తనకు ‘వీర’ అని పేరు పెట్టిన వ్యక్తిని బతికించి, చంపేయాలన్నంత కోపం వీర కుమార్‌కి. ఆ పేరు పెట్టిన దూరపు బంధువు చనిపోయాడు కాబట్టి బతికి పోయాడు! ‘వీర’ అనే పేరులో బూతేమీ లేదే? మరి తన పేరు మీద తనకు కోపం ఎందుకు?! ఎందుకంటే వీరకుమార్ పేరు మోసిన పిరికివాడు. ‘తెనాలి’ సినిమాలో కమలహాసన్ టైప్ అన్నమాట. ‘‘నీకు ఏవంటే భయం?’’ అనే డాక్టర్ క్వొశ్చన్‌కు కమలహాసన్ ఏమంటాడు? సరిగ్గా ఇలా అంటాడు... ‘అంతా శివమయం అంటారు కదండీ. నాకు మాత్రం అంతా భయమయమండీ. నీడంటే భయం. గోడ అంటే భయం. గూడు అంటే భయం. బల్లి అంటే భయం...పిల్లి అంటే భయం. బంతిని చూసినా భయం. ముద్దబంతిని చూసినా భయం. ఏ కాంతను చూసినా భయం. ఏకాంతంగా ఉండాలన్నా భయం’ సినిమాలో కమలహాసన్‌కు ఉన్న భయాలన్నీ వీరకుమార్‌కి ఉన్నాయి. అలాంటి వీర ఒకరోజు రాత్రి హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయినందుకు వీరకు విపరీతమైన సంతోషంగా ఉంది. బతికినంత కాలం తాను భయపడుతూనే బతికాడు తప్ప, ఎవరినీ భయపెట్టలేదు. ‘‘ఇప్పుడు నాకో గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు చూపిస్తా నా తడాఖా. నేను దెయ్యమై ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తాను. వారు గజగజ వణుకుతుంటే నేను భళ్లు భళ్లుమని నవ్వుతుంటాను’’ కాలర్ ఎగరేశాడు వీర. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ‘అలా షికారుకు వెళ్లొస్తాను’ అని శ్మశానంలో సాటి దెయ్యాలకు చెప్పి బయలుదేరింది వీర దెయ్యం.
జూబ్లిహిల్స్‌లో అందంగా కనిపిస్తున్న ఒక ఇంట్లోకి దూరింది దెయ్యం. ఆ ఇంట్లో అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. పదిహేడేళ్ల ఒక కుర్రాడు మాత్రం ‘స్మార్ట్‌ఫోన్’లో తలమునకలై ఉన్నాడు. ఈ కుర్రాడిని భయపెట్టాలని రీసౌండ్ ఎఫెక్ట్‌తో.... ‘రా.......జా......’ అని పిలిచినట్లుగా అరిచింది దెయ్యం. కుర్రాడు మాత్రం పొరపాటున కూడా దెయ్యం వంక చూడలేదు. ఫేస్‌బుక్‌లో ఏదో కామెంట్ పోస్ట్ చేస్తున్నాడు. రీసౌండ్ ఎఫెక్ట్‌తో దెయ్యం అయిదుసార్లు పిలిచిన తరువాత ఆ కుర్రాడు...‘చల్లని రాజా ఓ చందమామా...’ అని పాడుకున్నాడే తప్పా దెయ్యం వైపు చూడలేదు...ఫేస్‌బుక్‌లో నుంచి తల తీయలేదు. ఆ పాటలో వెటకారం తప్ప రవ్వంత భయం లేదు.‘మరెవరైనా అయితే... రా.....జా అనే రీసౌండ్‌కు భయపడి చచ్చేవాళ్లు. వామ్మో దెయ్యం అని అరిచేవాళ్లు. వీడేంటి ఇలా?’ తనలో తాను కుమిలిపోయింది దెయ్యం. ఈ జనరేషన్ కుర్రాళ్లని తిట్టుకుంది. ఈసారి క్రూరమైన గొంతుతో... ‘ఒరేయ్ రాజా’ అని హాల్ అదిరేలా అరిచింది దెయ్యం. ఆ కుర్రాడు మాత్రం యూట్యూబులో ‘భయ్యానికి నేనంటే భయ్యం.... దెయ్యానికి నేనంటే దడ’ అనే పాటను చూస్తూ ఆనందిస్తున్నాడు. భయపెట్టాలని దెయ్యం ఎంతగా ప్రయత్నించినా ఆ కుర్రాడు తన పనిలో తాను ఉన్నాడు. కొద్దిసేపు ఫేస్‌బుక్, కొద్దిసేపు యూట్యూబ్, కొద్ది సేపు ట్విట్టర్, కొద్దిసేపు మట్టర్...ఇలా ఏవేవో చూస్తున్నాడేగానీ ‘రా...జా’ అనే భయంకరమైన సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అని ఒక్క నిమిషం కూడా పక్కకు తిరిగి చూడలేదు.
‘ఛీ... వెదవ బతుకు... సారీ వెదవ చావు’ అని తనను తాను తిట్టుకొని అక్కడి నుంచి స్పీడ్‌గా పారిపోయింది దెయ్యం. ఇప్పుడు దెయ్యం సాగర్ అనే ఆయన ఇంట్లోకి దూరింది. ఇతడిని అందరూ ‘సమాచార సాగర్’ అని పిలుచుకుంటారు. దీనికి కారణం...ఈ సాగర్‌ని ఒక్క విషయం అడిగితే పది విషయాలు చెబుతుంటాడు. ఇప్పుడు మనం మళ్లీ దెయ్యం దగ్గరికి వద్దాం. ‘హీ....హీ....హీ’ అని వికృతంగా నవ్వింది దెయ్యం. చదువుతున్న పుస్తకం నుంచి తల పైకెత్తిన సాగర్ వెంటనే...‘హీ....హీ....హీ’ అనేది హిబ్రూ పదం ‘గుష్కీ గుష్కి’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘మీరు క్షేమంగా ఉన్నారా?’ అని దెయ్యానికి చెప్పి తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. ‘‘రేయ్ సచ్చినోడా...సారీ...బతికినోడా...నేను దెయ్యాన్నిరా...భయపడరా’’ గట్టిగా అరిచింది దెయ్యం. ‘దెయ్యం’ అనే పదం వినబడగానే సాగర్ కళ్లు చురుక్కున మెరిశాయి. వెంటనే గొంతు సర్దుకొని... ‘దెయ్యాల్లో మొత్తం 72 రకాలు ఉన్నాయి. ఇందులో ఒక దెయ్యానికి మరొక దెయ్యానికి పోలికే లేదు. కలర్ మాత్రం సేమ్ టు సేమ్. ఆఫ్రికా దెయ్యాలు నల్లగా ఉంటాయనేది అపోహ మాత్రమే’ అని తిరిగి పుస్తకం చదవడంలో మునిగిపోయాడు సాగర్. ‘వీడు సమాచారంతో భయపెడుతున్నాడు తప్ప భయపడడం లేదు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు’ అని మరోసారి పారిపోయింది దెయ్యం.
చివరిగా ఒక ప్రయత్నం చేసి చూద్దామని కృష్ణానగర్‌లో ఒక చిన్నరూమ్‌లోకి దూరింది. ఆ గదిలో థర్టీ ప్లస్ కుర్రాడు ఏదో సీరియస్‌గా రాసుకుంటున్నాడు. ఆ కుర్రాడి ముందుకు వచ్చి...‘రేయ్...నేను దెయ్యాన్నిరా’ గట్టిగా తనను తాను పరిచయం చేసుకుంది దెయ్యం. ‘వామ్మో’ అని అరవలేదు ఆ కుర్రాడు. కొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు వంద ఒకేసారి దొరికినట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ తరువాత ఇలా అన్నాడు... ‘‘సమయానికి దెయ్యంలా వచ్చారు. ఇలా కూర్చొండి. ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. గత అయిదేళ్లుగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. నా పేరు...మణిరత్న శంకర రాజమౌళి. అందరూ ఎంఎస్‌ఆర్ అని పిలుస్తుంటారు. ఇప్పుడంతా హర్రర్ సినిమాల హవా నడుస్తుంది కదండీ....అందుకే మంచి దెయ్యం స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసి, పెద్ద నిర్మాతకు వినిపించి డైరెక్టరవుదామనుకుంటున్నాను. దెయ్యం సబ్జెక్ట్‌పై వర్క్ చేయడానికి ఎన్నో పుస్తకాలు చదివాను. చదవడం వేరు...స్వయంగా మీలాంటి దెయ్యం మహాశయులు నన్ను వెదుక్కుంటూ రావడం వేరు. మీరు ఇన్‌పుట్స్ ఇస్తే స్క్రిప్ట్ అద్భుతంగా వస్తుంది. దెయ్యం సార్...ప్లీజ్ ఏమైనా చెప్పండి సార్’’ అంటూ పెన్ను ప్యాడ్ పట్టుకొని దెయ్యం వైపు ఆశగా చూశాడు ఫ్యూచర్ డైరెక్టర్ ఎంయస్‌ఆర్. ‘‘ఒరేయ్ నీకో దండం...నీ సినిమాకో దండం...నన్ను వొదల్రా బాబూ’’ అని అక్కడి నుంచి పారిపోవడానికి రెడీ అయింది దెయ్యం. ‘‘అలా అంటే ఎలా సార్. మీకు పాదాభివందనం చేస్తాను. మీరు నాకు ఇన్‌పుట్స్ ఇవ్వాల్సిందే ’’ అంటూ సడన్‌గా వంగీ ‘సారీ...మీకు కాళ్లు ఉండవు కదా’’ అని పైకి లేచాడు ఎంయస్‌ఆర్. ఈలోపే...‘పరారే పరారే... ఈ మనుషులు దేనికీ భయపడి చావరే’ అని పాడుకుంటూ అక్కడి నుంచి జెట్ స్పీడ్‌తో కన్నీటితో కానరాని తీరాలకు పారిపోయింది దెయ్యం!...పాపం దెయ్యం!!
– యాకుబ్ పాషా
అయ్యో పాపం దెయ్యం!!
Published Sun, Nov 19 2017 1:32 AM | Last Updated on Sun, Nov 19 2017 1:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment