ఇంతటి పరిపూర్ణమైన నవ్వును ఏ లాఫింగ్ క్లబ్ నవ్వించగలుగుతుంది? వీళ్లకు ఇంతటి సంతోషాన్ని ఎవరిచ్చారు? ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపు ఇచ్చిందా? సరస్సులో విచ్చుకున్న కమలం రేకలు ఇచ్చాయా? ఒకరి భావం ఒకరికి ఎలా అర్థమై ఉంటుంది? అయినా.. భావాన్ని పంచుకోవడానికి భాష అక్కర్లేదు, బాల్యం ఉంటే చాలు కదా! ఈ చిన్నారులను చూడండి. పదాలు తప్ప వాక్యాలు మాట్లాడటమే అలవాటు కాని వయసే ఇంకా. అలతి అలతి మాటలైతేనే నాలుక తిరుగుతుంది.
పదబంధాలనైతే విరగ్గొట్టి పలకాల్సిందే. విరిగే కొద్దీ పటికబెల్లంలా ఉండే తియ్యటి పలుకులవి. ఒకరి భావాలకు బదులివ్వడానికి ఒకరి మనసు ఎంతగా ఉద్వేగ పడుతోంది! భావం గుండెల్లో సుడులు తిరుగుతుంటుంది కానీ అన్నేసి భావనల్ని భాషించలేని వయసు. అయినా సరే.. ఒకరి మనసు మరొకరి మనసుకు తాకినట్లు.. మనసారా నవ్వుకుంటున్నారు. అనిర్వచనీయమైన స్నేహ పరిమళాలను గుబాళింప జేస్తున్నారు. గుండెల నిండా ఆనందం తొణికిసలాడుతుంటే పొంగిపొర్లుతున్న సంతోషాన్ని ఒడిసి పట్టుకోవడంతో.. విరిసిన నవ్వుల పువ్వులివి. ఈ భావ వీచికలు ఆరాధ్యకృతి (2), కాత్యాయిని (5).
Comments
Please login to add a commentAdd a comment