నవ్వులో శివుడున్నాడు
వివరం
‘ఒక్క నవ్వే చాలు వజ్జిర వయిడూర్యాలు’ అంటాడు ఎంకిపాటలో నాయుడు బావ. కొన్ని నవ్వులు ప్రేమిస్తాయి. కొన్ని నవ్వులు ప్రేమించబడతాయి. కొన్ని నవ్వులు వరిస్తాయి. కొన్ని తరిస్తాయి. కొన్ని నవ్వులు పెళ్లిపీటలు ఎక్కుతాయి. నవ్వులు కరిగితే ప్రేమ కవిత్వాలవుతాయి. పరస్పరం అర్థం చేసుకున్న నవ్వులు జీవితాంతం కొత్త మొగ్గల్ని తొడుగుతూనే ఉంటాయి. నవ్వు మనలో ఒక జీవనది అయినప్పుడు బతుకు సార్థకం అవుతుంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’. ఈ సందర్భంగా ఇవి నవ్వుల రవ్వలు, పువ్వూలు!
‘నవ్వులో శివుడున్నాడు’ అన్నాడొక మహానుభావుడు. ఇది అక్షర సత్యం. నిరంతరం నవ్వే ముఖంలో దైవత్వం ఉంటుంది. కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా ఉంటాయి. కొన్ని పొద్దెక్కిన సూర్యకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు వెన్నెల మడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. కృతయుగంలో క్షీర సాగర మథనం వేళ చంద్రవంక పుట్టి, శివుని జటలో అమరినప్పుడు లోకాలన్నీ నవ్వాయి. త్రేతాయుగంలో శివ ధనుర్భంగానికి గంగ ఫెళ్లున నవ్వింది. ఆ నవ్వుకి తొణికిన గంగ శివుడి మూడో కంటికి చల్లటి నీటి తెర అడ్డు వేసింది. కల్యాణ రాముడికి స్వచ్ఛమైన దీవెనలు అందాయి.
ద్వాపరంలో ఒక పురిటికందు అష్టమి రాత్రి పడగ నీడన తనని స్పృశిస్తూ సాగుతున్న వేళ యమునానది నిలువెల్లా నవ్వింది. కలియుగంలో సత్యం అహింసలే ఆయుధాలుగా విశాల భారతి శృంఖలాలను తెంచినప్పుడు ఒక బోసినవ్వు అంతరిక్షం దాకా ఆవరించింది. ఆనందానికి లిపి నవ్వు. అది పెదాల మీద సందర్భానికి తగినట్టు రూపుదిద్దుకుని ముఖమంతా కమ్ముకుంటుంది. దస్తూరిలాగే కొందరి నవ్వులు ముత్యాల కోవలా ఉంటాయి. మరికొన్ని ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. కొందరి నవ్వులు బుగ్గన దిష్టి చుక్కలవుతాయి. ప్రతి నవ్వుకి ఒక భాష, దానికో భాష్యం ఉంటాయి.
బుద్ధుడు నవ్వాడు
‘నవ్వును జంతువుల్ నరుడు నవ్వును’ అంటూ నవ్వుని శ్లాఘిస్తూ కవికోకిల జాషువా గొప్ప పద్యం చెప్పారు. నవ్వు చాలా ప్రాచీనమైంది. పసిపిల్లలు నిద్రలో తెగ నవ్వుతుంటారు. వాళ్లకి గత జన్మలో జరిగిన హాస్య సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి కాబోలు! గహనమైన తాత్విక అంశాలను మానవాళికి అందించిన జగద్గురువు శంకరాచార్యులు గొప్ప హాస్యచతురులు కూడా. మిధ్యావాదాన్ని ప్రతిపాదించిన ఆచార్యులవారు గజం మిధ్య పలాయనం మిధ్య అంటూ గంభీర వాతావరణాన్ని తేలికపరిచారు. ‘నాకే కనుక హాస్య స్పృహ లేకపోతే ఏనాడో చనిపోయి ఉండేవాణ్ని’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ.
మనదేశం అగ్ని క్షిపణిని విజయవంతంగా ప్రదర్శించగానే ‘బుద్ధుడు నవ్వాడు’ అని నాటి దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. జెన్ బౌద్ధంలో నవ్వుకి మంచి స్థానం ఉంది. ముగ్గురు బౌద్ధ సన్యాసులు నవ్వుతున్నట్టుగా జెన్ తత్వం చిహ్నం ఉంటుంది. దానికో కథ ఉంది. బౌద్ధ ఆరామానికి పక్కనే ఉన్న పట్టణానికి మధ్య ఒక కాలవ ఉంది. ఆ కాలవ మీద కొయ్య వంతెన ఉంది. బౌద్ధ సన్యాసులెవరూ ఆ వంతెన మీదకు గాని, అది దాటి పట్టణానికి గాని వెళ్లడం నిషేధం. అయితే, ఒకరోజు ముగ్గురు లేత సన్యాసులు లోకాభిరామాయణం చెప్పుకుంటూ, మాటల్లో పడి అలా వంతెన దాటి, అవతలకు వెళ్లారు. తీరా అవతల అడుగు పెట్టాక జరిగిన అపచారం స్ఫురించింది. నాలికలు కరుచుకుని ముగ్గురూ ఒక్కసారి హాయిగా నవ్వుకున్నారు. ఈ సందర్భాన్ని జెన్ బౌద్ధానికి పతాకం చేశారు. గొప్ప హాస్యశీలత!
క్రీస్తు ప్రభువు బైబిల్ పవిత్ర గ్రంథంలో లూకా సువార్తలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ‘ఇప్పుడు ఏడ్చెడివారు రక్షింపబడుదురు గాక! ఆ పిదప వారెల్లరూ నవ్వబడుదురు’ నవ్వుని సానుకూల స్పందనకి సంకేతంగా భావిస్తారు. కాని అది పాక్షిక సత్యమే. కొందరు నవ్వుతూనే వాత పెడతారు. పవిత్ర ఖురాన్, ‘స్నేహితులను నవ్వించగలవాడే స్వర్గం చేరడానికి అర్హుడు’ అని ప్రబోధిస్తోంది. నవ్వించగలవాడు అనడంలో విస్తృతమైన భావాలు ఉన్నాయి. ఎదుటివారిని సంతోషపెట్టడమంటే వారికి ఉపకారం చెయ్యడం. కొందరు పురాణాల్లో నవ్వు లేదండీ అని నవ్వేస్తుంటారు. ఆనాటి వినాయక విజయం యావత్తూ నవ్వు మీదనే కదా ఆధారపడి ఉంది. అసందర్భంగా నవ్వి చంద్రుడు శాపగ్రస్తుడైనాడు. ఇది మానవజాతికి ఒక హెచ్చరిక. అధికారుల దగ్గర సందర్భోచితంగా నవ్వాలి గాని, ఊరికే వచ్చింది గదాని నవ్వేయకూడదు. ‘జీవిత వృక్షం కొసను పూచిన పువ్వే నవ్వు’ అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.
దాసుగారు నవ్వించారు
హాస్య చతురత అందరికీ అబ్బదు. అదొక సుకృతం. స్రష్టలు ఏ రసాన్ని అందించినా దాన్ని ఆస్వాదించి, అనుభవించగల రసికులున్నప్పుడే అది అందగిస్తుంది. లేదంటే మందగిస్తుంది. సంగీత సాహిత్యాలను సరితూచిన త్రాసు ఆదిభట్ల నారాయణదాసు మాటకి, పాటకి, ఆటకి ప్రసిద్ధులు. విజయనగరం మహారాజావారి ఆప్తవర్గంలోని వారు.
ఒకసారి రాజుగారితో పేకాటకు కూచున్నాడు నారాయణదాసు. వేళ మంచిదే. అప్పటికి చాలా డబ్బు గెలుచుకున్నారు. ఉన్నట్టుండి దశ మారింది. రాజుగారికి ఒక్కసారిగా ఆసులు పడ్డాయి. దాసుగారికి రాజులు పడ్డాయి. దాంతో నారాయణ దాసు పెద్ద పందెం వోడిపోయారు. రాజుగారు ఆదిభట్ల ముందు కుప్పగా పోసివున్న డబ్బుని ఒక్కసారిగా రెండు చేతులా తనవైపు లాక్కున్నారు. దాసుగారు ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి, వెంటనే తెప్పరిల్లి, ‘అయితే రాజుల కంటే ఆసులు గొప్పవన్న మాట’ అన్నారు తనదైన శైలిలో. వెంటనే రాజు కవి రసికతను పసిగట్టి, ఇంతకుముందు తనవైపు లాక్కున్న డబ్బుని దాసుగారి ముందుకు నెట్టి మీసాలు తొలికేలా విలాసంగా నవ్వారట! హాస్యంలో శివుడే కాదు డబ్బు కూడా ఉంది.
నవ్వుల్ని పండించారు
జానపద కళారూపాలలో ముఖ్యమైన దినుసు హాస్యం. తోలుబొమ్మలాటలో బంగారక్క, జుట్టుపోలిగాడు కావల్సినంత సందడి చేసేవారు. అది ముతక హాస్యం. అవధాన ప్రక్రియ శతాబ్దాల నాడే ఆవిర్భవించింది. అందులో కొన్ని అంశాలు కేవలం హాస్య సృజన కోసమే ఉంటాయి. కవి, పండితులు కాశీ కృష్ణాచార్యులు బహుగ్రంథ కర్త, విశేషంగా విలక్షణంగా అవధానాలు చేసిన దిట్ట. అయితే, అలవాటుగా పొరబాటుగా ఆయన పేరుని చాలామంది కాశీ కృష్ణమాచార్యులుగా పలికేవారు.
ఆయనొక చోట అందుకు అసహనం వ్యక్తం చేస్తూ, ‘నాకు నడమంత్రపు సిరి లేదు. నా పేరు కృష్ణాచార్యులు మాత్రమే’ అన్నారు. ‘మా’ అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం.
తిరుపతి వేంకట కవులు జంటగా అవధానాలు నెరపారు. ప్రాచుర్యం పొందారు. వారి అవధాన పద్యాలలో, ‘‘ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము..’ అనేది చాలా ప్రసిద్ధం. దానిని కాలానుగుణంగా అన్వయిస్తూ నేటి అవధాన సరస్వతి గరికపాటి నరసింహారావు చెప్పిన పద్యం:
జీపుల నెక్కినాము, ధన జీవులు మ్రొక్కగ నిక్కినాము వా
గ్దీపము జూపినాము, గడిచేరిన మేటి వధాన విద్యలో
టాపును లేపినాము డఢఢామ్మని పేలెడి ఆశు విద్యలో
ఓపిక మేర లోకముల నూపితి నీ వలనన్ సరస్వతీ
ఆశువుగా గరికపాటి పద్యం పూర్తిచేశారో లేదో శ్రోతల్లోంచి ఒక గొంతు ‘ఎవరా సరస్వతి’ అంటూ నిగ్గదీసి నవ్వులు పండించింది.
యుగయుగాల నవ్వులు
నవ్వుకి యుగయుగాల చరిత్ర ఉంది. ఇతిహాసాలను మలుపు తిప్పిన వైనమూ ఉంది. ద్వాపరంలో మయసభలో రారాజు తడబాటుని చూసి ద్రౌపది నవ్వి ఉండకపోతే కురుక్షేత్రమూ లేదు, భగవద్గీతా లేదు. ఇక జానపద రామాయణంలో లక్ష్మణస్వామి నవ్వు అందరినీ భుజాలు తడుముకునేలా చేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో పాత్రలు సజీవంగా రూపుదిద్దుకుని మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొందరు నవ్వించడానికే రచనలు చేసి హాస్య బ్రహ్మలుగా రాణకెక్కారు.
హాస్యాన్ని అనేక విధాలుగా విశ్లేషకులు విడగొట్టారు. శబ్దాశ్రయం, చేష్టాగతం, చురక, అనుకరణ, అసంబద్ధం ఇలా నానా రకాలుగా నవ్వు పుట్టించవచ్చునని సోదాహరణంగా వివరించారు. శాస్త్రంలోకి వెళితే హాస్యం పండదు. ఒక్కోసారి ఉన్నట్టుండి నవ్వు వస్తుంది. దాన్ని మనసా స్వాగతించడమే ఆరోగ్యం. ఈ మధ్య ‘నవ్వు’ ఆరోగ్యానికి అవసరమని తేల్చారు. ఒకరు తేల్చేదేమిటి మనకు తెలియదా? నలుగురు కూచుని నవ్వుకునే వేళ ఎంత హాయిగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయాక అనేక వరసలు వెలిసిపోయాయి.
వదిన, మరదలు, అత్త, బావ లాంటి సరసానికి సరైన వరసలు లేవిప్పుడు. దాంతో చతురతలు చమత్కారాలు కరువైనాయి. జీవితం ఒక లాగుడు బండిలా తయారైంది. ప్రతివారికీ టెన్షన్ ఒక ఊతపదమైంది. ఒకరు ఒకరు, ఇద్దరు మాత్రమే మాట్లాడుకునే సెల్‌ఫోన్ సంస్కృతి ప్రబలింది. మాటలే తప్ప మాటకి మాట, పై మాటలకు అక్కడ ఆస్కారం ఉండదు. ఒకప్పుడు ఇంటిపనులు శ్రమశక్తితో చేసుకునేవారు. నీళ్లు తోడినా, వస్త్రాలుతికినా, దంచినా, రుబ్బినా, నడిచినా మంచి వ్యాయామంగా పనిచేసేవి. అన్నింటికీ యంత్రాలు వచ్చాయి.
మీట నొక్కితే ఆ పనులన్నీ క్షణంలో చేసేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిందల్లా శ్రమలేమితో వచ్చే అనారోగ్యం. అందుకని ఇప్పుడు కృత్రిమంగా యంత్రాలతోనే శ్రమించే సంస్కృతి వచ్చింది. నవ్వు సంగతి కూడా ఇంతే! సహజంగా నవ్వుకోవడం పోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘లాఫింగ్ క్లబ్’లు వచ్చాయి. అక్కడ పదిమందీ చేరి పడీ పడీ నవ్వుతుంటారు. అందులో జీవం ఉండదు. మంచి సాహిత్యం, మంచి నాటకాలు, మంచి సినిమాలు చక్కని చిక్కని వినోదాన్ని దానితో పాటు నవ్వుని అందించి అలరించాయి. క్రమేపీ హాస్యరసం పాలు తగ్గి రౌద్ర భయానక బీభత్స రసాల పాత్ర ప్రముఖమైంది. జీవితంలోనూ సాహిత్యంలోనూ నవ్వు కరువైంది.
ఇది కరుణశ్రీ పద్యం
రాధికా క్రోధ మధురాధరమ్మొకింత నవ్వెనో లేదో
పకపక నవ్వె ప్రకృతి; నవ్వుకొన్నది బృందావనమ్ము
యమున నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు
విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ నవ్వినవి
రాధ తలలోని పువ్వులెల్ల!
ఔను, ఈ వేసవిలో వచ్చే మల్లెలు మంచి నవ్వులకు ప్రతీకలు. ‘ఒక్క నవ్వే చాలు వజ్జిర వయిడూర్యాలు’ అంటాడు ఎంకిపాటలో నాయుడు బావ. కొన్ని నవ్వులు ప్రేమిస్తాయి. కొన్ని నవ్వులు ప్రేమించబడతాయి. కొన్ని నవ్వులు వరిస్తాయి. కొన్ని తరిస్తాయి. కొన్ని నవ్వులు పెళ్లిపీటలు ఎక్కుతాయి. నవ్వులు కరిగితే ప్రేమ కవిత్వాలవుతాయి. పరస్పరం అర్థం చేసుకున్న నవ్వులు జీవితాంతం కొత్త మొగ్గల్ని తొడుగుతూనే ఉంటాయి. నవ్వు మనలో ఒక జీవనది అయినప్పుడు బతుకు సార్థకం అవుతుంది. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు కుందన్‌లాల్ సైగల్ పాడిన పాట ఒకటుంది:
‘దుఃఖ్ కే అప దిన్ బీతత్ నాహీ
సుఖ్ కే దిన్ కే ఏక్ స్వపన్ థా ’ అంటూ సైగల్ తన గంభీర స్వరంతో పాడుతూ మధ్యలో నిర్వేదంతో నవ్వుతాడు. ఆ నవ్వులో ధ్వనించే తీపిని, చేదుని కూడా భరించడం కష్టం. నవ్వుకున్న శక్తి అసామాన్యం. ఎందుకంటే నవ్వులో శివుడున్నాడు మరి.
- శ్రీరమణ