
అదిగో అతడే పీపారాయుడు!ఈ పీపారాయుడి అసలు పేరేమిటో గానీ... పీపాలకు పీపాలు సారా తాగుతాడని అందరూ ప్రేమగా ‘పీపారాయుడు’ అని పిలుచుకుంటారు. పీపారాయుడు గుర్రపు బండి దిగనే దిగాడు. కండువాను ఆ భుజం మీది నుంచి ఈ భుజానికి మార్చాడు. పీపారాయుడి ముందు ఒక బక్క పల్చటి వ్యక్తి భయంగా నిల్చొని ఉన్నాడు.‘‘ఏమిటి వీడు చేసిన తప్పు?’’ కరీం బీడి కట్ట నుంచి ఒక బీడి వెలిగించి ఉక్కుస్వరంతో అడిగాడు రాయుడు.‘‘పక్కింట్లో నుంచి పప్పు దొంగిలించాడండీ’’ అన్నాడు రాయుడి పర్సనల్ అసిస్టెంట్.‘‘పప్పుచారు తినక చాలా రోజులవుతుందయ్యా... ఇంట్లో ఉప్పు తప్పా... పప్పు లేదయ్యా... అందుకే పక్కింట్లో నుంచి పప్పు దొంగిలించానయ్యా.. ఈ తప్పు నెక్స్›్ట టైమ్ జరగనీయనయ్యా’’ చేతులు కట్టుకొని వినయంగా చెప్పాడు పప్పుదొంగ. పీపారాయుడు మరో బీడి వెలిగించాడు. రాయుడు గొంతు సవరిస్తుండగా, ప్రమాదాన్ని పసిగట్టిన పప్పుదొంగ కన్నీళ్లతో అతని కాళ్ల మీద పడి, దీనంగా... ‘‘అయ్యా! అండమాన్ జైల్లో ఆరు సంవత్సరాలు శిచ్చ వేసినా బరిస్తాను. దయచేసి డైలాగులు మాత్రం కొట్టొద్దయ్య.. నా గుండె తట్టుకోలేదయ్యా...’’ అన్నాడు.
ఇదేమీ పట్టించుకోని పీపారాయుడు డైలాగ్ అందుకున్నాడు...‘ఆపు! నువ్వు చేతులు కట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రానా ప్రయోజనం ఉండదు. ఈ పీపారాయుడి తీర్పులో మార్పు ఉండదు.ఎవడి పప్పూ వాడిదే. ఎవడి తప్పూ వాడిదే.ఎవడి ఒప్పూ వాడిదే. ఎవడి ఉప్పూ వాడిదే.ఎవడి చెప్పూ వాడిదే. ఎవడి డప్పూ వాడిదే.ఎవడి కప్పూ వాడిదే. ఎవడి జిప్పూ వాడిదే’పీపారాయుడి డైలాగుల ధాటికి పప్పు దొంగ మూర్ఛిల్లిపోయాడు.ఆ తరువాత... ఏకంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు!‘నెక్స్›్టకేస్’ అరిచాడు రాయుడు.‘‘అయ్యా! వారం కింద చనిపోయిన మీ మామ రంగారాయుడుగారు దెయ్యమై తిరుగుతున్నాడండీ. కావాలంటే వినండి’’ అని హెయిర్ సెలూన్ పుల్లయ్యను పీపారాయుడి ముందు ప్రవేశ పెట్టాడు రాయుడి పీఏ.‘‘ఏం జరిగింది?’’ పుల్లయ్య కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు రాయుడు.
‘‘అయ్యా! ఆ రోజు నేను మా హెయిర్ సెలూన్‌లో బిజీగా ఉన్నాను. ఈలోపు వెనక నుంచి...‘నాకు హెయిర్ కటింగ్ చేయాలి’ అని ఒక గొంతు వినిపించింది.నేను వెనక్కి తిరిగి చూడకుండానే...‘ఇప్పుడు తీరిక లేదు.. గంట తరువాత వచ్చేయ్’ అన్నాను.‘ఓకే... నా తలను ఇక్కడే విడిచి వెళతాను. రెండు గంటల తరువాత వచ్చి తీసుకెళతాను. కటింగ్ చక్కగా చెయ్... బైబై’ అని వెనక నుంచి గొంతు వినిపించింది.
‘వీడెవడ్రా బాబూ!’ అని వెనక్కి తిరిగి చూశాను.అంతే!భయంతో గట్టిగా అరిచాను.వెనక ఒక కుర్చీలో మన రంగారాయుడిగారి తల ఉంది!‘ఓరి నాయనో’ అంటూ నాతో పాటు కస్టమర్లు అందరూ తలో దిక్కు పారిపోయాం.ఒక గంట తరువాత ధైర్యం చేసి సెలూన్‌లోకి వచ్చి చూశాను. కుర్చీలో తలకు బదులు పుర్రె కనిపించింది...’’ అని చెప్పాడు పుల్లయ్య.‘‘ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?’’ బీడి ముట్టిస్తూ అడిగాడు పీపారాయుడు.
‘‘వారం రోజుల క్రితం జరిగిందయ్యా’’ చెప్పాడు పులయ్య.‘‘మరి ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు?’’ బీడి పొగ ఊదుతూ అడిగాడు రాయుడు.‘‘ఎలా చెబుతానయ్యా... రంగారాయుడుగారు మీకు బంధువు... సాక్షాత్తు మామగారు.. ఏదో ఇప్పుడు ధైర్యం చేసి చెప్పాను’’ అన్నాడు పుల్లయ్య.వెంటనే పీపారాయుడు మరో బీడి ముట్టించి ఇలా డైలాగ్ అందుకున్నాడు...‘‘బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావల్సింది... నీతి న్యాయం ధర్మం.పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం... నాకు ముఖ్యం జరిగిన అన్యాయం... జరగాల్సిన న్యాయం!రేయ్... తియ్యరా పుర్రెఏది రా? బర్రె!’’‘‘పుర్రె సరే... మధ్యలో ఈ బర్రె ఎక్కడి నుంచి వచ్చింది?’’ జనంలో ఒకడు ఇంకోడి చెవులో ఊదాడు.‘‘ప్రాస కోసం అలా వాడుతుంటాడు’’ అన్నాడు ఇంకొకడు.ఈలోపు ‘పీ....పా....రాయుడు’ అని ఆకాశం అదిరేలా అరుపు వినిపించింది. అందరూ అటుకేసి చూశారు...‘వామ్మో దెయ్యం’ అని జనాలు పరుగందుకున్నారు.‘అయ్యా! అటు చూడండి మన రంగారాయుడుగారు దెయ్యమై వస్తున్నారు. మాకు మీరే దిక్కు’’ అని పీపారాయుడి కాళ్ల మీద పడ్డాడు పీఏ. ‘‘నువ్వేమీ భయపడకు... కాస్త కాళ్ల మీది నుంచి లేస్తావా’’ అన్నాడు రాయుడు. ‘‘అలాగే’’ అని లేచాడు పీఏ. ఇదే అదునుగా గోచి బిగించి ‘ఓరినాయనో దెయ్యం ఇటే వస్తుంది’ అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ది గ్రేట్ పీపారాయుడు!
కొసమెరుపు:
ఊరి జనాలు చూసింది దెయ్యాన్ని కాదు. మనిషినే! అలా అయితే చనిపోయిన రంగారాయుడు ఎలా బతికి వస్తున్నాడు అనే కదా మీ డౌటు. అతని పేరు రంగారాయుడు కాదు. దొంగారాయుడు. రంగారాయుడు, దొంగారాయుడు ట్విన్స్. చిన్నప్పుడు ఒక దొంగతనం చేసి ఊళ్లో జనాలకు భయపడి పారిపోయాడు. ఆ తరువాత ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. అతనంటూ ఒకడున్నాడని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి దొంగారాయుడికి ఊరు మీద మనసు మళ్లి ఇలా వచ్చాడు. అంతే!
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment