laughing
-
గంపెడు పిల్లలున్నా.. ఇంకో పిల్లను చంకనెత్తుకోవాలని..
గత పదేళ్లుగా ప్రతీయేటా ఒక్కో బిడ్డకు జన్మనిస్తోంది ఆ తల్లి. అయినా ఆమెకు పిల్లలను కనాలనే ఆశ అలానే నిలిచి ఉంది. అందుకే ఇప్పుడు మరో బిడ్డను కనేందుకు సిద్ధమయ్యింది. గంపెడు పిల్లలతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అమె కనిపించినవారందరికీ చెబుతోంది. వీరి ఫ్యామిలీకి ‘లాఫింగ్ ఫ్యామిలీ’ అనే ట్యాగ్ తగిలించారు. ఈ కుటుంబానికి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని లైక్‌లు వస్తుంటాయి. 2009 నుంచి పిల్లలను కనడమే పెద్ద పనిగా పెట్టుకున్న ఈమె ఇప్పుడు మరో బిడ్డను కనడానికి సిద్ధమవుతోంది. 40 ఏళ్ల క్యారిసా కాలిన్స్‌కు ముగ్గురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు. ఈ అమెరికన్ తల్లికి టిక్‌టాక్‌లో 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె తరచూ తన జీవితానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. క్యారిసా పిల్లల పేర్ల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది. క్యారిసా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కొందరు అంటున్నారు. అయితే క్యారిసా కుటుంబం ఈ వ్యాఖ్యలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసిందట. భర్త ఉద్యోగరీత్యా తరచూ ఇంటి బయట ఉండటంతో క్యారిసానే పిల్లల ఆలనాపాలనా, చదువుసంధ్యలను చూసుకుంటుంది. క్యారిసా పిల్లల పేర్లు అనిసా (14), ఆండ్రీ (13) అనిస్టన్ (11) ఏంజెలీ (10) అండర్సన్ (9), ఏంజెల్ (7) ఎన్సర్ (6) యాంకర్ (4) యాంథిమ్ (3) బేబీ ఆర్మర్. తన భర్త అద్భుతమైన తండ్రి అని క్యారిసా చెబుతుంటుంది. భర్త ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరితో కలసి ఆడుకుంటాడని తెలిపింది. కాగా క్యారిసా టిక్ టాక్ వీడియోలలోని కొన్నింటికి 55 లక్షలకు పైగా లైక్‌లు రావడం విశేషం. -
మణిపూర్ మండుతూ ఉంటే పార్లమెంట్లో జోకులా?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని మరోసారి టార్గెట్ చేశారు. గురువారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ ప్రధాని మోదీ నవ్వడం, జోకులు వేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని ప్రవర్తన సరైంది కాదన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ మణిపూర్ హింసను తక్షణం ఆపాలనుకుంటే, అందుకు అవసరమైన చాలా మార్గాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. భారత ఆర్మీ అక్కడి పరిస్థితులను రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకొస్తుందని చెప్పారు. ‘అక్కడ మహిళలు, చిన్నారులు చనిపోతున్నారు. మహిళలు వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. భారత ప్రధాని మోదీ మాత్రం నిండు పార్లమెంట్లో రెండు గంటలపాటు నవ్వుతూ, నవి్వస్తూ, నినాదాలతో గడిపారు. నాలుగు నెలలుగా మణిపూర్ మంటల్లో ఉన్న విషయం ఆయన మర్చిపోయినట్లున్నారు. మణిపూర్ మండుతూనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, మంటలను ఆపడం ప్రధానికి ఇష్టం లేదు’అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ విషయం రాహుల్ గాం«దీకి, కాంగ్రెస్‌కు, ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, ఇది భారత్‌కు, మన దేశానికి సంబంధించిన విషయం. ఒక రాష్ట్రం నాశనమైంది. అదిప్పుడు ఉనికిలో లేదు. విభజించు, పాలించు, తగులబెట్టు..తరహా బీజేపీ రాజకీయాల వల్లే ఇలా అయింది’అని రాహుల్ మండిపడ్డారు. ‘నేను అటల్ బిహారీ వాజ్‌పేయి, దేవెగౌడ వంటి ప్రధానుల్ని చూశాను. మోదీ వంటి ఇంత దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదు’అన్నారు. ‘మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైంది’అని నేను చేసిన వ్యాఖ్య సాధారణమైంది కాదు. నా 19 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి మాట వాడటం ఇదే మొదటిసారి’అని అన్నారు. మణిపూర్‌లోని మొయితీలుండే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. వాళ్లు మమ్మల్నెంతో ప్రేమగా చూశారు. అక్కడే ఉండిపొమ్మన్నారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్క కుకీ వర్గం వ్యక్తి కూడా లేరు. కుకీలుండే ఏరియాకు వెళ్లినప్పుడూ మాకు ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ ఒక్కడి భద్రతా సిబ్బందిలో ఒక్క మొయితీ కూడా లేరు. ఇలాంటి పరిస్థితి మణిపూర్‌లో మునుపెన్నడూ లేదని కేంద్ర భద్రతా సిబ్బంది ఒకరు నాతో అన్నారు’అని రాహుల్ చెప్పారు. ‘అందుకే మణిపూర్‌లో భరతమాత హత్యకు గురైందన్నాను. అది తమాషాకు కాదు. వాస్తవమే చెప్పాను’అని రాహుల్ తెలిపారు. ‘పార్లమెంట్లో నా ప్రసంగంలోని భరతమాత అనే మాట దోషంగా భావించి రికార్డుల నుంచి తొలగించి వేశారు. అందులో తప్పేముంది? ఇలా భరతమాత మాటను తొలగించడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి’అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. -
చావు ఇంటికి వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, జేయూయూ నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సందర్భంలో నవ్వుతూ కన్పించారు. ఈ పొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షహ్జాద్ పూనావాలా రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు శరద్ యాదవ్ కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే, వాళ్ల మధ్యన కూర్చున్న నీకు ఎలా నవ్వు వస్తుందని ధ్వజమెత్తారు. ఓ తపస్విగా చెప్పుకునే రాహుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని సెటైర్లు వేశారు. అంతేకాదు 2018లో కర్ణాటక మాజీ సీఎం ఎన్ ధారం సింగ్ సంతాప సభలోనూ రాహుల్ నవ్వుతూ కన్పించారని షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు. పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. Rahul Gandhi smiling while Sharad Yadav’s family is in tears- certainly not how a Tapasvi would behave Sensitivity demands one acts maturely but then in 2018 Rahul was laughing during Dharam Singh's condolence meet; was busy in phone during Pulwama Shraddhanjali Some tapasvi! pic.twitter.com/axj2CwS4fR — Shehzad Jai Hind (@Shehzad_Ind) January 13, 2023 చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
నవ్వులపాలైన ట్రంప్.. స్పీకర్ పదవికి పోటీ పడితే ఒకే ఒక్క ఓటు
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్ ఎన్నికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని మూడోరోజు సైతం అదృష్టం పలకరించలేదు. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. "The honorable Donald J Trump of Florida has received one [vote]" *members start laughing* pic.twitter.com/B0q8nknZEP — Aaron Rupar (@atrupar) January 6, 2023 స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెక్‌కార్తీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెక్‌కార్తీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్ ఓటింగ్ నిర్వహించే క్రమంలో ట్రంప్ పేరును ఆయన నామినేట్ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెక్‌కార్తీని స్పీకర్ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు జో బైడెన్‌ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. New Trump Truth Social Post 😂 pic.twitter.com/ubgdTePnU9 — Benny Johnson (@bennyjohnson) January 5, 2023 ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
నవ్వలేదని ఉద్యోగిపై వేటు... కోర్టు ఏమందంటే?
-
World Funniest Joke: మామూలు జోక్ కాదు.. ఇది జోకులకే జోక్!
ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. ‘మీకు ఇష్టమైన జోకులను పెట్టండి. నచ్చిన వాటికి ఓటేయండి’అంటూ ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. ఇలా మొత్తంగా 40 వేల జోకులు పోగయ్యాయి. సుమారు 20 లక్షల మంది తమకు నచ్చిన జోక్‌కు రేటింగ్ ఇచ్చారు. అందులో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గుర్పాల్ గోస్సాల్ అనే సైకియాట్రిస్ట్ పెట్టిన జోక్ అత్యంత హాస్యభరితమైన జోక్‌గా నిలిచింది. మరి ఆ జోక్ ఏంటో చూద్దామా.. చదవండి👉🏼క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! ఓ రోజు ఇద్దరు వేటగాళ్లు అడవికి వెళ్లారు. అందులో ఒకడు సడన్‌గా స్పృహ తప్పి పడిపోయాడు. కళ్లు తేలేసేశాడు.. ఊపిరి కూడా తీసుకుంటున్నట్లు కనపడలేదు. దీంతో చనిపోయేడామో అని రెండోవాడికి డౌట్ వచ్చింది.. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ‘నా స్నేహితుడు చనిపోయాడు. నేనిప్పుడు ఏం చేయాలి’అని టెన్షన్ పడుతూ అడిగాడు. అటు వైపు ఆపరేటర్.. ‘నేను మీకు సాయం చేస్తాను. మీరు కూల్ అవ్వండి. ముందు మీ స్నేహితుడు నిజంగానే చనిపోయాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి’అని చెప్పాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం.. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం.. ‘చనిపోయాడు.. కన్ఫర్మ్.. ఇప్పుడు నేనేం చేయాలి’అని ఆ వేటగాడు రొప్పుతూ మళ్లీ అడిగాడు.. సైంటిఫిక్‌గానూ ఇదే బెస్ట్ జోక్! మంచి జోక్‌లకు సంబంధించి.. ఆశ్చర్యం కలిగించడం, ఒత్తిడిని దూరం చేయడం వంటి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, అవన్నీ ఈ జోక్‌లో ఉన్నాయని సైకాలజిస్టు రిచర్డ్ వైస్మాన్ చెప్పారు. 103 పదాలు ఉండే జోక్‌లు ఎక్కువగా నచ్చుతాయని.. ఈ జోక్‌లో 102 పదాలు (ఇంగ్లిష్‌లో) ఉన్నా యని వివరించారు. మరో చిత్రమేమిటంటే.. ఏటా అక్టోబర్ 7న, అదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జోకులు ఎక్కువగా నవ్విస్తాయని తమ సర్వేలో తేలినట్టు పరిశోధకులు చెప్తున్నారు. చదవండి👉🏼కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స... చిగురిస్తున్న కొత్త ఆశ -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!
కిమ్ జోంగ్ ఉన్ తండ్రి వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియా 11 రోజుల పాటు నవ్వడాన్ని నిషేధించింది. అంతేకాదు ఉత్తర కొరియా తన పౌరుల కోసం 11 రోజుల పాటు నవ్వడం, తాగడం, షాపింగ్ చేయడంపై కఠినమైన నిషేధాన్ని విధించింది. ఈ మేరకు డిసెంబర్ 17న ఉత్తర కొరియా మాజీ నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ వర్ధంతిని పురస్కరించుకుని దేశంలో 11 రోజుల సంతాప దినాలు విధించారు. అయితే ఆ వ్యక్తి ఉత్తర కొరియా ప్రస్తుత నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ తండ్రి. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) పైగా రేడియో ఫ్రీ ఆసియా కొరియన్ సర్వీస్ నివేదిక ప్రకారం సంతాప సమయంలో పౌరులు ఏ విధమైన వేడుకలు జరుపుకోవడం లేదా పాల్గొనడం నిషేధించారు. పైగా శోక సమయంలో మద్యం సేవించకూడదు నవ్వకూడదు లేదా విశ్రాంతి కార్యక్రమాలలో పాల్గొనకూడదట. ఈ మేరకు ఇది సాధారణంగా ప్రతి ఏడాది 10 రోజుల సంతాప దినం అయితే ఈ ఏడాది 2021 నాయకుడి మరణానికి 10 సంవత్సరాలు నిండినందున సంతాపాన్ని మరో రోజు పొడిగించారు. అంతేకాదు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, అతను లేదా ఆమెను అరెస్టు చేయడమే కాక నేరస్థులుగా పరిగణించడం జరుగుతుంది. అంతేకాదు ఆ సమయంలో ఎవ్వరూ పుట్టిన రోజులు కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవరి ఇంటిలోనైన వారి బంధువుల చనిపోతే గట్టిగా ఏడవకూడదు, పైగా ఆ సంతాపదినాలు పూరైన తర్వాత మాత్రమే ఆ మృతునికి సంబంధిచిన కార్యక్రమాలు చేయాలి. అంతేకాదు ఈ సంతాపదినాల్లో పౌరులెవ్వరూ నియమాలను ఉల్లంఘించకుండా చూడటమే పోలీసుల ప్రత్యేక విధి. (చదవండి: భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...) -
ఇదో వెరైటీ చెట్టు.. తాకితే స్పందిస్తుంది..కితకితలు పెడితే నవ్వుతుంది.. ఎక్కడో తెలుసా?
Laughing Tree In Kaladhungi Forest: ప్రకృతి మనకిచ్చిన వరం చెట్లని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అవి మానవ మనుగడకు చాలా ఉపయోగపుడతుంటాయి. అయితే చెట్ల ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. కానీ అవి కూడా మనుషుల్లానే స్పందిస్తాయని, తాకినా కదులుతాయని, కితకితలు పెడితే నవ్వుతాయని ఉత్తర ప్రదేశ్‌లోని నైనిటాల్ జిల్లాలోని స్థానికులకు మాత్రమే తెలుసు. అసలా కథేంటంటే.. గడ్డి మైదానాల్లో పెరిగే ఈ రకమైన చెట్టును మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్ కనిపెట్టారు. ఇవి మనుషుల సైగలను బట్టి స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను చూడలేమని జెస్సే బోస్ తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ డీఎఫ్ఓ యశ్వంత్ చెప్పారు. అయితే మనుషులు నవ్వినప్పుడు సౌండ్ వచ్చినట్లు ఈ చెట్లు నవ్వినప్పుడు సౌండ్ రాదట. కానీ వాటి ప్రవర్తనను మనం చూడగలమని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నైనిటాల్ జిల్లాలోని కలదుంగి అడవిలో చెట్టును తాకడం, చక్కిలిగింతలు పెట్టడం లేదా నొక్కడం వంటి చేసినప్పుడు అది చేసే ప్రవర్తన కారణంగా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ చెట్టును గురించి అక్కడి స్థానికులు మాట్లాడుతూ.. చెట్టు చక్కిలిగింతలు పెడితే నవ్వుతుందని అందుకే దానికి 'లాఫింగ్ ట్రీ' అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇలాంటి వింత,అరుదైన చెట్లు అంతరించిపోతున్న జాతులలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చెట్ల సంఖ్యను పెంచేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని, ఎందుకంటే ఆ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి కొత్త మొక్కలు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ చెట్టుకి గ్రాఫ్టింగ్ ప్రక్రియలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అటవీ అధికారులు తెలిపారు. చదవండి: Queen Elizabeth Purple Hands: రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. అసలు నిజం బయటపెట్టిన వైద్యులు -
నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు..
Laughter Decreases Stress Hormones And Increases Immune Cells And Infection-fighting Antibodies: నవ్వితే మానసిక ఉత్తేజం కలుగుతుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ హాయిని కలిస్తుంది. ఎండార్ఫిన్ విడుదలయ్యే స్థాయి నవ్వు అంటే ఏ లాఫింగ్ క్లబ్లోనో చేరి నవ్వాల్సిన పనిలేదు. అలాగని వికటాట్టహాసం చేయాల్సిన పని కూడా లేదు, ఓ చిరుదరహాసం చాలు. సైంటిఫిక్ అమెరికన్ స్టడీ ప్రకారం చిరునవ్వుతో ముఖ కవళికలు మారుతాయి, చూసేవారికే కాదు నవ్విన వారికి కూడా అసంకల్పితంగా మనోల్లాసం కలుగుతుంది. మతికి సానుకులమైన ఆలోచనలు కలుగుతాయి. నొప్పి నివారణకు కూడా నవ్వు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా! నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చక్కగా హాయిగా నవ్వినట్లయితే ఒంటినొప్పులు తగ్గుతాయి. నొప్పి బాధపెడుతుంటే నవ్వు ఎలా వస్తుంది? అనే సందేహం అక్కర్లేదు. ఒళ్లు నొప్పులు, తలనొప్పితో బాధపడేటప్పుడు కామెడీ షోలు చూడండి. ఒకరు పక్కన ఉండి గిలిగింతలు పెట్టే పని లేకుండా మీకై మీరే హాయిగా నవ్వేస్తారు. నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. హాయిగా నవ్వడం రక్తప్రసరణ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ద కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం నవ్వేటప్పుడు ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకుంటాం. దాంతో ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో దేహంలోకి వెళ్తుంది. దాంతో కండరాలు సాంత్వన పొందుతాయి. గుండె లయ కూడా క్రమబద్ధమవుతుంది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్.. నవ్వడం వల్ల దేహంలో విడుదలయ్యే ఫీల్‌గుడ్ హార్మోన్ల ప్రభావంతో దేహంలోని వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అందుకే రోజూ పది నిమిషాల సేపు హాయిగా నవ్వడానికి కేటాయించండి. మనసు బాగుంటే నవ్వమా? అని ప్రశ్నించే వారికో సూచన. మనకు నిజంగా హాయిగా నవ్వాలనే ఆలోచన ఉంటే... నవ్వించడానికి సాధనాలెన్నో ఉన్నాయిప్పుడు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఒక హ్యూమరస్ వీడియో చూస్తే చాలు. హాయిగా నవ్వుకుంటాం. మనసు తేలికపడుతుంది. ఇప్పటి వరకు నవ్వడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే మేలు గురించి చెప్పుకున్నాం. ఇక సామాజిక ఆరోగ్యం విషయానికి వస్తే... చిరునవ్వు పెట్టని ఆభరణంలా ముఖానికి అందాన్ని తెస్తుంది. ఎదుటి వ్యక్తిని చిరునవ్వుతో పలకరిస్తే అవతలి వాళ్లు కూడా పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వుతారు. నవ్వులేని ముఖంలో ఆత్మీయతను, స్నేహితులను వెతుక్కోవడం ఎవరికైనా కష్టమే. సామాజిక బంధాలు మెరుగవ్వాలన్నా కూడా చక్కటి చిరునవ్వే సాధనం. అందుకే స్టైలిష్‌గా లేకపోయినా ఫర్వాలేదు, కానీ స్మైలిష్గా ఉండడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. -
జంధ్యాలాఫ్టర్ క్లబ్
‘నేడు వరల్డ్ లాఫ్టర్ డే’‘అంటే?’‘చరిత్ర అడక్కు. చెప్పింది విను’ అన్నాడు జంధ్యాల.‘అడిగితే?’‘అడిగితేనా? శ్రీవారికి ప్రేమలేఖలోని సంగీత వచ్చి ‘చికెనోవా ఉష్టినోవా’ అనే రష్యన్ పాయసం చేసి తినిపించేస్తుంది. చంటబ్బాయ్లోని శ్రీలక్ష్మి వచ్చి ‘నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా...’ అని తాజా కవిత ఒకటి వినిపిస్తుంది. నాలుగు స్తంభాలాటలోని సుత్తి వీరభద్రరావు వచ్చి– ‘అసలు న్యూటన్ అంటే ఎవరు? అతని అసలు పేరు నూతనుడు... మన బెంగాలీ వాడు. పైథాగరస్ అంటే రాజమండ్రిలోని పైథావారబ్బాయి’... అని సుత్తి కొట్టడం మొదలుపెడతాడు. అహ నా పెళ్లంటలోని బ్రహ్మానందం వచ్చి– సెల్‌ఫోన్ లేనోడికి సిమ్ కార్డ్ అమ్మే మొహమూ నువ్వూను అని వెరైటీ తిట్లు తిడతాడు. రెండు రెళ్లు ఆరులోని పొట్టి ప్రసాద్ వచ్చి ‘పితా’ అని పెద్దగా కేకేసి, చేతిలో ఒక బెరడు పెట్టి, ఈ పూట ఒక అంగుళం తిను... రేపటికి లేస్తే మరో అంగుళం తిను అంటాడు. రావూ గోపాలరావు సినిమాలోని రాధాకుమారి వచ్చి ఉన్న పళాన నీ బట్టలన్నీ ఊడబెరికి స్పూను వస్తుందని స్టీలు సామాన్లవాడికి వేసేస్తుంది. ఇంకా హైహై నాయకలో...’ ‘చాలు స్వామీ... చాలు. ఇంకేమీ చెప్పొద్దు. చరిత్ర అడగను. వరల్డ్ లాఫ్టర్ డే గురించి చెప్పినా లేదంటే నవ్వుకు మారుపేరైన జంధ్యాల గురించి చెప్పినా వింటా’‘ఊ. అలా రా దారికి. కిష్యోటికా’‘అంటే?’ ‘నాక్కూడా తెలియదు. జంధ్యాల కనిపెట్టిన కొత్త తిట్టు’. పూర్వం చాలామంది సీనియర్ నాటక రచయితలు, పరిషత్ ప్రకాండులు అవకాశాల కోసం మద్రాసు పాండీబజారులో రెండిడ్లీ ప్లేటు సాంబార్‌తో అడ్జస్టయ్యి సినిమా ఆఫీసుల చుట్టూ తెగ తిరుగుతుంటే జూనియర్ నాటక రచయితైన ఒక యువకుడు మాత్రం బెజవాడలో పద్మినీ కారులో ఎండల్ని లెక్క చేయకుండా యమా హుషారుగా తిరుగుతుండేవాడు. ప్రపంచంలో బాగా ఫేమస్సయిన ‘ది ఇన్స్పెక్టర్ జనరల్’ నాటకాన్ని స్ఫూర్తిగా తీసుకొని అతడు రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ పెద్ద హిట్టు. ఆ తర్వాత ‘గుండెలు మార్చబడును’ నాటకం కూడా. ఒక అవకతవకల డాక్టరు గుండెలు మార్చే పనికి బయలుదేరి చిన్న పిల్లల గుండె ముసలాళ్లకి, పిచ్చోడి గుండె మంచోడికి, ఆడాళ్ల గుండె మగాళ్లకి పెట్టి కంగాళీ సృష్టిస్తాడు. చివరకు అందరూ కలిసి తన్ని తలస్నానం చేయించబోతే క్లినిక్ బయట ఉన్న బోర్డును ‘గుండీలు మార్చబడును’గా మార్చి బతికి బనీను వేసుకుంటాడు. ఆ నాటకాల ప్రదర్శనలు జోరుగా సాగడం చూసి ఈ నవ్వులు పూయిస్తున్నది ఎవరా అని ఆరా తీస్తే అందరూ అతగాడి పేరును ‘జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి’ అని చెప్పారు. టాలెంటే అనుకుంటే పేరు కూడా పెద్దదిగానే ఉందే అని... సౌకర్యం కోసం జంధ్యాల వరకు కోసి తక్కిన పేరును పక్కన పెట్టారు. అప్పట్లో చెన్నై సినిమా ఎక్స్‌ప్రెస్ ఏదైనా వయా విజయవాడే వెళ్లేది.కలం ఉన్నోడు బలం ఉన్నోడు సినిమా వాళ్ల కంట్లో తప్పక పడేవాడు.జంధ్యాల కూడా పడ్డాడు.అప్పట్లో జంధ్యాల ‘సంధ్యారాగంలో శంఖారావం’ అనే నాటకం రాసి, తనే హీరోగా నటిస్తే బి.ఎన్.రెడ్డి ఆ చూసి ‘హీరోగా చేస్తావా... రచయితగా రాస్తావా?’ అని అడిగితే... హీరో అనేవాడు రచయిత సృష్టిస్తేపుడతాడు... నేను హీరోలను సృష్టించేవాడిగా ఉంటాను అని రచయితగా ఉండటానికే నిశ్చయించుకున్నాడు.ఒక శుభముహూర్తాన మద్రాసుకు స్లీపర్ క్లాసులో బయల్దేరిన జంధ్యాల కలం రాబోయే రోజుల్లో కోట్లాది నవ్వులను మేల్కొలపనుందని అప్పుడు ఎవరికీ తెలియదు... జంధ్యాలకు తప్ప.‘ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం’ అని ‘సిరిసిరి మువ్వ’ (1976) కోసం రాశాడు వేటూరి. జంధ్యాల కూడా ఆ సినిమాతోనే మాటల రచయితగా నలుగురికీ తెలిశాడు. కాని ఇద్దరికీ ఊపునిచ్చిన సినిమా ఆ తర్వాతి సంవత్సరం వచ్చింది. ‘అడవి రాముడు’. వేటూరి, జంధ్యాల ఇద్దరూ ఆ సినిమాతో మాస్ అయిపోయారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అని వేటూరి రాస్తే ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ పంచ్ డైలాగ్ జంధ్యాల రాశాడు. ఆ సినిమాలో నాగభూషణం కొడుకైన సత్యనారాయణ ఏదడిగినా ఏదో ఒక పాత ఉదంతం చెబుతుంటాడు. నాగభూషణం: రేయ్... హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి చెప్పుదెబ్బలు తిన్న దొనకొండ గాబ్రియల్లాగా కావడం నాకిష్టం లేదుసత్యనారాయణ: దొనకొండ గాబ్రియలా? ఆయనెవరు?నాగభూషణం: చరిత్ర అడక్కు. చెప్పింది విను.ఈ డైలాగ్ పండి, నవ్వి, ఇప్పటికీ నిలిచి ఉంది. ఆ సినిమాలోనే వంటవాడైన రాజబాబు తనకు గిట్టని వాళ్ల కోసం అన్ని కూరగాయలు కైమా కొట్టి ‘ఆల్ కూర్ చమ్‌చమ్’ చేస్తాడు. అది జంధ్యాల కనిపెట్టిన పేరు. ఇవాళ ఫైవ్‌స్టార్ హోటల్లో ‘ఆల్ కూర్ చమ్‌చమ్’ అని పెడితే మనం సీరియస్‌గా తినేస్తాంగాని ఆ రోజుల్లో జనం బాగా నవ్వారు. అక్కణ్ణుంచి జంధ్యాల రాఘవేంద్రరావు సినిమాలకు టీ షర్ట్ వేసుకొని, కె.విశ్వనాథ్ సినిమాలకు ధోవతి కట్టుకుని ద్విపాత్రాభినయం చేస్తూ ఈ ఇద్దరూ ఒకరేనా అన్నట్టు సంబంధం లేని ధోరణిలో మాటలు రాసి రాణించాడు.తనకు వీలున్నప్పుడు హాస్యాన్ని పొదుపుగా, అదుపుగా వాడి సరిగ్గా వేసిన ఉప్పు రుచి తెచ్చాడు. ‘శంకరాభరణం’లో ‘బ్రోచేవారెవరురా’ పాడిన డూప్లికేటు దాసు సీను తలుచుకుంటే అందరికీ నవ్వు. ఆ కీర్తనను సంప్రదాయం ప్రకారం పాడిన శిష్యురాలితో దాసు– ‘ఆపేయ్. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణించేటప్పుడు పాడిన పాటా కట్టిన రాగమూ అది. ఇప్పుడు? బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు... ఇన్ని వచ్చాయా? స్పీడు.. స్పీడు కావాలి’ అని ఆ కీర్తనను ఖరాబుగా పాడి శంకర శాస్త్రి చేత బుర్ర రామకీర్తన పాడించుకుంటాడు. అదే సినిమాలో లాయరైన అల్లు రామలింగయ్య, ఆయన దగ్గరకు క్లయింట్‌గా వచ్చిన థమ్ల మధ్య నడిచే సీన్ కూడా చాలా నవ్వు. వాళ్ల నాన్న రెండో భార్య కొడుక్కి ఆస్తంతా రాసేస్తున్నాడని కేసు వేయడానికి వస్తాడు థమ్. ‘మా నాన్నకు ఇద్దరు భార్యలు. మా అమ్మ పోయింది’ అని మొదలెడతాడు కేసు. కాని అల్లు రామలింగయ్య సరిగ్గా వినడు. భార్య విసిగిస్తూ ఉండే సరికి మధ్య మధ్య ఇంట్లోకి వెళుతూ వస్తూ థమ్తో అంటాడు– అల్లు రామలింగయ్య: ఆ... ఇంతకీ ఏమిటయ్యా నువ్వనేది? నీకు ఇద్దరు భార్యలు. నీ మొదటిభార్య పోయింది. థమ్: కాదండి. నేను... నేను పోయాను. నమస్కారం. వెళ్లొస్తా.‘శంకరాభరణం’కు ఇది రాసిన జంధ్యాలే ‘వేటగాడు’లో రావు గోపాలరావుకు ప్రాసల డైలాగులు పెట్టి ఈ విద్యలో తానే బెస్ట్ అని నిరూపించాడు. ఆ సినిమాలో ఒక సీన్లో–సత్యనారాయణ: అబ్బా... నీ ప్రాసతో చస్తున్నాను నాన్నా. గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను. రావు గోపాలరావు: సరదాగా ఉందా? అయితే విను. ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టారుగారి ఫస్ట్ సన్ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టర్ టెస్ట్‌లో ఫస్ట్ క్లాసులో బెస్టుగా ప్యాసయ్యాడని తన నెక్ట్స్ ఇంటాయన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్‌ను బెస్ట్ బెస్టని తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్టు చేయకుండా సుష్టుగా భోంచేసి పేస్టు పెట్టుకుని పళ్లు తోముకొని రెస్టు తీసుకున్నాడట ఏ రొష్టు లేకుండా. చాలా ఇంకా వదలమంటావా భాషా భరాటాలు.. మాటల తూటాలు.. యతి ప్రాసల పరోటాలు’...సత్యనారాయణ: వద్దు నాన్నోయ్... తల తిరిగిపోయింది నాన్నోయ్...ఇంత పొడుగ్గా రాసి నవ్వించిన జంధ్యాలే చిన్న డైలాగ్‌తో కూడా అంతే నవ్వు నవ్వించాడు. ‘సాగర సంగమం’లో డాన్సూ కెమెరా రెండూ తెలియని స్టుడియో కుర్రాడిని ఫొటో షూట్‌కు తీసుకెళ్లిన కమలహాసన్ మంచి ఫోజ్‌కు రెడీ అవుతూ ‘ఇప్పుడో భంగిమ పెడతాను’ అనగానే ఆ కుర్రాడు ‘తొందరగా పెట్టుబాబు. ఆకలేస్తోంది’ అంటాడు తినడానికి కూచొని. ఎంత నవ్వు.కూర చేయడం వచ్చినవాడికి చారు కాచడం ఒక లెక్కా అని అందరూ అనుకుంటారుగాని అసలు చారు కాచడం బాగా వచ్చినవాడే కూర బాగా చేయగలడు. చారు కాచడం రాకపోతే కూరేం చేయగలడు. హాస్యం బాగా రాయడం తెలుసు కనుకే జంధ్యాల ఏ రసాన్నైనా బాగా పండించాడు. సినీ జనరల్ మెడిసిన్‌లో ఎం.డి చేసినా ఆయన మళ్లీ పని గట్టుకుని కార్డియాలజీ చేశాడు– గుండెల నిండా నవ్వించడమే తన స్పెషాలిటీ అని. కాదు ఆయన చదివింది గ్యాస్ట్రో ఎంటరాలజీ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే అందుకు తార్కాణం అని కొందరు పేచీకి వస్తారు కాని అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకుంటారు అని మనం వాళ్ల జోలికి పోవాల్సిన పని లేదు. ఇప్పుడు జంధ్యాల దర్శకుడయ్యాడు. తన కథలకు తానే పాత్రధారి అయ్యాడు. తన పాత్రలకు తానే సూత్రధారి అయ్యాడు. ఢిష్యూం ఢిష్యూంలు, చెవులు మూసేసే విగ్గులు, కృతకమైన కాస్ట్యూమ్‌లు రాజ్యం చేస్తున్న రోజుల్లో లేలేత వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయిల ప్రేమ కథను ‘ముద్దమందారం’గా తీశాడు. ఇండస్ట్రీకి ప్రదీప్‌ను, పూర్ణిమను పరిచయం చేశాడు. ఆ తర్వాత విజ్జిబాబును హీరోగా పెట్టి ‘మల్లె పందిరి’ సినిమా తీశాడు. అందులో వేటూరి చేత ‘ప్రేమ గురువు’ పాత్ర కూడా చేయించాడు. ఆ పాత్ర ఒక చోట ఇలా ఉపదేశం చేస్తుంది–ప్రేమ అనేది దుష్ట సమాసం నాయనా. పి..ఆర్..ఇ..వై... ప్రే... అంటే ఇంగ్లిష్‌లో ఎర అని అర్థం. మ నిషాద. మ అంటే సంస్కృతంలో వద్దు అని. అంచేత ప్రేమంటే ఎర కావద్దు బలి కావద్దు అని తాత్పర్యం..త్రివిక్రమ్ ‘మల్లీశ్వరి’లోని ‘పెళ్లి కాని ప్రసాద్’ పాత్రకు ఈ సినిమాలోని హీరో ఒక ప్రేరణ కావచ్చు. ఈ రెండు సినిమాల్లో హాస్యాన్ని అంతర్లీనంగా ఉంచిన జంధ్యాల తన మూడో సినిమా ‘నాలుగు స్తంభాలాట’ లో మాత్రం ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమాతోనే ఆయన ‘సుత్తి’ అనే మాటను తెలుగు జాతికి అందించాడు. వీరభద్రరావు, వేలు అనే నటులు ‘సుత్తి’ ని ఇంటి పేరుగా మార్చుకుని ఖ్యాతి గడించారు. ‘నిన్నూ ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదురా బాబు.. నా వల్ల కాదు’ అంటుంటాడు వీరభద్రరావు ఈ సినిమాలో. షేక్స్పియర్ అసలు పేరు శేషప్పయ్యార్ అని అతడు తమిళుడని రామనాథం జిల్లావాడని అతడి థియరీ. అతడి సుత్తి భరించలేక తిరుగు సుత్తి అంటే రివర్స్ హ్యామరింగ్ వేసినట్టుగా కలలు కంటుంటాడు సుత్తి వేలు. ప్రతివాడూ ఎదుటివాడికి ఎంతో కొంత సుత్తి వేస్తాడని, కాని సుదీర్ఘ సుత్తి అనగా ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ మాత్రం పాపమని ఈ సినిమా ద్వారా జంధ్యాల బొప్పి కట్టకుండా చెప్పిన హితవు. చేసిన హెచ్చరిక. మనది మధ్యతరగతి దేశం. మధ్యతరగతి జీవుల చిత్రవిచిత్ర వ్యాపకాలు నిండిన దేశం. వారి పరిమితి, అపరిమితి, అలవాట్లు, చాదస్తాలు, శాడిజం... వీటిని కొద్దిగా ఎగ్జాగరేట్ చేస్తే హాస్యం పండుతుందని తెలిసినవాడు జంధ్యాల. బాపుగారు కార్టూ్టన్లలో చేసిన పనిని జంధ్యాల సినిమాలలో చేశాడు. ప్రతి పాత్రనూ ఒక నమూనాగా చేసి అతడు తీసిన సంపూర్ణ తొలి హాస్య సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’. ఈ సినిమాతోనే తెలుగు సినిమాల్లో హాస్య సినిమాల ధోరణి స్థిరపడింది. ఇంతకు మునుపు తెలుగులో సంపూర్ణ హాస్య సినిమాలు తీసే ఆనవాయితీ లేదు. ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘పెళ్లి చేసి చూడు’... వంటివి హాస్యం నిండిన సినిమాలే తప్ప హాస్య సినిమాలు కాదు. తెలుగులో అలాంటి పాదు వేసింది మాత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా. దానిని సృష్టించిన జంధ్యాల. (ఇందుకు మూల కథ అందించిన పొత్తూరి విజయలక్ష్మిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి).ఈ సినిమాలో ప్రతి పాత్రా ఒక నమూనా పాత్రే. కోపం వస్తే గోడకు తల కొట్టుకుని బిల్డింగ్‌కు పెద్ద పెద్ద క్రాకులిచ్చే వీరభద్రరావు, తెలుగు తమిళ మలయాళ సినిమాలు చూసి వాటిని టైటిల్స్‌తో సహా చెప్పే శ్రీ లక్ష్మి, వింత వంటకాలు చేసే సంగీత, పేకాట కోసం ప్రాణాలర్పించే నూతన్ ప్రసాద్, కోపం వస్తే నవ్వే మేల్కొటే, మందు కొట్టడాన్ని ‘మాట్లాడుకోవడం’గా గౌరవించే రాళ్లపల్లి, వీరభద్రరావు మొక్కులకు బలయ్యే మిశ్రో... వీటితో ఈ సినిమా జరుగుతున్నంత సేపు ప్రేక్షకుల చేత ‘హహ్హ’, ‘హొహ్హో’ అని హ గుణింతం వల్లె వేయిస్తూనే ఉంటుంది.క్లయిమాక్స్‌లో పెళ్లి మాటిమాటికి ఆగిపోతుంటే పట్టు చీర కట్టుకున్న ఒక బంధువు ‘అయితే పట్టుచీర విప్పేయ్యాల్సిందేనా’ అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే మిశ్రోకు గుండు గీయించి మొక్కు చెల్లిస్తాననే వీర భద్రరావు పెళ్లి ఆగిన ప్రతిసారీ గుండు కూడా ఆపించేస్తుంటాడు. సగం గుండుతో అతడు పడే బాధ ఒకటి. ఇంత పెళ్లి గొడవలో తన మానాన తాను పేకాట ఆడుకుంటున్న పొట్టి ప్రసాద్‌ను చూసి ‘నువ్విలాగే చేస్తే నిన్ను పేక దస్తాల మీద వేసి తగలెడతా’ అంటాడు వీరభద్రరావు. దానికి పొట్టి ప్రసాద్ ముచ్చటపడుతూ ‘అరె.. నా అంతిమ కోరిక మీకెలా తెలుసు’ అంటాడు.ఇక ఈ సినిమా గురించి రాసింది చాలు.నవ్వలేక చావాల్సొస్తోంది. జంధ్యాల ఈ స్థాయిలోనే ఇచ్చిన మరొక బ్లాక్‌బస్టర్ ‘అహ నా పెళ్లంట’. తెలుగువారికి బ్రహ్మానందం నిత్యానందంలా మారడానికి ఫౌండేషన్ వేసిన సినిమా. భారీ కలెక్షన్ల లాభాలతో రామానాయుడు స్టూడియోకు కూడా ఫౌండేషన్ వేసిన సినిమా ఇది. చిన్న నవ్వులా ఇందులో. ‘మీరెవరు సార్’ అన్న పాపానికి తాత తండ్రుల కాలం నాటి ఆటోబయోగ్రఫీని ఎత్తుకునే నూతన్ ప్రసాద్, ఖంగు తిన్న ప్రతిసారీ ‘ఎక్స్పెక్ట్ చేశా’అనే రాజేంద్ర ప్రసాద్, ‘నాకేంటి?’ అని పురుగు నోట్లోని చక్కెర పలుకును కూడా వదలని దారుణ పిసినారి కోట శ్రీనివాసరావు, దేశంలో వాన పడకపోయినా ఎండ ఎక్కువ కాసినా చలి తగినంతగా లేకపోయినా జీతం కోతకు గురయ్యే పాలేరు బ్రహ్మానందం, పెళ్లిచూపుల్లో ఏ చిరుతిండీ పెట్టకపోయినా ఆవకాయ జాడీలు తెప్పించుకుని శుభ్రంగా నాకేసే బకాసుర సోదరులు... చూసి తెలుగు ప్రేక్షకులు దొర్లి దొర్లి నవ్వారు. పిసినారుల స్వభావాన్ని జంధ్యాల ఇందులో పరాకాష్టకు తీసుకెళ్లాడు. పేపర్ కట్టుకుని నిద్రపోవడం, వంటకు అగ్గిపుల్లలు ఏరుకోవడం, రాత్రుళ్లు బస్టాండులో టీ అమ్మడం... ఇవన్నీ కోట శ్రీనివాసరావు చేస్తుంటే అతని బావ మరిది అయిన వీరభద్రరావుకు హడలు పుడుతుంటుంది.ఒకరోజు అతను భోజన వేళకు అక్కను చూసి పోదామని ఊర్నుంచి వస్తాడు. ఆ సమయానికి కోట శ్రీనివాసరావు భోజనం చేస్తుంటాడు.వీరభద్రరావు: ఆహా.. సమయానికి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. నేను కూడా భోం చేస్తాను.కోట శ్రీనివాసరావు: (భార్యతో) మీ తమ్ముడికి కూడా ఆకేయవే. కూచోవయ్యా. ఇవాళ మా ఇంట్లో కోడి కూర.వీరభద్రరావు: ఏదీ?కోట శ్రీనివాసరావు: (చూరుకు వేళ్లాడుతున్న కోడిని చూపిస్తూ) అదిగో ఆ కోడిని చూస్తూ ఒట్టన్నం మింగేయడమే.ఈ ఒక్క సీనుతో ఈ సినిమా నవ్వు సమాప్తం. కళ్లు తుడుచుకోండి.. నవ్వి నవ్వి తడితేరి ఉంటాయి. ఎన్ని సినిమాలు జంధ్యాల నుంచి.అతడు తలుచుకుంటే బూతులు, డబుల్ మీనింగ్, లేకి కామెడీ చేసి ఉండొచ్చు. కాని ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. ఆరోగ్యకరమైన హాస్యం, తెలుగు హాస్యం, జీవితాల నుంచి పిండిన హాస్యం మాత్రమే వెతికి వెతికి తెలుగువారికి పంచాడు. చిరంజీవి అంతటి మాస్ హీరో చేత ‘చంటబ్బాయ్’లో పూర్తిస్థాయి కామెడీ రోల్ చేయించడం సామాన్యమా. అందులో చిరంజీవి పాత్ర పేరు డిటెక్టివ్ పాండు రంగారావు. ఒక సీన్లో చాలా స్టయిల్‌గా శ్రీలక్ష్మి వాళ్ల గేట్లో అడుగు పెట్టి ‘ఐయామ్ పాండ్. జేమ్స్ పాండ్’ అనగానే శ్రీలక్ష్మి ‘పాండ్స్ పౌడర్ అమ్మేవాడివా బాబూ. మాకొద్దు’ అంటుంది. ఈ సినిమాలోనే శ్రీలక్ష్మి వండిన ‘బంగాళ భౌభౌ’, ‘అరటికాయ లంబా లంబా’ వంటలు తెలుగు ప్రేక్షకులు గొంతుకు అడ్డం పడేలా తిన్నారు. జంధ్యాల సినిమాలనగానే ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ప్రత్యక్షమయ్యేవారు. కొంచెం అటు ఇటుగా వారే ప్రతి సినిమాలో కనిపించేవారు. నరేశ్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, సుత్తి జంట, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రాళ్లపల్లి, థమ్, పొట్టి ప్రసాద్... కామెడీ అంటేనే టైమింగు. ఆ టైమింగును తప్పినా, దానికి ఉండాల్సిన ఎడిటింగ్ నెమ్మదించినా, రీరికార్డింగ్ పండకపోయినా ఆ సన్నివేశం వీగిపోతుంది. కాని జంధ్యాల వీటన్నింటి మీద మాస్టరీ చేసినట్టుగా సన్నివేశాలు పండించేవారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో శ్రీలక్ష్మి కొడుకు చిన్న వయసులోనే చనిపోయి ఉంటాడు. సందర్భాన్ని బట్టి ఆమె అందరిలోనూతన కొడుకును చూసుకుంటూ ఉంటుంది. సినిమా మొదట్లోనే రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ భయం భయంగా ఇంట్లోకి అడుగుపెడుతుంటే హౌస్ ఓనర్ అయిన శ్రీలక్ష్మి ‘ఎక్కణ్ణుంచి నాయనా?’ అని అడుగుతుంది. ‘ఊళ్లో శనిదేవుని లీలలు అనే సినిమా వస్తే చూసి వస్తున్నాం పిన్నిగారూ’ అంటాడు రాజేంద్ర ప్రసాద్. అంతే. ‘భక్తి సినిమా చూసి వస్తున్నారా నాయనా’ అంటుంది శ్రీలక్ష్మి. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ల పైప్రాణం పైనే పోతుంది. ‘చెప్పండి. భక్తి సినిమా చూసి వస్తున్నారా’ మళ్లీ అడుగుతుంది శ్రీలక్ష్మి. వెనుక నుంచి పీపీ..డుం..డుం అని ఆర్.ఆర్. మొదలవుతుంది. వాళ్లిద్దరూ భయం భయంగా చూస్తుంటారు. శ్రీలక్ష్మి కళ్లల్లో పల్చటి నీటిపొర. ‘బాబూ... చిట్టీ... మా చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడు’ అని వచ్చి అమాంతం రాజేంద్రప్రసాద్‌ను కౌగిలించుకుంటుంది. ఆ నవ్వుల కౌగిలింత నుంచి తప్పించుకోవడం ప్రేక్షకులకు చాలా కష్టమవుతుంది. ∙∙ సినిమాల జయాపజయాలు వాటి విడుదల సమయాన్ని, ఆ సమయంలో ఇతర సినిమాలు ఏర్పరచిన మూడ్‌ని బట్టి కూడా ఉంటాయి. జంధ్యాల తీసిన కొన్ని సినిమాలలోని చాలామంచి హాస్యం ఆ సినిమాలు విడుదలైనప్పుడు జనం రిసీవ్ చేసుకోకపోయినా ఆ తర్వాత టీవీలలో వీడియోల ద్వారా హిట్ చేసుకున్నారు. ‘రెండు జెళ్ల సీత’లో పిచ్చి హిందీ భాష మాట్లాడే అల్లు రామలింగయ్య హాస్యం,‘పుత్తడిబొమ్మ’ సినిమాలో అమాయక కవిగా వీరభద్రరావు హాస్యం, ‘బాబాయ్ అబ్బాయ్’లో పెళ్లికాని పెళ్లికూతురిగా పావలా శ్యామల హాస్యం, ‘శ్రీవారి శోభనం’లో ఎనభై ఏళ్ల పుచ్చా పూర్ణానందం ఏ ఆడపిల్ల కనిపించినా మీసం మెలేస్తూ వెంటబడే హాస్యం ఆ తర్వాతి రోజుల్లో జనం గమనించి యూ ట్యూబ్‌లో నిక్షిప్తం చేసుకున్నారు. ‘సీతారామ కల్యాణం’, ‘పడమటి సంధ్యారాగం’ వంటి అందమైన ప్రేమ కథలు తీసినా ఆ రవ్వలడ్లపై నవ్వులనే ఎండుద్రాక్షను గుచ్చకుండా జంధ్యాల వదల్లేదు.‘పడమటి సంధ్యారాగం’లో తిండిపోతు కొడుకుతో బాధ పడుతూ ఐస్ క్రీమ్ షాప్ నడుపుతున్న తండ్రితో ఎవరో ‘ఏమండీ కులాసానా’ అని అడుగుతారు.దానికి ఆ తండ్రి జవాబు ‘ఊ. కులాసే. (కొడుకును చూపిస్తూ) అంటే కుమారుడి వల్ల లాసు అని అర్థం’ అంటాడు. ఇలాంటి డైలాగు జంధ్యాల వినా మరొకరు రాయలేరు. శంకర్–జైకిషన్ జోడీలో జైకిషన్ మరణించాక శంకర్‌కు పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు నిర్మాత, దర్శకులు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు మారాక, జంధ్యాల ఇక్కడకు షిఫ్ట్ అయ్యి సినిమాలు తీయడం మొదలెట్టాక, మారిన పరిస్థితుల్లో, ఇ.వి.వి. వంటి కొత్త హాస్య దర్శకుల ఊపులో జంధ్యాల శక్తియుక్తులకు పని చెప్పే పెద్ద స్థాయి బడ్జెట్ గొప్ప ఆఫర్లు సినిమా పరిశ్రమ నుంచి అందలేదనే చెప్పాలి. కాని ఆయన టీవీ షోల ద్వారా, చిన్న సినిమాల ద్వారా తనను తాను బిజీగా ఉంచుకున్నారు. నిత్య జీవితంలో అనేకానేక చికాకులతో నిండి ఉండే సగటు మనిషికి నవ్వు అనే అమృతాన్ని పంచడానికి అలుపెరగక ప్రయత్నించిన హాస్య ప్రవక్త జంధ్యాల.చివరగా– పుత్తడి బొమ్మలో రాగం, తాళంతో సహా కవిత్వం చదివి విసిగించే వీరభద్రరావును శిక్షించడానికి ఊరి వాళ్లంతా అతడికి ఒక ఏనుగును బహూకరిస్తారు. ఆ ఏనుగుపై అతడు చెప్పిన కవిత–వీరభద్రరావు: ఈ ఏనుగుపై ఒక పాట రాశా. కుంతల వరాళి రాగం. మిశ్రచాపు తాళం. శ్రుతి ఒకటిన్నర.పాట: ఏనుగూ... ఏనుగూ...ఏనుగు కన్ను చింతాకుఏనుగు తొండం చాంతాడుఏనుగు చెవులు చేటలుఏనుగు పెద్దది టోటలు.మీరిలాగే సదా నవ్వుకుంటూ ఉండాలని కోరిక.జంధ్యాల మళ్లీ మళ్లీ మన పెదాల చిర్నవ్వై ఆయువు పొందుతూ ఉండాలని కోరిక.తెలుగు హాస్యం తెలుగుదనంతో వర్థిల్లాలని కోరిక. నవ్వడం ఒక యోగం. పకపకల సాక్షిగా. ∙కె. సువర్చల -
ఛత్తీస్‌గఢ్ ఎఫెక్ట్!
అది ఒక ఆఫీసు.‘‘సార్... మీకు కొరియర్’’ అన్న పిలువుతో బయటికి వచ్చాడు పిచ్చయ్య.ప్యాకెట్ విప్పి చూశాడు. ఆశ్చర్యం! ఒక వస్తువుతో పాటు చిన్న చీటీ కూడా ఉంది.∙∙ బద్దం బాలశేఖర్...బ్యాండ్ మేళం అనే కంపెనీకి బాసు. అతనికి ఆరోజు కొరియర్ వచ్చింది. తన కంపెనీ నుంచి రాజీనామా చేసిన పిక్కేష్ నుండి అది వచ్చింది. ప్యాక్ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్నచీటీ కూడా ఉంది.కవి కప్పడప్పుల అప్పారావు ఇల్లు. ‘కొరియర్’ అనే కేకతో హడావిడిగా బయటికి వచ్చాడు అప్పారావు.ప్యాక్ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్న చీటీ. కేవలం వీరికి మాత్రమే కాదు....తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి కొరియర్లే. ‘‘మీకు కొరియర్ వచ్చింది’’ అనే మాట విని ప్రజలు బెంబేలెత్తుతున్నారు! ‘‘రాజా! కొరియర్ అనే పిలువు వినబడగానే...మనసులో ఆనందం తొంగిచూస్తుంది.... అలాంటిది... కొరియర్ అనే మాట వినగానే ప్రజలు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పలేకపోయావో....నీకు అర్జంటుగా కొరియర్లో ప్యాకెట్ వస్తుంది...’’ అని బెదిరించాడు బేతాళుడు.‘‘ఈమాత్రం దానికి కొరియర్ దాకా ఎందుకు వెళతావు...చెబుతాను’’ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్ రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆమధ్య కాలంలో లగేరహా మున్నాభాయి సినిమా ఎఫెక్ట్‌తో ఎదుటివారికి తమ నిరసనను పూలు ఇచ్చిప్రదర్శించేవారు. ఇప్పుడు అద్దాలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి వెళదాం....పిచ్చయ్య ప్యాకెట్ విప్పి చూశాడు.అద్దం!చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది....‘‘ప్రియమైన శ్రీవారికి...మీ ఫేసును అద్దములో ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకోకపోతే ఇప్పుడు చూసుకోండి.లేకుంటే ఏమిటి! పొద్దున నేను చేసిన టిఫిన్‌కు వంకలు పెడతారా!ఇట్లు మీ శ్రీమతికాంతం(బీయే) బాస్ బద్దం బాలేశేఖర్ కొరియర్లో వచ్చిన అద్దాన్ని చూసి ఆశ్చర్యపోయి ‘‘ఈ అద్దాన్ని ఎవరు పంపించారు. ఎందుకు పంపించారు?’’ అనుకుంటూనే చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘‘మొన్న ఆఫీసుకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు...పది గంటల పాటు నాన్‌స్టాప్‌గా తిట్టారు. అందుకే జాబ్‌కు రిజైన్ చేశాను. ఇప్పుడు హాయిగా ఉంది. నా హాయి సంగతి సరేగానీ...నీ ఫేస్‌ను ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అసలు నీది మనిషి ఫేసేనా? నాకు ఎందుకో డౌటుగా ఉంది. ఒక్కసారి నీ ఫేసు అద్దంలో చూసుకొని చెప్పగలవు.ఇట్లుమీ మాజీ ఉద్యోగిమక్కి పిక్కేష్ కవిగారు ప్యాకెట్లో వచ్చిన అద్దాన్ని చూసి...‘నాకు మామూలుగా కొరియర్లో పుస్తకాలు వస్తాయి. ఇదేమిటి ఈరోజు అద్దం వచ్చింది’ అనుకుంటూ చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘నిన్న మీ కవితలు విని అందరూ ఆహో ఒహో అన్నారు. కానీ నేను అనలేకపోయాను. నా వైపు అదోలా చూశారు. అసలు నువ్వు కవివేనా? నీ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?‘‘దూరంగా చూస్తే దోమనేఇక్కడి నుంచి చూస్తే ఈగనేకానీ...నేను పులినినిన్ను నిలువెల్లా చెక్కే ఉలిని’’ఇది కవితా? నీ పిండాకూడా!ఇట్లుకె.పాఠక్రావు, పాయకరావుపేట కొరియర్లో వచ్చిన అద్దాన్ని చూసి ‘మా ఇంట్లోనే బోలెడు అద్దాలు ఉన్నాయి. షూటింగ్ స్పాట్ నుంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చిన అద్దాల సంగతి సరే సరి. ఈ అద్దాన్ని ఎవరు పంపించారు?’ అనుకుంటూ చీటీచదివాడు కొత్త హీరో పోత పాపారావు. అందులో ఇలా ఉంది...‘‘అయ్యా! నేను డైరెక్టర్ క్లాప్కుమార్ని. వరుసగా తొమ్మిది హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించాను. నా ఖర్మగాలి పదో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బొత్తిగా అవకాశాలు లేకపోవడంతో నా ఖర్మగాలి...మీకు కథ చెప్పాను.ఏమన్నారు?!‘రౌడీలను చితక్కొట్టి బోర్ కొడుతుందయ్యా...ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. వంద ఏనుగులు ఒకవైపు...నేను ఒకవైపు...చితక్కొట్టేస్తాను...ది గ్రేట్ ఎలిఫెంట్ ఫైట్‌గా ఈ ఫైట్ చరిత్రలో నిలిచిపోతుంది.’‘వాన పాటలేంటీ, వేరీ బోర్! ఈసారి వెరైటీగా నిప్పుల పాట పెడదాం. పైన వేడి వేడిగా నిప్పులు కురుస్తుంటే...హీరోయిన్‌తో నేను కూల్ కూల్‌గా డ్యాన్స్ చేస్తాను.’అయ్యా! మీ క్రియేటివ్ ఐడియాలు గుర్తు తెచ్చుకుంటుంటే కడుపులో డోకు వస్తుంది. మీరు హీరో ఏమిటండీ ఖర్మగాకపోతే! ఎందుకైనా మంచిది మీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోండి.ఇట్లుకె.క్లాప్ కుమార్, డైరెక్టర్ (లేస్తే మనిషిని కాను ఫేమ్)∙∙ ‘‘బేతాళా! ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే...మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో ‘అద్దాల ఉద్యమం’ అని ఒక ఉద్యమం నడిచింది, ప్రత్యర్థికి ఒక అద్దం పంపి ‘నీకు అంతసీన్ లేదు. ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూస్కో’ అని మెసేజ్ చేస్తుంటారు. ఇదే ఛత్తీస్‌గఢ్ అద్దాల ఉద్యమం’’అని ముగించాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
నవ్వుతా తీయగా పుల్లగా!
ఆనందరావుకి జోక్స్ సేకరించడం, వాటిని పదిమందికి చెప్పి నవ్వించడం అంటే భలేసరదా. ఈ సరదా అతనికి కాస్తో కూస్తో పేరు తీసుకొచ్చింది. ఎక్కడైనా ఏదైనా పోగ్రాం జరిగితే ఆనందరావుని ఆహ్వానించి ‘జోక్సాభిషేకం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. తన శక్తిమేరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసేవాడు ఆనందరావు. అలాంటి ఆనందరావుకు ఒక ఉదయం పూట ఫోన్ వచ్చింది... ‘‘హలో! ఆనందరావుగారేనా?’’ ‘‘ఆ...నేనే...మీరెవరండీ?’’‘‘నా పేరు భూకంపం భూపాల్. మీ టీవి నుంచి మాట్లాడుతున్నాను...’’‘‘చెప్పండి సార్...’’‘‘మేము ‘ఖబడ్దార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ అనే కార్యక్రమం ప్లాన్ చేశాము. మీ గురించి విన్నాం. మా నవ్వుల కార్యక్రమానికి మిమ్మల్ని జడ్జీగా అనుకుంటున్నాం...’’‘‘అయ్యో! అంతకంటే భాగ్యం ఏముందండీ.... తప్పకుండా...’’ ‘ఖబడ్డార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ మొదటి రెండు ఎపిసోడ్ల తరువాత ప్రోగ్రాం హెడ్ భూకంపం భూపాల్ ఆనందరావు దగ్గరకు వచ్చి...‘‘అయ్యా! మీరు ప్రోగ్రాంలో ముఖం సీరియస్‌గా పెట్టి అదోలా కూర్చుంటున్నారు.... కాస్త నవ్వాలి’’ అన్నాడు సుతిమెత్తగా.‘‘ఏం నవ్వుతామండీ బాబూ... ఒక్క జోక్కైనా నవ్వొచ్చి ఛస్తేకదా’’ నిట్టూర్చి నిజం చెప్పాడు ఆనందరావు.‘‘అది వేరే విషయం... మనమే నవ్వకపోతే ప్రేక్షకులు ఎలా నవ్వుతారండీ. కాబట్టి నవ్వాలి. నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వాలి. అప్పుడప్పుడు కాస్త గట్టిగా నవ్వాలి. ఫ్లోర్ అదిరిపోయేలా నవ్వాలి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలి. పొట్టపట్టుకొని నవ్వాలి...’’ ఇలా కొన్ని సలహాలు చెప్పాడు భూకంపం.‘‘రాక రాక వచ్చిన ఛాన్సు... నేను కాదు, కూడదు అంటే ఇంకెవరినైనా పెట్టుకుంటారు. ఎందుకొచ్చింది... నవ్వు రాకపోయినా నవ్వితే పోలా...’’ అనుకున్నాడు ఆనందరావు. పది ఎపిసోడ్ల తరువాత.... ‘‘హలో ఆనందు...’’‘‘హాహాహా.... ఏరా సుబ్బరాజు.... ఎలా ఉన్నావు... హాహాహా...’’‘‘ఒక బ్యాడ్‌న్యూస్.... మా తాతయ్య చనిపోయాడు’’‘‘హాహాహా.... తాతయ్య చనిపోయాడా.... ఎంత మంచివాడు.... హాహాహా..... దుక్కలా ఉండేవాడు కదరా.... హాహాహా..... ఇంకో అయిదు సంవత్సరాలైనా లాగించేస్తాడనుకున్నాను.... హాహాహా...’’‘‘తాతయ్య చనిపోయాడని చెబితే నవ్వుతావేమిటిరా ఫూల్.... తమాషాగా ఉందా?’’‘‘సారీ... హాహాహా.... ఈ పాడు నవ్వొకటి ఈమధ్య అలవాటైంది. నా ప్రమేయం లేకుండానే నవ్వేస్తున్నాను.... హాహాహా...’’హాస్పిటల్లో ఒకరోజు...డాక్టర్: చెప్పండి ఆనందరావుగారు ఏమిటి ప్రాబ్లమ్...ఆనందరావు: హాహాహా....ఒక్కటా రెండా..... హాహాహా...డాక్టర్: తర్వాత నవ్వుదురుగానీ ముందు సమస్యలు ఏమిటో చెప్పండి?ఆనందరావు: ఈ కీళ్లున్నాయి చూశారు... ఒకటే నొప్పులు.... హాహాహా.... ఈ నడుం ఉంది చూశారు... కొద్దిగా వంగితే చాలు.... ఒకటే నొప్పి... హాహాహా... ఈ కండ్లున్నయి చూశారు... సరిగ్గా కనబడి చావడం లేదు... హాహాహా....డాక్టర్: వాటన్నిటి కంటే పెద్ద సమస్య మీలో ఉంది...ఆనందరావు: ఏమిటది?డాక్టర్: నవ్వడం, అకారణంగా నవ్వడం, రంపపుకోతలా నవ్వడం, ఆగుతున్న గూడ్సుబండి చప్పుడులా నవ్వడం... అరటిపండు తొక్క మీద కాలువేసి పడినప్పుడు వినిపించే సౌండ్‌లా నవ్వడం, తుపానులో విరిగిపడుతున్న చెట్టు సౌండ్‌లా నవ్వడం... ఆపండి మహాప్రభో ఆపండీ....ఆనందరావు: దాన్దేముందండీ ఆపేస్తాను. హ్హాహ్హాహ్హా... నగరంలో పేరు మోసిన రాజకీయ నాయకుడు ఆయన. పేరు దున్న అప్పన్న.ఈ అప్పన్న ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన చావు ఊరేగింపు పెళ్లిలా ఘనంగా జరిగింది.దున్న అప్పన్న కుమారుడు దున్న గట్టన్న దగ్గరకు ఒక కార్యకర్త వచ్చి....‘‘నాయిన కోసం సంతాపసభ ఏర్పాటు చేసినమన్నా.... హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి పెద్దోళ్లను పిలుస్తున్నాం. వాళ్లు నాయిన గురించిమాట్లాడుతారు... అదిరిపోవాలి... వీరితో పాటు కామెడీకింగ్ ఆనందరావుని కూడా పిలుస్తున్నాము...’’ ఉత్సాహంగా చెప్పాడు ఒక కార్యకర్త.సరే అన్నాడు సంతోషంగా దున్న గట్టన్న.ఆరోజు...దున్నపోతుల్లాంటి రౌడీలు ఇద్దరు ఆనందరావు ఇంటికి వచ్చారు.‘‘ఆనందరావు.... ఓ ఆనందరావు...’’‘‘ఏమిటయ్య.... అలా అరుస్తున్నారు.... ఏమిటి?’’‘‘నీతో అర్జెంటుగా పనుందయ్యా...’’ ‘‘నాతో మీకేం పనయ్యా!’’‘‘ఏంలేదు... కొద్దిసేపు మాట్లాడి పోవాలి... అన్న దున్నగారి సంతాపసభ జరుగుతుంది. మీరు వచ్చి మాట్లాడాలి’’‘‘ఎప్పుడు?’’‘‘ఇప్పుడే’’‘‘కనీసం రెండురోజుల ముందు చెప్పొచ్చుగదయ్యా....’’‘‘మీకు మాట్లాడం పెద్ద విషయమా? మీ టాలెంట్ గురించి మాకు తెలియదనుకుంటున్నారా! పదండి... బండి ఎక్కండి’’ అంటూ ఆనందరావుని టాటాసుమో ఎక్కించారు తెల్లలుంగీరౌడీలు. నిజానికి దున్న అప్పన్న రౌడీయిజం గురించి తప్ప అతని పుట్టుపూర్వోత్తరాలు ఆనందరావుకి బొత్తిగా తెలియవు. ‘‘ఆయన గురించి నాకేమీ తెలియుదు. నేను రాలేను.మాట్లాడలేను’’అంటే ఎక్కడ పొట్టలో పొడుస్తారోనని భయంభయంగా బండి ఎక్కాడు ఆనందరావు. ఎక్కాడు సరే... సంతాపసభలో ఏంమాట్లాడాడు? వినండి...‘‘అన్న దున్న అప్పన్న చనిపోయాడు... హాహాహా...ఎప్పుడు చనిపోయాడు?ఎందుకు చనిపోయాడు?ఎలా చనిపోయాడు?... ఇవి కాదు మనకు కావాల్సింది... హాహాహా....మరి మనకు కావల్సింది ఏమిటి?ఆయన చనిపోవడమా... హాహాహా... కాదు.మళ్లీ బతకడమా... హాహాహా... కానే కాదు...లేక మనం చావడమా... హాహాహా... హ్హోహ్హోహ్హో....’’మామూలుగానైతే ఉపన్యాలసాలకు చప్పట్లు పడతాయి... మన ఆనందరావు ఉపన్యాసానికి మాత్రం నాన్‌స్టాప్‌గా చెప్పులు పడ్డాయి... తన బాధ ఎవరికి ‘చెప్పు’కోగలడు? మీరైనా ‘చెప్పండి’. – యాకుబ్ పాషా -
నవ్వుల కాంతి
ఇంతటి పరిపూర్ణమైన నవ్వును ఏ లాఫింగ్ క్లబ్ నవ్వించగలుగుతుంది? వీళ్లకు ఇంతటి సంతోషాన్ని ఎవరిచ్చారు? ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపు ఇచ్చిందా? సరస్సులో విచ్చుకున్న కమలం రేకలు ఇచ్చాయా? ఒకరి భావం ఒకరికి ఎలా అర్థమై ఉంటుంది? అయినా.. భావాన్ని పంచుకోవడానికి భాష అక్కర్లేదు, బాల్యం ఉంటే చాలు కదా! ఈ చిన్నారులను చూడండి. పదాలు తప్ప వాక్యాలు మాట్లాడటమే అలవాటు కాని వయసే ఇంకా. అలతి అలతి మాటలైతేనే నాలుక తిరుగుతుంది. పదబంధాలనైతే విరగ్గొట్టి పలకాల్సిందే. విరిగే కొద్దీ పటికబెల్లంలా ఉండే తియ్యటి పలుకులవి. ఒకరి భావాలకు బదులివ్వడానికి ఒకరి మనసు ఎంతగా ఉద్వేగ పడుతోంది! భావం గుండెల్లో సుడులు తిరుగుతుంటుంది కానీ అన్నేసి భావనల్ని భాషించలేని వయసు. అయినా సరే.. ఒకరి మనసు మరొకరి మనసుకు తాకినట్లు.. మనసారా నవ్వుకుంటున్నారు. అనిర్వచనీయమైన స్నేహ పరిమళాలను గుబాళింప జేస్తున్నారు. గుండెల నిండా ఆనందం తొణికిసలాడుతుంటే పొంగిపొర్లుతున్న సంతోషాన్ని ఒడిసి పట్టుకోవడంతో.. విరిసిన నవ్వుల పువ్వులివి. ఈ భావ వీచికలు ఆరాధ్యకృతి (2), కాత్యాయిని (5). -
కోహ్లి,యువీ, నేను అందుకే నవ్వుకున్నాం
-
కోహ్లి, నేను అందుకే నవ్వుకున్నాం: పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్: చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా- పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వులు చిందించుకున్న విషయం తెలిసిందే. అయితే ఘోర ఓటమి అనంతరం ఏ మాత్రం బాధ లేకుండా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకోవడం పట్ల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ నవ్వుల వెనకాల గల కారణాలను పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ వివరించాడు. తాజాగా స్థానిక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఆనాటి విషయాలను నెమరువేసుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను స్పిన్నర్ సయీద్ ఆజ్మల్, మాలిక్‌లు ఫన్నీగా డ్రాప్ చేశారు. చాంపియన్ ట్రోఫిలో విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అందుకునేందుకు అజ్మల్, మాలిక్‌లు ప్రయత్నించారు. అయితే మాలిక్ అందుకుంటాడని ఆజ్మల్, ఆజ్మల్ అందుకుంటాడని మాలిక్‌లు చివరి క్షణంలో క్యాచ్‌ను వదిలేశారు. అయితే క్యాచ్ డ్రాప్ అనంతరం ఆజ్మల్తో మాలిక్.. ‘నువ్వు నీ స్థానంలో ఉంటే క్యాచ్‌ను సులభంగా అందుకునే వాడివి కదా.. ఎందుకు పొజీషన్ ఛేంజ్ అయ్యావు?. అప్పుడు ఆజ్మల్ సమాధానమిస్తూ నువ్వు క్యాచ్ మిస్ చేస్తే బంతి నేలపై పడకుండా త్వరగా అందుకుందామని అనుకున్నాను’ అంటూ ఆజ్మల్ ఫన్నీగా సమాధానమిచ్చాడని మాలిక్ వివరించాడు. ఇదే విషయాన్ని టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలకు చెబితే తెగ నవ్వారని ఆనాటి సంఘటనను వివరించాడు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్ ట్రోఫీ పైనల్లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
అంత్యక్రియల్లో నవ్వినందుకు..
సాక్షి, ముంబై : ఇటీవల కన్నుమూసిన లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్ కపూర్‌కు బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచన్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్, అలియా భట్ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా కృష్ణరాజ్ కపూర్ ప్రేయర్ మీట్లో కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీలు నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక పార్టీలోనా..? అని కామెంట్ చేశారు. మిస్టర్ ఫర్పెక్షనిస్ట్ నుంచి ఇలాంటి దిగజారుడు చర్యను ఊహించలేమని.. షేమ్ అంటూ మరొక నెటిజన్ ఆమిర్‌ఖాన్‌ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. రాణీ, కరణ్ జోహార్లు సిగ్గుమాలిన పని చేశారు. రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను పెళ్లాడటం ఘనంగా భావిస్తోందని..తాము ఆమెను ద్వేషిస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
రంగస్థలం
ఆ ఊరి పేరు ‘రణస్థలం’. కానీ, కాదు. ‘‘ఇది పెన్ను అనుకుంటున్నావా? కాదు గన్ను’’ అని అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు... అది రణస్థలం అనుకుంటున్నారా? కానే కాదు రంగస్థలం. మరి ‘రంగస్థలం’ కాస్తా ‘రణస్థలం’ ఎలా అయిందంటే...తమ ఊరి పేరులోనే కళ ఉంది. ఆ కళను కళకళలాడించడానికి ‘రంగస్థలం’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించుకున్నారు ఊరి ప్రజలు. తమ ‘రంగస్థలం’ పృ«థ్వీరాజ్కపూర్ ‘పృ««థ్వీ «థియేటర్స్’లా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు.నటుల ఎంపిక పూర్తయింది.కొద్ది రోజుల తరువాత ‘రంగస్థలం’ వారి తొలి ప్రదర్శన మొదలైంది. ఇప్పుడు మనం ప్రేక్షకుల్లో కూర్చొని ‘రంగస్థలం’ కళాకారుల నట, గాన విన్యాసాలను ఆసక్తిగా చూద్దాం...అదిగో రావణ పాత్రధారి రంగస్థలం మీదికి వస్తున్నట్లుగా ఉంది. వచ్చేలోపు అతడి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అతని పేరు రాజేషం. ఈ రాజేషానికి మతిమరుపు ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి రాజేషానికి రావణుడి వేషం ఎలా దక్కింది? ‘రంగస్థలం’ స్పెషాలిటేమిటంటే నటుల ఎంపిక టాలెంట్ మీద ఆధారపడి ఉండదు. వేలంపాట మీద ఆధారపడి ఉంటుంది. అంటే... ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇష్టమైన వేషం దక్కుతుంది. మతిమరుపు ఉన్నా సరే... రాజేషానికి రావణుడి వేషం దక్కడానికి కారణం వేలంలో ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చి ఆ వేషాన్ని సొంతం చేసుకోవడమే. అలాగని తన పాత్రను లైట్‌గా తీసుకోలేదు రాజేషం.చాలా వెయిట్ పెరిగాడు. తన డైలాగులను రాత్రి పగలు అనే తేడా లేకుండా బట్టీ పట్టాడు.‘రంగస్థలం’ వేదిక దగ్గరకు బయలు దేరేముందు...తన భార్య ముందు నిల్చొని...‘‘ఇవ్వాళ మన పొగ్రాం ఉంది. అదరగొడతాను... నా డైలాగు విను’’ అన్నాడో లేదో ఆమెకు కోపం వచ్చింది.‘‘ కొత్తగా వినేదేమిటి నా బొంద? మీరు ఇల్లంతా అదిరిపోయేలా ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ ఇనలేక ఛస్తున్నాను. అవి నా నోటికి కూడా వచ్చాయి’’ అంటూ ఆమె నోరు పెంచి డైలాగ్ అందుకుంది...‘హా హా హాహా హా హాటెక్కుల మారి టక్కులాడితంటాలతో తైతక్కలతోమా తాతలను మైమరిపించిఅమృతకలశం హరించారుకదూకామధేనువును,కల్పతరువును ఆకట్టుకొనిమాకు సున్నా చుట్టారు కదూహా హా హా’‘శబ్బాష్’ అని భార్యని మెచ్చుకుంటూ అక్కడి నుంచి ‘రంగస్థలం’ వేదిక దగ్గరకు వెళ్లాడు రాజేషం.‘‘వుప్పుడు మేకతోకల రాజేషం ప్రదర్శించు రావణుడి ఏకపాత్రాభినయం’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించింది. రావణ పాత్రధారి రాజేషం స్టేజీ మీదకు వచ్చాడు. రావణుడి వేషంలో ఉన్న రాజేషాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేస్తున్నారు. దీంతో రాజేషానికి మరింత హుషారు వచ్చింది.మీసం తిప్పాడు.గద పైకెత్తి ఠీవిగా భుజాల మీద పెట్టుకున్నాడు.గొంతు సవరించాడు.గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయింది. డైలాగ్ గుర్తుకు రావడం లేదు. డైలాగు గుర్తు లేదుగానీ... డైలాగుకు ముందు వచ్చే పెద్ద నవ్వు మాత్రం గుర్తుంది.డైలాగ్ గుర్తు వచ్చేవరకు నవ్వుతో మానేజ్ చేద్దామనుకొని ‘హా హా హా’ అని పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అలా పదినిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు.‘‘నవ్వింది చాలుగాని.... డైలాగ్ కొట్టు బే’’ అని ప్రేక్షకుల నుంచి ఒక గొంతు వినిపించింది. ఈలోపే పాత చెప్పొక్కటి వచ్చి రాజేషం మూతిని తాకింది. తాకితే తాకిందిగానీ... అది రాజేషం పెట్టుడు మీసాన్ని తాకింది. దాంతో అది ఊడి కిందపడిపోయింది.ఈసారి నవ్వడం ప్రేక్షకుల వంతయింది! దీంతో రెండు వర్గాల మధ్య(రాజేషం మిత్రవర్గం, శత్రువర్గం) ఘర్షణ మొదలైంది.‘‘వుప్పుడు పీకల వెంకటేషం ఇంద్రధనస్సు సినిమాలోని పాటను తన మధురకంఠంతో వినిపించి మిమ్మల్ని మైమరపింపజేస్తాడు’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించడంతో గొడవ సద్దుమణిగి అందరూ సైలెంటైపోయారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... రాజేషంలా వెంకటేషం మతిమరుపు మైండ్ కాదు. మాంచి గాయకుడు. కానీ అప్పుడప్పుడూ మందుకొడుతుంటాడు. అతను స్టేజీ ఎక్కే ముందు ఎవడో అభిమాని క్వార్టర్ సీసా చేతిలో పెట్టాడు. మనవాడికి ఆత్రం ఎక్కువ. అదేదో పాట పూర్తయినాక తాగవచ్చుకదా... స్టేజీ ఎక్కే ముందు చాటుకు వెళ్లి సగం లాగించాడు. ఆ తరువాత...మైక్ ముందుకు వెళ్లి గొంతెత్తాడు.‘నేనొక ప్రేమ పిశాచిని.నువ్వుక ఆస్థమవాసివి.నా దాహం తీరనిది’ అని పాడుతూ జేబులో మిగిలి ఉన్న క్వార్టర్ సీసాను స్టేజీ మీదనే ఖాళీ చేశాడు వెంకటేషం. జనంలో హాహాకారాలు. కారాలు మిరియాలు. లొల్లి లొల్లి.... ఎవరు ఎవర్ని తిడుతున్నారో తెలియడం లేదు. ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. ఒకడు ఇంకొకడి కాలరు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. ఒకడు ఇంకొకడి జుట్టు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. రంగస్థలం కాస్త రణస్థలం అయింది. పట్నం నుంచి పోలిసు వ్యాన్ దిగింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదారు పోలీసులు. ఇక అప్పటి నుంచి కళ అనే మాట వినబడితే కలరా సోకినట్లుగా గజగజా వణికిపోతారు రణస్థలం గ్రామస్తులు! – యాకుబ్ పాషా -
అయ్యో పాపం దెయ్యం!!
తనకు ‘వీర’ అని పేరు పెట్టిన వ్యక్తిని బతికించి, చంపేయాలన్నంత కోపం వీర కుమార్‌కి. ఆ పేరు పెట్టిన దూరపు బంధువు చనిపోయాడు కాబట్టి బతికి పోయాడు! ‘వీర’ అనే పేరులో బూతేమీ లేదే? మరి తన పేరు మీద తనకు కోపం ఎందుకు?! ఎందుకంటే వీరకుమార్ పేరు మోసిన పిరికివాడు. ‘తెనాలి’ సినిమాలో కమలహాసన్ టైప్ అన్నమాట. ‘‘నీకు ఏవంటే భయం?’’ అనే డాక్టర్ క్వొశ్చన్‌కు కమలహాసన్ ఏమంటాడు? సరిగ్గా ఇలా అంటాడు... ‘అంతా శివమయం అంటారు కదండీ. నాకు మాత్రం అంతా భయమయమండీ. నీడంటే భయం. గోడ అంటే భయం. గూడు అంటే భయం. బల్లి అంటే భయం...పిల్లి అంటే భయం. బంతిని చూసినా భయం. ముద్దబంతిని చూసినా భయం. ఏ కాంతను చూసినా భయం. ఏకాంతంగా ఉండాలన్నా భయం’ సినిమాలో కమలహాసన్‌కు ఉన్న భయాలన్నీ వీరకుమార్కి ఉన్నాయి. అలాంటి వీర ఒకరోజు రాత్రి హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయినందుకు వీరకు విపరీతమైన సంతోషంగా ఉంది. బతికినంత కాలం తాను భయపడుతూనే బతికాడు తప్ప, ఎవరినీ భయపెట్టలేదు. ‘‘ఇప్పుడు నాకో గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు చూపిస్తా నా తడాఖా. నేను దెయ్యమై ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తాను. వారు గజగజ వణుకుతుంటే నేను భళ్లు భళ్లుమని నవ్వుతుంటాను’’ కాలర్ ఎగరేశాడు వీర. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ‘అలా షికారుకు వెళ్లొస్తాను’ అని శ్మశానంలో సాటి దెయ్యాలకు చెప్పి బయలుదేరింది వీర దెయ్యం. జూబ్లిహిల్స్‌లో అందంగా కనిపిస్తున్న ఒక ఇంట్లోకి దూరింది దెయ్యం. ఆ ఇంట్లో అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. పదిహేడేళ్ల ఒక కుర్రాడు మాత్రం ‘స్మార్ట్‌ఫోన్’లో తలమునకలై ఉన్నాడు. ఈ కుర్రాడిని భయపెట్టాలని రీసౌండ్ ఎఫెక్ట్‌తో.... ‘రా.......జా......’ అని పిలిచినట్లుగా అరిచింది దెయ్యం. కుర్రాడు మాత్రం పొరపాటున కూడా దెయ్యం వంక చూడలేదు. ఫేస్బుక్లో ఏదో కామెంట్ పోస్ట్ చేస్తున్నాడు. రీసౌండ్ ఎఫెక్ట్‌తో దెయ్యం అయిదుసార్లు పిలిచిన తరువాత ఆ కుర్రాడు...‘చల్లని రాజా ఓ చందమామా...’ అని పాడుకున్నాడే తప్పా దెయ్యం వైపు చూడలేదు...ఫేస్బుక్లో నుంచి తల తీయలేదు. ఆ పాటలో వెటకారం తప్ప రవ్వంత భయం లేదు.‘మరెవరైనా అయితే... రా.....జా అనే రీసౌండ్‌కు భయపడి చచ్చేవాళ్లు. వామ్మో దెయ్యం అని అరిచేవాళ్లు. వీడేంటి ఇలా?’ తనలో తాను కుమిలిపోయింది దెయ్యం. ఈ జనరేషన్ కుర్రాళ్లని తిట్టుకుంది. ఈసారి క్రూరమైన గొంతుతో... ‘ఒరేయ్ రాజా’ అని హాల్ అదిరేలా అరిచింది దెయ్యం. ఆ కుర్రాడు మాత్రం యూట్యూబులో ‘భయ్యానికి నేనంటే భయ్యం.... దెయ్యానికి నేనంటే దడ’ అనే పాటను చూస్తూ ఆనందిస్తున్నాడు. భయపెట్టాలని దెయ్యం ఎంతగా ప్రయత్నించినా ఆ కుర్రాడు తన పనిలో తాను ఉన్నాడు. కొద్దిసేపు ఫేస్బుక్, కొద్దిసేపు యూట్యూబ్, కొద్ది సేపు ట్విట్టర్, కొద్దిసేపు మట్టర్...ఇలా ఏవేవో చూస్తున్నాడేగానీ ‘రా...జా’ అనే భయంకరమైన సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అని ఒక్క నిమిషం కూడా పక్కకు తిరిగి చూడలేదు. ‘ఛీ... వెదవ బతుకు... సారీ వెదవ చావు’ అని తనను తాను తిట్టుకొని అక్కడి నుంచి స్పీడ్‌గా పారిపోయింది దెయ్యం. ఇప్పుడు దెయ్యం సాగర్ అనే ఆయన ఇంట్లోకి దూరింది. ఇతడిని అందరూ ‘సమాచార సాగర్’ అని పిలుచుకుంటారు. దీనికి కారణం...ఈ సాగర్ని ఒక్క విషయం అడిగితే పది విషయాలు చెబుతుంటాడు. ఇప్పుడు మనం మళ్లీ దెయ్యం దగ్గరికి వద్దాం. ‘హీ....హీ....హీ’ అని వికృతంగా నవ్వింది దెయ్యం. చదువుతున్న పుస్తకం నుంచి తల పైకెత్తిన సాగర్ వెంటనే...‘హీ....హీ....హీ’ అనేది హిబ్రూ పదం ‘గుష్కీ గుష్కి’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘మీరు క్షేమంగా ఉన్నారా?’ అని దెయ్యానికి చెప్పి తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. ‘‘రేయ్ సచ్చినోడా...సారీ...బతికినోడా...నేను దెయ్యాన్నిరా...భయపడరా’’ గట్టిగా అరిచింది దెయ్యం. ‘దెయ్యం’ అనే పదం వినబడగానే సాగర్ కళ్లు చురుక్కున మెరిశాయి. వెంటనే గొంతు సర్దుకొని... ‘దెయ్యాల్లో మొత్తం 72 రకాలు ఉన్నాయి. ఇందులో ఒక దెయ్యానికి మరొక దెయ్యానికి పోలికే లేదు. కలర్ మాత్రం సేమ్ టు సేమ్. ఆఫ్రికా దెయ్యాలు నల్లగా ఉంటాయనేది అపోహ మాత్రమే’ అని తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు సాగర్. ‘వీడు సమాచారంతో భయపెడుతున్నాడు తప్ప భయపడడం లేదు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు’ అని మరోసారి పారిపోయింది దెయ్యం. చివరిగా ఒక ప్రయత్నం చేసి చూద్దామని కృష్ణానగర్‌లో ఒక చిన్నరూమ్లోకి దూరింది. ఆ గదిలో థర్టీ ప్లస్ కుర్రాడు ఏదో సీరియస్‌గా రాసుకుంటున్నాడు. ఆ కుర్రాడి ముందుకు వచ్చి...‘రేయ్...నేను దెయ్యాన్నిరా’ గట్టిగా తనను తాను పరిచయం చేసుకుంది దెయ్యం. ‘వామ్మో’ అని అరవలేదు ఆ కుర్రాడు. కొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు వంద ఒకేసారి దొరికినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ తరువాత ఇలా అన్నాడు... ‘‘సమయానికి దెయ్యంలా వచ్చారు. ఇలా కూర్చొండి. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. గత అయిదేళ్లుగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. నా పేరు...మణిరత్న శంకర రాజమౌళి. అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తుంటారు. ఇప్పుడంతా హర్రర్ సినిమాల హవా నడుస్తుంది కదండీ....అందుకే మంచి దెయ్యం స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసి, పెద్ద నిర్మాతకు వినిపించి డైరెక్టరవుదామనుకుంటున్నాను. దెయ్యం సబ్జెక్ట్‌పై వర్క్ చేయడానికి ఎన్నో పుస్తకాలు చదివాను. చదవడం వేరు...స్వయంగా మీలాంటి దెయ్యం మహాశయులు నన్ను వెదుక్కుంటూ రావడం వేరు. మీరు ఇన్పుట్స్ ఇస్తే స్క్రిప్ట్ అద్భుతంగా వస్తుంది. దెయ్యం సార్...ప్లీజ్ ఏమైనా చెప్పండి సార్’’ అంటూ పెన్ను ప్యాడ్ పట్టుకొని దెయ్యం వైపు ఆశగా చూశాడు ఫ్యూచర్ డైరెక్టర్ ఎంయస్ఆర్. ‘‘ఒరేయ్ నీకో దండం...నీ సినిమాకో దండం...నన్ను వొదల్రా బాబూ’’ అని అక్కడి నుంచి పారిపోవడానికి రెడీ అయింది దెయ్యం. ‘‘అలా అంటే ఎలా సార్. మీకు పాదాభివందనం చేస్తాను. మీరు నాకు ఇన్పుట్స్ ఇవ్వాల్సిందే ’’ అంటూ సడన్‌గా వంగీ ‘సారీ...మీకు కాళ్లు ఉండవు కదా’’ అని పైకి లేచాడు ఎంయస్ఆర్. ఈలోపే...‘పరారే పరారే... ఈ మనుషులు దేనికీ భయపడి చావరే’ అని పాడుకుంటూ అక్కడి నుంచి జెట్ స్పీడ్‌తో కన్నీటితో కానరాని తీరాలకు పారిపోయింది దెయ్యం!...పాపం దెయ్యం!! – యాకుబ్ పాషా -
నవ్వులో శివుడున్నాడు
వివరం ‘ఒక్క నవ్వే చాలు వజ్జిర వయిడూర్యాలు’ అంటాడు ఎంకిపాటలో నాయుడు బావ. కొన్ని నవ్వులు ప్రేమిస్తాయి. కొన్ని నవ్వులు ప్రేమించబడతాయి. కొన్ని నవ్వులు వరిస్తాయి. కొన్ని తరిస్తాయి. కొన్ని నవ్వులు పెళ్లిపీటలు ఎక్కుతాయి. నవ్వులు కరిగితే ప్రేమ కవిత్వాలవుతాయి. పరస్పరం అర్థం చేసుకున్న నవ్వులు జీవితాంతం కొత్త మొగ్గల్ని తొడుగుతూనే ఉంటాయి. నవ్వు మనలో ఒక జీవనది అయినప్పుడు బతుకు సార్థకం అవుతుంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’. ఈ సందర్భంగా ఇవి నవ్వుల రవ్వలు, పువ్వూలు! ‘నవ్వులో శివుడున్నాడు’ అన్నాడొక మహానుభావుడు. ఇది అక్షర సత్యం. నిరంతరం నవ్వే ముఖంలో దైవత్వం ఉంటుంది. కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా ఉంటాయి. కొన్ని పొద్దెక్కిన సూర్యకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు వెన్నెల మడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. కృతయుగంలో క్షీర సాగర మథనం వేళ చంద్రవంక పుట్టి, శివుని జటలో అమరినప్పుడు లోకాలన్నీ నవ్వాయి. త్రేతాయుగంలో శివ ధనుర్భంగానికి గంగ ఫెళ్లున నవ్వింది. ఆ నవ్వుకి తొణికిన గంగ శివుడి మూడో కంటికి చల్లటి నీటి తెర అడ్డు వేసింది. కల్యాణ రాముడికి స్వచ్ఛమైన దీవెనలు అందాయి. ద్వాపరంలో ఒక పురిటికందు అష్టమి రాత్రి పడగ నీడన తనని స్పృశిస్తూ సాగుతున్న వేళ యమునానది నిలువెల్లా నవ్వింది. కలియుగంలో సత్యం అహింసలే ఆయుధాలుగా విశాల భారతి శృంఖలాలను తెంచినప్పుడు ఒక బోసినవ్వు అంతరిక్షం దాకా ఆవరించింది. ఆనందానికి లిపి నవ్వు. అది పెదాల మీద సందర్భానికి తగినట్టు రూపుదిద్దుకుని ముఖమంతా కమ్ముకుంటుంది. దస్తూరిలాగే కొందరి నవ్వులు ముత్యాల కోవలా ఉంటాయి. మరికొన్ని ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. కొందరి నవ్వులు బుగ్గన దిష్టి చుక్కలవుతాయి. ప్రతి నవ్వుకి ఒక భాష, దానికో భాష్యం ఉంటాయి. బుద్ధుడు నవ్వాడు ‘నవ్వును జంతువుల్ నరుడు నవ్వును’ అంటూ నవ్వుని శ్లాఘిస్తూ కవికోకిల జాషువా గొప్ప పద్యం చెప్పారు. నవ్వు చాలా ప్రాచీనమైంది. పసిపిల్లలు నిద్రలో తెగ నవ్వుతుంటారు. వాళ్లకి గత జన్మలో జరిగిన హాస్య సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి కాబోలు! గహనమైన తాత్విక అంశాలను మానవాళికి అందించిన జగద్గురువు శంకరాచార్యులు గొప్ప హాస్యచతురులు కూడా. మిధ్యావాదాన్ని ప్రతిపాదించిన ఆచార్యులవారు గజం మిధ్య పలాయనం మిధ్య అంటూ గంభీర వాతావరణాన్ని తేలికపరిచారు. ‘నాకే కనుక హాస్య స్పృహ లేకపోతే ఏనాడో చనిపోయి ఉండేవాణ్ని’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. మనదేశం అగ్ని క్షిపణిని విజయవంతంగా ప్రదర్శించగానే ‘బుద్ధుడు నవ్వాడు’ అని నాటి దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. జెన్ బౌద్ధంలో నవ్వుకి మంచి స్థానం ఉంది. ముగ్గురు బౌద్ధ సన్యాసులు నవ్వుతున్నట్టుగా జెన్ తత్వం చిహ్నం ఉంటుంది. దానికో కథ ఉంది. బౌద్ధ ఆరామానికి పక్కనే ఉన్న పట్టణానికి మధ్య ఒక కాలవ ఉంది. ఆ కాలవ మీద కొయ్య వంతెన ఉంది. బౌద్ధ సన్యాసులెవరూ ఆ వంతెన మీదకు గాని, అది దాటి పట్టణానికి గాని వెళ్లడం నిషేధం. అయితే, ఒకరోజు ముగ్గురు లేత సన్యాసులు లోకాభిరామాయణం చెప్పుకుంటూ, మాటల్లో పడి అలా వంతెన దాటి, అవతలకు వెళ్లారు. తీరా అవతల అడుగు పెట్టాక జరిగిన అపచారం స్ఫురించింది. నాలికలు కరుచుకుని ముగ్గురూ ఒక్కసారి హాయిగా నవ్వుకున్నారు. ఈ సందర్భాన్ని జెన్ బౌద్ధానికి పతాకం చేశారు. గొప్ప హాస్యశీలత! క్రీస్తు ప్రభువు బైబిల్ పవిత్ర గ్రంథంలో లూకా సువార్తలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ‘ఇప్పుడు ఏడ్చెడివారు రక్షింపబడుదురు గాక! ఆ పిదప వారెల్లరూ నవ్వబడుదురు’ నవ్వుని సానుకూల స్పందనకి సంకేతంగా భావిస్తారు. కాని అది పాక్షిక సత్యమే. కొందరు నవ్వుతూనే వాత పెడతారు. పవిత్ర ఖురాన్, ‘స్నేహితులను నవ్వించగలవాడే స్వర్గం చేరడానికి అర్హుడు’ అని ప్రబోధిస్తోంది. నవ్వించగలవాడు అనడంలో విస్తృతమైన భావాలు ఉన్నాయి. ఎదుటివారిని సంతోషపెట్టడమంటే వారికి ఉపకారం చెయ్యడం. కొందరు పురాణాల్లో నవ్వు లేదండీ అని నవ్వేస్తుంటారు. ఆనాటి వినాయక విజయం యావత్తూ నవ్వు మీదనే కదా ఆధారపడి ఉంది. అసందర్భంగా నవ్వి చంద్రుడు శాపగ్రస్తుడైనాడు. ఇది మానవజాతికి ఒక హెచ్చరిక. అధికారుల దగ్గర సందర్భోచితంగా నవ్వాలి గాని, ఊరికే వచ్చింది గదాని నవ్వేయకూడదు. ‘జీవిత వృక్షం కొసను పూచిన పువ్వే నవ్వు’ అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. దాసుగారు నవ్వించారు హాస్య చతురత అందరికీ అబ్బదు. అదొక సుకృతం. స్రష్టలు ఏ రసాన్ని అందించినా దాన్ని ఆస్వాదించి, అనుభవించగల రసికులున్నప్పుడే అది అందగిస్తుంది. లేదంటే మందగిస్తుంది. సంగీత సాహిత్యాలను సరితూచిన త్రాసు ఆదిభట్ల నారాయణదాసు మాటకి, పాటకి, ఆటకి ప్రసిద్ధులు. విజయనగరం మహారాజావారి ఆప్తవర్గంలోని వారు. ఒకసారి రాజుగారితో పేకాటకు కూచున్నాడు నారాయణదాసు. వేళ మంచిదే. అప్పటికి చాలా డబ్బు గెలుచుకున్నారు. ఉన్నట్టుండి దశ మారింది. రాజుగారికి ఒక్కసారిగా ఆసులు పడ్డాయి. దాసుగారికి రాజులు పడ్డాయి. దాంతో నారాయణ దాసు పెద్ద పందెం వోడిపోయారు. రాజుగారు ఆదిభట్ల ముందు కుప్పగా పోసివున్న డబ్బుని ఒక్కసారిగా రెండు చేతులా తనవైపు లాక్కున్నారు. దాసుగారు ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి, వెంటనే తెప్పరిల్లి, ‘అయితే రాజుల కంటే ఆసులు గొప్పవన్న మాట’ అన్నారు తనదైన శైలిలో. వెంటనే రాజు కవి రసికతను పసిగట్టి, ఇంతకుముందు తనవైపు లాక్కున్న డబ్బుని దాసుగారి ముందుకు నెట్టి మీసాలు తొలికేలా విలాసంగా నవ్వారట! హాస్యంలో శివుడే కాదు డబ్బు కూడా ఉంది. నవ్వుల్ని పండించారు జానపద కళారూపాలలో ముఖ్యమైన దినుసు హాస్యం. తోలుబొమ్మలాటలో బంగారక్క, జుట్టుపోలిగాడు కావల్సినంత సందడి చేసేవారు. అది ముతక హాస్యం. అవధాన ప్రక్రియ శతాబ్దాల నాడే ఆవిర్భవించింది. అందులో కొన్ని అంశాలు కేవలం హాస్య సృజన కోసమే ఉంటాయి. కవి, పండితులు కాశీ కృష్ణాచార్యులు బహుగ్రంథ కర్త, విశేషంగా విలక్షణంగా అవధానాలు చేసిన దిట్ట. అయితే, అలవాటుగా పొరబాటుగా ఆయన పేరుని చాలామంది కాశీ కృష్ణమాచార్యులుగా పలికేవారు. ఆయనొక చోట అందుకు అసహనం వ్యక్తం చేస్తూ, ‘నాకు నడమంత్రపు సిరి లేదు. నా పేరు కృష్ణాచార్యులు మాత్రమే’ అన్నారు. ‘మా’ అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం. తిరుపతి వేంకట కవులు జంటగా అవధానాలు నెరపారు. ప్రాచుర్యం పొందారు. వారి అవధాన పద్యాలలో, ‘‘ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము..’ అనేది చాలా ప్రసిద్ధం. దానిని కాలానుగుణంగా అన్వయిస్తూ నేటి అవధాన సరస్వతి గరికపాటి నరసింహారావు చెప్పిన పద్యం: జీపుల నెక్కినాము, ధన జీవులు మ్రొక్కగ నిక్కినాము వా గ్దీపము జూపినాము, గడిచేరిన మేటి వధాన విద్యలో టాపును లేపినాము డఢఢామ్మని పేలెడి ఆశు విద్యలో ఓపిక మేర లోకముల నూపితి నీ వలనన్ సరస్వతీ ఆశువుగా గరికపాటి పద్యం పూర్తిచేశారో లేదో శ్రోతల్లోంచి ఒక గొంతు ‘ఎవరా సరస్వతి’ అంటూ నిగ్గదీసి నవ్వులు పండించింది. యుగయుగాల నవ్వులు నవ్వుకి యుగయుగాల చరిత్ర ఉంది. ఇతిహాసాలను మలుపు తిప్పిన వైనమూ ఉంది. ద్వాపరంలో మయసభలో రారాజు తడబాటుని చూసి ద్రౌపది నవ్వి ఉండకపోతే కురుక్షేత్రమూ లేదు, భగవద్గీతా లేదు. ఇక జానపద రామాయణంలో లక్ష్మణస్వామి నవ్వు అందరినీ భుజాలు తడుముకునేలా చేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో పాత్రలు సజీవంగా రూపుదిద్దుకుని మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొందరు నవ్వించడానికే రచనలు చేసి హాస్య బ్రహ్మలుగా రాణకెక్కారు. హాస్యాన్ని అనేక విధాలుగా విశ్లేషకులు విడగొట్టారు. శబ్దాశ్రయం, చేష్టాగతం, చురక, అనుకరణ, అసంబద్ధం ఇలా నానా రకాలుగా నవ్వు పుట్టించవచ్చునని సోదాహరణంగా వివరించారు. శాస్త్రంలోకి వెళితే హాస్యం పండదు. ఒక్కోసారి ఉన్నట్టుండి నవ్వు వస్తుంది. దాన్ని మనసా స్వాగతించడమే ఆరోగ్యం. ఈ మధ్య ‘నవ్వు’ ఆరోగ్యానికి అవసరమని తేల్చారు. ఒకరు తేల్చేదేమిటి మనకు తెలియదా? నలుగురు కూచుని నవ్వుకునే వేళ ఎంత హాయిగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయాక అనేక వరసలు వెలిసిపోయాయి. వదిన, మరదలు, అత్త, బావ లాంటి సరసానికి సరైన వరసలు లేవిప్పుడు. దాంతో చతురతలు చమత్కారాలు కరువైనాయి. జీవితం ఒక లాగుడు బండిలా తయారైంది. ప్రతివారికీ టెన్షన్ ఒక ఊతపదమైంది. ఒకరు ఒకరు, ఇద్దరు మాత్రమే మాట్లాడుకునే సెల్‌ఫోన్ సంస్కృతి ప్రబలింది. మాటలే తప్ప మాటకి మాట, పై మాటలకు అక్కడ ఆస్కారం ఉండదు. ఒకప్పుడు ఇంటిపనులు శ్రమశక్తితో చేసుకునేవారు. నీళ్లు తోడినా, వస్త్రాలుతికినా, దంచినా, రుబ్బినా, నడిచినా మంచి వ్యాయామంగా పనిచేసేవి. అన్నింటికీ యంత్రాలు వచ్చాయి. మీట నొక్కితే ఆ పనులన్నీ క్షణంలో చేసేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిందల్లా శ్రమలేమితో వచ్చే అనారోగ్యం. అందుకని ఇప్పుడు కృత్రిమంగా యంత్రాలతోనే శ్రమించే సంస్కృతి వచ్చింది. నవ్వు సంగతి కూడా ఇంతే! సహజంగా నవ్వుకోవడం పోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘లాఫింగ్ క్లబ్’లు వచ్చాయి. అక్కడ పదిమందీ చేరి పడీ పడీ నవ్వుతుంటారు. అందులో జీవం ఉండదు. మంచి సాహిత్యం, మంచి నాటకాలు, మంచి సినిమాలు చక్కని చిక్కని వినోదాన్ని దానితో పాటు నవ్వుని అందించి అలరించాయి. క్రమేపీ హాస్యరసం పాలు తగ్గి రౌద్ర భయానక బీభత్స రసాల పాత్ర ప్రముఖమైంది. జీవితంలోనూ సాహిత్యంలోనూ నవ్వు కరువైంది. ఇది కరుణశ్రీ పద్యం రాధికా క్రోధ మధురాధరమ్మొకింత నవ్వెనో లేదో పకపక నవ్వె ప్రకృతి; నవ్వుకొన్నది బృందావనమ్ము యమున నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల! ఔను, ఈ వేసవిలో వచ్చే మల్లెలు మంచి నవ్వులకు ప్రతీకలు. ‘ఒక్క నవ్వే చాలు వజ్జిర వయిడూర్యాలు’ అంటాడు ఎంకిపాటలో నాయుడు బావ. కొన్ని నవ్వులు ప్రేమిస్తాయి. కొన్ని నవ్వులు ప్రేమించబడతాయి. కొన్ని నవ్వులు వరిస్తాయి. కొన్ని తరిస్తాయి. కొన్ని నవ్వులు పెళ్లిపీటలు ఎక్కుతాయి. నవ్వులు కరిగితే ప్రేమ కవిత్వాలవుతాయి. పరస్పరం అర్థం చేసుకున్న నవ్వులు జీవితాంతం కొత్త మొగ్గల్ని తొడుగుతూనే ఉంటాయి. నవ్వు మనలో ఒక జీవనది అయినప్పుడు బతుకు సార్థకం అవుతుంది. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు కుందన్లాల్ సైగల్ పాడిన పాట ఒకటుంది: ‘దుఃఖ్ కే అప దిన్ బీతత్ నాహీ సుఖ్ కే దిన్ కే ఏక్ స్వపన్ థా ’ అంటూ సైగల్ తన గంభీర స్వరంతో పాడుతూ మధ్యలో నిర్వేదంతో నవ్వుతాడు. ఆ నవ్వులో ధ్వనించే తీపిని, చేదుని కూడా భరించడం కష్టం. నవ్వుకున్న శక్తి అసామాన్యం. ఎందుకంటే నవ్వులో శివుడున్నాడు మరి. - శ్రీరమణ -
మెక్సికోలో నవ్వుల్లో ముంఛెత్తిన లాఫధాన్