సత్‌భుక్తి | Funday story to in this week | Sakshi
Sakshi News home page

సత్‌భుక్తి

Published Sun, Jun 24 2018 12:51 AM | Last Updated on Sun, Jun 24 2018 3:22 PM

Funday story to in this week - Sakshi

సింహాచలం మండుటెండను, నెత్తిమీది బరువునూ భరిస్తూ గమ్యం చేరి, తలమీది బరువును దిగ్గున కింద పడేసి, ఒక షాపు మెట్ల మీద కూర్చుంది. చీరకొంగు ముందుకు లాక్కుని, ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. చెంగుతో కలిసిన చేతివేళ్లు కళ్లవద్దకు వచ్చేసరికి కన్నీళ్లు తన్నుకు రాబోయాయి. కానీ, అలవాటైన చేతివేళ్లు ఆ కళ్లను సముదాయించి, తమ బాధ్యతను నెరవేర్చుకున్నాయి. సింహాచలం నిట్టూర్చింది. బతికి చెడినవారికి నిట్టూర్పులు, చెడి బతికినవారికి మైమరపులూ పరిపాటే. నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు అనుకుందామె. మనస్సుకు కాస్త తీరుబడి దొరికితే అది గతంలోకి చొచ్చుకుపోతుంది. ఉస్సూరుమంటుంది. శరీరానికే గానీ, మనస్సుకు విశ్రాంతినివ్వలేదా దేముడు. ఈలోగా కోమటి కోటేశ్వర్రావు కొడుకు నాగేశ్వర్రావు వచ్చి, షాపు తెరుస్తూ, ‘‘ఏం సింహాచలం! ఈరోజు పేపర్లు బాగానే పట్టినట్టున్నావే’’ అన్నాడు. సింహాచలం పేపర్లు తక్కెడలో పెడుతూ, ‘‘ఏముంది నాయనా, ఎంత సంపాదించినా కూటికీ, ఎన్నాళ్లు బతికినా కాటికేగదా అన్నట్టుంది నా కథ’’ అంది.‘‘నీతో మాట్లాడేటపుడో నోట్‌బుక్కూ, ఓ పెన్నూ సిద్ధం చేసుకోవాలి. ఎన్ని సామెతల్జెప్తావో’’ అన్నాడు నాగేశ్వర్రావు.పేపర్ల డబ్బులు తీసుకుని, కాళ్లీడ్చుకుంటూ గుడిశకి చేరి, ఓ మూడు గుప్పెళ్ల బియ్యం అత్తెసరు పడేసి, గోడకి జారపడి కూర్చుంది సింహాచలం.  ఆమె మనస్సు గతంలోకి గుంజింది. 

‘‘... సింహాచలం గెట్స్‌ క్లాస్‌ ఫస్టినింగ్లీష్‌’’ అది తన ఇంగ్లిష్‌ టీచర్‌ గొంతు. అది ఎనిమిదో తరగతి క్లాసు. టీచర్‌ గొంతు విన్న పిల్లల్లో ఆనందంతో కొందరు, ఆనవాయితీగా కొందరు, సరదాగా కొందరు, తప్పనిసరిగా కొందరు చప్పట్లు కొట్టారు. ఆ ఆనందంతో తను ఎగిరి గంతేసినంత పనిచేసి, నిభాయించుకుంది. మనస్సు మాత్రం ఎగిరి, గంతున్నర వేసింది ఉత్సాహంతో. ఆ రాత్రి భోజనాలయ్యాయనిపించుకున్నాక, సింహాచలం తండ్రితో, ‘‘నాన్నా! పన్నెండు పాసయ్యాక నే టీచరు చదువుతా’’ అని, కాసేపాగి, ‘‘వెంటనే కాదులే.. ఓ ఏడాగుతా.. ఈనెల నుంచీ మరికొన్నిళ్లు పనికి ఒప్పుకుంటా’’ అంది. సింహాచలం తండ్రి ఆమెకేసి జాలిగా చూసి, ‘‘అలాగేనమ్మా! నాకు కూతురివైనా, కొడుకువైనా నువ్వే కదా’’ అన్నాడు. తనకంత స్తోమతుందో లేదో అతనికే తెలీదు. ఈలోగా తల్లి సత్తెమ్మవచ్చి కూర్చుంటూ ‘‘మింగ మెతుకు లేదు. మీసాలకు సంపంగి నూనే అన్నట్టుంది నీ కథ’’ అంది.‘‘ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత కదే అది చెప్పేది. ఇప్పుడే మీద పడ్డట్టెందుకా ఊపు’’ అన్నాడతను చిరాగ్గా. సత్తెమ్మ అది వినిపించుకోకుండా ‘‘ఈ చదువయ్యాక ఆ చదువెన్నేళ్లే’’ అంది.‘‘ఓ ఏడాది’’‘‘అంటే మొత్తం అయిదేళ్లు.. తర్వాత’’‘‘ఉద్యోగం.. టీచరుద్యోగం చేస్తా’’‘‘ఎన్నేళ్లు మిడుకుతావ్‌’’సింహాచలం కాసేపాగి ‘‘ఓ రెండేళ్లు. కాపోతే మరో ఏడు’’ అంది.‘‘అంటే.. ఊ.. సరి. ఆ తర్వాత?’’ సింహాచలం జంకింది.

‘‘ఆ తర్వాత – నీ ఇష్టప్రకారం బావను పెళ్లి చేస్కుంటా. అయినా ఉద్యోగం మానను’’సత్తెమ్మ వెటకారంగా నవ్వింది.‘‘అంటే నీకోసం వాడు ఎనిమిదేళ్లు ఆగాలటే.. నా ముఖంలా ఉంది నీ కథ. ఆ మాత్రం దానికి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే నీ పీడ మాకు, మా పీడ నీకూ ఉండదు కదా’’ అందామె.‘‘పోనీ పెళ్లి చేసుకొని చదువుతా’’ అంది సింహాచలం గొంతు తగ్గించి. ‘‘అది నీ అత్త, నీ మొగుడూ ఇష్టం. నీకు పెళ్లి చేసి, మేం చేతులు దులుపుకుంటే ఇహ నువ్వేవ్టో, నీ కోర్కెలేవ్టో అన్నీ ఆ ఇంట్లోనే’’ అంటూ సత్తెమ్మ నడుంవాల్చింది.భవిష్యత్తు ఆలోచించుకుంటూ సింహాచలం కూర్చున్న చోటే సాగిలపడింది. అత్తెసరులో అన్నం మాడుతున్న వాసన సింహాచలాన్ని వాస్తవానికి లాగింది. ‘‘ప్చ్‌! ఏం బతుకిది’’ అనుకుంటూ సింహాచలం పొయ్యిమీంచి గిన్నె దింపింది. 

సంకల్పం ప్రకారం సింహాచలం ఆ నెల నుంచే మరికొన్ని ఇళ్లల్లో పనులు కూడా ఒప్పుకుంది. సంపాదనంతా నీల డబ్బీలో జమచేసి, నిలవ రాసుకునేది నెలనెలా. ఇలాగే ఓ రెండేళ్లు గడిచాయి. పెళ్లికి తండ్రి మద్దతుతో తల్లితో పోట్లాడుతూండేది. ఈలోగా దేవుడిటు చూశాడు. బీదవాళ్లను ధనలేమితోను, ధనం ఉన్న వాళ్లను ఆరోగ్యలేమితోను బాధలు పెడతాడాయన. అదే ఆయన గడుసుదనం. సాఫీగా సాగుతున్న కొంపమీద కొండ విరిగిపడ్డట్టు సింహాచలం నాన్న తను అద్దెకు తీసుకున్న ఆటో ఆ ఓనరుకు అప్పజెప్పి, లెక్క చెల్లుపెట్టి వస్తూంటే అతన్నో కారు ఢీకొంది. కారు ఓనరు వైద్య సహాయం చేసినా,కాలు విరిగి, ఇక ఆటో తోలడం మంచిది కాదు అనే నమ్మకంతో రెండు నెలలు ఆసుపత్రిలో ఉండి తిరిగొచ్చాడు.సింహాచలం నీల డిబ్బీ పైకొచ్చి, పగిలి ఆ ఖర్చు కొంత భరించింది.తనకిక చదువు యోగం లేదని సింహాచలానికి అర్థమయ్యింది. అయినా పన్నెండో క్లాసయ్యాక కదా. ఇంకా టైముందిలే.. అని మనస్సుకు సర్ది చెప్పుకునేది. 

మరో ఏడు గడ్డుగా గడిచేసరికి సింహాచలం నాయనమ్మ గోల ఆరంభించింది. తనకు చావు దగ్గరకొచ్చిందనీ, మనమరాలి పెళ్లి చూడకుండా చావదలుచుకోలేదనీ ప్రకటించింది. నానా గోల చేసి, రెండుసార్లు మంచం దిగి, మళ్లీ ఎక్కింది. ఫలితంగా సింహాచలం మెడలో మూడు ముళ్లూ పడ్డాయి. జీవితదశ దిశ మారిపోయిందామెకు ఆ మూడు ముళ్లతో. ఏడాది తిరిగేసరికి ఒక పిల్లాడు ఒళ్లో పడ్డాడు. ఇంటింటెడు చాకిరీ చేసి, మరో ఆరిళ్లకూ అదే పని చేసి, ఉస్సురుమంటూ ఇంటికొచ్చిన తనని చూసి, అత్తగా మారిన మేనత్త జాలి పడేది కాదు. ఈ దిక్కుమాలిన మేనరికం తగలడకపోతే, ఆ ముసిల్ది గోలచేసి, చావకపోతే తన కొడుక్కి చక్కని కట్నంతో పెళ్లయ్యేదని ముప్పూటలూ దెప్పేది.  ఇంట్లో పని, బయట పని, అత్త సేవ, మొగుడి సేవ, పిల్లాడి చాకిరీ... రకరకాల పనులతో సింహాచలం జీవితం యంత్రాన్ని మించిన యంత్రంగా మారింది. 

ఆరోజు వర్షం పడుతూ ఉండటంతో సింహాచలం నాగేశ్వర్రావు షాపు ముందే కూర్చుంది. నాగేశ్వర్రావు తాను చూస్తున్న టీవీని ఆపు చేసి, ‘‘సింహాచలం, నీ కథ చెప్పు. నీ మొగుడు, కొడుకూ ఏరి! ఒంటరిగా ఒక్కతివే ఎందుకుంటున్నావు?’’ ఇల్లొదిలి వచ్చేశావా? ఏంటసలు..’’ అన్నాడు. సింహాచలం మాట్లాడేలోగా, ‘‘అవును, ఆ నాగేశ్వరమ్మ కూతురికి చదువు నువ్వే చెప్పిస్తున్నావట కదా, ఎందుకు! వాళ్లంత లేనివాళ్లు కాదు కదా,’’ అన్నాడు. సింహాచలం విరాగినిగా నవ్వింది. ‘‘నా కథ నాకు నేనే చాలాసార్లు చెప్పుకుంటుంటాను. మననం చేసుకుంటుంటాను. విమర్శించుకుంటుంటాను. అలా చెయ్యవలసినది, ఇలా చెయ్యవలసినది అనుకుంటుంటాను. ఈ కట్టె రాలేలోగా ఇంకా ఎన్నిసార్లు తలుచుకుంటానో గతాన్ని’’ అంది.‘‘ఓ సివాచలం, ఉపోద్ఘాతం మాని, కథ చెప్పు. మా నాన్నొచ్చేడంటే కథకు కామా పడుతుంది’’ అన్నాడు నాగేశ్వర్రావు. సింహాచలం ఆరంభించింది.‘‘ఒంటరితనం చాలా కష్టం నాయనా! పైగా ఓ లక్ష్యం లేని జీవితం సారం తీసేసిన చెరుకు పిప్పిలా ఉంటుంది. నాలుగు రాళ్లు సంపాదించడం, ఒండుకోవడం, మింగడం, పడుకోవడం – మర్నాడు, ఆ మర్నాడూ.. ఇహ జీవితమంతా అంతే! బతకడానికో అర్థం, లక్ష్యం ఉండాలి. నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ జన్మలో చదువుకూ నాకూ అంతే రాసిపెట్టాడా దేవుడు. చక్కగా చదువుకునే ఓ పిల్ల చదువు బాధ్యత తీసుకుందామని మన సందవతలుండే స్కూలుకు వెళ్లి అయిదో క్లాసులో బాగా చదివే పిల్లను ఎంచుకున్నాను. ఆ పిల్ల పేరు వైదేహీ. దాని మార్కులు అవీ బాగున్నాయి. ఆ పిల్లతో వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లమ్మా నాన్నతో మాట్లాడాను. 

‘‘ఏవన్నారు వాళ్లు.. మేమేం లేనివాళ్లం కాదు. పదిళ్లల్లో పని చేసుకునే దానివి నువ్వు ఎవరు చదివించడానికి అన్లేదా?’’ అన్నాడు నాగేశ్వర్రావు. ‘‘అలానే అన్నారు. కానీ నా కోరిక చెప్పాక ఒప్పుకున్నారు.’’ ‘‘ఏమని చెప్పావు?’’ ‘‘నేను బతకడానికీ, ఒంటరితనాన్ని వెళ్లగొట్టుకోడానికీ ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను. మీరొద్దంటే, మరో పాపను ఎంచుకుంటాను’’ అన్నాను. స్కూల్లో మాష్టారు కూడా ఇదో స్కాలర్‌షిప్‌ అనుకోండి అని నచ్చజెప్పాడు. చివరికి వాళ్లు ఒప్పుకున్నారు.’’ అంది.‘‘ఆర్నెల్లయ్యిందా.. ఇది మొదలెట్టి?’’‘‘అయ్యుంటుంది.’’ అని మళ్లీ తనే ఆరంభించింది. ‘‘ఆ పిల్ల ఎంతవరకు చదువుకుంటే అంతవరకూ చదివిస్తా. నాకు టీచర్‌ ఉద్యోగం అంటే ఇష్టం.’’ అంది.‘‘బీఏ చేయించి, ట్రయినింగ్‌ చేయిస్తావా ఆ పిల్లని.. చాలా డబ్బవుతుంది కదా’’ అన్నాడు నాగేశ్వర్రావు, నోటి లెక్కలేసి చూసుకుంటూ. 

‘‘ఏమి నాయనా! ఓపిక ఉన్నంతవరకూ చదివిస్తా. అది పోతే ఇంకేం చెస్తాం. చేతులెత్తేస్తా.. చూద్దాం దేవుడేం చేస్తాడో’’ అంది వేదాంత ధోరణిలో. ‘‘ఇక నువ్వు ఒంటరివెలా అయ్యావో చెప్పు’’ అని అంతలోనే ‘‘బాబోయ్, మా నాన్నొస్తున్నాడు. గమ్మునుండు. లేకపోతే నన్ను నస పెట్టి చంపేస్తాడు’’ అన్నాడు.కోటేశ్వర్రావు కొట్టు మెట్లెక్కుతూ, ‘‘ఏం సింహాచలం. తీరుబడిగా కూర్చున్నావే’’ అని మళ్లీ తనే, ‘‘అవున్లే! ఒంటి ప్రాణం. ఆరాటం లేని లైఫ్‌’’ అని ముగించి, కొడుకు వైపు చూస్తూ ‘‘ఏరా.. బోణీ ఏమైనా అయ్యిందా,’’ అని దానికి తనే సమాధానం చెప్పుకుంటూ, ‘‘నువ్‌ కూర్చుంటే బోణీ లేదు, వోణీ లేదు. పోరా, పోయి చదువుకునేడు’’ అన్నాడు. కొడుకు కిమ్మనకుండా మెట్లు దిగి మాయమైపోయాడు. కోటేశ్వర్రావు షాపులో కూర్చుంటూ, ‘‘అదేవ్టీ.. నువ్వు ఆ నరసయ్య కూతురి చదువు ఖర్చు భరిస్తున్నావట. డబ్బెక్కువయిందా, ఒంటరిదానివి. డబ్బులెక్కువయితే బ్యాంకులో దాచుకుంటే రేపు కాలూ చెయ్యి లొంగకపోతే అవసరమవుతాయి కదా’’ అన్నాడు.సింహాచలం వాదనవుతుందని, పెద్ద వాళ్లతో వాదన మంచిది కాదని, నవ్వేసి ఊరుకుంది.

తాను చదివిస్తున్న పిల్ల వైదేహికి ఓ గౌను కొని, ఆ గౌను పెట్టెలో దాచుకుని, మర్నాడివ్వాలనీ, పెట్టె తీస్తే ఆ పెట్టెలో తన కొడుకు చొక్కా ఒకటి కనిపించింది.సింహాచలం కళ్లలో నీరు గిర్రున తిరిగింది. గుర్తుకొచ్చిన కొడుకు ఆమెను గతానికి లాక్కుపోయాడు.బంధువుల ఇంట్లో పెళ్లికి బయల్దేరారందరూ. తన తండ్రికి వాళ్లు ఛార్జీలకు డబ్బు కూడా పంపారు. తాను, తన కొడుకు, మొగుడూ, తల్లిదండ్రులూ, మామ గారూ.. అత్తయిన మేనత్త తాను రానంది. పెళ్లికి వెళ్లి ఆనందంగా తిరుగు ప్రయాణంలో కబుర్లూ పాటలతో సంతోషంగా ఉన్నారంతా. ట్రాక్టరు ట్రయిలర్‌ తొట్టిలో సిమెంటు బస్తాల లోడు మీద గోనె సంచులు పరుచుకుని కూర్చున్నారు. గేటులేని రైలు కట్ట ఎక్కుతూ ట్రాక్టరు అదుపుతప్పి, గుంజుకుని, కట్టమీంచి దొర్లుకుంటూ పడిపోయింది.పెళ్లి వారందరూ కింద, వారిమీద సిమెంటు బస్తాలు పడ్డాయి. ఊళ్లో జనాలకి తెలిసి, పరుగున వచ్చి ఆ సిమెంటు లోడంతా తీసేసరికి అందరూ చచ్చిపోయారు. సింహాచలం కన్నీరాగలేదు. తన కొడుకు సిమెంట్‌ విగ్రహంలా మారిపోయాడు. అందరూ కూడా ఊపిరాడక, సిమెంటు లోపలకు – ఊపిరితిత్తుల్లోపలకు పోయి, అంతా చచ్చిపోయారు. సిమెంటు బస్తాలు కొన్ని పగిలి కొందర్ని విగ్రహాలుగా మార్చేశాయి. తనకి మాత్రం రెండు కాళ్లమీద నాలుగైదు సిమెంటు బస్తాలు పడి, గిలగిల్లాడింది. సింహాచలం వెక్కి వెక్కి ఏడ్చింది. చాలాసేపు ఏడ్చాక, ఆ ఏడుపే ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్లు తుడుచుకుని, ముఖం కడుక్కుని, ఓ చెంబుడు మంచినీళ్లు తాగి స్థిమితపడింది.

సింహాచలం కథ అంతటితో ఆగలేదు. ఒంటరిగా ఇంటికొచ్చిన సింహాచలాన్ని జుట్టు పట్టుకుని, సింహాచలం అత్త నడిరోడ్డు మీదికి ఈడ్చింది. ‘‘పాపిష్టిదానా, తల్లినీ తండ్రినీ, కొడుకునూ మింగడమే గాక, నీ మొగుణ్నీ మింగి, నా మొగుణ్నీ మింగి రాయిలా తిరిగివచ్చావా.. లోపలకొచ్చావంటే నీ మీదకి కిరసనాయిలు పోసి, తగలబెడ్తా. నేను జైలుకెళ్లినా ఫర్లేదు. నిన్ను బతకనివ్వను’’ అంటూ భీభత్సంగా గోల చేసింది. సింహాచలం ఆ ఊరు వదిలి, ఈ ఊరు చేరి, ఒంటరి బతుకు ఆరంభించింది.

ఆరోజు ఎన్ని వీధులు తిరిగినా, ఎంత తిరిగినా పాత పేపర్లు దొరకలేదు. ఇక కొత్త వీధులు తిరిగి చూద్దామని, కొంచెం దూరం వెళ్లి ప్రయత్నించింది సింహాచలం. ఓ సందులో తన కేక విని ఒకావిడ ఎదురు కేక వేసింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ సింహాచలం ఆ ఇంటికి వెళ్లింది. ఆ ఇంటావిడ కట్టలు కట్టలుగా కట్టిన పేపర్లు తెచ్చి నెమ్మదిగా కింద పెత్తి     ‘‘అన్నీ నీటుగా కట్టాను. తూచి చూసుకో’’ అని బేరమాడి, ఖరారు చేసింది.సింహాచలం కట్టలన్నీ తూచి, తన గోనే సంచీలో వేసుకుని, ఆవిడకివ్వాల్సిన డబ్బులిచ్చి, బరువు నెత్తికెత్తించుకుని బయల్దేరింది. ఆ ఇంటావిడ మురిసిపోతూ ఆ డబ్బు బీరువాలో దాచుకుంది. ఆ ఇల్లాలు మైథిలి.బరువు దింపుకుంటున్న సింహాచలాన్ని చూసి, ‘‘ఏం సివాచలం.. ఈరోజు బాగా పేపర్లు దొరికినట్టున్నాయే’’ అన్నాడు షాపు ఓనరు కోటేశ్వర్రావు లేచి, లైటు వేసి, దేవుడికి దండం పెట్టుకుంటూ. షావుకారు దీపం వేశాక ఇక ఆ పూట డబ్బులిచ్చే పనులేవీ చేయడని సింహాచలానికి తెలుసు. తాను తెచ్చిన పేపర్లన్నీ పొందికగా షాపులో ఒక మూల సర్దింది. కాస్సేపు మెట్లమీద కూర్చుని, ఇంటికి వెళ్లిపోయింది. 

పేపర్లమ్మిన ఇల్లాలు మైథిలి మొగుడు ఇంటికి రాగానే ‘‘పేపర్లమ్మేశాను’’ అని, ఎంత డబ్బు వచ్చిందో చెప్పి, పేపర్లు కొన్ని నెలలుగా అమ్మిన డబ్బు మొత్తం ఎంతో కూడా లెక్కలు చెప్పి, ‘‘నా దగ్గర ఎంతుంటే అంత డబ్బు మీరిస్తానన్నారు కదా, ఇవ్వండి’’ అంది.ఆ ఇల్లాలి భర్త ఎగిరి గంతేశాడు. ‘‘ఏయే.. నా బీరువా మీద విడిగా పెట్టిన పేపర్లు కూడా అమ్మేశావా?’’ అంటూ ఒక్క గెంతులో లోపలకెళ్లి బీరువాపైన ఖాళీగా ఉండటం చూసి, మరో గెంతులో పెళ్లాం మీద విరుచుకుపడ్డాడు. ‘‘ఓసినీ, ఆ పేపర్లు విడిగా పెట్టాను కదా, అవి కొన్ని చాలా ఇంపార్టెంటు పేపర్లు. ఆ పేపర్ల మధ్యలో ఓ కవరు పెట్టాను. అది తీసి దాచావా?’’ అన్నాడు.‘‘లేదు. కవరేం కనబళ్లా’’ అందా ఇల్లాలు.ఇంటాయన మోహన్రావు పిచ్చిపట్టిన వాడిలా జుట్టు కొంచెం పీక్కుని, ‘‘చంపేశావే.. ఆ కవర్లో డబ్‌...’’ అని, తమాయించుకుని ‘‘వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన కాగితాలు పెట్టాను. ఎవడికిచ్చావో గుర్తుందా, రా, బండెక్కు’’ అని దాదాపు అరిచినంత పని చేశాడు. మైథిలి కిక్కురుమనకుండా స్కూటరువెనక కూర్చుంది. దారిలో సింహాచలాన్ని వర్ణించి చెప్పింది. ఇద్దరూ ఓ గంటన్నర తెగ తిరిగి ఉస్సురుమంటూ ఇల్లు చేరారు. మోహన్రావు ధుమధుమలాడుతూ సోఫాలో కూలబడ్డాడు.‘‘అందులో ఇంపార్టెంటు పేపర్లా, లేక డబ్బు పెట్టారా. నాకు నిజం చెప్పండి. మీ వాలకం చూస్తే పేపర్లు పోయినట్టనిపించట్లేదు’’ అంటూ కొంచెం దబాయించి చూసింది.మోహన్రావు కిమ్మనకపోయేసరికి ఆమెకి కొంచెం ధైర్యం పాలు ఎక్కువైంది. దాంతో కాస్త పుంజుకుని ‘‘ఎన్ని వేలు ఉన్నాయందులో’’ అంది.

‘‘కాస్సేపు నోరు మూసుక్కూర్చుంటావా’’ అన్నాడు మోహన్రావు. కానీ మైథిలికి తనమీద తనకు నమ్మకం ఎక్కువైంది. కాస్సేపాగి, ‘‘ఓ పది వరకూ ఉండొచ్చా. చెప్పండి. పోయిన దాన్ని బట్టి ప్రయత్నం చేయడమా, మానడమా ఆలోచిస్తా. నాలుగిళ్లు వాకబు చేస్తే ఆ ముసిల్దాన్ని ఈజీగా పట్టియ్యచ్చు’’ అంది.ఈలోగా గేటు శబ్దమయితే అటు చూసి, ‘‘అయ్‌! అదిగో ఆ ముసిల్దే వచ్చింది’’ అని ఒక్క గంతులో గుమ్మం దాటి గేటు దగ్గరికి చేరింది. మోహన్రావు కూడా ఒక్క ఉదుటున హాలు దాటి గేటు దగ్గరకు చేరాడు. ‘‘మీ పేపర్లలో ఈ కవరొకటి ఉంది’’ అంటూ సింహాచలం ఆ కవరు మైథిలి చేతిలో పెట్టేలోపు మోహన్రావు గద్దలో ఆ కవర్ను లాక్కున్నాడు. ‘‘అందులో డబ్బు సరి చూసుకోండి’’ అంది సింహాచలం.

‘‘ఎంతుందే అందులో’’ అంది మైథిలి. ‘‘పదివేలు’’ అంది సింహాచలం. ‘‘పదివేలా.. అంతేనా.. నువ్వేమయినా..’’ అని మైథిలి నిలదీయబోయింది. ‘‘అలా చేసేదాన్నయితే.. ఈ డబ్బు కూడా పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు’’ అంది సింహాచలం. కవరు సరిచూసుకున్న మోహన్రావు సంతృప్తిగా, గాలిపీల్చి, ‘‘సరిపోయిందిలే’’ అని, ‘‘ఇందా.. ఈ వంద ఉంచుకో’’ అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. సింహాచలం ఆ వంద తీసుకుని, తన మొల్లో దోపుకున్న గుడ్డ సంచీలో పెట్టి, అందులోంచి ఓ ఇరవై రూపాయలు తీసి, ‘‘నే మోసపోయినదంతే బాబూ’’ అంది.‘‘అదేమిటీ?’’ అన్నాడతను. ‘‘చెప్తా’’ అంటూ సింహాచలం చంకలో ఉన్న గోని సంచిలోంచి కొన్ని నాపరాయి ముక్కలు తీసి మైథిలి చేతిలో పెడుతూ, ‘‘ఇవి పేపర్ల మధ్యలో ఉన్నాయమ్మా. ఈ రాళ్లు మళ్లీ మీకు అవసరపడొచ్చు. తూకం తేడా డబ్బులు అయ్యగారి వద్ద తీసేసుకున్నాను’’ అంది. వారిద్దరూ నిర్ఘాంతపోయి, తేరుకునేలోగా సింహాచలం రోడ్డు మీదికి వచ్చేసింది. ఆమె మనస్సు తేలికపడి, హాయి అనిపించింది. 

- ఫాలక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement