ఆనందరావుకి జోక్స్ సేకరించడం, వాటిని పదిమందికి చెప్పి నవ్వించడం అంటే భలేసరదా. ఈ సరదా అతనికి కాస్తో కూస్తో పేరు తీసుకొచ్చింది. ఎక్కడైనా ఏదైనా పోగ్రాం జరిగితే ఆనందరావుని ఆహ్వానించి ‘జోక్సాభిషేకం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. తన శక్తిమేరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసేవాడు ఆనందరావు. అలాంటి ఆనందరావుకు ఒక ఉదయం పూట ఫోన్ వచ్చింది... ‘‘హలో! ఆనందరావుగారేనా?’’ ‘‘ఆ...నేనే...మీరెవరండీ?’’‘‘నా పేరు భూకంపం భూపాల్. మీ టీవి నుంచి మాట్లాడుతున్నాను...’’‘‘చెప్పండి సార్...’’‘‘మేము ‘ఖబడ్దార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ అనే కార్యక్రమం ప్లాన్ చేశాము. మీ గురించి విన్నాం. మా నవ్వుల కార్యక్రమానికి మిమ్మల్ని జడ్జీగా అనుకుంటున్నాం...’’‘‘అయ్యో! అంతకంటే భాగ్యం ఏముందండీ.... తప్పకుండా...’’
‘ఖబడ్డార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ మొదటి రెండు ఎపిసోడ్‌ల తరువాత ప్రోగ్రాం హెడ్ భూకంపం భూపాల్ ఆనందరావు దగ్గరకు వచ్చి...‘‘అయ్యా! మీరు ప్రోగ్రాంలో ముఖం సీరియస్‌గా పెట్టి అదోలా కూర్చుంటున్నారు.... కాస్త నవ్వాలి’’ అన్నాడు సుతిమెత్తగా.‘‘ఏం నవ్వుతామండీ బాబూ... ఒక్క జోక్‌కైనా నవ్వొచ్చి ఛస్తేకదా’’ నిట్టూర్చి నిజం చెప్పాడు ఆనందరావు.‘‘అది వేరే విషయం... మనమే నవ్వకపోతే ప్రేక్షకులు ఎలా నవ్వుతారండీ. కాబట్టి నవ్వాలి. నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వాలి. అప్పుడప్పుడు కాస్త గట్టిగా నవ్వాలి. ఫ్లోర్ అదిరిపోయేలా నవ్వాలి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలి. పొట్టపట్టుకొని నవ్వాలి...’’ ఇలా కొన్ని సలహాలు చెప్పాడు భూకంపం.‘‘రాక రాక వచ్చిన ఛాన్సు... నేను కాదు, కూడదు అంటే ఇంకెవరినైనా పెట్టుకుంటారు. ఎందుకొచ్చింది... నవ్వు రాకపోయినా నవ్వితే పోలా...’’ అనుకున్నాడు ఆనందరావు. పది ఎపిసోడ్‌ల తరువాత....
‘‘హలో ఆనందు...’’‘‘హాహాహా.... ఏరా సుబ్బరాజు.... ఎలా ఉన్నావు... హాహాహా...’’‘‘ఒక బ్యాడ్‌న్యూస్.... మా తాతయ్య చనిపోయాడు’’‘‘హాహాహా.... తాతయ్య చనిపోయాడా.... ఎంత మంచివాడు.... హాహాహా..... దుక్కలా ఉండేవాడు కదరా.... హాహాహా..... ఇంకో అయిదు సంవత్సరాలైనా లాగించేస్తాడనుకున్నాను.... హాహాహా...’’‘‘తాతయ్య చనిపోయాడని చెబితే నవ్వుతావేమిటిరా ఫూల్.... తమాషాగా ఉందా?’’‘‘సారీ... హాహాహా.... ఈ పాడు నవ్వొకటి ఈమధ్య అలవాటైంది. నా ప్రమేయం లేకుండానే నవ్వేస్తున్నాను.... హాహాహా...’’హాస్పిటల్‌లో ఒకరోజు...డాక్టర్: చెప్పండి ఆనందరావుగారు ఏమిటి ప్రాబ్లమ్...ఆనందరావు: హాహాహా....ఒక్కటా రెండా..... హాహాహా...డాక్టర్: తర్వాత నవ్వుదురుగానీ ముందు సమస్యలు ఏమిటో చెప్పండి?ఆనందరావు: ఈ కీళ్లున్నాయి చూశారు... ఒకటే నొప్పులు.... హాహాహా.... ఈ నడుం ఉంది చూశారు... కొద్దిగా వంగితే చాలు.... ఒకటే నొప్పి... హాహాహా... ఈ కండ్లున్నయి చూశారు... సరిగ్గా కనబడి చావడం లేదు... హాహాహా....డాక్టర్: వాటన్నిటి కంటే పెద్ద సమస్య మీలో ఉంది...ఆనందరావు: ఏమిటది?డాక్టర్: నవ్వడం, అకారణంగా నవ్వడం, రంపపుకోతలా నవ్వడం, ఆగుతున్న గూడ్సుబండి చప్పుడులా నవ్వడం... అరటిపండు తొక్క మీద కాలువేసి పడినప్పుడు వినిపించే సౌండ్‌లా నవ్వడం, తుపానులో విరిగిపడుతున్న చెట్టు సౌండ్‌లా నవ్వడం... ఆపండి మహాప్రభో ఆపండీ....ఆనందరావు: దాన్దేముందండీ ఆపేస్తాను. హ్హాహ్హాహ్హా...
నగరంలో పేరు మోసిన రాజకీయ నాయకుడు ఆయన. పేరు దున్న అప్పన్న.ఈ అప్పన్న ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన చావు ఊరేగింపు పెళ్లిలా ఘనంగా జరిగింది.దున్న అప్పన్న కుమారుడు దున్న గట్టన్న దగ్గరకు ఒక కార్యకర్త వచ్చి....‘‘నాయిన కోసం సంతాపసభ ఏర్పాటు చేసినమన్నా.... హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి పెద్దోళ్లను పిలుస్తున్నాం. వాళ్లు నాయిన గురించిమాట్లాడుతారు... అదిరిపోవాలి... వీరితో పాటు కామెడీకింగ్ ఆనందరావుని కూడా పిలుస్తున్నాము...’’ ఉత్సాహంగా చెప్పాడు ఒక కార్యకర్త.సరే అన్నాడు సంతోషంగా దున్న గట్టన్న.ఆరోజు...దున్నపోతుల్లాంటి రౌడీలు ఇద్దరు ఆనందరావు ఇంటికి వచ్చారు.‘‘ఆనందరావు.... ఓ ఆనందరావు...’’‘‘ఏమిటయ్య.... అలా అరుస్తున్నారు.... ఏమిటి?’’‘‘నీతో అర్జెంటుగా పనుందయ్యా...’’
‘‘నాతో మీకేం పనయ్యా!’’‘‘ఏంలేదు... కొద్దిసేపు మాట్లాడి పోవాలి... అన్న దున్నగారి సంతాపసభ జరుగుతుంది. మీరు వచ్చి మాట్లాడాలి’’‘‘ఎప్పుడు?’’‘‘ఇప్పుడే’’‘‘కనీసం రెండురోజుల ముందు చెప్పొచ్చుగదయ్యా....’’‘‘మీకు మాట్లాడం పెద్ద విషయమా? మీ టాలెంట్ గురించి మాకు తెలియదనుకుంటున్నారా! పదండి... బండి ఎక్కండి’’ అంటూ ఆనందరావుని టాటాసుమో ఎక్కించారు తెల్లలుంగీరౌడీలు. నిజానికి దున్న అప్పన్న రౌడీయిజం గురించి తప్ప అతని పుట్టుపూర్వోత్తరాలు ఆనందరావుకి బొత్తిగా తెలియవు. ‘‘ఆయన గురించి నాకేమీ తెలియుదు. నేను రాలేను.మాట్లాడలేను’’అంటే ఎక్కడ పొట్టలో పొడుస్తారోనని భయంభయంగా బండి ఎక్కాడు ఆనందరావు. ఎక్కాడు సరే... సంతాపసభలో ఏంమాట్లాడాడు? వినండి...‘‘అన్న దున్న అప్పన్న చనిపోయాడు... హాహాహా...ఎప్పుడు చనిపోయాడు?ఎందుకు చనిపోయాడు?ఎలా చనిపోయాడు?... ఇవి కాదు మనకు కావాల్సింది... హాహాహా....మరి మనకు కావల్సింది ఏమిటి?ఆయన చనిపోవడమా... హాహాహా... కాదు.మళ్లీ బతకడమా... హాహాహా... కానే కాదు...లేక మనం చావడమా... హాహాహా... హ్హోహ్హోహ్హో....’’మామూలుగానైతే ఉపన్యాలసాలకు చప్పట్లు పడతాయి... మన ఆనందరావు ఉపన్యాసానికి మాత్రం నాన్‌స్టాప్‌గా చెప్పులు పడ్డాయి... తన బాధ ఎవరికి ‘చెప్పు’కోగలడు? మీరైనా ‘చెప్పండి’.
– యాకుబ్ పాషా
నవ్వుతా తీయగా పుల్లగా!
Published Sun, Jan 20 2019 12:14 AM | Last Updated on Sun, Jan 20 2019 12:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment