‘బేబి వెయిట్’ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను సన్నగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డ మంచిలావుతో బొద్దుగా ఉండాలనుకుంటున్నాను. ఇది సాధ్యమేనా? బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నందిత, ఆళ్లగడ్డ
బిడ్డ బరువు అనేది తల్లి తీసుకునే ఆహారం, తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా సరిగా ఉండటం, బిడ్డకు రక్తం వెళ్లే రక్తనాళాలు సరిగా వ్యాకోచించి ఉండటం, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తల్లిలో బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనత, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉండటం వంటి అనేక అంశాల మీదా ఆధారపడి ఉంటుంది. ఆహారంలో రోజూ ఎక్కువగా పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆహారాన్ని రోజూ కొద్దికొద్దిగా రెండు గంటలకోసారి తీసుకుంటూ ఉండాలి. కొంతమందిలో వారి శరీరతత్వాన్నిబట్టి ఆహారం ఎంత తీసుకున్నప్పటికీ తల్లి బరువే పెరుగుతుంది కానీ ఆహారం బిడ్డకు చేరదు. దాంతో బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు.
మా కజిన్ abnormal uterine bleeding(aub) సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య గురించి వినడం ఇదే మొదటిసారి. ఇది ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలు ఏమిటి?
– పి.చందన, పిడుగురాళ్ల
పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నెలకోసారి మూడు నుంచి అయిదు రోజుల వరకు అవ్వడం సాధారణం. కానీ కొంతమందిలో క్రమం తప్పి, బ్లీడింగ్ త్వరత్వరగా అంటే నెలకు రెండుసార్లు లేదా ఇరవై రోజులకోసారి బ్లీడింగ్ ఎక్కువగా ఎక్కువ రోజులు అవ్వడం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే అబ్‌నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అంటారు. తెలియకుండా అబార్షన్ అయ్యి ముక్కలు ఉండిపోవడం, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్, పాలిప్ వంటి కంతులు, ఎండోమెట్రియోసిస్, నీటి బుడగలు, అండాశయం, గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌లు, గర్భాశయ క్యాన్సర్ (45 ఏళ్లు దాటిన తర్వాత), రక్తం గూడుకట్టే ప్రక్రియలో సమస్యలు, మానసిక ఒత్తిడి, అధిక బరువు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అబ్‌నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అవ్వొచ్చు. వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి జనరల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, రక్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి ఇతర అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్నిబట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా ఉండేందుకు మన చేతిలో ఏమీ ఉండదు. కాకపోతే సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల, సమస్య జటిలం కాకుండా ఉంటుంది. అలాగే నివారణలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఒకవేళ అధిక బరువు ఉంటే తగ్గడం, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మా ఆయన బాగా తాగుతాడు. తాగుడు ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని, అవయవలోపాలతో పుట్టే అవకాశాలు ఉండొచ్చునని ఒక్కరిద్దరు అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియజేయగలరు. ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా?
– కేఆర్, హైదరాబాద్
మగవారు బాగా మందు తాగడం వల్ల వీర్యకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉండొచ్చు. అలాగే వీర్యకణాల నాణ్యత తగ్గిపోవచ్చు. నాణ్యత తగ్గిపోవడం వల్ల కొందరిలో, అవి అండంలో కలిసి పిండం ఏర్పడినప్పుడు పిండం సరిగా తయారు కాకపోవడం, పిండం సరిగా పెరగకుండా ఉండటం, జన్యుపరమైన లోపాలు ఏర్పడి మొదటి మూడు నాలుగు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో పిండం పెరిగేకొద్దీ జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే గర్భం కోసం ప్రయత్నం చేయక ముందు నుంచే, మందు తాగడం మానెయ్యడం మంచిది. మరీ పూర్తిగా మానెయ్యలేకపోతే వీలైనంత వరకు ఎంత తక్కువ తాగితే అంత మంచిది. గర్భం వచ్చిన తర్వాత సమస్యలు రాకుండా చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు ఉండవు. వీర్యకణాల్లో నాణ్యత లేకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటే ఎలాగైనా అవి వచ్చే తీరుతాయి. బిడ్డలో కొన్ని రకాల సమస్యలు ముందే తెలుసుకోవడానికి స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. కానీ వీటిలో నూటికి నూరుశాతం సమస్యలు తెలియవు. కొన్ని సమస్యలు బిడ్డపుట్టిన తర్వాత పెరిగేకొద్దీ బయటపడతాయి. కాబట్టి గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మందు తాగటం మానెయ్యడం ఒక్కటే మార్గం.
Comments
Please login to add a commentAdd a comment