
ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది.
‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ అంది దుర్గ.పెద్దగా నవ్వబోయి, ఆగిపోయాడు అమన్. అక్కడ దుర్గ లేదు! కిచెన్‌లో చూశాడు. లేదు! హాల్లో చూశాడు. లేదు! డైనింగ్ రూమ్‌లో చూశాడు. లేదు! పెరట్లోకి వెళ్లి చూశాడు. లేదు! బాత్రూమ్ వైపు చూశాడు. లేదు! ముగ్గేస్తోందేమోనని చూశాడు. లేదు! మేడపైకి వెళ్లి చూశాడు. లేదు!‘‘ఈ దెయ్యాల కొంపలో నేనుండలేను’’ మళ్లీ అంది దుర్గ.‘‘ఎక్కడున్నావ్?!’’ అన్నాడు అమన్, ఆమె చేతిలోంచి కాఫీ కప్పు అందుకుంటూ. వింతగా ఉంది అతడికి. ‘‘బందిత పిలిస్తే వాకిట్లోకి వెళ్లాను..’’ ‘‘వాకిట్లో లేవు మరి!’’‘‘వాకిట్లోంచి వాళ్లింట్లోకి తీసుకెళ్లింది.’’‘‘ఏమంటోంది.. బందిత, తనక్కూడా మనింట్లో దెయ్యం కనిపించిందటనా?’’ నవ్వుతూ అన్నాడు.‘‘బందిత మనింట్లో కాదు కదా ఉండేది! నేనే చెప్పాను మన దెయ్యాల కొంప గురించి.’’‘‘ఏం చెప్పావ్? దెయ్యాలు ఉన్నాయనా?’’‘‘కాదు, మంచి ఇల్లేదైనా ఉంటే చూసి చెప్పమని.’’అమన్ నవ్వాడు. ‘‘ఏమంది బందిత?’’‘‘వెళ్లిపోతారా? అని ఆశ్చర్యంగా అడిగింది.’’‘‘నువ్వేమన్నావ్?’’‘‘పదేళ్లుగా ఉంటున్నాం. ఇక చాలు’’ అన్నాను.పెద్దగా నవ్వాడు అమన్. దుర్గ.. దెయ్యం అన్నప్పుడల్లా.. అమన్ అలాగే నవ్వుతాడు.. పెద్దగా, హార్ట్‌లీగా.‘‘ధైర్యవంతురాలివే. పేరు మాత్రం దుర్గ’’ అన్నాడు.
‘‘అమన్. నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను. ఇల్లు మారిపోదాం ప్లీజ్’ అంది దుర్గ. ఆమె కళ్లలో తడి!‘‘ఏమైంది.. దుర్గా’’ అన్నాడు. ‘‘ఇల్లు మారిపోదాం అని కదా అన్నాను. కాదు అమన్. పారిపోదాం అనిపిస్తోంది’’ అంది.భార్యవైపు వింతగా చూశాడు అమన్. ‘‘నువ్వు ఆఫీస్‌కి వెళ్లిపోతావు అమన్. పిల్లలు స్కూలుకు వెళ్లిపోతారు. ఇంట్లో నేనొక్కదాన్నీ ఉంటాను. నేనొక్కదాన్నే కాదు. నాతో కొన్ని దె..య్యా..లు కూడా! భయం వేస్తోంది అమన్.. చచ్చిపోతానేమోనని’’ అంది దుర్గ. ‘‘సరే, సీరియస్‌గా వెతుకుతాను. ఒకటి చెప్పు. మనింట్లో నిజంగానే అలాంటివేమైనా కనిపించాయా?’’ అడిగాడు అమన్. ‘‘ఎస్’’ అంది దుర్గ, కళ్లు తుడుచుకుంటూ. భార్య అలా కళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా ఒకసారి కలియచూడడం గమనించాడు అమన్. ‘‘సీరియస్‌గా వెతుకుతాను దుర్గా’’ అన్నాడు.అన్నట్లుగానే వెతికాడు. అయితే ఇంటిని కాదు. సైకియాట్రిస్ట్‌ని!
పదేళ్లుగా కంఫర్ట్‌గా ఉంటున్న ఇంటిని దెయ్యాల భయంతో ఖాళీ చేసి వెళ్లడం ఏమంత తెలివైన పనిలా అనిపించలేదు అమన్‌కి. దోమలనీ, నీళ్లు సరిగా రావనీ, వర్షాలొస్తే వరండా మునిగిపోతుందనీ, మార్కెట్‌కు దూరమనీ, హాస్పిటళ్లు దగ్గర్లో లేవనీ.. ఇలాంటి ఈతి బాధలు కూడా ఏం లేవు. అద్దెకూడా తక్కువే. అంత మంచి లొకాలిటీనీ, అంత మంచి ఇంటిని వదిలేసి వెళ్లిపోవడం పిచ్చితనం కాకపోతే ఏంటి.. అనుకున్నాడు అమన్. అందుకే సైకియాట్రిస్ట్‌ని కలిశాడు. భూతవైద్యుణ్ణి కలిసి, అతడికి ముందే నాలుగు ముక్కలు చెప్పి ఉంచి, ఇంటినంతా నాలుగు మూలలూ తిప్పించి ‘అసలిది దేవతలు ఉండే ఇల్లు’ అని ఆ భూతవైద్యుడి చేత దుర్గకు చెప్పించవచ్చు. కానీ ఇంట్లోకి భూత వైద్యుడిని రానివ్వడం అమన్‌కి ఇష్టం లేదు. అదీగాక, దుర్గ.. ‘ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదాం’ అంటోంది తప్ప, ‘ఇంట్లోంచి దెయ్యాలను ఖాళీ చేయిద్దాం’ అనడం లేదు. అందుకే భూత వైద్యుణ్ణి కాక, మానసిక వైద్యుణ్ణి వెతికి పట్టుకున్నాడు అమన్. సైకియాట్రిస్ట్ దగ్గరికి అనగానే ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది దుర్గ. ఆ అరుపుకు అదిరిపడ్డాడు అమన్. ‘‘నేను చచ్చాకైనా ఇల్లు మారుస్తావా అమన్?’’ అంది.ఖిన్నుడయ్యాడు అమన్ ఆ మాటకు! చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. దుర్గ కూడా మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి, ఆ తెల్లారి వాళ్లిద్దరి మధ్యా మాటల్లేకపోవడం పిల్లలు గమనించారు.పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక, భర్త ఆఫీస్‌కి బయల్దేరుతుంటే అడిగింది దుర్గ..‘‘డాక్టర్ అపాయింట్‌మెంట్ ఎన్నింటికి?’’
దుర్గతో చాలాసేపు మాట్లాడాక, ఆమెను బయట వెయిట్ చెయ్యమని చెప్పి, అమన్‌ని లోపలికి పిలిచాడు డాక్టర్ తీర్థ. ఆయన ఎదురుగా కూర్చొన్నాడు అమన్. ‘‘మీ వైఫ్ చెప్పింది నిజమే. మీ ఇంట్లో దెయ్యాలున్నాయి’’ అన్నాడు డాక్టర్ తీర్థ.అమన్ వింతగా చూశాడు. ‘‘ఇంకా మీరు ఆ ఇంట్లో ఉంటే మీ వైఫ్ మీకు దక్కరు’’ అన్నాడు తీర్థ. ‘‘దెయ్యాలు ఆమెను పీక్కుతింటాయనేనా డాక్టర్.. మీరు చెప్పబోతున్నారు?’’‘‘ఎగ్జాట్లీ అమన్. ఆమెకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ‘ఎందుకు ఇష్టం లేదు’ అని నేను ఆమెను అడగలేదు. అలా అడిగితే శాంతిపూజలు చేస్తే సరిపోతుందని చెప్పే భూతవైద్యుడికీ నాకు తేడా ఉండదు. మీరు వెంటనే ఇల్లు మారండి. చింత ఉన్న చోట శాంతి మంత్రం పని చేయదు. పదేళ్ల నుంచీ మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు. రెండేళ్ల నుంచీ తను ఇల్లుమారుదాం అంటున్నారు. మీరు నవ్వి ఊరుకుంటున్నారు. నాట్ కరెక్ట్ అమన్’’ అన్నాడు డాక్టర్ తీర్థ. అమన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘ఒకే డాక్టర్’’ అని పైకి లేచాడు. మళ్లీ ఒక్క క్షణం ఆగి, ‘‘నిజంగానే మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటారా డాక్టర్? మీరు చెప్పండి’’ అన్నాడు. డాక్టర్ తీర్థ అమన్ వైపు చూశాడు. ‘‘లేవు అమన్’’ అన్నాడు. అమన్ అర్థంకానట్లు చూశాడు. ‘‘అవును అమన్. మీ ఇంట్లో దెయ్యాలు లేవు. కానీ మీ వైఫ్‌కి కనిపిస్తున్నాయి. కిచెన్ ఒక దెయ్యంలా, హాల్ ఒక దెయ్యంలా, డైనింగ్ రూమ్ ఒక దెయ్యంలా, పెరడు ఒక దెయ్యంలా, మేడ ఒక దెయ్యంలా, బాత్రూమ్ ఒక దెయ్యంలా.. అసలు మీ ఇల్లే ఓ పెద్ద దెయ్యంలా కనిపిస్తోంది. తనిప్పుడు బంధనవిముక్తి కోసం కొట్టుకుంటున్న ఆత్మలా ఇంట్లో ఉంటోంది. ఏళ్ల తరబడి ఉన్నచోటే ఉండిపోయి, చేసిన పనే చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్లెవరికైనా దెయ్యం పట్టినట్లే ఉంటుంది అమన్. మగాళ్లం.. మనకది తెలియదు. రోజూ ఆఫీస్ నుంచి అతిథుల్లా ఇంటికి వచ్చిపోతుంటాం కదా’’.. ముగించాడు డాక్టర్ తీర్థ. అమన్ బయటికి వచ్చాడు. దుర్గ భుజాల చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు..‘‘మంచి భూతవైద్యుడే దొరికాడు. నాకు పట్టిన దెయ్యాన్ని వదిలించాడు.’’
Comments
Please login to add a commentAdd a comment