  ఆమెకు తెలిసింది మాధవరావు గారి డిపాజిట్లకు నామినీగా రవిని పెట్టారని... పూర్‌ ఫెలో! ఆయన్ని అడ్డు తొలగిస్తే ఆ డబ్బు రవి చేతికి వస్తుంది. రవిని గుప్పెట్లో పెట్టుకుని హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చని తలచింది’’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌... కాస్త ఆగి...‘‘విశ్వనా«థరావుగారూ! మీరు అక్టోబర్‌ 25న విజయవాడ వెళ్ళారు కదూ’’ ప్రశ్నించాడు.

‘‘అవును! ఆరోజు విజయవాడ వెళ్లాను’’ అన్నాడు విశ్వనాధరావు.‘‘ఆ రోజు మధ్యాహ్నం షాపు ఖాళీగా వుంది. షాపులో పనిచేసే అమ్మాయి భోజనం చేస్తోంది.  ఆ సమయంలో భానుమతి తెలివిగా ఓ సిరంజ్, పెథిడ్రిన్‌ ఇంజక్షన్‌ దొంగిలించి ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకుంది. ఇకపోతే మీ పని మనిషి రాములమ్మ.. మాధవరావుగారు హెడ్‌ మాస్టారుగా వున్నపుడు రాములమ్మ కొడుక్కి ఫీజు కట్టి చదివించారు.అప్పుడు బాగానే వుంది. ఆయన రిటైర్‌ అయ్యాక పిల్లాడి ఫీజు చెల్లించాలని స్కూలు వాళ్ళు పంపిన నోటీసులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాదాపు ఐదువేల రూపాయలు ఎక్కడి నుండి తేవాలి. ఆమె అవసరాన్ని  గుర్తించి తెలివిగా ఆమెను వాడుకుంది భానుమతి.  భానుమతి అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బును ఆమె వీధి చివర లెక్క బెట్టుకొని దాచుకోవడం బడ్డీ కొట్టు ఓనర్‌ చూసాడు.మాధవరావు నోరుమూసి ఇంజక్షన్‌ గట్టిగా చెయ్యడంతో చిమ్మిన రక్తపుమరక ఆయన గ్లాస్కో షర్ట్‌ కు అంటుకుంది.  ఆయన నోటి నుంచి వచ్చిన నురగ తలగడ గలేబుకి అంటుకుంది. మా పరిశీలనలో పనస చెట్టు పక్కన తుప్పలలో దొరికిన ఈ ఇంజెక్షన్‌ బాటిల్, వాడి పారేసి సిరంజ్‌ మీ షాపు నుంచి బయటకు వచ్చినవే. మరో విషయం మీ షాపులో కంప్యూటర్‌ బిల్లింగ్‌ జరుపుతున్నారు.కనుక మా పరిశోధనలో అరడజను వుండవలసిన పెథిడ్రిన్‌ ఇంజక్షన్లలో ఐదే వున్నట్లు, ఒక ఇంజక్షన్‌ బాటిల్‌ బిల్లు చెయ్యకుండానే బయటకు వెళ్ళినట్లు తెలిసింది. అన్నీ ఎంక్వయిరీ చేసిన తరువాతే భానుమతి అపరాధి అని తెలిసింది’’ అని చెబతూ ‘‘ శివం, సత్యం ఆమెను అరెస్టు చెయ్యండి’’ ఆదేశించాడు ఇన్‌స్పెక్టర్‌. ఆప్పుడే అక్కడికి వచ్చిన హరికి జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయి. రవి, సత్యవతి ఏమీ తోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయారు.
కూచిమంచి నాగేంద్ర  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement