ఆఫ్రికాలో సినిమా టిక్కెట్, అమెరికాలో గుడ్లు రేటు !
సమాచారం: ఇంటర్నెట్ అందరికీ తెలుసు. కానీ ఎలా వాడాలో మాత్రం అందరికీ తెలియదు. మనం వాడుతున్నది ఏదైనా తెలుసుకుని వాడితే గరిష్ట ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. బహుశా ఇంటర్నెట్ వాడుతున్న వారిలో నూటికి నూరు శాతం దాని ప్రయోజనాలు తెలిసిన వారు దాదాపుగా ఉండరట. అదెప్పుడూ నేర్చుకునే విషయమే. అలాంటి ఓ విషయం తెలుసుకోండి.
సింగపూర్‌లో రోజు ఖర్చు ఎంత? లాస్‌ఏంజెల్స్‌లో అద్దెలు ఎలా ఉన్నాయి? జర్మనీలో జీవితం ఎలా ఉంటుంది? మన దేశం ఖరీదైనదా, వాళ్ల జీవితం ఖరీదైనదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ఎవరు చెబుతారు? మనకు తెలిసిన వారు విదేశాలకు వెళ్తుంటారు కానీ మనం కోరుకున్న నగరానికి వెళ్లరు కదా... అలాంటపుడు మనం తెలుసుకోవాలనుకున్న ఊరు గురించి మనకు తెలుసుకోవాలనుకున్న విషయాలు ఎవరు చెబుతారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే వెబ్‌సైట్లు కొన్ని ఉన్నాయి.
www.expatistan.com
ఇది జీవన వ్యయాన్ని తెలిపే వెబ్‌సైట్. ఇందులో మీకు కావల్సిన నగరానికి చెందిన సమాచారం ఉంటుంది. అంటే ఆ ఊర్లో ఏవి ఎక్కడ ఉంటాయని కాదు... మీ సమీప నగరాన్ని ప్రపంచంలో ఏ నగరంతో అయినా పోల్చి చూసుకోవచ్చు. ఇందులో రెండు నగరాలను పోల్చిచూసుకుంటే ఆహారం, నివాసం, దుస్తులు, రవాణా సదుపాయాలు, వ్యక్తిగత ఖర్చులు, వినోదం వంటి ఖర్చులను మీరుంటున్న నగరం కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో చాలా స్పష్టంగా చెబుతంది. వీటికి సంబంధించి స్థూలంగాను, మళ్లీ వాటిలో ఉప విభాగాలను తెలుసుకోవచ్చు. ఇది వికీపీడియా మోడల్‌లో పనిచేస్తుంది. ఇందులో 1776 నగరాల సమాచారం ఉంది. ఇదంతా ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు నమోదుచేసిన సమాచారం. కాబట్టి ఎక్కువ కచ్చితమైన ధరలు తెలిసే అవకాశం ఉంది. ఇది మన రూపాయల్లో ధరను చెబుతుంది. కాబట్టి అంచనా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది.
http://www.numbeo.com/
ఇది కేవలం జీవన వ్యయాలకు సంబంధించిన సమాచారాల సమూహమే కాకుండా చాలా విస్తృత సమాచారాన్ని ఇస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్‌కు సంబంధించిన ప్రతి సమాచారమూ దేశాల ప్రకారం, నగరాల ప్రకారం అందించడమే కాకుండా గతంలో ఎలా ఉండేదన్న విషయాన్ని కూడా ఇవ్వడం ఈ సైటు ప్రత్యేకత. ఇందులో కేవలం ఈ కంపేరిజన్ కాకుండా జీవన వ్యయ ర్యాంకింగ్స్, ఇండెక్స్ వంటి సమూల సమాచారం దొరుకుతుంది. అలాగే ఒకదేశంలో నివసించాలంటే ఆ దేశపు శాంతి భద్రతల సమాచారం కూడా తెలిసి ఉండటం అవసరం. అందుకే క్రైమ్‌రేటును కూడా చాలా సంపూర్ణంగా అందిస్తోంది. అలాగే వివిధ దేశాల్లో, నగరాల్లోని స్థలాలు/అద్దెల ధరలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఆరోగ్యపరమైన సమాచారం, ఆ విషయంలో ఆయా దేశాల ర్యాంకింగ్‌లు, పోలికలు ఇస్తున్నారు. కాలుష్యం, ట్రాఫిక్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వంటి అనేక రకాల సమాచారం ఉంటుంది. ఈ పోర్టల్ అన్ని దేశాలకు సంబంధించిన 4433 నగరాల సమాచారాన్ని అందిస్తోంది. ఇది కూడా పాఠకులు అందించిన సమాచారం ఆధారంగా నడుపుతున్నదే. పైగా ఇది లక్షన్నర మంది పాఠకులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండే సమాచారం.
www.ifitweremyhome. com/
జపాన్‌లో పుట్టింటే మనం ఎలా బతికేవాళ్లం? ఏ చైనాలోనో ఉంటే ఎలా ఉండేది? బ్రెజిల్‌లో పుట్టిఉంటే మన జీతం ఎంత ఉండేది అన్న విషయాలను తెలియజెప్పే ఈ సైటును కొందరు ఔత్సాహికులు పెట్టారు. ఇది కేవలం పాఠకుల ఉత్సుకతను తీర్చడానికి నెలకొల్పిన పోర్టల్ అయినా చక్కటి సమాచారాన్ని ఇస్తోంది. ఇది చాలా విచిత్రమైన విషయాలను కంపేర్ చేసి చూపిస్తుంది. ఉదాహరణకు చిన్నప్పుడు చనిపోయే అవకాశం, విద్యుత్తు, వంటనూనె, డబ్బు వినియోగం, పిల్లలు, ఖర్చు కలిగి ఉండటం, వ్యాధులు సోకే అవకాశం వంటి చాలా చిత్రమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు నువ్వు పుట్టాలి అనుకున్న దేశానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా ఇస్తుంది. ఇది కాస్త సరదాగా ఉంటుంది.
వీటితో పాటు ఇతర దేశాలను, రాష్ట్రాలను సందర్శించినపుడు పనికివచ్చే మరికొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి. ప్రపంచాన్ని చుట్టేయడానికి అవసరమైన సమారాచాన్నిచ్చే tripadviser.com, వివిధ దేశాల కరెన్సీ ప్రస్తుత, పూర్వ సమారాచారాన్ని ఇచ్చే www.xe.com కూడా మంచి సమాచారాన్ని ఇస్తాయి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి.