సూర్యుడు రాత్రి మొఖం మీద చీకటి దుప్పటి లాగేశాడు, నా భార్య పొద్దు పొద్దున్నే నా మొఖం మీద నుంచి లాగేసినట్టు. మా పెళ్లిరోజు ఆ రోజు. ప్రతి సంవత్సరం మా పెళ్లిరోజుని నేను కచ్చితంగా మరచిపోయానను కుంటుంది నా భార్య. కానీ నేను అలా ఎప్పుడూ మరచిపోలేదు. అందుకు కారణం నా భార్యే. మూడు నెలల ముందు నుంచే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక నెపంతో నాకు ఆ విషయాన్ని కచ్చితంగా గుర్తు చేస్తుంటుంది. రాత్రి పడుకోబోయే ముందు కూడా ‘‘రేపైనా బయటకు తీసుకెళ్తావా లేదా..’’ అని అడిగింది. ‘‘ఎందుకు?’’ అన్నాన్నేను, నాకూ ఏమీ తెలియనట్టు.హాళ్ళో టీవీ ఆన్ చేసి బెడ్‌రూమ్ వైపు దొంగ చూపులు చూస్తోంది, నాకు పెళ్లిరోజు గుర్తుందా లేదా అని. నాకసలు ఆ విషయమే గుర్తులేనట్టు తన దగ్గరకొచ్చి నాకోసం టేబుల్‌పై పెట్టిన టీ అందుకొని పెదాలకి ఆనించుకుంటూ.. ‘‘పెళ్లి రోజు శుభాకాంక్షలోయ్’’ అన్నాను తన వైపు చూడకుండా. ‘‘పర్వాలేదే.. పెళ్ళయి ఆరు సంవత్సరాలైనా మన పెళ్లిరోజుని బాగానే గుర్తుంచుకున్నావు’’ సంతోషంగా అంది తను. ఎందుకో, ఆరోజు నాకు తనని ఇంకొంచెం ఆనందంలోకి తీసుకెళ్లాలనిపించింది. అలా చెయ్యడానికి సిగ్గుగా వున్నా, కొంచెం కష్టంగా వున్నా, ఇష్టం లేని పని అయినా కూడా బుగ్గ మీద ముద్దు పెట్టి ‘‘నువ్వు నా అదృష్టానివోయ్, నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాన్నో’’ అని కౌగిలించుకున్నాను. నా భార్య నిజమని నమ్మి ‘‘అవునా’’ అంటూ గారాలు పోతూ నన్ను కౌగిలించుకుంది.
‘‘ఎందుకు మా అమ్మని పట్టుకున్నావ్...’’ అంటూ ఏడుపు మొఖంతో బయటకు వచ్చాడు నా మూడేళ్ళ కొడుకు. ‘‘పట్టుకోలేదమ్మా! ముద్దు పెడుతున్నా’’ అన్నాను వాణ్నెత్తుకొని ముద్దు పెడుతూ. ‘‘ఛీ! ఊరుకో.. మంచి మాటలు చెప్తున్నావ్ పిల్లోడికి’’ అని వాణ్నెత్తుకొని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళింది. నేను పెట్టిన ముద్దు గురించే ఆలోచిస్తున్నట్టు వుంది నా భార్య, అందుకే త్వరత్వరగా వాడికి గ్లాసుడు పాలిచ్చి టీవీలో కార్టూన్ చానల్ పెట్టి మళ్ళొచ్చి నా పక్కన కూర్చుంది. దగ్గరగా జరిగి కూర్చుంటూ ‘‘మరి ఈ రోజు ఆదివారం కదా.. బయటకి వెళ్దామా’’ అంది. ‘‘తప్పకుండా వెళ్దాం. కానీ నేను అడిగే ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్తేనే నిన్ను బయటకు తీసుకెళ్తా’’ అన్నాను, ఆదివారం పెద్దగా పనులేమీ లేకపోవడంతో. ‘‘అడుగు’’ అన్నది తను. ‘‘నేను నిన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాను?’’ అన్నాను. దీర్ఘంగా ఆలోచిస్తూ... ఆ రోజులోకే వెళ్లిపోయినట్టు మొఖం పెట్టి ‘‘ఆ రోజు నేను పింక్ చుడీదార్ వేసుకొని, నా ఫేవరేట్ భరతనాట్యం డాన్సర్ మౌనికా నటరాజన్ డాన్స్ ప్రోగ్రాం చూద్దామని ఆడిటోరియంకి వచ్చినప్పుడు చూశాను నిన్ను. చక్కగా పక్క పాపటి తీసుకొని వైట్ షర్ట్ బ్లూ ప్యాంటు వేసుకొని టక్ ఇన్ చేసుకొని వచ్చి నా పక్కన కూర్చున్నావ్. ఆ రోజు ఎందుకో మౌనికా నటరాజన్ డాన్స్ సగంలోనే ఆపేసి వెళ్లిపోయినప్పుడే కదా నీ పర్స్ నాకు దొరకడం, నేను నీకు ఫోన్ చెయ్యడం, ఆ నెపంతో నువ్వు నాకు రోజూ కాల్ చెయ్యడం... నాకన్నీ గుర్తున్నాయ్’’ అంది నా భుజంపై తలవాలుస్తూ. థ్యాంక్ గాడ్! ఆ ప్రశ్న ముందుగా నేనే అడిగాను. తనే అడిగుంటే నాకు అవేవీ గుర్తుకులేవని తెలిసేది. మనసులో నాకు నేను భుజం తట్టుకొని, ‘‘అమ్మో నాలాగే నీకు అన్నీ గుర్తున్నాయన్న మాట’’ అన్నాను నవ్వు నటిస్తూ.
‘‘కానీ మనం కలుసుకోవడం, ఫోన్‌లు చేసుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చాలా విచిత్రంగా వుంది కదా ఇప్పుడు తలుచుకుంటుంటే. నేనసలు అనుకోలేదు నిన్ను ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని’’ తను అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెంసేపు మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన నిశ్శబ్దం వచ్చి చేరింది. ఆ నిశ్శబ్దంలో నాకు కూడా అనుకోకుండా ఆ రోజులు, ఆ ఫోన్‌లు, ఆ పరిచయాలు, ఆ చిలిపి సరదాలు, చిన్న గొడవలు.. అలా ఒక దండెంపై ఆరేసున్న తెల్లటి గుడ్డ మీద ఎవరో నా జీవితాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనిపించీ కంపించకుండా నాలో ఒక ప్రశాంతతని కలుగజేసింది. ‘‘నిజమే’’ అన్నాన్నేను అదే మూడ్‌లో.
‘‘ఒకవేళ నేను ఆ రోజు అక్కడ నీ పక్కన కూర్చోకుండా ఉండుంటే, నీ పర్స్ నాకు దొరకుండా ఉండుంటే, నేను నీకు ఫోన్ చెయ్యకుండా ఉండుంటే, ఇప్పుడు మనం ఎక్కడ వుండే వాళ్ళమంటావ్.. నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకొని ఉండేవాడివి.. వీడి పరిస్థితి ఏమయ్యేది? తలచుకుంటుంటే వింతగా వుంది కదా’’ అంది నా భుజం మీదనుంచి పైకిలేస్తూ. అప్పటిదాకా నాలో వున్న ప్రశాంతత ఒక అలజడిలా మారిపోయింది.అవును కదా! ఏమి జరిగి వుండేది? తను ఎవర్ని పెళ్ళిచేసుకొని వుండేది? నేనెవర్ని పెళ్లి చేసుకొని వుండేవాడిని? నేనెక్కడ వుండేవాడిని.. తనెక్కడ వుండేది? ఈ పిల్లాడు ఏమయ్యి వుండేవాడు? ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న, ఇంకో ప్రశ్నకి పది ప్రశ్నలు కలిసిపోతూ ఒక ప్రశ్నల వలయం నా మెదడు చుట్టూ చేరి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
మా ఆఫీసర్ నన్ను చెడామడా తిట్టేస్తున్నాడు, నాకీ మధ్య మతిమరుపు ఎక్కువ అయ్యిందని. చాలాసార్లు టక్ ఇన్ చేసుకోవడం మర్చిపోతున్నానంట. పక్క పాపటి కాదుకదా అసలు తలే దువ్వుకోవడం లేదంటా. నా భార్య ప్రతి విషయాన్నీ నాకు గుర్తు చెయ్యాల్సి వస్తోందంట, విసుక్కుంటోంది ప్రేమగా. నా కొడుకు నా దగ్గరకి ఎక్కువగా రావడం లేదు. నేను ఆ జాతకాలు చెప్పేవాడి దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నానని నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం నాకు వింతగా వుంది. ఈ మధ్య నేను ఇంటర్నెట్‌లో వెతుకుతున్న వెబ్‌సైట్‌లు చూసి నా కొలీగ్స్ కొందరు నన్ను సైకియాట్రిస్టుని కలవమని సలహాలు ఇస్తున్నారు.
ఆ రోజు నేను మా పెళ్లిరోజుని నిజంగానే మర్చిపోయాను. నా భార్య నాకు ఎన్నోసార్లు ఆ విషయాన్ని గుర్తుచేసే వుంటుంది. కానీ నాకు ఎందుకో ఆ విషయం నిజంగా గుర్తులేదు. నా భార్య నా మీద అలిగింది. నేనెలాగైనా తనని సంతోషపెట్టాలని అనుకుంటున్నా కానీ ఏం చేయాలో నాకర్థం కావడం లేదు. పాపం తను మాత్రం నేను పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా ఎప్పటిలాగే నా భుజంపై వాలి ఈ రోజు బయటకి వెళ్దామా అని అడుగుతోంది. ఐ లవ్ యూ అని ముద్దు కూడా పెట్టింది, నా కొడుక్కి తెలియకుండా. నాలో చలనం లేదు. స్పందన లేదు. తిరిగి ముద్దు పెట్టాలని వున్నా ఎందుకో పెట్టలేకపోతున్నా.‘‘సరే నీకోసం ఈ రోజు నేనో కొత్త డిష్ చేస్తా’’ అని నవ్వుతూ వంట గదిలోకి వెళ్ళింది.
నా మనసులో మాత్రం సంవత్సరం కిందట మొదలైన అలజడి ఇంకా తగ్గలేదు. ఆ రోజు అక్కడికి నేను వెళ్ళకుండా ఉండుంటే ఏమయ్యేది? నేను నా పర్స్ పోగొట్టుకోకుండా ఉండుంటే ఏమయ్యేది? తను ఆ పర్స్ తీసుకొని నాకు ఫోన్ చెయ్యకుండా ఉండుంటే ఏమయ్యేది? తను ఎవర్ని పెళ్లి చేసుకొని వుండేది? నేను ఎవర్ని పెళ్లి చేసుకొని వుండేవాడిని? వీడు ఏమయ్యేవాడు? నేను ఏమయ్యేవాడిని? తను ఏమయ్యేది? ప్రశ్నకి ప్రశ్నలు కలుస్తూ నా బుర్రలో మెదడుకి బదులు ప్రశ్నలు మాత్రమే వున్నాయేమో అనిపిస్తోంది. నా భార్య తను ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్న కొత్త వంటకమేదో తెచ్చి నా ముందు పెట్టి తినమని లోపలికి వెళ్ళింది. నా కొడుకు నా జేబులోంచి ఫోన్ తీసుకొని వాడికి కావాల్సిన గేమ్ ఏదో ఆడుతున్నాడు. నా ఎదురుగా టీవిలో వస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ నన్ను ఏమాత్రం కదిలించలేకపోతున్నాయ్. అసలు నువ్వు మనిషివేనా.. స్పందనలు లేని వెధవ్వా అని తిట్టుకుంటూ సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. నేను కూడా.
ఆ రోజు రాత్రి నా నుదుటి మీద వలయాకారంలో ఒక పచ్చని చిక్కటి రంగేదో పడుతోంది. దాన్ని నేను తుడుచు కోలేకపోతున్నాను. పొయ్యొద్దని ఆ పోసే వాడికి చెప్పలేకపోతున్నాను. ఆ పోస్తుందెవరో తెలియడం లేదు. ఆ రంగులో నేను ఆడిటోరియం ముందు నుంచొని వుండటం నాకు కనపడుతోంది. నేను లోపలికి వెళ్తున్నా. ప్రతి మెట్టు నేనే ఎక్కుతున్నా. నా కాళ్ళకి ఆ స్పర్శ, నా కళ్ళకి ఆ దృశ్యం, నా చెవులకి ఆ శబ్దం వినపడుతోంది. లేదు.. నేనే నిజంగా అక్కడ వున్నాను. మౌనికా నటరాజన్ డాన్స్ గురించి రాసివున్న ఒక పాంప్లేట్ నా చేతికి ఇస్తూ నన్ను లోపలికి ఆహ్వానించాడు సెక్యూరిటీ గార్డ్. నా సీటు ఎక్కడో వెతుక్కొని నేను దాన్లో కూర్చున్నా. ఆ పేపర్‌ని నా పర్స్‌లో పెట్టుకుందామనుకొని కూడా పర్స్ బయటకు తీయకుండా ఆ పేపర్‌ని షర్టు జేబులో పెట్టుకున్నా. మౌనికా నటరాజన్ డాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. తెరలు తొలిగాయి. మౌనికా నటరాజన్ డాన్స్ మొదలయ్యింది. నా నుదుటిపై నారింజ రంగు పడుతోంది. పచ్చరంగంతా ఇంకిపోతోంది. నారింజ రంగులో దృశ్యం సరిగా కనిపించడం లేదు. ఆ రంగు మొత్తం చెరిపేసుకుంటుంటే, ఎవడు పోస్తున్నాడో తెలియదు గానీ అతి చిక్కటి ఎర్రటి రంగు, ఆ నారింజ రంగుపై. ఎర్రటి రంగు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆ రంగు మెరిసిపోతోంది. చీకట్లని చీలుస్తోంది. గుండ్రంగా మారి దూరంగా వెళ్లి సూర్యునిలా మారిపోయింది. కళ్ళు తెరిచాను. మా ఇంట్లోనే వున్నాను.
నా జేబులో మౌనికా నటరాజన్ డాన్స్‌కు సంబంధించిన పాంప్లేట్ అలాగే వుంది. నిజంగానే వుంది. దాన్ని నేను తాకగలుగుతున్నా, మడవగలుగుతున్నా. అది ఆరు సంవత్సరాల క్రితం పాంప్లేట్. నాకొచ్చింది కలలా లేదు కానీ నేను ఈ రోజు ఈ ఇంట్లో ఉండటమే నాకు కలలా వుంది. నా భార్య నాకు టీ తెచ్చిస్తుంటే తను కలలో టీ తెచ్చి ఇస్తున్నట్టు వుంది. కానీ ఆ టీ వేడిగా వుండటం నేను ఇంట్లోనే వున్నానని గుర్తుచేసింది. ఆ పాంప్లేట్ నా జేబులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు.మా ఆవిడకి చెబుదామన్నా దాన్ని నమ్మదు సరికదా నాకు పిచ్చి పట్టిందని నవ్వుకుంటుంది. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకెవరైనా ఎలా నమ్ముతారు? అందుకే ఎవరూ నమ్మని దాన్ని మనం నమ్ముతున్నప్పుడు దాన్ని ఎవ్వరికీ చెప్పకపోవడమే మన నమ్మకానికి మంచిదని నేను దాని గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించలేదు. కానీ నాకా రంగులు కావాలి. చీకట్లో స్పష్టంగా కనపడే రంగులు కావాలి. కాలం కర్పూరంలా కాలిపోతోంది. ఆ రంగులను వెతికే క్రమంలో పండువెన్నెల లాంటి నా కొడుకు అందాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. మంచు ముద్ద లాంటి నా భార్య ప్రేమని పంచుకోలేకపోతున్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో నా పని మాత్రమే వుంది. నేను లేను. నాకు కావాల్సింది చీకట్లో కనపడే ఆ రంగులు. ఆ రంగుల లోకం. అందుకే వెలుగు మీద కోపాన్ని, చీకటి మీద ప్రేమని పెంచుకున్నాను. నాకిప్పుడు చీకటి పతీవ్రత లాగా, వెలుగు వేశ్యలా కనిపిస్తోంది. రాత్రయింది. నిద్ర రావడం లేదు. నిద్రరాకపోతే రంగులు రావు. రంగులు రాకపోతే నాకు నిద్ర రాదు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ అది నటన అని నాకూ తెలుస్తోంది. నటిస్తే నటన వస్తుంది కాని నిద్ర రాదుకదా. నిద్రకు దూరంగా చాన్నాళ్ళు అలాగే ఉండిపోయాను. నిద్రరాక అల్లాడిపోయాను. నా భార్య, నా కొడుకు ఎంత సంతోషంగా నిద్రపోతున్నారో. ఎవరైనా నిద్ర అప్పిస్తే బాగుండుననిపిస్తోంది. ఎవరైనా నిద్రని అమ్మితే బాగుండుననిపిస్తోంది. ఆలోచనల్లో పడిపోయాను. ఆ రోజెందుకో నిద్రపోయాను.
అదుగో రంగు. చిక్కటి పచ్చటి రంగు ఒక ధారలా నా నుదిటిపై పడుతోంది. నా నుదిటిపై పడ్డ రంగంతా నా మెదడులోకి ఇంకిపోతోంది. నా కళ్ళు పచ్చగా మారాయి. ఆ పచ్చటి రంగు వెనుక మౌనికా నటరాజన్ తను చేస్తున్న నృత్య ప్రదర్శన ఆపేసి బయటకు పరిగెట్టడం కనపడింది. పోలోమని అభిమానులు, మీడియా వాళ్ళు తన వెంటపడుతున్నారు. ఆవిడ మీద వున్న పిచ్చి అభిమానంతో నేను కూడా బయటకు పరిగెత్తాను. నేను బయటకు వెళ్లేసరికి తను మాయమయ్యింది. బహుశా కారెక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు.పార్కింగ్‌లో వున్న నా టూవీలర్‌ని స్టార్ట్ చేస్తున్నప్పుడు వెనుకనుంచి నా మీద చెయ్యి వేసింది మౌనిక నటరాజన్. ‘‘నన్ను మా ఇంటి దాకా డ్రాప్ చెయ్యగలరా? ప్లీజ్’’ అని అడిగింది. నమ్మలేకపోయాను. తనని నా బండిపై ఎక్కించుకోకుండా ఉండలేకపోయాను. ‘‘ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వగలరా...’’ అని అడిగింది. ‘‘మీరడిగితే ఫోన్ ఏంటి.. ప్రాణమయినా ఇస్తాను. మీరంటే నాకంత అభిమానం’’ అన్నాను ఫోన్ ఇస్తూ.
‘‘డాడీ.. వాడెళ్ళిపోయాడా? హి ఈజ్ చీటర్ డాడీ, ఐ డోంట్ లైక్ హిమ్. వాడికి చెప్పండి నేనిక వాడి మొహం చూడనని. ఆ.. ఇంటికే వస్తున్నా. నా అభిమాని బండి మీద. పర్లేదు.. నన్నెవ్వరూ గుర్తు పట్టర్లే. నేను నా మొఖానికి ముసుగు వేసుకొని వున్నాను. ఇంకొంచెం సేపట్లో అక్కడ ఉంటా’’ తను మాట్లాడుతూనే వుంది. నాకు వాడెవడో, అసలు తనకు వచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలని చాలా ఆశగా వుంది. తను ఫోన్ మాట్లాడటం ఆపిన తరువాత ‘‘మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుంటున్నా’’ అన్నాను. ‘‘చెప్పండి’’ అంది తను. నారింజ రంగు ధార నా నుదిటిపైన. ‘ఓహ్ షిట్’ దాన్ని తప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. నా వల్ల కావడం లేదు. నాకు తెలుసు.. ఎర్ర రంగు వస్తుందని. అది రాక ముందే ఈ నారింజ రంగుని తుడిపేసుకోవాలని నా రెండు చేతులతో బలంగా ప్రయత్నిస్తున్నా. కొంచెం పోతోంది. మరింత పడుతోంది. నారింజ రంగుని పూర్తిగా నాశనం చెయ్యగలిగాను. మౌనికా నటరాజన్‌ని చూడగలుగుతున్నా కానీ నాకు తను మాట్లాడుతున్నదేదీ వినపడటం లేదు. తన మాటలకి బదులుగా యేవో శబ్దాలు. ఏదో ఫ్యాక్టరీలలో వచ్చే ప్రమాద సంకేతపు సైరన్ శబ్దాలు. ఎర్ర రంగు రానే వచ్చింది. దాన్ని చెరపడం నా వల్ల కాలేదు. కళ్ళు తెరిస్తే నా పక్కలో హాయిగా నిద్రపోతున్న నా కొడుకు, వాడి పక్కన నా భార్య. ఇద్దరూ చాలా అందమైన వాళ్ళు. వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఎందుకో ఆ సమయంలో నా కొడుకుని గట్టిగా హత్తుకోవాలనిపించింది. వాణ్ని తీసుకొని నా మీద పడుకోపెట్టుకున్నాను. ఆ అలికిడికి నా భార్య లేచి వాణ్ని, నన్ను చూసి, ‘‘మమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నావా ఏంటి..’’ అంది నవ్వుతూ. ఆ వెంటనే నిద్రలోకి జారుకుంది. నా కొడుకుని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టి వాడి చెవిలో ‘‘నువ్వే నా ప్రాణం రా’’ అన్నాను. వాడు నవ్వాడు. లేదు. వాడు నవ్వినట్టు నేను ఊహించుకున్నాను. నా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేసి ‘‘హలో ఎవరూ’’ అన్నాను. ‘‘నేను మౌనికా నటరాజన్‌ని... ఇంటికి క్షేమంగా చేరేరా?’’ అంది అటునుంచి.
నేను ఒకేసారి రెండు కాలాల్లో ఎలా జీవించగలుగుతున్నానో అర్థం కావడం లేదు. నా భార్యని ప్రేమిస్తూనే మౌనికా నటరాజన్‌ని కలవకుండా ఉండలేకపోతున్నాను. ఆ చీకటిలో వచ్చే రంగుల్లో నేనో కొత్త జీవితాన్ని గడపడం నాకే చాలా వింతగా వుంది. నేనసలు బతికున్నానా, చచ్చిపోయనా అర్థం కావడం లేదు. నేను బతికే వుంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన మౌనికా నటరాజన్‌ని ఎలా కలవగలుగుతున్నాను? తనని తాకగలుగుతున్నాను. ముద్దు పెట్టుకోగలుగుతున్నాను. కౌగిలించుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం బాగుందో, మౌనికా నటరాజన్‌తో నా జీవితం బాగుందో ఏమాత్రం అర్థం కావడం లేదు. నాకు నా భార్య మీద వల్లమాలిన ప్రేమ వున్నా, మౌనికా నటరాజన్‌ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. మనసులో ఒకర్ని ఊహించుకుంటూ భార్యతో శారీరకంగా కలిసుండే చాలామంది మగాళ్ళ లాగే నేను సంస్కారవంతంగా బతుకుతున్నాను. మనకు నష్టం జరగనంత వరకూ రెండు జీవితాల్ని ఎంజాయ్ చెయ్యడం నాకేమీ తప్పనిపించలేదు. నిన్న రాత్రి తనని పెళ్లి చేసుకోమంది మౌనికా నటరాజన్. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు. నా భార్యకు అన్యాయం చేస్తానేమో అని భయంగా వుంది. నా ముద్దుల కొడుకుని వదిలెయ్యాల్సి వస్తుందేమోనని భయంగా వుంది. అలాగని మౌనికా నటరాజన్‌తో పెళ్లిని అంగీకరించకుండా ఉండలేకపోయాను. మౌనికా నటరాజన్‌తో రేపే నా పెళ్ళి.
రంగులు మొదలయ్యాయి... పెళ్ళిలో తోరనాళ్ళ మంటపాళ్ళా. మౌనికా నటరాజన్ తెరకవతల, నేను ఇవతల. మౌనికా నటరాజన్‌ని పెళ్లి చేసుకుంటున్నానన్న ఆనందంలో వున్న నాకు నా భార్య గుర్తుకు రాలేదు. కొడుకూ గుర్తుకు రాలేదు. కావాలనే నేను గుర్తుకు తెచ్చుకోలేదు. మౌనికా నటరాజన్ నా తల మీద జీలకర్రా బెల్లం పెట్టింది. నేను కూడా. తనని చూడాలన్న ఆశ క్షణక్షణానికీ పెరిగిపోతోంది. గట్టి మేళం గట్టి మేళం అన్నాడు పంతులు గారు. ఆనందంగా తాలిబొట్టు కోసం వంగాను. నారింజ రంగు నుదుటి మీద. ధార లాగా. చెరిపేస్తున్నా. చెరిపెయ్యడానికి పోరాడుతున్నా. పోవడం లేదు. నేను వదలడం లేదు. మౌనికా నటరాజన్ ఆ రంగులో కలిసిపోతోంది. నన్ను విడిచి పోతోంది. నేను తన చెయ్యిని పట్టుకున్నాను. ఎర్ర రంగు మొదలయింది. నా శక్తినంతా కూడదీసుకొని ఎర్ర రంగుని వదిలించుకుంటున్నా. పోస్తున్న వాడికి దండం పెడుతున్నా ఆపమని. మౌనికా నటరాజన్‌ని పెళ్లి చేసుకోవాలనే కోరికలోంచి వచ్చిన బలంతో.. ఎర్రరంగుని వచ్చిన దాన్ని వచ్చినట్టు తుడిపేసుకుంటున్నా. ఎర్రరంగు అయిపోయే కొద్దీ వింత శబ్దాలు మొదలయ్యాయి. పోలీస్ సైరన్ లాంటివి, ఫ్యాక్టరీ సైరన్ లాంటివి. చెవులు పగిలిపోతున్నాయ్. కానీ నేను ఎర్రరంగుతో పోరాడుతున్నా.
ఆశ్చర్యం. ఎర్రరంగు అయిపోయింది. కానీ రంగుల ధార ఆగలేదు. రకరకాల రంగులు నా నుదుటి మీద. ఒకదాని తరువాత ఒకటి. రంగులన్నీ కలసిపోయి వింత రంగు ఒకటి నాకు నన్నే కనపడకుండా చేసింది. ఆ వింత రంగు చీకటిలా మారి, కటిక చీకటిలా మారి, ధారలా కారుతున్న రంగులన్నింటినీ తనలో కలిపేసుకుంది. దాని వెనకాల మౌనికా నటరాజన్ మొఖం చంద్రబింబంలా, సూర్యతేజంలా వెలిగి పోతూ, నాకోసం, నేను కట్టబోయే తాళి కోసం, తలవంచుకొని ఎదురుచూస్తోంది. తాళి కట్టాను. నేను జయించాను. మౌనికా నటరాజ¯Œ ని సొంతం చేసుకున్నాను. అక్కడ వున్న ప్రజలంతా హర్షధ్వానాలతో, ఆనంద బాష్పాలతో మాపై అక్షింతల వాన కురిపించారు. ఆ అక్షింతల వానలో హటాత్తుగా పిడుగు పడ్డట్టు నా తలపై ఎవరో ఇనుప కమ్మీతో గట్టిగా కొట్టారు. నేను కిందకి పడిపోయాను. ‘‘ఇలంగో! ప్లీజ్ డోంట్ డూ దట్. అతణ్ని వదిలేయ్. చచ్చిపోతాడు. నీకు దండం పెడతా. అతను అమాయకుడు’’ అంటూ పెద్ద పెద్దగా అరుస్తోంది మౌనికా నటరాజన్. ఇలంగో నా మీద చాలా కోపంమీద ఉన్నట్టున్నాడు. నా తలపై ఇంకో దెబ్బ కొట్టాడు. ‘‘నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. అతన్నొదిలెయ్ ఇలంగో.. ప్లీజ్...’’ అంటూ ఇలంగో కాళ్ళు పట్టుకుంది మౌనికా నటరాజన్.చాలా నొప్పిగా వుంది. ఆకాశం వైపుకి చూస్తున్నా, నారింజ రంగేమైనా వస్తుందేమోనని, ఎర్ర రంగేమైనా వస్తుందేమోనని. రాలేదు. నొప్పి ఎక్కువైంది. నాకు చిన్న జ్వరం వస్తేనే తల్లడిల్లిపోయే నా భార్య గుర్తుకొచ్చింది. నేను ఏడ్చినట్టు నటిస్తేనే కళ్ళ నీళ్ళు పెట్టుకొనే నా కొడుకు గుర్తుకొచ్చాడు. వాళ్ళను చూడాలని వుంది. చెవుల్లో ఏదో తడి. ముక్కుల్లో ఏదో తడి. ఎర్ర రంగు వస్తే బాగుణ్ణు నొప్పి తట్టుకోలేకపోతున్నా. మా ఇంటికెళ్ళిపోవాలి. నా కొడుకుని కౌగిలించుకోవాలి. నా భార్యకు కష్టం రాకుండా చూసుకోవాలి. కళ్ళు మూతలు పడుతున్నాయ్. తల మీద ఏదో జిగట జిగటగా వుంది. ఎర్ర రంగు ధార వచ్చిందేమో అనుకొని చేత్తో ముట్టుకొని చూసాను. అది ఎర్రరంగే కానీ రక్తం. నిజం. కళ్ళు మూసుకున్నా. నా రంగుల ప్రపంచం చీకట్లో కలసిపోయింది.
- చంద్రశేఖర్ ఇండ్ల
రంగుల చీకటి
Published Sun, Apr 29 2018 12:50 AM | Last Updated on Sun, Apr 29 2018 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment